మాధవీ! లే! మీ నాన్నగారు ఇంటికి వచ్చేసి వుంటారు."
"ప్రేమ్ "మాధవి చెక్కిళ్ళు పాలిపోయి వున్నాయి.
"కమాన్! మీ ఇంటి వద్ద దించి వస్తాను."
"నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నా' సాగర్ భుజం పట్టుకొని లేస్తూ అన్నది.
"నాకేం కష్టం లేదు. నీ ఆరోగ్యం బాగుండాలి. అంతే నాక్కావలసింది.
"నా ఆరోగ్యాని కేమయింది?" సాగర్ కళ్ళల్లోకి చూస్తూ అన్నది మాధవి.
సాగర్ అనాలోచితంగా తను అన్నదానికీ బాధ పడ్డాడు. ఆమె వున్న పరిస్థితిలో తను అనవలసిన మాట కాదు.
"నా ఉద్దేశ్యం నీ ఆరోగ్యం బాగా లేదని కాదు. చాలా పొద్దుపోయింది. బాగా అలసి పోయినట్లు కన్పిస్తున్నావు. నీకు విశ్రాంతి కావాలని నా ఉద్దేశ్యం"
ఆమె చూపుల్లో ఏ రకమయిన భావమూ కన్పించలేదు. అసలు తను చెప్పింది విన్నదా లేదా అన్న అనుమానం కూడా వచ్చింది సాగర్ కు.
సాగర్ ఆలోచిస్తూ మాధవి వెనుక నడిచాడు. సాగరూ , మాధవి బయటకు రాగానే వరండాలో కునుకు తీయడానికి ఉపక్రమిస్తున్న అర్డర్లీ ఖంగారుగా లేచి సెల్యూట్ చేశాడు.
"విక్టర్! గ్యారేజి లో నుంచి కారు బయటకు తియ్. ఇప్పుడే వస్తా. ఈలోపల అమ్మగారు లేచి అడిగితే చెప్పు."
"యస్సార్" అని విక్టర్ గ్యారేజీ లో వున్న కారు తీసి బయట పెట్టాడు.
,మాధవి సాగర్ పక్కన కూర్చుంది. కారు స్టార్టు చేసి డోర్ ప్రక్కన ఎటేన్షన్ లో నిలబడ్డ విక్టర్ ను చూసి "అమ్మ గారు అడిగితే ఏమి చెప్తావ్!" అన్నాడు.
"జడ్జి గారమ్మయిని తీసుకొని బయటకు వెళ్ళారు ఇప్పుడే వస్తానన్నారని చెప్తాను సార్."
"యూజ్ లెస్ ఫెలో!"
"ఏం చెప్తే తప్పా?" మాధవి బుంగమూతి పెట్టింది!
"నో! నో! అది కాదు"
"నీ కంత భయం అయితే చెప్పుం నువ్వేం రానక్కరలేదు . నేనే ఒంటరిగా వెళ్ళగలను. నాకేం భయం లేదు. నాకు ఎవరి తోడు అక్కర్లేదు!" అంటూ మాధవి డోర్ తీసి దిగటానికి ప్రయత్నించింది.
"యూ సిల్లె గరల్!" అంటూ సాగర్ మాధవి చెయ్యి పట్టుకుని గట్టిగా గుంజి కూర్చోబెట్టాడు. ఆ వూపుకి మాధవి సాగర్ మీద వాలిపోయి మళ్ళీ సర్దుకొని కూర్చున్నది. కారు గేటు దాటింది. విక్టర్ గేటు వేసి తల గోక్కుంటూ "అమ్మగారు లేచి అడిగితే అబ్బాయి గారిని గురించి ఏం చెప్పాలా?" అని ఆలోచిస్తూ నిలబడ్డాడు.
పున్నమీ వెన్నెలలో చెరువు నిండిపోయింది. చెరువు పక్క రోడ్డు మీద కారు వేగంగా పోతున్నది. చల్లటి గాలి ముఖాన్ని తగులు తుండగా మాధవి సాగర్ ని ఓరగా చూస్తూ కూర్చున్నది. బరువెక్కిన గుండెలు తేలిక పడ్డాయి. ఏదో చెప్పలేని హాయి. ఆనందంలో అంతకుముందు జరిగిన దంతా మరచిపోయింది. నీటిలో ప్రతిఫలిస్తున్న చంద్రబింబంలా సాగర్ హృదయంతరాళంలో మాధవి ముఖం మెదలసాగింది. కారు కంటే వేగంగా, గాలి కంటే వేగంగా అతడి ఆలోచనలు పరుగెత్త సాగాయి.
ఇంతకీ మాధవి పరిస్థితి ఏమిటి? ఎందుకిలా అయిపొయింది. మొదటిసారిగా కాలేజి లో ఫంక్షన్ లో అలా జరిగింది. తర్వాత ఈరోజు మళ్ళి జరిగింది. డైనింగ్ టేబిల్ మీదున్న ప్రెషర్ కుక్కర్ చూసినప్పుడు మళ్ళీ తనకు ఏవేవో భావాలు కలుగుతాయని అంటున్నది. తనకున్న మానసిక శాస్త్ర జ్ఞానం చాలదేమో. ఈ విపరీత ప్రకృతిని అర్ధం చేసుకోవటానికి , ఉన్మాద స్థితికి చేరబోయే ముందుండే మానసిక స్థితి కాదు కదా ఇది! అర్ధం కావడం లేదు. ఎంతో ఆరోగ్యంగా, ధైర్యంగా వుండే మాధవి ఇలా అయిందేమిటి? ఆమెకు ప్రత్యేకంగా వచ్చిన బాధలూ, ఇబ్బందులూ లేవు. సమస్యలూ లేవు. ఏ దుర్ఘటనలూ జరగలేదు. మరి ఇలా అయిపొవటానికి కారణమేమిటి? విండ్ స్క్రీన్ లో నుంచి కన్పిస్తున్న చంద్రబింబం మబ్బుల చాటుకు వెళ్ళింది. సాగర్ ఆలోచన ఆగిపోయింది. ఎదురుగా వస్తున్న కారు రాష్ గా వచ్చి గుడ్డుకోన్నంత పని జరిగింది.
"రాస్కెల్! హెడ్ లైట్స్ వేసుకొని ఎంత స్పీడుగా వస్తున్నాడో చూశావా మాధవీ" అంటూ కారును స్లో చేసి పక్కగా పోనిచ్చాడు.
"ప్యూర్ షి వల్రీ! ముందు సీటులో ఇద్దరు మాడ్స్ కూర్చున్నారు, చూశావా?"
"చూశా. ఎప్పుడో కాళ్ళూ, చేతులు విరుగుతాయి. బ్రతికి బయటపడితే ముక్కూ, ముఖం కల్సిపోతుంది."
"వాళ్ళకు కావాల్సింది భవిస్యత్తు కాదు , వర్తమానం, ఓ రకంగా చూస్తే ఆ జీవితంలోనే థ్రిల్ ఉందేమో ననిపిస్తుంది."
సాగర్ ప్రక్కకు తిరిగి చూశాడు. మాధవి తన కేసే తదేకంగా చూస్తున్నట్లు గ్రహించాడు.
ఏమిటి మాధవి ఇలా మాట్లాడుతుంది. మానసిక రుగ్మతకు ఇది సూచనా? ఈ ఆలోచనా ధోరణి దేన్నీ సూచిస్తుంది? ఇది ఆత్మహత్య సదృశ్యమైనది కాదా?
మేఘాలు పరుగెత్తుతున్నాయి. కాని చంద్రుడే మబ్బులను దూసుకొని పరుగెత్తుతున్నట్లుగా కన్పిస్తోంది. సహజత్వానికి అసహజత్వానికి మధ్య ఉన్న సరిహద్దనెమో ఈ మానసిక భ్రమలు! సాగర్ మళ్ళీ తల తిప్పి మాధవి కేసి చూశాడు. ఆమె విండ్ స్క్రీన్ లో నుంచి ముందుకు చూస్తూ చలన రహితంగా కూర్చున్నది.
"మధూ! ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
"ఆ, ఏమి లేదు. నల్లటి మబ్బుల చాటు నుంచి బయటకు వస్తున్న చంద్రుడ్ని చూస్తున్నాను."
"అలా చూస్తుంటే ఏమనిపిస్తుంది?"
"పరుగెత్తాలనిపిస్తుంది."
"సాగర్ విస్మయంగా చూశాడు.
"ఎక్కడికి?"
"చీకటిలో నుంచి వెలుగులోకి"
సాగర్ మాధవి మాటలను మననం చేసుకోసాగాడు. ఈ మాటలకు అన్వయం, అర్ధం ఏమిటి? మాధవి మనస్సు ఏదో చీకటి తెరల మధ్య కప్పబడి వున్నది. ఆ తెరల మధ్య నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంతర్గతంగా ఆమె మనసును ఆవరించి వున్నా చీకటి తెరలు ఎలాంటివి? ఆ తెరలు చించుకొని బయట పడాలనే ఆమె ప్రయత్నానికి ప్రోద్భలం ఇస్తున్న శక్తు లేమిటి? సాగర్ ఆలోచనలు తెగలేదు. కాని జడ్జి గారి ఇంటి ముందు కొచ్చి కారు ఆగింది.
