Previous Page Next Page 
మారణహోమం పేజి 76

 

    మర్నాడు పొద్దున్న అందరూ లేచారు అమ్మ తప్ప. తను నిద్రలోనే వెళ్ళిపోయింది పరలోకంలో కూడా నాన్నగారి పక్కనే ఉండడానికి.
    నా భవిష్యత్తు అప్పుడే నిర్ణయమయిపోయింది అమూల్య. తగిన అర్హత రాగానే ఈ వృత్తిలోకి వచ్చేశాను. నేను దేశానికి అంకితమయిపోయాను అమూల్యా! దేశం కోసం చావడానికి అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉంటాను నేను! చావంటే భయం లేదు నాకు!
    కానీ చావుకంటే కూడా నేను భయపడేది ఒక్కటే ఉంది అమూల్యా!"
    మాట్లాడకుండా వింటోంది అమూల్య.
    "అదేమిటంటే, మిమ్మల్ని వదిలి దూరంగా ఉండటం."
    ఇబ్బందిగా చూసింది అమూల్య. మాట్లాడుతూనే అతను డిన్నర్ త్యయారుచేసేసి టేబుల్ మీద సర్వ చెయ్యడం మొదలెట్టాడు.
    "మీరు ఆ పనులన్నీ చేస్తుంటే ఉరికే కూర్చోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. " అంది అమూల్య.
    "ఇదేంతపని అనీ! నెక్ట్స్ ట్ టైం ఎంత గ్రాండ్ గా చేస్తానో చూడండి! స్పానిష్ ఆమ్లెట్, స్టఫ్ డ్ చిలీస్, వొర్ సెస్ టర్ షైర్ సాస్ తో చేసిన డిషెస్! వంట నాకు హాబీ అనుకోండి! ఒక్కోసారి అది నాకు అత్యవసరం కూడా!"
    "మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు" అంది అమూల్య సిన్సియర్ గా.
    "ఆ ఎవరో మీరే ఎందుకు కాకూడదు?"
    కొలను ఒడ్డున తీరిగ్గా కూర్చుని కులాసాగా నీళ్ళలో కాళ్ళూపుతూ ఉంటే, టక్కుమని మొసలి కాలిని పట్టేసుకున్నట్లు పీలయింది అమూల్య. సంభాషణ ఇలా తిరుగుతుందని ఉహించలేదు తను.
    ఆమె మాట్లాడకపోవడం చూసి తరుణ్ అన్నాడు "నేను మరీ దురాశ పడుతున్నానా అమూల్యా?"
    చటుక్కున మాట మార్చేసింది అమూల్య. "మళ్ళీ సింగపూర్ ఎప్పుడూ వెళుతున్నారు మీరు?"
    "పొద్దునే! ఏం?"
    "మొన్న హాంగ్ కాంగ్ వెళుతున్నప్పుడే చెబుదామనుకున్నాను. నాకొక వీసీఆర్ తెచ్చి పెట్టకూడదూ? ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసుకోవచ్చు. ఒక్కదాన్నే బోర్ గా ఫీలవుతుంటాను అప్పుడప్పుడు. ఎంతవుతుంది వీసీఆర్? నా బ్యాంక్ అకౌంట్ లో పద్నాలుగు వేలదాకా ఉంది. సరిపోతుందా?"
    అతను దెబ్బతిన్నట్టు చూశాడు.
    "మీకు వీసీఆర్ తెచ్చి పెట్టినందుకు నేను డబ్బులు తీసుకుంటానా? ఇన్ ఫాక్ట్ నేను మీకో చిన్న ప్రజెంటేషన్ తెచ్చాను హాంగ్ కాంగ్ నుంచి."
    ప్రశ్నార్ధకంగా చూసింది అమూల్య.
    అతను జేబులోంచి ముచ్చటగా ఉన్న ఒక చిన్న ప్యాకెట్ తీశాడు.
    అందులో ఉన్నది చూడగానే అమూల్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అరుదైన, అందమైన చిన్న లేడీస్ వాచీ అది.
    పూర్తిగా బంగారంతో చేసి ఉంది.
    ధగధగ మెరుస్తున్న చిన్న చిన్న వజ్రాలు దాని డయిల్ చుట్టూ నిండా పొదిగి ఉన్నాయి. లైటు వెలుగుని కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ప్రతిఫలిస్తున్నాయి ఆ వజ్రాలు.
    "వాషేరోన్ - కాన్ స్తాన్ టిన్ వాచ్ ." అన్నాడు తరుణ్. "ఈ చిరుకానుకను మీరు స్వీకరిస్తే ,దీన్ని సెలెక్టు చేసుకోవడం కోసం హాంగ్ కాంగ్ వీధులన్నీ వెదికిన నా ప్రయాస వృధా కాలేదని సంతోషిస్తాను."
    నోటివెంబడి చాలా సేపు మాటరాలేదు అమూల్యకి. "చిరుకానుక! ఈ అపురూపమైన రిస్టువాచ్ - మైగాడ్ ఎంత ఖరీదు ఉంటుంది?"
    తమకంగా అన్నాడు. "అది ఎంత ఖరీదయినా, మీ చేతిని అలంకరించగలిగితేనే దానికి సార్ధకత వస్తుంది అమూల్యా!"
    "ఇంత ఖరీదయిన ప్రజెంట్స్ కొనివ్వడానికి సరిపడేటంత జీతం వస్తుందా మీకు?"
    భుజాలు ఎగరేశాడు తరుణ్.
    "మీకు చెప్పలేదా? మా ముత్తాత బాగా ధనవంతుడు. వంశపారంపర్యంగా ఆ ఆస్తి అలా వస్తూనే ఉంది."
    "మరి ఈ ఉద్యోగం ఎందుకు?"
    "ఈ ఉద్యోగం భుక్తి కోసం కాదు అమూల్యా! దేశభక్తి కోసం!"
    తదేకంగా అతని వైపు కాసేపు చూసింది అమూల్య. ఈ రోజుల్లో , ఇంకా ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉన్నారా?
    మరుక్షణంలో అతను అన్న మాటలు ఆమెకి పిడుగుపాటులా తోచాయి.
    "ఈ వాచ్ మీరు తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి అమూల్యా! మీ కోసం , నా కోసం కూడా!"
    తెల్లబోయింది అమూల్య.
    "ఎందుకు?"
    "ఇది మామూలు వాచ్ కాదు.
    సూక్ష్మమైన ట్రాన్స్ మీటర్ అమర్చాం ఇందులో. దీనితో మీరు నన్ను సులభంగా కాంటాక్ట్ చెయ్యవచ్చు. రాబోయే కొద్దిరోజుల్లో మనం చాలా విషమ పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం ఎప్పటికీ మంచిది అమూల్యా!"    
    గొంతు తడారి పోయినట్లయింది అమూల్యకి. "ఏమిటంత విషమ పరిస్థితి?" అంది హీనస్వరంతో.
    "నిఖిల్ గురించి కొన్ని చిత్రమైన విషయాలు వింటున్నాను. అవి అన్నీ గనక నిజమయితే, అతను మనకి పెద్ద చాలెంజ్ గా మారబోతున్నాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS