Previous Page Next Page 
మారణహోమం పేజి 75

 

    "మీరా ! ప్లజేంట్ సర్ ప్రైజ్! ఎప్పుడొచ్చారు?" అంది మొహానికి నవ్వు పులుముకుంటూ, గొంతులో సంతోషం పలికించాలని ప్రయత్నం చేస్తూ.
    "చాలారోజుల వరకూ మీరు కనబడరేమోనని ........." "దిగులేసింది" అనబోయి, అంత పెద్ద అబద్దం ఆడలేక, "అనుకున్నాను" అంది.
    "నేనూ అలాగే అనుకుని భయపడ్డాను అమూల్యా!" అన్నాడు తరుణ్. "హాంగ్ కాంగ్ నుంచి సింగపూర్ వెళ్ళవలసినపని ఉంది. కానీ బ్రహ్మప్రయత్నం చేసి ఒక్కరోజు వీలు చూసుకుని వచ్చేశాను - మిమ్మల్ని చూడాలని."

    కనురెప్పలు బరువుగా అయిపోయినట్లు కిందికి వాల్చి, ఓరగా చూసింది అమూల్య అతనిని. "చాలా అలిసిపోయారా? మంచి కాఫీ కలిపి ఇవ్వనా?"
    "ముందు కాఫీ  -తర్వాత మంచి డిన్నరు? ఏమంటారు? ఏమిటీ దౌర్జన్యం అనుకుంటున్నారా?"
    "దౌర్జన్యం కాదు, సిగ్గులేనితనం! ఎదుటివాళ్ళని మీమీద ఇష్టం ఉందో కనిపెట్టలేకపోవడం!" అనుకుంది అమూల్య మనసులోనే, వెగటుగా.
    కానీ అంతలోనే అనిపించింది. తనకి ఇతని మీద ఇష్టం లేదన్న సంగతి ఇతను కనిపెట్టయ్యగలిగితే , ఇంక తను ఆడబోయే నాటకం ఎలా రక్తి కడుతుంది?
    ఇతన్ని అలాంటి భ్రమలోనే కొంతకాలంపాటు ఉండనివ్వాలి. కధ క్లయామాక్స్ కి వచ్చేసి, నిజం బయటపడ్డాక ఒక్కసారి దిగ్భామ చెందుతాడు ఇతను.
    అప్పుడు ఈ హాండ్సమ్ గై తాలూకు అందమైన మొహం ఎలా కందిపోతుంది?
    అంతేకాని, నిజంగా ఇతన్ని ప్రేమించదమా? బుల్ షిట్!
    "చాలా అలిసిపోయినట్లు కనబడుతున్నారు. మొహం కడుక్కుని రిప్రేష్ అవండి. ఈలోగా నేను కాఫీ పెడతాను. తర్వాత డిన్నరు. చెప్పండి! ఏమిటి మీ ఇష్టాలు?" అంది.
    "నా ఇష్టాలు అయితే .........."అతను కొద్దిసేపు అలోచించి అన్నాడు, "కాకరకాయ వేపుడు, కందిపచ్చడి, పాఠోళీ........."
    పాఠోళీనా? అదేమిటి?"
    ఉత్సాహంగా అన్నాడతను "మీకు పాఠోళీ అంటే తెలియదా? చిన్నప్పుడు మా వంటమనిషి చేసిపెట్టేది. ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు చేసి పెడతాలెండి."
    "మీకెందుకు శ్రమ............" అని తప్పించుకొబోయింది అమూల్య.
    కాని అతను వినిపించుకోకుండా, కోటు విప్పి సోఫాలో పడేసి, షర్టు స్లివ్స్ మోచేతులపైకి మడిచి, కుస్తీ పోటీకి వెళ్ళబోతున్నవాడిలాగా ఒక్కసారి చేతి దండలు ఆడించి, స్టవ్ దగ్గరికి వెళ్ళాడు.
    అప్పుడు బహిర్గతమైన అతని కండలు చూసి మనసులోనే అనుకుంది అమూల్య. భీమబలుడు ఇతను! నిజం!
    భీముడికి వచ్చినట్టే, వంటకూడ అంత బాగా వచ్చా?
    అమూల్యని అసలు స్టవ్ దగ్గరికే రానివ్వలేదు తరుణ్.
    ఎక్స్ పర్ట్ లాగా రకరకాల దినుసులని గిన్నేల్లోకి వంచి, కుడిచేత్తో కలియబెడుతూ ఎడమ చేతిని తమాషాగా నడుముకి ఆనించి మాట్లాడుతూ ఉన్నాడు. అతని భంగిమా, మాట్లాడే తీరు అమూల్యకి నవ్వు కలిగిస్తున్నాయి. తనకు తెలియకుండానే కొంచెం రిలాక్స్ అయింది.
    "మొదటగా కాఫీ!" అని కాఫీ కప్పు అందించాడు తరుణ్. సంకోచంగా పెదిమలు కప్పుకి తాకించింది అమూల్య. మింగగలదా తను? ఆమె భయం నిరాధారమయిందని మరుక్షణంలోనే తేలిపోయింది.
    అద్భుతంగా ఉంది కాఫీ!
    అమూల్య సిప్ చేస్తూ ఉంటే అతను చెప్పడం మొదలెట్టాడు.
    "ఈ జెట్ విమానాల్లో ప్రయాణం చూశారూ! మొదట్లో సరదగానే ఉండేది గానీ పోనూ పోను చిరాకేసి పోతోందండీ! ముఖ్యంగా ఈ జెట్ లాగ్ ధరించడం చాలా కష్టం! జెట్ లాగ్ అంటే మీకు తెలుసు కదా?"
    జెట్ లాగ్ అంటే ఏమిటో తెలుసు అమూల్యకి. అయినా సంభాషణ కొనసాగించడానికి అంది. "పురిగా తెలియదు చెప్పండి" అని.
    అతను మాట్లాడుతూనే ఉండాలి. ఆ మాటల్లోనే అనుకోకుండా ఇంపర్మేషన్ ఏదన్నా బయటపడిపోతూ ఉండాలి. అది తను నిఖిల్ కి చేరవెయ్యాలి.
    "ప్లేన్ లో ఎక్కి సూర్యుడితో బాటు మనమూ అదే దిశలో వెళితే, అంటే నిజంగా సూర్యుడు పయనిస్తున్నడని కాదనుకోండి. సూర్యుడితో బాటు మనమూ అదే దిశలో పయనిస్తే, అంత శ్రమ అనిపించదు. కానీ సూర్యుడికి వ్యతిరేక దిశలో విమానం వెళుతుంటే జెట్ లాగ్ ఎక్కువ ఫీలవుతాం. ఇక్కడ పొద్దున్న బయలుదేరి చాలా గంటలు పయనించిన తర్వాత అక్కడ దిగితే, అక్కడ చీకటిపడి ఉండదు సరికదా, అప్పుడే తెలతెలవారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పొద్దున్న బయలుదేరి అక్కడ పొద్దున్నే చేరమన్నమాట. శరీరం అలిసిపోయి ఉంటుంది. నిద్రపోయే సమయం కానీ అది రాత్రి కాదు. అకక్డ అందరూ మేలుకునే ఉంటారు. చిత్రంగా ఉంటుంది. ఆ పరిస్థితి. ఒక్కోసారి ఇంటర్నేషనల్ జెట్ లైన్ దాటేసి వెళుతుంటాం. అంటే ఇరవై రెండో తారీకున ఇక్కడ బయలుదేరితే, అక్కడికి ఇరవై ఒకటో తారీఖే చేరిపోతాం అన్నమాట! ఫన్నీ! ఇవన్నీ తెలియనివి కాదనుకోండి?"
    "కొద్దిగా తెలుసు! కానీ నిజంగా అనుభవించిన వాళ్ళు చెబుతూ ఉంటే వినడానికి ఇంటరెస్టింగ్ గా ఉంది!" అంది అమూల్య.
    "అవును! నిజంగా అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఏ బాధ అయినా!" అన్నాడు అతను భావగర్భితంగా. "ఒక మాట చెబుతాను. నమ్ముతారా అమూల్య?"
    "చెప్పండి!"
    "మిమ్మల్ని విడిచి దూరంగా ఉంటే, జెట్ లాగ్ కన్న దుర్భరమైన అవస్థ అనుభవిస్తాను నేను.అసలు సూర్యోదయం అయినట్లే అనిపించదు. రోజంతా రాత్రిలాగే ఉంటుంది. కటిక చీకట్లో అగమ్య గోచరంగా ........" అని ఆగిపోయాడు అతను. "సారీ! మరీ అతిగా మాట్లాడేస్తున్నానా?"    
    అప్పటిదాకా బిగుసుకుపోయి వింటున్న అమూల్య తెప్పరిల్లుకుంది. "లేదు . లేదు. చెప్పండి."
    "మీరు లేకపోతే జీవితం గాడంధకార బంధురంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అమూల్య! మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళాలనే ఆలోచనే అయిష్టంగా , అసంతృప్తిగా అనిపిస్తోంది నాకు. శత్రువుల మధ్యకి వెళ్ళడానికి కూడా నేనెప్పుడూ వెనుకంజ వెయ్యలేదు. కానీ మీ నుంచి దూరంగా వెళ్ళాలంటేనే దిగులుగా ఉంటోంది. ఇది నా వృత్తికి వ్యతిరేకం! ప్రవృత్తికి పూర్తిగా విరుద్దం! అయినా అలా జరుగుతోంది. హెల్ప్ లెస్ గా అయిపోయాను అమూల్యా!"
    "మీరు అసలు ఎందుకు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారు? ఇంటరెస్టు కొద్దీనా?" అంది అమూల్య. కూపీలాగుతున్నట్లు కనబడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ . కుతూహలంగా నటిస్తూ.
    అతను నుదురు చిట్లించి ఆలోచించాడు. "ఎందుకు వచ్చానంటారా? అది బహుశా నా రక్తంలోనే ఉందనుకుంటాను. సైన్యంలో పనిచెయ్యడం తరతరాలుగా మా వంశ సాంప్రదాయం అమూల్యా! మా కుటుంబంలో ప్రతి తరంలో ఒక్కరైనా సైన్యంలో చేరడం అలవాటు."
    "నా తొమ్మిదో ఏట అనుకుంటాను. మా ఇంటికి ఒక పెద్ద పార్సిలు వచ్చింది. దాన్లో మా నాన్నగారి లాంగ్ కోటూ, పెన్నూ, రిస్టువాచీ, భగవద్గీతా, ఉన్నాయి. బార్డర్ దగ్గర జరిగిన ఒక సంఘర్షణలో అయన మరణించారనీ, ఆయనకు సంబంధించిన వస్తువులు పంపుతున్నామనీ ప్రభుత్వం వర్తామానం పంపింది."
    అది చూసి మా అమ్మ ఏడవలేదు అమూల్యా! శివాజీని కన్నువీరమాత జిజియా బాయిలాగా నన్ను పొడువుకుని చెప్పింది. "దేశం కోసం మీ నాన్నగారు ప్రాణాలు ధారాపోశారు కన్నా! మనం పుట్టేదీ , గిట్టేదీ ఎందుకోసమో తెలుసా? మన దేశం కోసం! మనకోసం కాదు! మన ఈ భారతదేశం కోసం! గుర్తుంచుకో కన్నా!" అంది అంతే!
    ఆ రోజున ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది అమూల్యా! బంధువులందరూ మమ్మల్ని చూడడానికీ , ఒదార్చడానికీ వచ్చారు. కానీ నిజానికి వాళ్ళందరినీ, మా అమ్మే ఒదార్చవలసి వచ్చింది. ఎవరినీ ఏడవ నివ్వలేదు అమ్మ. చాలా లేటుగా పడుకున్నాం అందరం ఆ రోజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS