"వేసవి సెలవుల్లో దేశపర్యటన వుందనుకో. అది తిరుపతేకానీ, కాశ్మీరేగానీ, అంత చిన్న వయసులో తోటి పిల్లల్తో వెళ్లటం కుర్రవాడికి ఎంత ఆత్మ స్థయిర్యాన్ని ఇస్తుంది. ఇలా ఆలోచిస్తాడు ఆయన. ఆ రోజుల్లోనే కరాటే నేర్పించాడు. గ్రాడ్యుయేషన్ అవగానే ఈ వుద్యోగం వస్తే నాకన్నా ఎక్కువ సంతోషించింది ఆయనే....."
"నువ్వు సంతోషించలేదా?"
నేత్ర నవ్వేడు. "ఆ రోజుల్లో సీక్రెట్ ఏజెంట్ అంటే నాకు చాలా ఆహ్లాదకరమైన అపోహలు వుండేవి. ఆ ఆపోహలన్నీ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే పోయాయి. తప్పు నాడి కాదు. ఫాంటసీ రైటర్స్ ది...." అంటూ చివర్లో "నీలాగా" అని కలిపాడు.
భాస్కర్ నవ్వేడు. అతడూ చిన్న తరహా రైటరు. ఇప్పుడిప్పుడే నాలుగైదు రచనలు ప్రచురితమయ్యాయి. కొత్తగా సాహితీ రంగంలోకి అడుగుపెట్టిన అందరు యువ రచయితల్లాగా, అతడి ప్రపంచం అంతా రచనా మయమే. సాయంత్రమయ్యే సరికి ఆ ప్రపంచంలోకి వెళ్ళాలని తహతహలాడుతూ వుంటాడు. కప్పు టీ తాగి, రాత్రి చాలా పొద్దు పోయేవరకూ స్నేహితుల్తో నిరర్థకమైన చర్చలు జరపటం అతడి హాబీ. అతడికో చెల్లెలుంది. పేరు కళ్యాణి. చూపులేని పిల్ల. ఇద్దరూ అనాధలే ఇద్దర్నీ గజపతిరావుగారు చేరదీసి పోషించారు.
జీవితం ఇంకా పాఠాలు నేర్పలేదు అతడికి. వృత్తిలో అతడు ఇంకా స్థిరపడలేదు. స్థిరపడే సమయంలోనే విధి అతడితో దారుణంగా ఆడుకుంది.
అతనేదో అనబోయాడు. అంతలో అక్కడికి అహోబిల వచ్చింది. ఆమె డిపార్ట్ మెంట్ రికార్డ్ సెక్షన్ లో పనిచేస్తూ వుంటుంది. ఆరడుగుల ఎత్తు , ఎత్తుకు తగ్గ లావు. బలమైన రెండు బుగ్గలు, రెండు పెద్ద కళ్ళు, కండలు తిరిగిన రెండు చేతులు...... ఆమెలో అన్ని రెళ్ళూ విశిష్టంగా కనబడుతూ అవసరమైన దానికన్నా ఎక్కువ ఆకర్షణీయంగా వుంటాయి మనిషి మంచిది.
"డైరెక్టర్ పిలుస్తున్నట్టున్నాడు. నేను వెళ్ళొస్తాను" నేత్ర అన్నాడు.
"డైరెక్టర్ నిన్నే పిలుస్తున్నాడని ఎలా తెలిసింది?"
"రికార్డు సెక్షన్ కి ఏ మాత్రం సంబంధించని ఆ పనిని అహోబిల తన నెత్తిన వేసుకుని వచ్చిందంటే నా కోసమే అయివుంటుంది" అని నేత్ర నవ్వి ఆమె దగ్గరగా వెళ్ళాడు.
* * *
భగీరథరావు వెనక్కి వాలి "కూర్చో" అన్నాడు. ".......ఏమిటి నిన్న కారు స్పీడుగా డ్రైవ్ చేసి పోలీసుల కేసులో ఇరుక్కున్నావట?"
నేత్ర అరచేతులవైపు చూస్తూ కూర్చున్నాడు.
"ఎవరు నీ పక్కనున్న అందమైన ఆ అమ్మాయి?"
"ఆహా.... నిజంగా మీరు చాలా గొప్పవారు సార్. ఈ డిపార్ట్ మెంట్ కి డైరెక్టర్ అంటే అచ్చు మీలా వుండాలి. మీరీ కుర్చీలోనే కూర్చుని, అక్కడెక్కడో పోలీసు నా కారు పట్టుకున్న సంగతి, అందులో అమ్మాయి వున్న సంగతి కనుక్కోగలిగా రంటే హ్యాట్సాఫ్ టు యూ."
"నేనడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదు మిస్టర్ నేత్రా" తాపీగా అన్నాడు రావు.
"పోలీసులకి ఆ అమ్మాయి ఎవరో తెలియడం నాకిష్టంలేదు సార్. చాలా గౌరవప్రదమైన కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి. నాతో కలిసి తిరిగిందని తెలిస్తే ఆవిడ ప్రాణాలు కూడా పోవచ్చు" భయం నటిస్తూ అన్నాడు.
"ఈ అమ్మాయిల్ని వెంటేసుకుని తిరగటాన్ని బట్టి, నువ్వు చాలా ఖాళీగా వున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒక కేసు నీకప్పగిస్తే తప్ప లాభం లేదు."
"మీరీ టాపిక్ లేవనెత్తి నన్ను డిఫెన్స్ లో పడేసినప్పుడే ఈ విధమైన చర్య ఏదో తీసుకోవటానికి అది నాంది అనుకున్నాను సార్. ఇవ్వండి ఏం చేస్తాం! నిన్న సాయంత్రం చచ్చిపోయిన స్కూటరిస్టు యాక్సిడెంటు గురించి ఎంక్వయిరీ చేయమంటారా? పాపం ఎడమవైపు స్కూటర్ మీద వెళ్తున్న మనిషిని వెనక నుంచి లారీ వచ్చి కొట్టిందంటే, ఆ దుర్మార్గుల్ని కనుక్కుని, పట్టుకుని చట్టానికి అప్పగించిన రోజే మన డిపార్ట్ మెంట్ దేశానికి సేవ చేసినట్టు."
"నువ్వేమీ సెటైరికల్ గా మాట్లాడనవసరంలేదు నేత్రా. అంతా చిన్న కేసు అప్పగించబోవడంలేదు నీకు. సర్పభూషణరావు తెలుసుగా నీకు."
"తెలియకపోవడం ఏమిటి? ఫెరా కేసులో అతడు ప్రభుత్వం మీద గెల్చాడుగా!"
"అతడిని ఎలాగైనా బంధించాలి నేత్రా. అది నా పర్సనల్ కేసు. ఎన్ని చేసినా ఆ దుర్మార్గుడు కోర్టు దగ్గరకి వచ్చేసరికి తప్పించుకుంటున్నాడు. నీకు సంబంధించినంతవరకూ యిది చాలా చిన్నకేసు. కానీ కేవలం నాకోసం నువ్వీ కేసు టేకప్ చేయాలి. నాకే సిగ్గుగా వుంది నిన్నీ కేసు చెయ్యమని అడగడం."
" ఏ పుట్టలో ఏ పాముందో సర్! స్కూటరు మీద నుంచి పడి చచ్చిపోయిన జర్నలిస్టు కేసు టేకప్ చేసినా సర్పభూషణరావు దగ్గరికి దారి తీయవచ్చు."
"ఏమిటి నువ్వు మాట్లాడేది...."
"ఏదీ చిన్న కేసు కాదంటున్నాను సర్. సర్పభూషణరావుని విమానాశ్రయంలో నిలదీసిన జర్నలిస్టు ఇంటికి చేరుకునే లోపులో ఆ ఎస్.బి.ఆర్. ఇంటి ముందే శవంగా మారడం చిత్రంగా లేదూ? పైగా ఆ జర్నలిస్టు చాలాస్మార్టు. సర్పభూషణరావు జూరిచ్ లో ఆగిన సంగతి కూడా అతడు తెలుసుకున్నాడు. అతడి బ్యాంక్ అకౌంట్ సంగతి కూడా."
"యస్.బి.ఆర్. కి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ వున్నదన్న సంగతి మనకీ తెలుసుగదా. నిరూపించలేకపోయాంగానీ...."
"మనకి తెలియడం వేరు. మనలా హంగు, ప్రభుత్వ సహకారం లేని ఒక జర్నలిస్టు తనకున్న తెలివితేటల్తో, వృత్తి పరమైన దీక్షతో కనుక్కోవడం వేరు. అలాంటి వాడు చనిపోయాడంటే విచారంగా వుంటుంది. పైగా సర్పభూషణరావుకి ఎన్నో మందుల కంపెనీలు, రిసెర్చి చేయటానికి ప్రయోగశాలలూ వున్నాయి. అయినా అతడి ఫారమ్ హవుస్ తోటకి తరచు కెమికల్స్, రకరకాల యాసిడ్స్ ఎందుకు వెళ్తుంటాయి. అక్కడేవైనా ప్రయోగశాలలు పెట్టాడా? ఇవన్నీ కనుక్కోవాలి."
డైరెక్టర్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి "ఇవన్నీ నువ్వెప్పుడు కనుక్కున్నావ్...?" అన్నాడు.
"ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టే అతడి గురించి అంత తెలుసుకోగా లేనిది నేర పరిశోధనే వృత్తి, ప్రవృత్తిగా వున్న నేను కనుక్కోవడంలో చిత్రమేముంది" అన్నాడు నేత్ర. "అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే, జూరిచ్ లో వుండగా అతడికో టెలిగ్రాం వచ్చింది. అందులో విషయం ఏమిటో తెలియదుగాని, అది ఇండియా నుంచి మాత్రం కాదట."
"మైగాడ్,,,, యివన్నీ నీకెవరు చెప్పారు?" అడిగాడు చీఫ్. నేత్ర ఇబ్బందిగా చూసి, ఇక చెప్పక తప్పదన్నట్టు "మోకాలికి అంగుళం పైన పుట్టుమచ్చ వున్న అమ్మాయిలు మనసులో ఏ విషయామూ దాచుకోలేరు" అన్నాడు.
"ఎవరా అమ్మాయి....."
"సర్పభూషణరావు సెక్రెటరీ....." నవ్వాడు నేత్ర.
