Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 6


    అతను చూస్తుండగానే మంగళ సూత్రధారణ కూడా అయిపోయింది. అందరితోపాటు తనూ అక్షింతలు చల్లాడు సృజను.
    అతనికి విపరీతమయిన ఆశ్చర్యంగా ఉంది. సురేంద్రలో ఏం ఆలోచనలు దాగి ఉన్నాయో అర్ధం కావటం లేదు.
    అతను స్వరూపని స్వీకరించడానికే నిశ్చయించుకొన్నాడా? అలా చేయడాన్ని తను వ్యతిరేకించటం లేదు. కాని- అంతగా ఉద్రేకపడిన అతను ఇంత తేలికగా ఎలా రాజీకి రాగలిగాడు. అతని తత్వం తనకు బాగా తెలుసు. పట్టుదలగలమనిషి. మరి ఈ చిత్రమేమిటి?
    "పదరా! ఇంకా ఇక్కడెందుకు? పదిగంటలకు బస్సుందట పోదాం..." అన్నాడు సీతంరాజు అక్కడినుంచి లేస్తూ.
    "ఓసారి సురేంద్రకు చెప్పి వెళ్ళొద్దూ?" అడిగాడు శ్రీధరం.
    "పదండి చెప్పకుండా ఎట్లా?"
    అందరూ అతడిదగ్గరకు నడిచారు. వాళ్ళతో పాటు తనూ నడిచాడు సృజన్.
    "అప్పుడే ఏమిట్రా? భోజనం అదీచేసి సాయంత్రం వెళుదురుగాని...." అన్నాడు సురేంద్ర.
    "ఇంకెందుకులే రా మేము పానకంలో పుడకల్లాగా రాత్రిళ్ళు ప్రయాణం కష్టమయిపోతుంది మళ్ళీ పోతాం"
    అతను ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.
    "నేనూ వెళుతున్నాను" అన్నాడు సృజన్. అతనికి వీలయినంత త్వరగా అక్కడినుండి వెళ్ళిపోవాలనుంది.
    "నీకేం తొందర?" అడిగాడు సురేంద్ర.
    "ఇప్పుడు బయల్దేరితేనె తెల్లారేసరికి హైద్రాబాద్ చేరుకొంటాను. లేకపోతే మరో రోజంతా గడపాల్సి వస్తుంది..."
    "సరే నీ ఇష్టం-అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తానులే తరువాత.
    సృజన్ బాబు సీతంరాజువాళ్ళతో పాటు బస్ స్టాండ్ చేరుకొన్నాడు. అతని మనసంతా వికలమయిపోయింది.
    తనకూ-సురేంద్రకూ మధ్య అదివరకటి అభిమానం స్నేహం లోపించినట్లనిపించసాగింది.
    బస్ బయల్దేరి కలువ ప్రక్కనే రోడ్డుమీద వేగంగా పరుగెత్త సాగింది.
    సృజన్ బాబు కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. "తనీ పెళ్ళికి రాకపోయినా బావుండేది" అనుకొన్నాడు బాధగా.
    
                                                            4
    
    అందంగా అలంకరించిన మంచంమీద కూర్చున్నాడు సురేంద్ర. అతని మొఖం వాడిపోయి ఉంది. ఈ ఘడియలకోసం తనెన్ని కలలు కన్నాడు. ఎంత ఆత్రుతతో ఎదురు చూశాడు! అవన్నీ ఒక్క రాత్రిలో చెల్లాచెదరయి పోయినయ్. ఒక్కమాటలో చెప్పాలంటే తనజీవితమే సర్వనాశనం అయిపోయింది.
    టైం చూసుకొన్నాడతను. పదకొండవుతోంది గదిలో లైటు డమ్ గా వెలుగుతోంది. పూలు, అగరొత్తులు, సెంట్లు-అన్నిటి సువాసనా కలిసిపోయి కొత్త పరిమళం అలుముకొంది.
    ఉండుండి బయట ఆడవాళ్ళ నవ్వులు వినబడుతున్నాయ్.
    మరికొద్దిసేపటి తర్వాత గది తలుపులు తెరచుకొన్నయ్. స్వరూప నెమ్మదిగా బిడియంగా లోపలి కడుగుపెట్టింది. తలుపులు మళ్ళీ మూసుకుపోయినయ్.
    అతని వంక ఓసారిచూసి తలదించుకొని గోడకానుకొని నుంచుండిపోయింది స్వరూప. ఆమె అందం అదివరలా పరవశత్వం కలిగించటం లేదు సురేంద్రకి. శరీరమంతా ద్వేషంతో భగ్గుమంది. అతికష్టంమీద కోపం అణచుకొని లేచి ఆమె దగ్గరగా నడిచాడు.
    కొద్దిసేపు ఆమెవంకే చూస్తూ నిలబడిపోయాడు. ఎలా మొదలుపెట్టాలో ఏమాత్రం అర్ధంకావటంలేదు.
    అమాయకంగా, నిర్మలంగా కనబడుతోన్న ఆమె ముఖం కోపాన్ని పెంచేస్తోంది. వెనక్కు తిరిగి నడిచి మంచం మీద కూర్చొని సిగరెట్ వెలిగించుకున్నాడు.
    "ఇలారా!" అన్నాడు ఆమె వంక చూడకుండానే అతని ముందు కొచ్చి నిలబడింది స్వరూప.
    ఆమె వంకే చూసి, ఆమెకూడా తనవంక చూడటంతో చూపులు మరల్చుకొన్నాడతను. స్వరూప తెల్లబోయింది. అతని ప్రవర్తన ఆమెకేమాత్రం అవగాహన కావటంలేదు. తను అంతకు ముందు దృష్టిలో ఉన్న సురేంద్ర వేరు-ఈ సురేంద్ర వేరు!
    "అలా కూర్చో నీతో మాట్లాడాలి...." అతని గొంతులోని కర్కశత్వానికి కలవర పడిందామె.
    కుర్చీలో కూర్చుని అతని వంకే ఆత్రంగా చూడసాగింది.
    "దయచేసి నేనడిగేదానికి నిజం చెప్పు అబద్దాలాడి నీ మీద ఉన్న అభిప్రాయాన్ని మరింత దిగజార్చవద్దు..." తిరిగి అన్నాడతను.
    త్రుళ్ళిపడింది స్వరూప. ఆమె గుండెలు బయటకు వినబడేటంత గట్టిగా, వేగంగా కొట్టుకోసాగాయి. క్షణంలో ముఖం వెల వెల పోయింది.
    "ఏమిటది?" హీనస్వరంతో అడిగిందామె.
    "నీ గత చరిత్ర నాదగ్గరెందుకు దాచావ్? నన్నెందుకు మోసం చేసావ్?" ఉద్రేకంగా అన్నాడు సురేంద్ర లేచి నుంచుంటూ.
    స్వరూప మొఖం పూర్తిగా పాలిపోయింది.
    "మీ....రనేది..."
    "నే ననేదేమిటో నీకు తెలుసు. ఇంక నటించడం ఆపు, నువ్వు నీ యిష్టం వచ్చిన వాడితో తిరుగు. నాకేమీ సంబంధంలేదు. కాని మధ్యలో నన్నెందుకు వివాహం చేసుకోవాలనుకున్నావ్? నేను నీకేం ద్రోహం చేశానని నన్నీ రకంగా అపఖ్యాతి పాలు చేయదల్చుకున్నావ్?"
    జలజలా రాలిపోతున్న కన్నీళ్ళు తుడుచుకొని, కుర్చీ లోంచి లేచి నిలబడింది స్వరూప.
    "క్షమించండి! నేనెవర్నినీ మోసం చేయాలనుకోలేదు. అసలు వివాహం చేసుకోవాలన్న కోరికే చచ్చిపోయింది నాలో. కానీ... మా పెద్దవాళ్ళ బలవంతం మూలానా, వాళ్ళ కన్నీళ్ళు చూడలేక నా 'చరిత్ర'ణు మీ ముందుంచడానికి సాహసించలేకపోయాను. అయినా నేనేమీ తప్పుచేయలేదన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి!..."
    ఆమె చెంప చెళ్ళుమని మోగింది కళ్ళు బైర్లు కమ్మినట్లయినయ్.
    "ఆడదానివి కాబట్టి, ఇంతటితో ఆగుతున్నాను. తప్పు చేయలేదని నమ్మకం ఉందిట? మోసం చేయాలనుకో లేదట... రాస్కెల్! నిన్న రాత్రే ఈ పెళ్ళి రద్దుచేసి- నీ రంకుతనం నలుగురుముందూ చాటి మరీ ఇక్కడినుంచి పోయేవాడిని కానీ ఈ అల్లరికి గుండెజబ్బు ఉన్న మా అమ్మ ప్రమాదపరిస్థితిలో పడుతుందేమోనని ఆలోచించి ఇంతవరకూ జరగనిచ్చాను!"
    స్వరూప అతని వంక బాధతోనూ, అసహ్యంతోనూ చూసింది. హఠాత్తుగా ఎక్కడలేని ధైర్యం ఆమెలో ప్రవేశించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS