Previous Page Next Page 
మారణహోమం పేజి 78

 

    "నరేందర్, దేవేందర్ వాళ్ళకి తుపాకులు సప్లయి చేసేది నువ్వేనా?"
    ఆశ్చర్యంగా చూశాడు అతను.
    "నీకెట్టా తెలుసు?"
    "నాకు చాలా తెలుసు? నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు! దేవేందర్ ఇదివరకు చేసిన హత్యలతో నీకు........."
    ఆమె వాక్యం పూర్తికానేలేదు.
    పెద్దపులిలా అమెమీదకు లంఘించాడు ఆదిశేషు.
    ఆ విసురుకి వెనక్కి పడింది అమూల్య.
    పులి పంజాలా ఉన్న తన చేతులని ఆమె మెడచుట్టు బిగించాడు అతను.
    అమూల్యకి ఊపిరి అందడంలేదు. తేలకళ్ళు వేసేసింది.
    అప్పుడు -
    హటాత్తుగా ఆదిశేషు పట్టుసడలిపోయింది. చేతులు మెల్లిగా పక్కకు జారిపోయాయి.
    కంఠాన్ని తడుముకుంటూ , అతికష్టం మీద దృష్టి కేంద్రీకరించి చూసింది అమూల్య.
    ఎదురుగా నిఖిల్ ఉన్నాడు. మోకాలితో ఆదిశేషు వీపుని తన్నిపెట్టి, కుడిచేతిని ఆదిశేషు మెడచుట్టు వేశాడు. ఎడమ చెయ్యి ఆదిశేషు తలమీద వుంది.
    అది నిఖిల్ ఫేవరేట్ టెక్నిక్.
    ప్రత్యర్ధిని అలా కదలకుండా పట్టుకున్నాక, తలని ఒక్కసారిగా పైకీ, పక్కకి, వెనక్కి తిప్పితే మెడ విరుగుతుంది. తక్షణం మరణం సంభవిస్తుంది.
    అది గ్రహించిన దానిలా గాభరాగా అంది అమూల్య.
    "చంపొద్దు నిఖిల్! చంపొద్దు! ఇతను మనకి చాలా అవసరం!"
    ఆదిశేషుని వదిలేశాడు నిఖిల్. పరుపుచుట్టలా కిందపడి అలానే ఉండిపోయాడు ఆదిశేషు.
    "థాంక్స్ నిఖిల్!" అంది అమూల్య హృదయపూర్వకంగా. నిఖిల్ ని చూడగానే ఇందాకటి నుంచి తను అనుభవిస్తున్న శారీరక బాధ ఒక్కసారిగా మటుమాయమై పోయినట్లు అనిపించింది.
    "నువ్వెందుకు ఒంటరిగా ఇక్కడికి వచ్చావ్?" అన్నాడు నిఖిల్ , అభిమానంగా.
    "తరుణ్ సింగపూర్ వెళ్ళాడు" అంది అమూల్య.
    అన్న తర్వాత తనమీద తనే చిరాకుపడింది.
    తను ఒంటరిగా రావడానికి, తరుణ్ దేశంలో లేకపోవడానికి సంబంధం ఏమిటీ? అతనేమన్నా తనకు బాడీగార్డా?
    "మీరెలా రాగలిగారు ఇక్కడికి?"
    "నీకు వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది. నిర్మల కేసులో వీడు మనకి విట్ నెస్ గా పనికివస్తాడేమో నని. వీణ్ణి ముందుగానే తయారుచేసి వుంచుదామని వచ్చాను. నువ్వు కనబడ్డావ్" అని దగ్గరికి వచ్చి, ఆమె మెడని చుపుడువేలుతో తడిమి చూశాడు. "నొప్పిగా ఉందా?"
    లేదన్నట్లు తల ఆడించింది అమూల్య. కష్టజీవనం వల్ల అతని వేళ్ళు కాయలు కాచిపోయి ఉన్నాయి. చేతులు మొద్దుబారి పోయి ఉన్నాయి. అయినా ఆ స్పర్శ ఆమెను పులకింపజేస్తోంది. నిఖిల్ మూడు నాలుగు రోజుల నుంచి గెడ్డం చేసుకున్నట్లు లేదు. రెండు రోజుల నుంచి షర్టు మార్చినట్లు లేదు. ఇతనికీ, మల్లెపువ్వులా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే తరుణ్ కీ చాలా విషయాల్లో చాలా తేడా ఉంది.
    అయినా ఇతని సమక్షంలో తను స్పందించినట్లు తరుణ్ దగ్గర స్పందించదెం?
    పదేపదే రుజువవుతోంది నిఖిల్ పట్ల తనకి ఉన్నది ఉత్త ఆకర్షణ కాదు, అంతకంటే ఎక్కువయినది ఏదో అని.
    "ఏమంటున్నాడు తరుణ్?"
    తనకీ, అతనికీ జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పింది అమూల్య. శ్రద్ధగా విన్నాడు నిఖిల్.
    "ఇంకొక్క పనిచెయ్యాలి మీరు." అంది అమూల్య.
    "ఏమిటి?"
    చెప్పింది అమూల్య.
    తల పంకించి నేలమీద పడివున్న ఆదిశేషుని లేవదీశాడు నిఖిల్. "నేను వెళ్ళొస్తా అమూల్యా! మళ్ళీ వీడిని సాక్ష్యం రోజున తీసుకొస్తా! నువ్వు జాగ్రత్తగా ఉండు."
    అస్పష్టంగా పెదిమలు కదిలించింది అమూల్య.
     ఆదిశేషుని నడిపించుకుంటూ తన కారువైపు నడిచాడు నిఖిల్. వెనక డోర్ తెరచి ఆదిశేషుని లోపలికి తోశాడు.
    తను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు.
    డ్రయివింగ్ సీట్లో ఉన్నది ఎవరో అని చూసింది అమూల్య.
    డ్రయివింగ్ సీట్లో ఉన్నది రాధ!
    స్టోన్ వాష్ షర్టు వేసుకుని ఉంది తను. బాగా డార్క్ గా ఉన్న గ్లాసెస్ పెట్టుకుని ఉంది.
    భయం భయంగా బతికే ఎన్జీవో రంగారావుగారి కూతురిలా కనబడటం లేదు రాధ ఇప్పుడు!
    రోజురోజుకీ మార్పు వస్తోంది ఆమెలో!
        
                                                                * * *


    మళ్ళీ విచారణకు వచ్చింది నిర్మల కేసు.
    ఈసారి చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళింది అమూల్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS