Previous Page Next Page 
మారణహోమం పేజి 69

 

    "అలాగా!" అంది అమూల్యా తలపంకిస్తూ.
    "మన ఇండియాలోనే హాధీ అని ఒక పెద్ద క్రూక్ ఉన్నాడు. అతనికి ఇప్పటికే అమెరికన్ మాఫియాతో, హాంగ్ కాంగ్ బాంబూ యునియన్ తో సంబంధాలు ఏర్పడ్డాయని నాకు అనుమానం. నిఖిల్ ఈ మధ్య అతన్ని కలిసినట్లు కూడా నాకు సమాచారం అందింది.
    అదీకాక ఇంకొక విశేషం కూడా విన్నాను అమూల్యా!"
    ప్రశ్నార్ధకంగా చూసింది అమూల్య.
    అతను ఇప్పుడు అమూల్యతో మాట్లాడుతున్నట్లు కాకుండా స్వగతంగా తనని తనే ప్రశ్నించుకుంటున్నట్లు అన్నాడు.
    "అన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పాలరాతి గుడి కట్టాలని, దానికి బంగారు గోపురం అమర్చాలని, నిలువెత్తు విగ్రహానికి కీరీటం పెట్టాలని హాధీ ఎందుకు తలపెట్టాడు?
    అతనికి ఉన్నట్లుండి అంత దైవభక్తి ఎందుకు ఎలా పుట్టుకొచ్చింది?"
    ఆలోచనలతో తరుణ్ భ్రుకుటి ముడిపడింది.
    "పాలరాతి గుడా?" అంది అమూల్య ఆశ్చర్యంగా.
    "అవును. మూడు సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతోంది. మొదట్లో కట్టుదిట్టంగా కాపలా వుంచి గోప్యంగా ఉంచారు ఆ విషయాన్ని. ప్రజలకు తెలియకపోయినా మాకు తెలిసిపోతుంది కదా? మందిరమే కదా అని అంతగా పట్టించుకోలేదు మేము. ఇంక కొద్దిరోజుల్లో ప్రజలందరికి తెలిసిపోతోంది ఆ మందిరం సంగతి! వేల టన్నుల పాలరాయి ఉపయోగిస్తున్నారు దానికి. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. బహుశా పై నెలలో కలశప్రతిష్టాపన చేస్తారేమో? ఆ గుడి పూర్తయ్యాక అంత అందమైన కట్టడం ఇండియాలో మరొకటి ఉండదనుకుంటాను!"
    "తాజ్ మహల్ కంటే బాగుంటుందా?"
     అవును! దాదాపు తాజ్ మహల్ అంత అందమైన కట్టడం అవుతుంది ఇది! ఇంకో విశేషం ఏమిటంటే తాజ్ మహల్ కట్టిన శిల్పుల సంతతి వారే ఈ దేవాలయాన్ని కడుతున్నారు!"
    "అంత పనీ మూడేళ్ళలో పూర్తీ అయిపోతుందా?" అంది అమూల్యా ఆశ్చర్యంగా.
    తరుణ్ నవ్వాడు. "తాజ్ మహల్ నిర్మాణం జరిగినప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ కాలేదు. ఇన్ని రవాణా సౌకర్యాలూ , ఇంత సోఫిస్టికేటేడ్ ఎక్విప్ మెంట్స్ లేవు! అందుకని అంతమంది పనివాళ్ళు, అన్ని సంవత్సరాల తరబడి పని చేయ్యవలసి వచ్చింది.
    ఇంత పెద్ద దేవాలయాన్ని , గుట్టల వెనక గుట్టుచప్పుడు కాకుండా మూడేళ్ళలో కట్టివేయ్యగలిగారంటే అందుకు కారణం ట్వెంటీయత్ సెంచురీ టెక్నాలజీనే!" అని ఆగి కోటు పాకెట్ లో నుంచి పర్స్ తీశాడు తరుణ్.
    అందులో ఉంది ఒక కలర్ ఫోటో. ఏరియల్ వ్యూ. ఆకాశంలోంచి తీసిన యాంగిల్. అందులో కనబడుతోంది మంచుముక్కలతో చేసినట్లు నీరెండలో మిలమిల మెరిసిపోతున్న పాలరాతి దేవాలయం. ఎకరాల మేర వ్యాపించి వున్నాయి దాని తాలూకు కట్టడాలు. చీమల్లా కనబడుతున్నారు వేలాది కూలీలు, మేస్త్రీలు, అర్కిటేక్టులు, శిల్పులు, స్థపతులు.
    రెప్ప వాల్చకుండా దాన్ని చూసింది అమూల్య. తరుణ్ చెప్పిన దానిలో అతిశయోక్తి లేదు. ఆ దేవాలయం గనక పూర్తయితే అది ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడంగా గుర్తించబడినా ఆశ్చర్యంలేదు.    
    "నేను అడిగేది హాధీకి ఇంత దైవభక్తి ఎప్పుడూ పుట్టుకొచ్చిందని?
    లేకపోతే?
    అది పాపభీతా?"
    ఈ ప్రశ్నలు తనకి తానే వేసుకుని వాటికి జవాబు తట్టనివాడిలా అసంతృప్తిగా తల పంకించాడు తరుణ్. సమాధానాలు దొరకని ప్రశ్నలు మిగిలిపోవడం అతనికి రుచించలేదు.
    ఉన్నట్లుండి ఏదో స్పురించినట్లు అన్నాడు తరుణ్. "నేను అర్జెంటుగా వెళ్ళాలి అమూల్యా! మిమ్మల్ని వచ్చేవారం కలుస్తాను."
    "అయ్యో! కాఫీ అన్నా తాగకుండా వెళ్ళిపోతారా?" అంది అమూల్యా లేని అభిమానం ఒలకబోస్తూ -
    ఎప్పుడూ క్షణాల మీద నిర్ణయం తీసుకునే తరుణ్ సందిగ్ధంలో పడ్డట్లు తటపటయించాడు. కొద్దిసేపటి తర్వాత "సరే! మీ ఆఫర్ ని కాదనేటంత తెగువ నాకు లేదు. ఒప్పుకుంటున్నాను" అన్నాడు చిరునవ్వుతో.
    అతనికి కాఫీ పెట్టి ఇవ్వడమే తన దేయమన్నట్లు, తను ఇచ్చిన కాఫీ అతను తాగితే తన జన్మ సార్ధకమయేటట్లు మొహం పెట్టి ఇన్ స్టంట్ కాఫీ జార్ అందుకుంది  అమూల్య.
    రెండు నిమిషాలలో వెచ్చటి సువాసనలు వెదజల్లుతున్న కాఫీని పెద్దకప్పులోకి ఒంపి తరుణ్ కి అందించింది.
    "థాంక్స్!" అని అందుకున్నాడు తరుణ్. "నాకొక చిత్రమైన అలవాటు వుంది. గుర్తించారా?" అన్నాడు నవ్వుతూ.
    తల కొంచెం ఓరగా పెట్టి కొద్ది క్షణాలు చూసి "ఆ!" అంది అమూల్య.
    "ఏమిటి?"
    "మీది కుడి చేతివాటం. అయినా ఎందుకో గానీ కాఫీ కప్పు హెండిల్ ఎప్పుడూ ఎడం చేత్తోనే పట్టుకుంటారు."
    "ఏక్స్ లెంట్! మీ పరిశీలనా శక్తి అమోఘం!"
    "ఇంతకీ ఎందుకలా చేస్తారో చెప్పలేదు?"
    "ప్రపంచంలో ఎక్కువమంది జనాభాకి కుడిచేతి వాటమే వుంటుంది. కాఫీ కప్పుని చాలామంది కుదిచేత్తోనే పట్టుకుంటారు. హోటళ్ళలాంటి పబ్లిక్ ప్లే సెస్ లో అయితే ఒక కాఫీ కప్పుని ఒకే వైపు పట్టుకుని ఒకే స్పాట్ లో పెదిమలు తాకించి కొన్ని వేలమంది కాఫీ తాగుతారు. అందుకని నేను కప్పుని ఎప్పుడూ ఎడమచేత్తో పట్టుకుని తాగుతాను. ఎందుకంటే ఆ అంచుని ఎక్కువ పెదిమలు తాకివుండవు. కానీ ఇవాళ నుంచి మీరు మీ కాఫీ కప్పుతో కాఫీ ఇస్తే మాత్రం కుదిచేత్తోనే పట్టుకుని తాగుతాను. ఇష్టంగా! మహాభాగ్యమని భావిస్తూ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS