అమూల్య పైకి చెప్పకపోయినా అతని భావం అర్ధమైపోతోంది.
"మీ పెదిమలు సృశించిన చోట కప్పుని నా పెదిమలతో సృజిస్తాను మహాభాగ్యంగా భావిస్తూ!"
రెండు గుక్కలలో కాఫీ తాగేసి గుడ్ నైట్ చెప్పి తలుపు కొద్దిగా తెరిచి కారిడార్ లోకి తొంగిచూసి మరుక్షణంలో మాయమైపోయాడు అతను.
* * *
కొద్ది రోజుల తర్వాత కోర్టులో -
ప్రాసిక్యుటర్ వామనరావు గారు తన కేసుని కోర్టు వారికి నివేదించడం మొదలెట్టారు.
"యువరానర్! స్త్రీ అంటే సహనానికి, క్షమాకూ, పవిత్రతకూ, వినయానికి, వందనానికి మారు పేరని చెబుతుంది మన సంస్కృతీ. కానీ మా ముందు నిలబడి వున్న ముద్దాయి నిర్మల, తన మలిన చరిత్రతో మొత్తం స్త్రీ జాతికే తలవంపులు తెచ్చేపని చేసింది. ఒక నిండు ప్రాణాన్ని దయాదాక్షిణ్యం లేకుండా తీసింది. కీర్తి శేషుడయిన హతుడు, నరేందర్ ఆమె కంటే రెండు నెలలు చిన్న. గౌరవనీయ కుటుంబానికి చెందినవాడు. తరతరాలుగా ఊరికి పెద్దదిక్కుగా ఉంటోంది వాళ్ళ కుటుంబం. వాళ్ళ తాత ఉరి మధ్యలో రామాలయం కట్టించాడు. అతని పెదనాన్న పంచాయితీ ఆఫీసుకి, ఎలిమెంటరీ స్కూలు పెట్టడానికి తన ఇల్లు రెండు దానంగా ఇచ్చాడు.
అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నరేంద్రని మీ ముందు నిలబడి ఉన్న ఈ స్త్రీ నిర్మల , పాశవికంగా కొడవలితో నరికి చంపింది.
ఈ దారుణ మారణకాండకు సాక్షులు ఉన్నారు యువరానర్! ఒకళ్ళు కాదు, ఇద్దరూ కాదు. అక్షరాల రెండు వందల తొంభై ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు, జరిగిన ఘతకాన్ని కళ్ళారా చూసినవాళ్ళు వున్నారు.
కోర్టు అనుమతిస్తే ఆ సాక్షులను ప్రవేశపెట్టడం జరుగుతుంది యువరానర్!"
"ప్రొసీడ్!" అన్నాడు జడ్జిగారు.
మొదటి సాక్షి బోనేక్కాడు. భగవద్గీతను తాకించి ప్రమాణం చేయించాడు కోర్టు గుమాస్తా.
"పేరు?"
"దున్నపోతుల రాజయ్య"
"వృత్తి?"
"వేవసాయం!"
"హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావా?" అన్నాడు వామనరావు.
"ఉంటిని దొరా!"
"ఏం జరిగింది?"
"మర్డర్ జరిగింది దొరా!"
"ఏం జరిగింది కోర్టువారికి పూర్తిగా చెప్పు! ఎవరు చేశారు హత్య?"
దున్నపోతుల రాజయ్య చేతులు కట్టుకుని నిలబడి చెప్పడం మొదలెట్టాడు.
"ఆరోజు రచ్చబండ కాడ కూకోని మేం కొంతమందిమి రేడియో వింటుంటిమీ దొరా! అప్పుడు కొడవలి పట్టుకుని మహంకాళిలెక్క ఈ నిర్మల వచ్చే. జబర్దస్తీగా ఒక్క వేటు వేసే. దాన్తో నరేందర్ సఫా అయిపోయిండు దొరా!"
"నిర్మల నీకు బాగా తెలుసా?"
"తెలుసు అంటే అట్లట్ల తెలుసు! మా ఉళ్ళో పరువుగా బతికే వాళ్ళెవరూ నిర్మల నాకు తెలుసనీ చెప్పుకోరు దొరా?"
"నరేందర్ నీకు ఎప్పటి నుండి తెలుసు?"
"నరేందర్ పుట్టినప్పటి నుండి నాకు తెలుసు!"
"ఎలాంటివాడు నరేందర్?
"సుద్దపూస! అంత మంచి పిల్లగాడు ఇంకోడు ఉండడు"
"అతను ఆడవాళ్ళ జోలికి ఎప్పుడయినా పోయేవాడా?"
"అడోల్లె నరేందర్ మీదకి పడీ పడీ వస్తూ ఉండే వాళ్ళు. కానీ ఆయనకు గట్లాంటి షోకులు లెవ్!"
తర్వాత మరో సాక్షి బోనేక్కాడు.
అతను చెప్పినదే!
ఆ తర్వాత సాక్షి అదే చెప్పాడు. అందరూ ఒకే మాస్టర్ గైడ్ చదివి పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాసినట్లు అందరిదీ ఒకే వర్షన్.
నిర్మల పోగారబోతు. నరేందర్ దైవాంశ సంభూతుడి లాంటివాడు. అతను చెయ్యని మంచిపని లేదు. అతను ఇంకొన్నాళ్ళు బతికి వుంటే వాళ్ళ ఊరుని భోలోక స్వర్గంగా మార్చి ఉండేవాడు.
అలాంటి నరేందర్ ని అందరూ చూస్తుండగా హత్య చేసింది నిర్మల.
ఆమెని ఉరితీసి తరవాత వీలయితే శిరచ్చేదం కూడా చేస్తే కాని ఈ భూభారం తగ్గదు.
సీరియస్ గా ఇదంతా విన్నది అమూల్య.
అందరి సాక్ష్యం అయ్యాక మళ్ళీ ఒకసారి తన కేసుని సమీక్ష చేశాడు వామనరావు.
"యువర్ అనర్! మర్డర్ లు కూడా రకరకాలు. ఆత్మరక్షణ కోసం చేసివి కొన్ని, తాత్కాలికమైన కోపావేశంలో చేసేవి కొన్ని. కావాలని కూల్ గా అలోచించి కుట్ర పన్ని చేసేవి మరికొన్ని. ఎవడన్నా కత్తి పట్టుకుని మన మీదకు వచ్చాడనుకొండి. ఆత్మరక్షణ కోసం మనం మరో ఆయుధం పట్టుకోవచ్చు. పెనుగులాటలో ఆ దుండగుడు గాయపడి మరణించవచ్చు. అది హత్య అనిపించుకోదు యువర్ అనర్.
