Previous Page Next Page 
మారణహోమం పేజి 72

 

    "నేనే హెచ్చరించాను. నిర్మలా వెంకటేశం బహుశా నా హెచ్చరికను అర్ధం చేసుకోలేకపోయారనుకుంటాను. నిజానికి వాళ్ళు మనతో బాటే వస్తున్నరనుకున్నాను నేను."    
    కాసేపు ఇద్దరూ దీర్ఘాలోచనలో ఉండిపోయారు.
    ఆలోచిస్తూనే అలవాటుగా చెయ్యి ముందుకు జాపాడు నిఖిల్ సిగరెట్ ప్యాకెట్ కోసం. కొద్ది క్షణాల పాటు తడుముకుని అది కనబడక కళ్ళు చిట్లించి చూశాడు.
    "సిగరెట్ ప్యాకెట్ ఏదీ?"
    "నేను తీశాను"
    వెంటనే కోపం కనబడింది నిఖిల్ మోహంలో.
    "ఇలా ఇవ్వు"
    "మీరు ఇవాళ ఇప్పటికి అరవై తొమ్మిది సిగరెట్లు కాల్చారు. ప్లీజ్! ఇంక వద్దు!"
    "నేకు పిచ్చి పట్టిందా?" అన్నాడు నిఖిల్ తీవ్రంగా. "ఇలా ఇవ్వు"
    "వద్దు! ప్లీజ్! సిగరేట్లలో ఉండే నికోటిన్ విషం! కాన్సర్ కి దారితీస్తుంది."
    అతి కష్టం మీద కోపాన్ని ఆపుకున్నాడు నిఖిల్.
    "బ్యూటీ!" అన్నాడు పెద్దగా.
    తక్షణం గదిలోకి వచ్చింది బ్యూటీస్పాట్. నాలుక బయట పెట్టి రొప్పుతూ అతని వైపు చూసింది.
    "బ్యూటీ సిగరెట్స్! అర్జెంట్!"
    మరుక్షణంలో మాయమయింది బ్యూటీ. యాభై సెకండ్ల తర్వాత తిరిగి వచ్చింది. దాని నోట్లో సిగరెట్ కార్టన్ ఉంది పాకెట్ కాదు. ఇరవై ప్యాకెట్లు ఉండే కార్టన్.
    "థాంక్స్ బ్యూటీ! గో!"
    కానీ బ్యూటీ వెళ్ళిపోలేదు. తన చుట్టూ తను ఒకసారి గిర్రున తిరిగి అక్కడే నేలమీద పడుకుని ఇద్దరినీ చూడడం మొదలెట్టింది.
    అతను కార్టన్ ఓపెన్ చేసి అందులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ పెదిమల మధ్య పెట్టుకున్నాడు.
    సిగరెట్ లైటర్ పట్టుకున్న రాధ చెయ్యి అతని పెదిమలను సమీపించింది. క్లిక్ మని చిన్న శబ్దం. లైటర్ లో నుంచి చిన్న మంట వస్తోంది.
    ఆ మంటలో సిగరెట్ అంటించుకోవడానికి కొంచెం తల ముందుకి వంచాడు నిఖిల్.
    తక్షణం చేతిని వెనక్కి లాగేసుకుంది రాధ.
    ఆశ్చర్యంగా తల ఎత్తి చూశాడు నిఖిల్. అతని మోహంలో ఆశ్చర్యం మొదట ఆగ్రహంగా ఆ తర్వాత ఆరాటంగా మారింది.
    "బ్లడీ ఫూల్!! ఏం చేస్తున్నావ్?"
    "ఫాలో ది లీడర్ అని వినలేదూ? నా లీడరు చేసే పనే నేను చేస్తున్నాను." అని తన పెదిమల మధ్య ఉంచుకున్న సిగరెట్ ని లైటర్ తో అంటించుకుంది రాధ. గాడంగా పీల్చింది. ఉపిరితిత్తులలోకి పొగవెళ్ళిపోయి కోరబోయింది. ఉదృతంగా దగ్గు వచ్చింది. ఉపిరి అందనట్లు కాసేపు మెలికలు తిరిగిపోయింది రాధ.
    ఆదుర్దాగా చూస్తున్నాడు నిఖిల్.
    పడుకుని ఉన్న బ్యూటీ స్పాట్ కూడా లేచి నిలుచుంది.
    కొద్దిక్షణాల తర్వాత తెప్పరిల్లుకుంది రాధ. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
    "నిజంగానే నువ్వు ఉత్త ఫూల్ వి!" అన్నాడు నిఖిల్ కోపంగా.
    "ఎందుకు? ఒక్క సిగరెట్ కల్చబోయినందుకా? మరి డెబ్బయ్యో సిగరెట్ కాల్చబోయిన వాళ్ళని ఏమనాలి! మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. ముఖ్యంగా నాకు! డెబ్బయ్ సిగరెట్లు! బాప్ రే! మీరు సిగరెట్లు కాల్చడం లేదు నిఖిల్! సిగరెట్లు మిమ్మల్ని కాల్చుకు తిన్తున్నాయ్! నికోటిన్ కి నీ నా భేదం లేదు నిఖిల్, కాన్సర్ కి కారుణ్యం కూడా ఉండదు!"
    "రాధా!"
    "ఒకటి మాత్రం నిజం నిఖిల్! మీరు ఏం చేస్తే నేను అదే చేస్తాను. మీకు మంచి జరిగితే నాకు మంచి జరగాలి! మీకు చెడు జరిగితే నాకూ ఆ చెడె జరగాలి! అంతే!"
    తదేకంగా ఆ అమ్మాయివైపే చూశాడు నిఖిల్. తనని సూపర్ మాన్ గా చూస్తూ ఆరాధిస్తూ తన నోటి వెంబడి వచ్చిన మాట పూర్తీ అయి కాకముందే దాన్ని ఆచరణలో పెట్టె అనుచరులతోనే అతనికి అనుభవం ఉంది.
    కానీ ఇన్నాళ్ళకు ఈ అమ్మాయి అంతులేని అభిమానంతో తనకు ఎదురునిలిచి ఎదురు తిరిగి ఎదురు చెప్పి తన నోరు మూత పడేట్లు చేస్తోంది.
    కొత్తగా ఉంది ఈ అనుభవం!
    పెదిమల మధ్య ఉన్న సిగరెట్ ని మెల్లిగా కిటికీలో నుంచి బయటపడవేశాడు నిఖిల్.
    నిఖిల్ సిగరెట్ పారెయ్యడం చూసి సంతోషం కనబడింది రాధ మోహంలో. కానీ అంత సంతోషమూ తుడిచిపెట్టుకుపోయినట్లయింది. అతను ఆ తర్వాత అన్న మాటలు వినగానే.
    "రాధా! నివ్వోకసారి అమూల్యను అర్జెంటుగా కలుసుకోవాలి"
    అప్రయత్నంగానే నుదురు చిట్లించింది రాధ. "ఎందుకు?" అంది.
    ఆమెలో వచ్చిన మార్పును గమనించే స్థితిలో లేడు నిఖిల్ "వెళ్ళి ఒక మెసేజ్ కన్వే చెయ్యాలి. చాలా అర్జెంటు. చాలా రహస్యం. ఒకే!"
    "సరే" అంది రాధ తన అయిష్టం గొంతులో కనబడకుండా జాగ్రత్తపడుతూ.

 

                                                           * * *


    ఒక వైపు నిర్మల కేసు విచారణ జరుగుతూ ఉండగానే మరో వైపు దొంగ ఆయుధాల తయారీ నేరం మోపబడిన పోచయ్య కేసు మరో కోర్టులో విచారణకి వచ్చింది రెండూ కష్టమైనా కేసులే. రెండు కేసుల్లోనూ న్యాయం తన క్లయింట్ల పక్షానే ఉందని నమ్మింది అమూల్య. వాళ్ళకి అన్యాయం జరగకూడదని పట్టుదలగా ఉంది ఆమెకు.
    న్యాయశాస్త్రంలో ముఖ్యాతి ముఖ్యమైన సిద్దాంతం ఏమిటి?
    వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని. కాదూ?
    "దొంగ ఆయుధాలు నువ్వు తయారుచెయ్యలేదంటున్నావు. ఆదిశేషు అనే అతను తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నావ్. ఆ అనుమానానికి ఆధారం ఏదన్నా ఉందా పోచయ్య తాతా?" అంది అమూల్య, పోచయ్యని ఒకరోజు సెల్ లో కలుసుకుని.    
    విచారంగా తల ఊపాడు పోచయ్య.
    "లేదు తల్లీ!"
    "మరి ఎందుకు అలా అనుకుంటున్నావ్ తాతా?"
    "నా మనసు చెబుతుందమ్మా!"
    చిన్నగా నవ్వింది అమూల్య.
    "మనసు చెప్పిందంటే కోర్టు నమ్ముతుందా తాతా?"
    ఇబ్బందిగా చూశాడు పోచయ్య.
    కాసేపు అతనివైపే పరీక్షగా చూసింది అమూల్య. మనసు! అవును! అతని మనసు చెబుతోంది అదిశేషు నేరం చేశాడని. అంటే నేరం తాలూకు ఆచూకీ ఏదో పోచయ్యకు తెలియకుండానే అతని సబ్ కాన్షస్ లోకి ఇంకిపోయి అట్టడుగు పొరల్లో ఎక్కడో ఇమిడిపోయిందన్నమాట. ఆ మేమొరీనీ రికాల్ చేసుకోలేకపోతోంది అతని మనసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS