Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 6


    "బాగానే వున్నాను నాన్నా!" అనలేకపోయాడు.


    "బాగానే వున్నానండీ." అన్నాడు అప్రయత్నంగానే శరత్.


    రామనాధం శరత్ ముఖంలో తెల్లబోయి చూశాడు.


    సుశీలమ్మ ఉలిక్కిపడింది. వెర్రిచూపులు చూసింది. శరత్ తన పొరపాటును గ్రహించాడు. కాని "నాన్నా" అని మాత్రం అనలేకపోయాడు. తలవంచుకొని కాఫీ తాగసాగాడు.


    రామనాధం స్థాణువులా కొంచెంసేపు నిలబడి, అంతలోనే తనను తాను సంభాళించుకుంటూ "ఆరోగ్యం బాగున్నట్టులేదు. ఈరోజుకు కాలేజీకి సెలవు పెట్టు" అనేసి భార్య ముఖంలోకి చూడలేక గబగబా బయటికి వెళ్ళిపోయాడు.   


    "బాగానే వున్నానండీ!" సుశీలమ్మ చెవులకు తిరిగి తిరిగి వినిపిస్తూ వుంది.


    భయంతో నిలువెల్లా కంపించిపోయింది.


    సందేహం లేదు. తను ఏది జరగకూడదని ఇరవై రెండేళ్ళుగా కన్పించిన రాయికీ రప్పకూ మొక్కిందో అదే జరిగింది. ప్రతి నిత్యం ప్రతి నిముషం. తనను వెంటాడిన రహస్యం బట్టబయలు అయింది.    


    తానేం పాపం చేసింది? వాడు ఆ హరిజన పిల్లని ప్రేమించడం ఆయన రెచ్చిపోవడం.... తన గుండెల్లో ఆరని మంట రగిలింది.


    వాడు ఆయనను "ఏమండీ!" అన్నాడు. తనను కూడా అంటే తను భరించగలదా?


    సుశీలమ్మ లేవబోయి తూలింది. శరత్ గబుక్కున పట్టుకున్నాడు.


    "ఏమిటమ్మా! ఏమైంది?" అంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు.


    తనను 'అమ్మా' అన్నాడు. వాడు తన బిడ్డే. వాడు తనను కాదని ఎక్కడికీ వెళ్ళడు. తనేవాడితల్లి. కుర్చీకి వెనక్కువాలి ఓపికలేని దానిలా కళ్ళు మూసుకుంది.


    "ఏమ్మా! ఎలా వుంది? ఏమైంది?" ఆతృతగా అడిగేడు శరత్.


    చిన్నగా కళ్ళు తెరచి సన్నగా నవ్వింది సుశీలమ్మ. ఆ నవ్వు బోలుగా, దిగులుగా వుంది.


    "ఏం లేదు బాబూ, కాస్త కళ్ళు తిరిగాయ్! అంతే, నువ్వు లే! త్వరగా తలంటి పోసుకో! పద! ఆ తర్వాత పాయసం తాగుదువుగాని!" అన్నది సుశీలమ్మ.


    అప్పుడు గాని శరత్ కు తన పుట్టినరోజని గుర్తు రాలేదు.


    ఇవ్వాళ తన పుట్టిన రోజా? తను ఏ రోజు పుట్టాడో సుశీలమ్మకు ఎలా తెలుసు? ఉజ్జాయింపుగా చేస్తోందేమో?   


    శరత్ పెదవుల మీద హాసరేఖ క్షణకాలం కదిలింది. ఎన్నో అర్థాలు కన్పించాయి ఆ నవ్వులో సుశీలమ్మకు. గుండెలు బిగిసినట్టు కూర్చుండిపోయింది.


    "ఏమిట్రా అలా చూస్తావ్? ఇవ్వాళ నీ పుట్టినరోజు. మర్చిపోయావా?" తెప్పరిల్లి అడిగింది సుశీలమ్మ.   


    శరత్ అదోలా సుశీలమ్మ కళ్ళల్లోకి చూశాడు.


    ఆ చూపులు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నట్టు అన్పించి సుశీలమ్మ కళ్ళు పక్కకు తిప్పుకుంది.


    "ఇవ్వాళ నా పుట్టినరోజా అమ్మా?" శరత్ కంఠంలో ఏదో బాధ ధ్వనించింది. సుశీలమ్మ చివ్వున తలతిప్పి శరత్ ముఖంలోకి చూసింది. శరత్ అదోలా నవ్వాడు.   


    సుశీలమ్మకు ఎవరో గుండెలు పిండుతున్నట్టనిపించింది.


    "ఏమిట్రా కొత్తగా అడుగుతున్నావ్?" ఎలాగో గొంతు పెగిల్చుకొని అన్నది సుశీలమ్మ.


    సమాధానంగా శరత్ అదోలా నవ్వాడు.


    "ఎందుకురా అలా నవ్వుతావ్?" బాధగా అడిగింది తల్లి.


    "అమ్మా! ఒక విషయం అడుగుతాను నిజం చెబుతావా?"


    అయిపోయింది! అంతా అయిపోయింది. తను సర్వనాశనం అయిపోయింది!


    సుశీలమ్మకు ఆ గదిలో ప్రతి వస్తువూ గిర్రున తిరుగుతున్నట్టు అన్పించింది. వళ్ళంతా చెమట పట్టింది.


    "ఏమ్మా మాట్లాడవ్?" అది గమనించని శరత్ అన్నాడు.


    "ఏమిటి?" నోటితో అడగలేక కళ్ళతోనే అడిగింది.


    "అమ్మా! ఇవ్వాళ నా పుట్టినరోజని నీకెలా తెలుసు?"


    సుశీలమ్మకు తన కాళ్ళకింద భూమీ, తను కూర్చున్న కుర్చీ దగా చేస్తున్నట్టు అన్పించింది.


    అగాధంలో పడిపోతున్నవాడు కేకపెట్టినట్టు "బాబూ" అన్నది.


    శరత్ చివ్వునలేచి తల్లి దగ్గరకు వచ్చాడు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. గాబరాగా ముఖంమీద నీళ్ళు చల్లి "అమ్మా, అమ్మా" అంటూ పిల్చాడు శరత్.


    సుశీలమ్మ చిన్నగా కళ్ళు తెరిచింది. వెర్రిచూపులు చూడసాగింది.


    "అమ్మా!"


    సుశీలమ్మ చూపులు శరత్ ముఖం మీద నిల్చాయి.


    "ఎలా వుందమ్మా? కాసేపు పడుకుంటావా."


    "నాకేం! బాగానే వున్నాను." అన్నదే కాని మరుక్షణంలో శరత్ ను పట్టుకుని భోరున ఏడవసాగింది.


    "ఓరేయ్ ఏమన్నావురా? నీ పుట్టినరోజు నాకెలా తెలిసింది అనా? నీ పుట్టినరోజు నీ అమ్మను తెలియకపోతే ఎవరికి తెలుస్తుందిరా?" ఏడుస్తూనే అన్నది సుశీలమ్మ.


    "ఛ! ఏమిటమ్మా! ఇంతలోకే ఏడుస్తావేం? ఏదో సరదాగా అన్నాను. ఇదిగో! ఇప్పుడే స్నానం చేసి వస్తాను. పాయసం రెడీగా వుంచు" అంటూ శరత్ లేచి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS