వారు చెప్పినది చాలా చిత్రమైన ఆర్గుమెంట్ యువర్ అనర్! మాట వరసకు ఒకమ్మాయి తప్పని పరిస్థితులలో ముగ్గురు వ్యక్తులతో సంబంధం పెట్టుకుందే అనుకుందాం! అది తప్పే కావచ్చు! అయినంత మాత్రాన దారిన పోయే ప్రతి దానయ్యకి ఆమె చెయ్యి పట్టుకులాగే హక్కు ఉంటుందా యువర్ అనర్? ఆమె జీవితం ఆమె సొంతం ఆమె......
"మంటలు బాబోయ్ మంటలు" అని దిక్కులు పిక్కటిల్లెలా కేక వినబడింది.
అందరూ తలలు తిప్పి చూశారు . కొంతమంది లేచి నిలబడి తొంగి చూశారు.
తలుపుదగ్గర వెంకటేశం వెర్రికేకలు పెడుతున్నాడు. "నాయనోయ్! దేవుడోయ్! తగలబడిపోతోంది సార్లూ"
వెంటనే కలకలం బయలుదేరింది.
అందరూ ఒకే సెకండులో గుమ్మాన్ని చేరుకొని బయటపడాలని చూశారు. గందరగోళం, కోర్టు క్లర్కుని ఎవరో నెట్టారు. అతను దభీమని కిందపడ్డాడు. వామనరావు అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు.
జడ్జిగారు కోర్టులో అందరినీ అదుపులో ఉంచి భయం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.
కొద్ది నిమిషాల తర్వాత కొర్టంతా ఖాళీ అయిపొయింది.
అందరూ బయటకొచ్చి ఆందోళనగా చూశారు.
కోర్టు భవంతి అంటుకోలేదు. దాని గోడ ప్రక్కన పోసి ఉన్నాయి ఎండుటాకులు. అవి అంటుకుని మండుతున్నాయి. వెంకటేశం గగ్గోలుగా అరుస్తున్నాడు.
దూరంగా నిలబడి వున్న రాధ వైపు చూసి "థాంక్స్" అన్నట్లు పెదిమలు కదిలించింది అమూల్య. ఆమె రాధకి ఇందాక చెప్పింది ఎండుటాకులతో చిన్నమంట చేసి, అది వెంకటేశానికి చూపించమని. వెంకటేశం కేకలు పెడతాడని కరెక్టుగా ఉహించగలిగింది అమూల్య.
మంటని ఆర్పారు ఎవరో.
హడావుడి తగ్గాక తిరిగి ఆసనంలో కూర్చున్నారు జడ్జిగారు.
"యువర్ అనర్!" అంది అమూల్య విజయగర్వంతో. "మంటలు మొదలవగానే బయటికి పరిగెత్తిపోయాం మనం. మంటలను గురించి ముందుగా హెచ్చరించింది వెంకటేశం! మన వెర్రిబాగుల వెంకటేశం! సాక్ష్యానికి పనికిరాడని మనం ఈసడించుకున్న వెంకటేశం!
కానీ మన ప్రాణాలకు అపాయం వచ్చిందని తోచినప్పుడు ఆ వెంకటేశం మాటలే మనం వేదంగా భావించి తలో దిక్కు పారిపోయాం!" ఆగి ఒకసారి సాభిప్రాయంగా ప్రాసిక్యూటర్ వామనరావువైపు చూసింది ఆమె.
"అదే విధంగా ఎవరి ప్రాణాలు వారికి తీపి యువర్ అనర్! ఈ ముద్దాయి నిర్మలకు కూడా!
ప్రమాదం జరుగుతూ ఉంటే వెంకటేశం గుర్తించగలడని తేలింది గనకా వెంకటేశం సాక్ష్యం నమ్మదగ్గదేనని రుజువయింది గనకా ఇంక మనం ముందుకి ప్రొసీడ్ కావచ్చు యువర్ అనర్?"
కోర్టులో గుసగుసలు వినబడ్డాయి.
"ఆర్డర్! ఆర్డర్!" అని హెచ్చరించి "మిస్ అమూల్యా! కోర్టు లేచిన తర్వాత మీరు నన్ను చాంబర్స్ లో కలవండి. ఈలోగా , పోసీడ్ విత్ ద కేస్. ప్రాసిక్యూటర్ గారూ! సాక్షి వెంకటేశాన్ని మీరు మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా?" అన్నారు జడ్జిగారు. అయన మోహంలో చిరునవ్వు కనబడుతోంది.
"ఈ అమ్మాయి పిల్ల కాదు . పిడుగు ! సగం కేసు గెల్చేసింది!" అని తన అసిస్టెంటుతో జనాంతికంగా లేచి నిలబడ్డాడు వామనరావు.
* * *
ఆ తర్వాత పదినిముషాలకే కోర్టు వాయిదా పడింది.
ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది అమూల్య మనసు. దాన్ని ఉగ్గబట్టుకోవడానికి విశ్వప్రయత్నిస్తోంది అమూల్య. సుడిగుండంలో చిక్కుకున్న నిర్మలకు మునిగిపోకుండా చేయూత ఇవ్వగలిగింది తను. ఇంక ఆమెకు కేసులో నుంచి పూర్తిగా బయట పడేసి ఒడ్దేక్కించాలి. జరిగింది అంతా రాధ ఈపాటికి నిఖిల్ కి చెప్పే ఉంటుంది. చాలా సంతోషిస్తాడు. తను ఎదురుగా ఉంటే, ప్రశంసాపూర్వకంగా ఒక్కచూపు చూసి ఉండే వాడు కూడా.
కనీసం చూపుకూడా కరువయిపోయింది ఇప్పుడు!
మనసులోనే లెక్కలేసుకుంది అమూల్య.
ఆ విధంగా ఆలోచిస్తేచూస్తే, రాధ ఎంత అదృష్టవంతురాలు!
నిఖిల్ అండలో, అనుక్షణం అతన్ని అనుసరించి ఉంటూ, అతని అవసరాలు గమనిస్తూ అతనికి కుడిభుజంలా మెలిగే అదృష్టం ఎంతమంది అమ్మాయిలకి కలుగుతుంది ఈ ప్రపంచంలో?
ఎవరో ఒక్కరికి!
ఆ ఒక్కరూ ఎవరూ?
ప్రస్తుతానికి రాధ!
అలా అనుకోగానే చేదుగా అయిపొయింది అమూల్య మనసు.
అటో ఎక్కి ప్లాట్ కి చేరుకోగానే ఆమె నాసికాపుటాలకి సోకింది సిగరెట్ వాసన.
ఒక్కక్షణం పాటు ఆమె మనసు తనని తాను మభ్యపెట్టుకోవడానికి చూసింది. నిఖిల్!
నిఖిల్ వచ్చి ఉంటాడని. తనని స్వయంగా కంగ్రాట్యులెట్ చెయ్యడానికి!
"కంగ్రాట్స్!" అన్నాడు తరుణ్, క్రీనీడలో నుంచి బయటికి వస్తూ. చెప్పలేనంత ఆశాభంగం కలిగింది అమూల్యకి. చాలా అసహనంగా పీలయింది. "బయటికి నడు!" అని గట్టిగా అతనికి చెప్పేయాలని బలీయమైన కోరిక కలిగింది.
కానీ నిఖిల్ ఆర్డర్స్!
