ఇంతకుముందులా పిల్లలతో ఆడుకోవడం తగ్గిపోయింది. ఊళ్ళో ఉన్న తెలిసినవాళ్ళ ఇళ్లకువెళ్ళడం కూడా ఇంచుమించు ఆగిపోయింది. ఎంతసేపు తన లోకంలో తను ఉంటుంది. పూజగదిలో శ్రీ వేంకటేశ్వరస్వామి పటం ముందు కూర్చుని స్వామిని తదేకంగా చూస్తూ ఉంటుంది. అంతలోనే ఆనందం, అంతలోనే విషాదం ఆ పిల్ల ముఖాన్ని ఆవరిస్తూ ఉంటాయి. ఆ లేత పెదవులపై చిరునవ్వు మొలకలు మెరిసినంతలోనే కనుతామరల నుంచి అశ్రుకణాలు జారిపడుతుంటాయి. ఒక్కోసారి, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న స్తోత్రాలు, కీర్తనలూ, ఒక్కోసారి తను అప్పటికప్పుడు కూర్చిన కీర్తనలూ పాడుకుంటూ ఉంటుంది. తనకోసం నేస్తాలు ఎవరైనా వస్తే వారికి తనకు తెలిసిన దేవుడి కథలే ఎంతో తమకంగా చెబుతూ ఉంటుంది.
బిడ్డ ప్రవర్తన మంగమాంబకు, కృష్ణయ్యకు ఆందోళన కలిగిస్తూనే ఉంది.
గురువుగారు యథావిధిగా రోజూ వస్తూనే ఉన్నారు. వెంగమాంబను చదువువైపు మరలించడం ఆయనకు రాను రాను మరీ కష్టంగా మారుతోంది. యాంత్రికంగా తన ముందు కూఎచున్న వెంగమాంబ ధ్యాస మాత్రం మరెవరి మీదో!
ఓ రోజు గురువుగారి రాకను కూడా గమనించకుంది. కనులు మూసుకుని వెంగమాంబ ఏదో కీర్తనలు పాడుకుంటోంది. గురువుగారు ఆమె తన్మయత్వానికి భంగం కలిగించకుండా వింటూ ఉండిపోయారు. ఎంత తియ్యని గాత్రం! ఎంత భక్తి తన్మయత్వం! అనుకున్నారు. కాసేపటికి తన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుని "వెంగమాంబా" అని పిలిచారు. అప్పటికీ ఆ పిల్లలో కదలిక లేకపోయేసరికి, "వెంగమాంబా..... కళ్ళు తెరు....." అన్నారు ఒకింత బిగ్గరగా.
వెంగమాంబ కళ్ళు తెరచి గురువుగారిని చూసింది. సిగ్గుముంచుకొచ్చి మొగ్గలా ముడుచుకుపోయింది. అంతలోనే మామూలుస్థితికి వస్తూ, "స్వామి కనిపించారు..... ఎంత బాగున్నారో!...... నన్ను రమ్మంటున్నారు....." అంటూ ఒక్క ఉదుటన లేచి నిలబడింది.
"స్వామి ఎవరు? ..... కనిపించడమేమిటి?...." అని అడిగారు.
"స్వామి.... వేంకటేశ్వరస్వామి....." అంటూ వీథిగుమ్మం వైపు పరుగెత్తింది. విస్తుపోయిన గురువుగారు వారించడం కూడా మరచిపోయి ఆ పిల్ల వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు.
వెంగమాంబ నేరుగా స్వామి ఆలయానికి వెళ్ళింది. అక్కడే పూజాదికాలు పూర్తి చేసుకుని పూజారి గర్భగుడి గడప ఇవతల కూర్చుని ఉన్నారు. వెంగమాంబ ముకుళిత హస్తాలతో నిలబడి స్వామి దివ్యమంగళరూపాన్ని నేత్రతృప్తిని దర్శిస్తూ నిలబడిపోయింది.
"వేళకానివేళ వచ్చావేం తల్లీ" అంటూ పూజారి లేచి నిలబడి లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చి వెంగమాంబ దోసిట్లో ఉంచాడు.
వెంగమాంబ ఇంటికి తిరిగివచ్చింది. గురువుగారు అలాగే కూర్చుని ఉన్నారు. వెంగమాంబ కొంత ప్రసాదం ఆయన చేతిలో ఉంచింది. "ఇప్పుడు చెప్పు తల్లీ! స్వామి కనిపించారన్నావు..... ఎలా కనిపించారు? ఏం మాట్లాడారు?" అని అడిగారు.
"చాలా మాట్లాడారు. అచ్చం మనం పటంలో చూస్తున్నట్లే ఉన్నారు. నాతో మాట్లాడిన విషయాలు రహస్యంగా ఉంచమన్నారు" అంది వెంగమాంబ మెరిసే కళ్ళను గుండ్రంగా తిప్పుతూ.
"అదృష్టవంతురాలివి తల్లీ. నీకు ఆ సర్వేశ్వరుడి దర్శనం లభించింది. ఇఅక్ పాఠం చదువుకుందామా?" అని అడిగారు.
పాఠం అనేసరికి వెంగమాంబ ముఖం ముడుచుకుపోయింది. స్వామిని దర్శించాక, ఆయనతో సంభాషించాక ఈ మామూలు పాఠాలు ఇంక దేనికి? అమృతం తాగిన తర్వాత పంచదార పానకమైనా రుచిస్తుందా? అసలు తనకు వేరే చదువెందుకు? గురువెందుకు?...... ఇలా సాగిపోయాయి వెంగమాంబ ఆలోచనలు.
కానీ ఈ మాటలు పైకి ఆనలేకపోయింది. అంటే గురువుగారు నొచ్చుకుంటారని ఆ పసివయసులోనే ఆ పిల్ల సంస్కారం హెచ్చరించింది. వెంగమాంబ ముఖకవళికలను బట్టి ఇక ఈరోజు పాఠం సాగదని గురువుగారు నిశ్చయించుకున్నారు. నిట్టూర్చి లేచి నిలబడి కృష్ణయ్యకు చెప్పి వెళ్ళిపోయారు.
వెంగమాంబ పద్ధతి రోజు రోజుకూ వింతగా, విచిత్రంగా మారుతోంది. ఊళ్ళోవాళ్ళు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మంగమాంబ, కృష్ణయ్యలకు బాధతో పాటు తల కొట్టేసినట్లుగా కూడా ఉంటోంది. లేక లేక కలిగిన సంతానం కావడం వల్ల తిట్టి, కొట్టి అదుపులో పెట్టడానికి కూడా మనసు రావడం లేదు. ఎప్పుడు ఇంట్లోంచి జారుకుంటుందో తెలియదు. గుళ్ళోకి వెళ్ళి ఎన్ని గంటలైనా సరే స్వామి విగ్రహం ముందు స్థాణువులా నిలబడి ఉంటుంది. పూజారి గుడి తలుపులు మూసేస్తే గుడిమెట్ల మీదే కూర్చుండిపోతుంది. వీథిలో నడుస్తున్నా, తన లోకంలో తానుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఈ పిల్లను ఎలా దారిలో పెట్టాలో, అందరు ఆడపిల్లళ్ళా నడుచుకునేలా ఎలా చేయాలో ఆ దంపతులకు పాలుపోవడం లేదు.
ఓ రోజున ఓ పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చింది.
"ఏయ్, సీతా! ఎందుకే ఆ పరుగులు?" అంది మంగమంబా.
"అత్తా.....అత్తా.... నాతో రండి. మీకో విచిత్రం చూపిస్తాను......" అందాపిల్ల.
"ఏమిటే ఆ విచిత్రం?" మంగమాంబ, కూతురు ఇంట్లో లేదన్న విషయం గుర్తొచ్చి సంశయిస్తూనే అడిగింది.
"మన వెంగమాంబే..... వీథిలో గుడిముందు నిలబడి నృత్యం చేస్తూ పాటలు పాడుతోంది..... అందరూ పోగై వింతగా చూస్తున్నారు" అంది సీత.
"నృత్యం చేస్తోందా?....." మంగమాంబ దిగాలుపడిపోయి సీత వెంట బయలుదేరింది. గుడి దగ్గరకు చేరాక అక్కడ కనిపించిన దృశ్యం చూసి మంగమాంబ ముఖం పాలిపోయింది. జనం చుట్టూ మూగి ఉన్నారు. వెంగమాంబ "గోవిందా, గోవిందా..... వెంకట రమణా గోవిందా..... నా స్వామీ రావేమీ, నన్నేలుకోవేమీ....." అంటూ శూన్యంలోకి చేతులు చాచి పిలుస్తూ చిందులు వేస్తోంది. తన చుట్టూ మూగిన జనాన్ని కూడా గమనించలేనంతగా తన్మయత్వంలో మునిగి జనాన్ని కూడా గమనించలేనంతగా తన్మయత్వంలో మునిగి ఉంది. జనంలో కొందరు నవ్వుతున్నారు. కొందరు వెంగమాంబకు భక్తితో చేతులు జోడిస్తున్నారు. కొందరు వెంగమాంబ వైపు గుచ్చి గుచ్చి చూస్తున్నారు. "ఇంత చిన్నతనంలోనే చలించినట్టుంది" అని కొందరంటున్నారు.
సిగ్గుతో చితికిపోతూ మంగమాంబ కూతురుచేయి పట్టుకొని వీపుమీద ఒక చరుపు చరిచి "పదవే.... ఇంటికి పద......" అంటూ జనంలోంచి దారిచేసుకుంటూ పిల్లను దాదాపు ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకెళ్ళింది. దారిపొడవునా అమ్మలక్కలు ఆ తల్లీకూతుళ్లను చోద్యంగా, కొందరు సానుభూతిగా గుమ్మాలలో నిలబడి చూస్తూ ఉండిపోయారు.
ఇంట్లోకి వెళ్ళి వీథితలుపులు దడాలున మూసేసి మంగమాంబ ఒక్కసారిగా కిందకూలబడి, అంతవరకు బిగపట్టుకున్న దుఃఖం ఒక్కసారి పొంగుకు రాగా "ఏమైందే నీకు? ఏమిటే ఈ వీథిలో గంతులు? మాకు తల కొట్టేసినట్టుందే తల్లీ" అంటూ భోరుమంది.
వెంగమాంబ తల్లివే యాంత్రికంగా చూస్తూ ఉండిపోయింది. తల్లి ఎందుకు ఏడుస్తోందో, తనేం తప్పుచేసిందో ఆ పిల్లకు అర్థం కాలేదు. అలసట వల్ల కాబోలు, నేలమీదే అలా కిందికి ఒరిగి నిద్రలోకి జారుకుంది.
కాస్సేపటికి కృష్ణయ్య ఇంటికొచ్చాడు. మంగమాంబ తులసికోట గుమ్మంలో విచారంగా కూర్చుని ఉంది.
"మంగా ఏమిటలా ఉన్నావు?" అనడిగాడు.
"చాలా బెంగగా ఉంది" భర్తను చూడగానే మంగమాంబ కళ్ళు అశ్రుసిక్తమై పోయాయి.
"బెంగా.... దేనికి?" అన్నాడు కృష్ణయ్య, అతని ఆలోచన వెంగమాంబవైపు మళ్ళింది.
ఆ ప్రశ్నతో మంగమాంబ దుఃఖం కట్టలు తెంచుకుంది. జరిగినదంతా చెప్పింది. కృష్ణయ్య మ్రాన్పడిపోయాడు. అతనిలో బాధా, కోపమూ ఒక్కసారిగా విజృంభించాయి. పిల్ల గురించి గురువుగారు ముందే హెచ్చరించారు. అప్పుడే కట్టడి చేసి ఉండాల్సింది. కానక కన్న సంతానం కావడంవల్ల కడుపుతీపితో తాము ఆ పని చేయలేకపోయారు. కూతురు భక్తి చూసి మురిసిపోయాం కానీ, అదిలా వెర్రితలలు వేస్తుందని అనుకున్నామా? వీథికెక్కి గంతులు వేస్తూంటే, ఇంటి పరువు ఏమైనా దక్కుతుందా? దీనికి పెళ్ళవుతోందా? ఆలోచించిన కొద్దీ కృష్ణయ్యలో ఆవేదనతోపాటు ఆవేశమూ పెరిగిపోతోంది.
అప్పుడే నిద్రలేచి పూజగదిలో స్వామిముందు కళ్ళు మూసుకుని కూర్చున్న వెంగమాంబను చూడగానే కృష్ణయ్యలో ఆవేశం తగ్గి, ఆవేదన, ఆలోచన చోటు చేసుకున్నాయి. తనూ, మంగా కూడా భక్తితత్పరులమే. కానీ కూతురు చేష్టల్ని ఎందుకు సహించలేకపోతున్నాం? ఆడపిల్ల, పెళ్ళయి ఇంకో ఇంటికి వెళ్ళవలసిన పిల్ల కనుకనే తమ బాధ్యతను తలచుకుని తామిలా దిగులుపడుతున్నాం. కనుక కుటుంబ ధర్మాన్ని నిర్వహించడానికి, తాము కొంత కఠినంగా ఉండవలసిందే - అనుకున్నాడు. అప్పటికి మంగమాంబ కూడా పూజగదిలోకి వచ్చి నిలబడింది.
కళ్ళు తెరచిన వెంగమాంబ తల్లిదండ్రులు తనవైపే చూస్తూ నిలబడడం గమనించి అమాయకంగా మందహాసం చేసింది. "అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవే" అంది.
మంగమాంబ మాట్లాడకుండా భర్త మొహంవైపు చూసింది.
