కోర్టులో అందరూ అమూల్య చేస్తున్న ప్రతిపనినీ, ప్రతి కదలికనీ వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. ఆమె ప్రతి మాటనీ చెవులు రిక్కించి వింటున్నారు.
ఆమె ఉన్నట్లుండి సెన్సేషనల్ గా ఏదో చేసేస్తుందని నమ్మకం కలిగినట్లుంది అందరికీ. అది మిస్సవ కూడదన్నట్లు జాగ్రత్తగా కేసుని ఫాలో అవుతున్నారు.
"యువర్ అనర్! నరేందర్ కుటుంబం ఊరికి పెద్దదిక్కనీ, వాళ్ళు కనిపెట్టి ఉండడం వల్లే ఊరు ఆ మాత్రంగా ఉందనీ, నరేందర్, ఇంద్రుడనీ, దేవేందర్ చంద్రుడనీ, ప్రాసిక్యూషన్ వారునోరూరగ చవులు బుట్టగనుదవడం విన్నాం మనం. ఇంతటి సత్యస్వరూపాలూ, అహింసావాదులూ, లోకకల్యాణనికై ఉద్భవించిన అవతార పురుషులు అయిన నరేందర్ ఇంటిలో ఇవి ఉండవలసిన అవసరం ఏమిటి?"
అప్పటిదాకా బల్లకి నిలబెట్టి ఉంచిన ఒక పొడుగాటి మూట లాంటిది శ్రమతో ఎత్తి, బల్లమీద పెట్టింది అమూల్య.
వెంటనే మెరుపులా లేచి నిలుచున్నాడు ప్రాసిక్యూషన్ వామనరావు.
"అబ్జెక్షన్ యువర్ అనర్! మన యంగ్ ఫ్రెండ్ తను నేర్చుకున్న ఈ కొత్తపద్దతి ప్రకారం మళ్ళీ ఏదో డ్రామా ..........."
"అబ్జెక్షన్ ఓవర్ రూల్ద్" అన్నాడు జడ్జిగారు.
"నేను దీన్ని ఎగ్జిబిట్ 'బి' కింద ప్రవేశపెట్టడానికి కోర్టువారి అనుమతి కోరుతున్నాను" అంది అమూల్య.
"అది కేసుకి సంబంధించినదని రుజువు చెయ్యగలిగేటట్లు ఉంటే అనుమతిస్తున్నాను . ఏమిటవి?" అన్నాడు జడ్జిగారు.
డ్రమెటిక్ గా, ఆ మూటను విప్పింది అమూల్య.
అందులో, కత్తులు, కఠార్లు, బాకులు, బరిశేలు, బాణాలు, తుపాకులు, తూటాలు వున్నాయి.
కోర్టులో ఉన్న అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు.
"యువర్ అనర్! ఇవన్నీ మన అభినవ శ్రీరామచంద్రుడు , అపర సత్య హరిశ్చంద్రుడు, కలియుగ కర్ణుడూ అయిన శ్రీ నరేందర్ గారి ఇంట్లో దొరికాయి.
యువర్ అనర్, మీరు కొద్దిగా శ్రమ తీసుకు పరికిస్తే, ఈ బరిసెకి అంటుకుని, గడ్డకట్టిన రక్తం కనబడుతుంది. అది మేక రక్తం కాదు యువర్ అనర్!
మనిషి రక్తం! పనివాళ్ళ అశ్రద్ధ వల్ల పూర్తిగా శుభ్రపరచకుండా దాచి పెట్టబడిందనుకుంటాను."
కోర్టులో కలకలం.
"యువర్ అనర్! చివరగా నేను మరొక్క సాక్షిని ప్రవేశ పెట్టదలుచుకున్నాను.
"ప్రొసీడ్!"
"ఆదిశేషు వచ్చి, బోనెక్కి ప్రమాణం చేశాడు.
"నీ పేరు"
"ఆదిశేషు"
"నీ వృత్తి?"
"............"
"దొంగ ఆయుధాలు తయారుచెయ్యడం! అవునా?" గద్దించింది అమూల్య.
"అవును"
"ఎవరు నేర్పించారు నీకు?"
"పోచయ్య"
"పోచయ్య నేర్పించాడా? అతని దగ్గర సమాచారం సేకరించి నువ్వు నేర్చుకున్నావా?"
"అతని దగ్గర సమాచారం సేకరించి నేను నేర్చుకున్నాను."
"నువ్వు తయారు చేసిన ఆయుధాలు ఎవరికి అమ్ముతావ్?"
"ఎవరు అడిగితే వాళ్ళకి! ఎవరు డబ్బులిస్తే వాళ్ళకి"
"నువ్వు అమ్మిన ఆయుధాలతో హత్యలు జరగవచ్చునని నీకు తెలుసా?"
"ఆ సంగతి నాకు అనవసరం"
"అడిగిన దానికి సమాధానం చెప్పు" అని అన్నారు జడ్జిగారు.
"తెలుసు"
"నువ్వు అమ్మిన ఆయుధాలతో హత్యలు ఏమన్నా జరిగాయా?"
"జరిగాయి"
"వివరాలు చెప్పు"
అతను చెబుతున్న వివరాలు చెబుతుంటే పెద్దగా రొద బయలుదేరింది కోర్టులో.
"ఆర్డర్! ఆర్డర్!" అన్నారు జడ్జిగారు.
"నువ్వు సప్లయ్ చేసిన ఆయుధాలతో నరేందర్ కుటుంబం ఇదివరకు చాలా హత్యలు చేసింది. అంటే, అదే ఆయుధాలతో వాళ్ళు నిర్మలని కూడా చంపి ఉండొచ్చా?"
"అబ్జెక్షన్ సస్టేయిన్!" అన్నారు జడ్జిగారు.
"పోనీ! ఇంకోవిధంగా అడుగుతాను. " అంది అమూల్య.
"మీకింత అవసరం లేదు. నరేందర్ నిర్మలని ఆ ఆయుధాలతో చంపి ఉండే వాడు కాదు" అన్నాడు ఆదిశేషు.
ఆశ్చర్యాన్ని అణుచుకుంది అమూల్య.
"ఎందుకని అలా చెప్పగలుగుతున్నావ్!"
"నిర్మల పంచాయితీ పెట్టినచోతోందని తెలియగానే నరేందర్ మండిపడి నా దగ్గరికి వచ్చాడు. నిర్మలని దారుణంగా చంపాలనీ , దానికి సరైన పద్దతి ఏమిటనీ అడిగాడు."
మంత్రముగ్ధుల్లా వింటున్నారు అందరూ.
"నువ్వేం చెప్పావ్?"
