Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 7



    "ఎందుకు మామయ్య అక్కడే ఉంటాను. వీలున్నప్పుడల్లా వచ్చి పోతుంటాను" అన్న మోహన్ మీద చిరాకు పడ్డాడు.

    "నీ మొహం లంకంత ఇల్లు పెట్టుకుని లాడ్జిలో ఉండే ఖర్మేమీ పట్టింది నీకు పద!" అన్నాడు.

    "అదికాదు మామయ్యా ఇంకా ఏదో చెప్పబోతున్నమోహన్ ని వారించాడు. అప్పటికప్పుడు లాడ్జికి లాక్కుపోయి రూం ఖాళీ చేయించి వెంటబెట్టుకొచ్చేసాదు. మేడమీద గదిలో అతని సామానులు స్వయంగా సర్ధాడు.

    "ఇదుగో ఇది నీ గది. అసలా మాటకొస్తే ఇల్లంతా నీదే. రెస్టు తీసుకో ఇప్పుడే వస్తా" అనేసి వెళ్లి[పోయాడు.

    వంటరిగా మిగిలిపోయిన మోహన్ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. పక్కనే కనిపిస్తోంది ఆ చిన్న  ఇల్లు ఉసూరు మనిపించింది అతనికి ఎంత పొరబాటు జరిగిపోయింది ఇప్పుడేం చెయ్యటం అనుకున్నాడు.

    పక్కింట్లో బయటికి వచ్చింది వర్ధనమ్మగారు తిన్నగా ఈ నారాయణమూర్తిగారి ఇంటికి వచ్చింది ఆవిడ రావడం తలుపుతట్టడం ఈయన వెళ్ళి  తలుపుతియ్యడం అన్నీ గమనిస్తూనేవున్నాడు మోహన్.

    "రామ్మా! రా!" ఆదరంగా ఆహ్వానించారు ఆయన.

    "మజ్జిగ  పులుసు చేశానన్నయ్యా! నీకు ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను" గిన్నె అందించింది ఆవిడ.

    "ఏమిటోనమ్మా నేనంటే నీ కెందుకు ఇంత అభిమానం! కూర్చోమ్మా" అంటూ లోపలికెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు.

    "వర్ధనమ్మా నీ మొగుడు ఏం చేసాడో చూసావా? ఇందాక నా స్నేహితుడి కొడుకు పొరబాటుగా మీ ఇంటికి వస్తే కర్రపుచ్చుకొని వెంటపడ్డాడుట. నాతో సరే శత్రుత్వం. నా ఇంటికొచ్చేవాళ్ళతో కూడా వైరమేనా? నిష్టూరంగా అడిగాడు.

    తెల్లబోయింది ఆవిడ "అతను మీ ఇంటికోచ్చాడా? పాపం మావయ్యా అంటూ మా ఇంటికొచ్చాడుట వంట హనుమాయమ్మ పోతూ పోతూ తన ఇత్తడి బిందె నీళ్ళ కాగు మాకు అప్పజెప్పి పోయిందిగా వాటికోసం ఆవిడ కుర్రాడేమో మీ ఆవిడ చచ్చిపోయింది. మీకు కష్టం వచ్చింది అని పరామర్శించాడుట. దాంతో ఆయనకి కోపం వచ్చింది" సంజాయిషీ చెప్పుకుంది.

    గతుక్కుమన్నాడు నారాయణమూర్తి "ఏదో చిన్నతనం. పొరపాటు పడ్డాడే నెమ్మదిగా చెప్పాలిగానీ అలా చేయడం ఏం న్యాయం చెప్పమ్మా!" అన్నాడు.

    "ఆయన విషయం నీకు కొత్తేముంది అన్నయ్యా? ఇంతకీ ఎవరా అబ్బాయి?" మాట మార్చింది వర్ధనమ్మ.

    ఆయన ముఖం వికసించింది. "అతనా? మా స్నేహితుడి  కొడుకు. చూద్దువుగాని రా!" హుషారుగా మేడ మీదికి తీసుకెళ్ళాడు . వీళ్ళను చూసి లేచి నిలబడ్డాడు మోహన్.

    "ఇదుగోనమ్మా పేరు మోహన్ . బి.ఏ పాసయ్యాడు. అదేదో కంపెనీలో ఉద్యోగంకూడా వచ్చిందిట నా స్నేహితుడి కొడుకు మాత్రమె కాదు. నాక్కాబోయే అల్లుడుకూడా!" అన్నాడు మహాదానందంగా గుండె గుభేలుమంది మోహన్ కి.

    అతనివంక ఆదరంగా చూసి "అదృష్టవంతుడివి అన్నయ్యా!ఒక ఒడ్డుకి చేరావు. ఇక మా అదృష్టం ఎలా వుందో" అంది దీనంగా.

    "బాధపడకు వర్ధనమ్మా! నీకూ మంచి రోజు లోస్తాయి!" ధైర్యం చెప్పాడు నారాయణమూర్తి ఇద్దరు కిందికి వెళ్ళిపోయారు.

    మంచంమీద కూర్చున్నాడు మోహన్ అంతా గందరంగోళంగా వుంది అతనికి మామయ్యకి ఆయనకీ  బద్దవైరం ఏమిటి ఆయన భార్య ఈయనను స్వంత అన్నగారిలా గౌరవించడం ఏమిటో అన్నింటినీ మీంచి ఇప్పుడు తన కర్తవ్యమ్ ఏమిటో ఏమాత్రం  అంతుబట్టడంలేదు అతనికి.

    దీపిక తండ్రి అయిన సత్యనారాయణమూర్తిగారికీ ఆయన పక్కింటి సూర్యనారాయణమూర్తి గారికీ మొదటినించే బద్దవైరం లేదు. పైపెచ్చు శివకేశావుల్లా ప్రాణమిత్రులు.

    కలెక్టరాఫీసులో పనిచేసి రిటైరు అయిపోయిన వాళ్ళిద్దరికీ దాదాపు పాతికేళ్ళ క్రిందట తొలిసారిగా పరిచయం ఏర్పడింది మాటల నందట్లో ఇద్దరి స్వంత వూరూ కంకిపాడు అని తెలుసుకొని మరీ సంతోషపడ్డారు మా ఇంటికిరండి అని ఆహ్వానించుకున్నారు.

    అదృష్టవశాత్తు వారిద్దరిభార్యలకీకూడా మంచిమైత్రి ఏర్పడింది. రాకపోకలు అధికం అయ్యాయి. ఆ ఇబ్బంది  కూడా లేకుండా ఆ తరువాత కొద్దిరోజులకే సత్యంగారి ఇంటిపక్క పోర్షన్ లో అద్దెకి దిగారు సూర్యంగారు.

    స్నేహం మరింత పెరిగింది మీరు మీరు అనుకునే వాళ్ళు కాస్తా నువ్వు నువ్వు అనుకోవడంలోకి దిగిపోయారు. ఆ రోజుల్లోనే సూర్యంగారికి ఓ ఆలోచన వచ్చింది "ఇంతింత అద్దెలుపోసి ఉండలేంరా. ఏదో చిన్న కొంప ఒకటి అమర్చు కోవాలి" అన్నాడు.

    "నిజమే నువ్వు చెప్పింది అదేదో వెంటనే అంటే ఇప్పుడే తలపెట్టాలి. మరో పదేళ్లు ఆగితే పిల్లలు ఎదిగివస్తారు ఖర్చులుంటాయి" అన్నాడు సత్యం.

    మరో ఆర్నెల్ల తరువాత ఇద్దరూ కలిసి ఓ స్థలం ఏకంగా కోనేసుకొని చేరిసగం తీసుకున్నారు, మరో ఆర్నెల్ల తరువాత  శంఖుస్థాపన  చేయించారు లోనులు తీసుకొని భార్యల నగలు అమ్మి ఎలాగయితేనేం ఇళ్ళు పూర్తిచేసి మరో ఆర్నెల్ల  తరువాత గృహప్రవేశంకూడా అయిపోయారు. రెండిళ్ళకీ కలిసి ఒకటే కాంపౌండ్ వాల్. మధ్య గోడమాత్రం కట్టలేదు.

    సత్యం ఆజానుబాహువు. మంచి రంగు. కళ్ళకి నిండుగా వుంటాడు. మహా మొండిమనిషి.  తాను  పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేరకం. ముక్కుమీద కోపం. ఆయన అర్ధాంగి వర్థనమ్మ బొత్తిగా సత్యకాలం మనిషి. పరమ శాంతమూర్తి కృష్ణ, దీపిక వారి సంతానం.

    సూర్యం పొట్టిగా పిట్టంత మనిషి. వ్యాయామాలు చేసి  ఆనవాలు వేసి ఇనపకట్టెలా ఉండే శరీరం.

    ఈయనకీ మొండితనం యెక్కువే, నేను చెప్తాను లోకంలో మిగిలిన వాళ్ళంతా నా మాట ఆచరించాలి. అనే రకం.

    ఆయన భార్య మహాలక్ష్మి వారిద్దరికీ భారతి ఏకైక సంతానం.

    పక్క పక్క యిల్లు కట్టుకున్నాక ఈ  నారాయణమూర్తుల దినచర్య తమాషాగా ఉండేది. తెల్లవారుజామునే లేచి వ్యాయామం గట్రా ముగించేసిబయటికి వచ్చేవారు సూర్యంగారు.

    "ఒర్ సత్యం! ఇంకా లేవలేదూ!" అని అరిచేవారు పక్కింటి ముందుర నిలబడి

    "వస్తున్నాన్రా అరిచి అఘోరించకు" అని కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చే వారు సత్యం.

    ఇద్దరూ వరండామీద కూర్చునేవారు వర్ధనమ్మ కాఫీ తెచ్చి యిచ్చేది. కాఫీ తాగుతుండగానే పేపరు వచ్చేది యిద్దరూ కలిసి ఒకటే కొనుక్కునేవారు. చెరోముక్కా తీసుకుని  చర్చించేవారు.

    ఏదో విషయం మీద యిద్దరికీ వాద ప్రతివాదాలు జరిగేవి. ముందర సన్నగా మొదలై క్రమంగా హెచ్చు స్థాయిలోకి వెళ్ళిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అని  దెబ్బలానుకునేవారు. అలా కాసేపు అనుకున్నాక ఇద్దరూ మౌనం వహించేవారు.

    పావుగంట గడిచాక మళ్ళీ ఒకర్నొకరు పలకరించుకుని తప్పు నాది అంటే కాదు నాదే అని అరుచుకునేవారు. ఈ తతంగం ముగిసేసరికి బారెడు పొద్దెక్కేది.

    అప్పుడు లేచి "రారా సత్యం" అని చెయ్యి పట్టుకుని తన యింటికి తీసుకు వెళ్ళేవాడు సూర్యంగారు. ఇద్దరూ కలిసి సూర్యంగారి వరండాలో కూర్చునేవారు. మహాలక్ష్మి కాఫీ తెచ్చి యిచ్చేది. రెండోసారి కాఫీ తీగేసి లోపలికి వెళ్ళి పోయేవారు. ఈలోగా  వంటలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు. ఆ వంటలు కూడా ఐకమత్యంగానే జరిగేవి. ఒక యింట్లో కూరా పులుసు చేస్తే రెండో యింట్లో పప్పు పచ్చడిచేసేవాళ్ళు. నాలుగురకాలు అందరూ తినేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS