Previous Page Next Page 
మారణహోమం పేజి 71

 

    అలాగే మీరూ నేను ఇక్కడున్న చాలామంది ప్రముఖులూ సంఘంలో మర్యాదా మన్ననా ఉన్న వ్యక్తులం. పరువుగా బతకడానికి అలవాటు పడిన వాళ్ళం.
    పరువుగా బ్రతికున్న మనిషిని పట్టుకుని నడిరోడ్డులో ఎవరైనా నానా మాటలు అన్నారనుకొండి. అతను కోపాన్ని అదుపులో పెట్టుకోడానికే ప్రయత్నిస్తాడు. ఎదుటిమనిషి హద్దు మీరి ఇంకా తిక్కరేగేలా మాట్లాడాడనుకొండి. ఇతను మనసు వశం తప్పి చేయి చేసుకోవచ్చు. ఆ దెబ్బ అనుకోకుండా ఆయువు పట్టుమీద తగలవచ్చు. ఆ మనిషి మరణించవచ్చు.
    అదికూడా ఉద్దేశ్యపూర్వకంగానే చేసిన హత్య అవదు. తాత్కాలికోద్రేకంలో ఒళ్ళు మరిచిపోయి చేసిన చర్య అవుతుందది.
    అది కూడా ఒక్కోసారి క్షమార్హమే అవొచ్చు యువర్ అనర్!
    కానీ కావాలని కసితో కుళ్ళు బుద్దితో కుట్ర పన్ని చంపుతారే అది దేముడు కూడా క్షమించలేని మహాపరాధం యువర్ అనర్!
    ఆ మహాపరాదాన్ని చేసింది మీ ముందు నిలుచున్న ఈ మగువ. ఒకరికి కూతురుగా, ఒకరికి భార్యగా, ఒకరికి తల్లిగా ఇల్లు చక్కదిద్దుకోవలసిన పిల్ల బజారునపడి, కొడవలితో గడ్డిపోచను నరికినట్లు ఒక అమాయకుడిని నరికింది యువర్ అనర్!"
    పబ్లిక్ ప్రాసిక్యుటర్ పబ్లిగ్గా తనని తిట్టకుండా నిర్మల మీద పెట్టి తనను నిందిస్తున్నట్లు తోచింది అమూల్యకి.
    ప్రాసిక్యూషన్ కధనం అయిన తర్వాత నెమ్మదిగా లేచి నిలబడింది అమూల్య. నిర్మల వైపు చూసింది. జరుగుతున్నదేమీ నిర్మలకు పట్టినల్టు లేదు. విరాగినిలా నిలబడి ఉంది తను.
    తర్వాత జడ్జిగారి వైపు చూసింది అమూల్య.
    తర్వాత ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూసింది.
    అప్పుడు నెమ్మదిగా చెప్పడం మొదలెట్టింది.
    "యువర్ అనర్! గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యుటర్ గారి కధనం వింటే వారు రెండు విషయాలు మిస్సయిపోయినట్లు అర్ధం అవుతుంది.
    "ఏమిటవి ?"
    "మనముందు బిక్కచచ్చిపోయి నిందితురాలిలా నిలుచుని ఉన్న ఈ ఆడపడుచు నిజానికి ముద్దాయి కాదు యువర్ అనర్!
    ఈ ముద్దాయి అన్నెం పున్నెం ఎరుగని అమాయకురాలు.
    ఆబాల కదా అని ఉబలాటపడి ఈమె పైన అత్యాచారం చేశాడు నరేందర్. తను ఆబలను కాననీ సబలననీ నిరూపిస్తూ తిరగబడింది నిర్మల."
    వెంటనే వామనరావు లేచి నిలబడ్డాడు. అయన మోహంలో విజయగర్వం కనబడుతోంది.
    "నా లేర్నాడ్ యంగ్ ఫ్రెండ్ ఈ పాయింట్ లేవదీస్తారనీ నేను ముందే ఉహించాను యువర్ అనర్! ఇది టిపికల్ ఫిమేల్ ట్రిక్!
    ఒక మగవాడు ఒక ఆడదాని ప్రవర్తన చెడ్డది అని రుజువు చెయ్యాలంటే శతకోటి సాక్ష్యాలు సంపాదించాలి. కాని కాని ఒక ఆడది ఒక మగవాడ్ని జులాయిగా చిత్రించాలంటే మాత్రం అంత ప్రయాసపడనక్కర్లేదు యువర్ అనర్. ఎవరూ లేకుండా చూసి అతని దగ్గరగా వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేలా కేకపెట్టి ఇతను నా చెయ్యి పట్టుకున్నాడనో నా బుగ్గ గిల్లాడనో కన్ను గీటాడనో మరే విధమైననైనా అసభ్యంగా ప్రవర్తించాడనో ఎలుగెత్తి ఎడుస్తే చాలు! లోకం గుడ్డిగా నమ్మేస్తుంది. ఫినిష్! అంతటితో అతనికి కామందుడని స్టాంప్ పడిపోతుంది.
    నరేందర్ నిర్మలమీదే కాదు, ఏ యువతి మీదా అత్యాచారం చేసే మగవాడు కాదు.
    అది అలా ఉండగా నా లేర్నేడ్ ఫ్రెండ్ పొగిడేస్తున్నంత శీలవతి కూడా ఏమీ కాదు యువర్ అనర్!"
    చటుక్కున లేచి నిలబడింది అమూల్య. "అబ్జక్షన్ యువర్ అనర్! దిసీజ్ కారెక్టర్ అసాసినేషన్! శీలాన్ని శంకించి సమాధి చేసెయ్యడం , నిర్మల నిప్పులాంటిదని వాళ్ళ ఉళ్ళో అందరికీ తెలుసు."
    "అబ్జక్షన్ సస్టేయిన్!" అన్నారు జడ్జిగారు ప్రాసిక్యుటర్ తో. "మీరు చాలా తీవ్రమైన నిందారోపణ చేశారు. దానికి సాక్ష్యం ఏదన్నా ఉందా?"
    తొణకకుండా చిరునవ్వుతో ఇదంతా చూస్తున్న వామనరావు తల పంకించాడు.
    "డజను మంది సాక్ష్యులు ఉన్నారు యువర్ అనర్! వాళ్ళు సాక్ష్యులే కాక నిర్మలకు ప్రియులు కూడా."
    నెత్తిమీద పిడుగుపడినట్లు చూసింది నిర్మల. కనుబొమలు ముడేసి తీక్షణంగా చూస్తోంది అమూల్య.
    కోర్టువారి అనుమతితో సాక్ష్యులను ప్రవేశపెట్టాడు ప్రాసిక్యూటర్. మొత్తం పన్నెండు మంది. అందరూ కూడా తమకు నిర్మలతో శారీరక సంబంధం ఉందని ఒప్పుకున్నారు.
    "దట్సాల్ యువర్ అనర్! శీలం అంటే ఎరుగని ఈ స్త్రీ కోసం నరేందర్ అర్రులు చాచాడనడం అత్యాచారం చేశాడనడం అసంబద్దం అవివేకం! అసమంజసం! అన్యాయం! అక్రమం!
    ఈ స్త్రీ పాతచారిత్రను ఎరిగిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరు యువర్ అనర్, నరేందర్ చిటికేవేసి, కాకితో కబురంపినా ఈమె తక్షణం వెళ్ళి అతని వళ్ళో వాలి ఉండేది. ఈమె కోసం అత్యాచారం ........" చులకనగా చూస్తూ తల ఉపాడు ప్రాసిక్యూటర్........."జస్ట్ అన్ థింకబుల్ యువర్ అనర్!
    అసలు ఏం జరిగిందో నెను చెబుతాను. చిన్నప్పటి నుంచి చెడు తిరుగుళ్ళకి అలావాటు పడింది నిర్మల. అది మొహం మొత్టాక పెళ్ళి మీద తాళి మీద మోజు పుట్టింది. అప్పుడు కళ్ళకి తేరగా కనిపించాడు నరేందర్. అతను గొప్పింటి బిడ్డ. ఎర్రగా బుర్రగా ఉంటాడు. అతన్ని కూడా వలలో వేసుకుని తూతూ మంత్రంగా తాళి కట్టించుకోవాలనుకుంది.
    ఆ ఎత్తులకూ జిత్తులకూ లొంగ లేదు నరేందర్.
    తిరస్కరించబడిన స్త్రీ తాచులా మారుతుందని శాస్త్రకారులు అంటారు యువర్ అనర్! నిర్మల విషయంలో అది నూటికి నూరు శాతం నిజం అయింది. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మలా ఉండాలి స్త్రీ. దానికి వ్యతిరేకంగా వ్యసనపరురాలైన ఈ నిర్మల పశుత్వం ప్రకోపించి పగబట్టి నరేందర్ ప్రాణాలు తీసింది.
    దట్సాల్ యువర్ అనర్!"
    నిర్మల కేసు ఆరోజుకు వాయిదా పడింది.
    
                                                       * * *


    "చూస్తూ ఉంటే నిర్మల పరిస్థితి చాలా విషమంగానే ఉన్నట్లు ఉంది" అంది రాధ నిఖిల్ తో.
    :"అవును" అన్నాడు నిఖిల్, సిగరెట్ ప్యాకెట్ లో నుంచి కొత్త సిగరెట్ తీసి పెదిమల మధ్య ఉన్న సిగరెట్ తో దాన్ని అంటించుకుంటూ, గదంతా అప్పటికే సిగరెట్ పొగ ఆవరించుకుని కొద్దిగా తలనొప్పి కలగజేసేలా ఉంది వాతావరణం.
    టీపాయ్ మీద ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి తన కొంగులో దాచేసింది రాధ అతను చూడకుండా.
    "మరి మీరు స్వయంగా వెళ్ళి నిర్మలను ఎందుకు కాపాడారు?" అంది నిలదీస్తున్నట్లు.
    "పరిస్థితులు ఇదివరకులా లేవు రాదా! ఇంతకుముందు ఎన్ని కేసులు ఉన్నా నిర్భయంగా కోర్టుకి వెళ్ళేవాడిని నిబ్బరంగా తిరిగివచ్చేవాడిని. నా మీద కేసు నిలవకుండా ప్రత్యర్ధులు కేసు గెలవకుండా ముందే జాగ్రత్తలు తీసుకునేవాడిని. ఇప్పుడు అంత జాగ్రత్తగా పనులు చేసే సమయమూ లేదు అవకాశమూ లేదు. పైగా నామీద మర్డర్ కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. నాన్ బెయిలబుల్ వారంట్లు నా కోసం ఎదురు చూస్తున్నాయి.
    అందుకే ఈ మధ్య నేను కోర్టు కేసులకు అటెండ్ కావడం లేదు రాదా! వెళితే చిక్కుకుపోయేటట్లు ఉన్నాను. నిర్మల దగ్గరకి నేను స్వయంగా వెళ్ళలేకపోవడానికి కారణం అదే!"
    "ఆ రోజు నిర్మల వాళ్ళు కూడా మనతో బాటు కొండలవైపుకి వచ్చేసి ఉంటే బాగుండేది.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS