అది అర్ధం కావడం లేదు పోచయ్య తాతకి.
ఇప్పుడు అతని మనసులోకి చొచ్చుకుపోయి శిధించాలి తను.
ఓపికగా నెమ్మదిగా ప్రశ్నలు అడగడం మొదలెట్టింది అమూల్య అతన్ని గురించి, అతని గతాన్ని గురించి.
కాంతి విహినంగా ఉన్న కళ్ళకు నీటి పోరకమ్మి మసకబారిపోతూ ఉండగా , తడుముకుంటూ చెప్పడం మొదలెట్టాడు పోచయ్య.
* * *
మర్నాడు మళ్ళీ నిర్మల కేసు విచారణ.
రాత్రింబవళ్ళు నిర్విరామంగా పనిచేస్తున్న శ్రమ తాలూకు ఛాయలు అమూల్య మోహంలో స్పష్టంగా కనబడుతున్నాయి. నిద్రలేమితో ఎర్రగా ఉన్నాయి కళ్ళు.
లేచి నిలబడింది అమూల్య.
"యువర్ అనర్! నరేందర్ నిర్మల పైన అత్యాచారం చేశాడని మనవి చేశాను దానికి ప్రతిగా నిర్మల శీలవతి కాదు అన్న విషయాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఆమెతో శారీరక సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్న కొంతమంది సాక్షులను ప్రవేశపెట్టారు గౌరవనీయులైన ప్రాసిక్యుటర్. ఈ విషయం తర్వాత చర్చిస్తాను నేను.
కానీ ముందుగా నేను రుజువు చేయదలుచుకున్న విషయం నిర్మలని నరేందర్ బలవంతంగా అనుభవించాడని.
ఈ విషాద సంఘటనను కళ్ళారా చూసిన ప్రత్యక్షసాక్షి నిర్మల అన్న వెంకటేశం."
అమూల్య చెప్పబోయే ఈ ఆర్గుమెంటుని తను ముందే ఉహింది మందహాసంతో చూశాడు వామనరావు.
కోర్టువారి అనుమతితో వెంకటేశం వచ్చి బోను ఎక్కాడు.
అతన్ని చూడగానే కోర్టులో ప్రేక్షకుల గాలరీలో నుంచి గుసగుసలు నవ్వులు.
మోకాళ్ళు దాటి, వేలాడుతున్నట్లు కనబడే ఖాకీ నిక్కరూ, నలిగిపోయిన ఖాకీ చొక్కా వేసుకుని ఉంటాడు వెంకటేశం ఎప్పుడూ.
అలాంటి వేషధారణలో వస్తే అతని మీద ఎవరికీ సదభిప్రాయం కలగదని అముల్యకి తెలుసు. అందుకని అతనికి రెడీమేడ్ ప్యాంటూ, షర్టూ కొనిచ్చి అవి వేసుకురమ్మంది.
అలావాటులేక జారిపోతున్న ప్యాంటుని పైకి లాక్కుని దానిమీద మొలత్రాడు బిగించాడు వెంకటేశం. కలరు ఒకవైపు పైకి లేచి ఉంది. ఇంకో వైపు కిందకు ఉంది.
భగవద్గీత మీద ప్రమాణం చెయ్యమంటే వద్దని తనకు దేవతలాంటి చెల్లి నిర్మల మీద ప్రమాణం చేసి చెప్పడం మొదలెట్టాడు వెంకటేశం.
ఇదంతా చూస్తుంటే అమూల్యకి గుండె జారిపోయినట్లనిపించింది. తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టెయ్యడం తప్పదా అని కూడా అనిపించింది.
తన చెల్లెలిని పాకలోకి తీసుకెళ్ళి నరేందర్ ఏమి చేశాడో మోటు గ్రామీణ భాషలో చెప్పాడు వెంకటేశం.
నలభై ఏళ్ళ వెంకటేశం వాలకం, అతని భాషా , అతను చెప్పినా తీరు అందరికీ నవ్వు తెప్పించాయి గానీ ఎవరికీ జాలి కలిగించలేదు.
తర్వాత కొద్ది నిమిషాలలో వెంకటేశం సాక్ష్యాన్ని అట్టే శ్రమ లేకుండానే చిన్నాభిన్నం చేసి ఎందుకు పనికిరాకుండా చేసేశాడు వామనరావు తన ఏక్స్ పర్ట్ స్ట్రాటజీతో.
"నీకు ఎన్నేళ్ళు?" అని మొదటి ప్రశ్న వేశాడు.
"తెలియదు" అన్నాడు వెంకటేశం.
"మీ చెల్లెలికి ఎన్నేళ్ళు?"
"తెలియదు"
"నువ్వు పెద్దా మీ చెల్లెలు పెద్దా?"
వెంకటేశం కాసేపు ఆలోచించాడు. "మా చెల్లెలే నా కంటే పెద్దనుకుంటా? ఎందుకంటే తనేగా నాకు అన్నం పెట్టేది" అన్నాడు అమాయకంగా.
బుద్ది ఎదగని కపటం ఎరగని ఆ వెంకటేశాన్ని చూస్తుంటే అమూల్య కళ్ళు చెమర్చాయి. చెల్లెలి మీద ఇంతగా ఆధారపడిన ఈ వెర్రిబాగుల మనిషి , చెల్లెలిని ఉరితీశాక ఇంక ఎలా బతకుతాడు?
సదలిపోతున్న అమూల్య పట్టుదల తిరిగివచ్చింది. తను గెలవాలి. తనకోసం నిర్మల కోసం, నిఖిల్ కోసం, వెంకటేశం కోసం. వెంకటేశం లాంటి వాళ్లెందరి కోసమో కూడా.
"దట్సాల్ యువర్ అనర్?" అన్నాడు వామనరావు. "సాక్షి వెర్రి బాగులవాడని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇతని మాటలను నమ్మి న్యాయాన్యాయాలు తేల్చడం సబబు అనిపించుకోదు."
ఒక చెవితో అయన మాటలు వింటోంది అమూల్య. ఆమె మెదడు తీవ్రంగా ఆలోచిస్తోంది.
ఇంక టైం లేదు. తట్టాలి. వెంటనే ఏదో ఒకటి తట్టాలి. లేకపోతే నిండు ప్రాణం.........
ఒక్కసారి మెరుపు మెరిసినట్లయింది ఆమె మెదడులో. ఏం చెయ్యాలో స్పురించింది.
అటూ ఇటూ చూసింది.
ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉంది రాధ. ఆమెని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లయింది అమూల్యకి. సైగ చేసింది. పక్కకు వచ్చి నిలబడింది రాధ. ఆమె చెవిలో నాలుగు ముక్కలు చెప్పింది అమూల్య! రాధ తల పంకించి బయటకు వెళ్ళిపోయింది. బొరుగుల ఉండ తింటూ తలుపుదగ్గర నిలబడ్డాడు వెంకటేశం.
అమూల్య లేచి నిలబడింది.
"యువర్ అనర్! ఇందాక గౌరవనీయులైన ప్రాసిక్యుటర్ గారు చెప్పిన విషయానికి మళ్ళీ వస్తున్నాను."
