Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 6


                హే! ఆషాఢస్య ప్రథమ దివస!!
    'ఇదిగో' ఇంట్లో అడుగుపెట్టగానే అందించింది ఉత్తరాన్ని తల్లి.
    'నా ముఖం, ఒఠిఛాదస్తం' ఉత్తరం బల్లమీద పడేసి వో నవ్వు నవ్వాడు రామం.
    'ఈవిడేది' అన్నాడు ఇల్లంతా కలయచూస్తూ.
    'ఇప్పుడే వస్తుందిలే - పేరంటానికెళ్ళింది' తల్లి సమాధానం.
    మళ్ళా వోమాటు ఉత్తరాన్ని చదివాడు రామం.
    'ఎవరి దగ్గరనుంచి?' రామం ముఖం చూస్తూ అడిగింది తల్లి.
    'మామగారు - ఆషాఢమాసం వస్తోందిట, వాళ్ళ అమ్మాయిని పంపాలట.'
    'అవును మరి తొలి ఆషాఢంలో ఆడపిల్ల పుట్టింట్లోనే ఉండాలిమరి.'
    'నాన్సెన్స్' సాక్సు బల్లకిందకు విసిరికొడుతూ అన్నాడు రామం.
    'బావుంది - లోకానికంతా వున్నదే- తొలి ఆషాఢంలో ఆ అమ్మాయి అత్తారింట్లో ఉండకూడదు. నువ్వు కూడా అత్తారింటికి వెళ్ళకూడదు.' రామం ముఖంచూస్తూ నవ్వింది తల్లి. అమ్మ అలా నవ్వినపుడు రామానికి బలే కోపమొస్తుంది. ఎందుకో?
    'అయినా అత్తాకోడలు వో ఇంట్లో ఉంటే ఏమవుతుందిట' గొంతు కాస్త రెట్టించాడు రామం.
    తల్లి పకపకా నవ్వింది. గదిలోంచి వస్తూ తండ్రి కూడా నవ్వాడు.
    'అది కాదురా, అత్తాకోడళ్ళు వో గడప దాటకూడదంతే' అన్నాడు తండ్రి.
    'గడపదాటితే ఏమవుతుందో చూద్దాం మనం' రామం తండ్రి చూసాడు.
    'అదేం కుదరదులే.'
    'అలాటప్పుడు ఆ ఆషాడం ఏదో అయ్యాకే పెళ్ళిళ్ళు చెయొచ్చుగా-వైశాఖంలో పెళ్ళిచేయటం దేనికి' - ఈ మాటు అమ్మా నాన్న పాటు రామం కూడా నవ్వేశాడు.
    పట్టుచీర ఫెళ ఫెళ మంటుంటే గుమ్మంలో అడుగుపెట్టింది ఇందిర.
    'ఇదిగో మీ నాన్న ఉత్తరం.'
    ఉత్తరం చదువుతున్నంతసేపు ఇందిర ముఖంలోకి చూచాడు రామం. సంతోషం ముఖంలో దాచుకోలేకపోతోంది. ఒక్కసారి గుమ్మంలోకి చూసాడు రామం. అమ్మ నాన్న లోపల కెప్పుడో వెళ్ళిపోయారు.
    'ఊ-ఏమంటావ్' అన్నాడు కాస్త నెమ్మదిగా రామం.
    'హాయిగా వెడతాను.'
    'వెళ్ళిపోతావా' ఆవిడ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని మళ్ళా అడిగాడు.
    'వెళ్ళద్దుమరి - రెండు నెలలయింది మా వాళ్ళని చూసి - మా బుజ్జిగాడు ఎలా వున్నాడో ఏమో-' ఇందిర క్షణంసేపు పుట్టింటి ఆలోచనల్లో తేలిపోయింది.
    'సరే వెళ్ళు- అక్కడేవుండు-మళ్ళారాకు' ఇందిర చేతిలో ఉత్తరం లాక్కుని విసిరికొట్టాడు రామం.
    ఇందిర విస్తుపోయింది.
    'మీరూ నేనూ కలిసే వెళదాం-కొన్ని రోజులుండి వచ్చేయొచ్చు మీరు-అయినా దిక్కుమాలిన ఆఫీసు రోజూ ఉండేదేగా-'
    'నీ సలహా అడగలేదు నేను-'
    పెళ్ళయి రెండు నెలలన్నా కాకుండా అప్పుడే రావాలా ఆషాఢ మాసం కొంప మునిగిపోతున్నట్లు! ఇంతకు ముందు ఎన్ని ఆషాఢాలు వచ్చి వెళ్ళలేదు కనక. ఎప్పుడు వచ్చేవో, ఎప్పుడు పోయేవో,-అయినా ఒక రోజా రెండు రోజులా- నెల్లాళ్ళు, అంటే ముప్పై రోజులు, ముప్పయి రాత్రులు, ముప్పయి పగళ్ళు-ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
    వేలు చుర్రుమని కాలగానే సిగరెట్టు ముక్క యాష్ ట్రేలో పడేశాడు రామం.
    ఈ మామగారొకరు, పెద్ద సాంప్రదాయాలతో కొట్టుకుపోతున్నట్టు- రామానికి దూరంగావున్న మామగారిమీద చాలా కోపం వచ్చింది. ఆ కోపం పోస్ట్ మేన్ మీద, తల్లి మీదకూడా వ్యాపించింది.
    అతి ముఖ్యమయిన ఉత్తరాలు చాలా ఆలస్యంగా అందించడం; నాలుగిళ్ళ అవతల పడేయటము పోస్టుమాను కలవాటే - ఇదెందుకో అతి ముఖ్యమయినదానిలా పట్టుకొచ్చి పడేశాడు-అమ్మమాత్రం, 'అబ్బాయ్, నీకేదో ఉత్తరం వచ్చిందిరా, చెప్పడమే మరిచాను. చూసావా ఎంత మతిమరుపో' అంటూ పదిహేను రోజుల తర్వాత ఉత్తరాన్ని చేతికిచ్చిన రోజులు లేకపోలేదు! మరి ఈ రోజు! ఇంతకీ తన దురదృష్టం.
                                                 *    *    *
    ఓ మెరుపులాంటి ఆలోచన రామం బుర్రలో మెదిలింది. తండ్రి పక్కన భోంచేస్తున్న రామం సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక తికమకపడ్డాడు. ముద్ద గొంతులోకి దిగటంలేదు-
    'అమ్మా, పిన్ని మనింటికొచ్చి ఎన్నేళ్ళయిందో చూసావా' - రామం తల్లి ముఖంలోకి చూచాడు.
    'నిజమే మరి, దాని కూతురి పెళ్ళికి కూడా మనం వెళ్ళలేదు. నాకూ చూడాలని ప్రాణం పీకుతోంది'
    అమ్మమాటలకి రామంకి లేచి గంతులెయ్యాలనిపించింది.
    'చుట్టరికాలు వస్తూపోతూ వుంటేనే మరి' అన్నాడు రామం.
    'దానికయినా నాకయినా ఒకటే గొడవ; ఇల్లు- ఇల్లు వదలిపోవాలంటే కుదరదు'
    'బావుంది- ఇల్లు ఏమీ అవదులే - మేమంతా వున్నాంగా - నువ్వు హాయిగా పిన్ని దగ్గరకెళ్ళి వో నెల్లాళ్ళుండిరా' - గుమ్మంలో నుంచున్న భార్యకేసి రహస్యంగా చూస్తూ అన్నాడు రాము.
    'మీ ఆవిడ దోవను ఆవిడ, మీ అమ్మదోవను అమ్మ వెళ్ళిపోతే నేను ఈ వంటలు వార్పులు చేయలేను బాబూ'
    రామం ముఖం ఒక్కసారి పాలిపోయింది. పెద్ద ఆలోచన ఒక్క క్షణంలో ఆర్పేశారు నాన్నగారు.
    అమ్మ పిన్నివాళ్ళ ఊరెడితే ఇందిర పుట్టింటి కెళ్ళాల్సిన సమస్య రాదు. గడపలు పెద్ద సమస్యలుగా కళ్ళముందు నిలవవు- ప్చ్! ఏం లాభం!
    తానొకటి తలుస్తే నాన్నొకటి తలచారు!
    'ఎంతసేపు కలుపుతావురా-తిను' అమ్మ గొంతు విని ఉలిక్కిపడ్డాడు.
    'నీ ఇష్టం- వెడితే పిన్ని సంతోషిస్తుందంతే' నెమ్మదిగా లేచాడు రామం.
                                                 *    *    *
    ఆషాఢం దగ్గరకొస్తున్న కొలదీ రామం మనసుకి విశ్రాంతి దూరమవుతోంది. ఊళ్ళోనే అత్తారిల్లయితే ఏ సినిమా హాల్లోనో, హోటల్ లోనో, రోడ్డు చివరలోనో కలుసుకోవచ్చు- ఈ పెద్దవాళ్ళకేం ఇలాగే చెబుతారు. ఒకసారి అమ్మమీద, నాన్నమీద, మామగారిమీద, ఊళ్ళో పెద్దవాళ్ళందరి మీద కూడా కోపం వచ్చింది రామానికి!
    అగ్గిపెట్లో పుల్లలయిపోయాయి. వెధవ అగ్గిపుల్లలకోసం ఎవడు వెడతాడు వంటింటిదాకా.
    'ఇదిగో'- కేక పెట్టాడు రామం.
    పనిలో వున్న ఇందిర చీరకొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది.
    'అగ్గిపెట్టె'
    'దీనికేనా ఇంత కేకపెట్టారు' ఇందిర అగ్గిపెట్టి రామం ఒళ్ళో పడేసింది.
    'ఆగాగు' అన్నాడు.
    'పని అయ్యాక వస్తాను'
    'నేను పెద్ద సమస్యతో తల బాదుకుంటూంటే నీకేంపట్టదు- సరే వెళ్ళు'-
    ఇందిర సోఫాలో కూలబడింది.
    'మా స్నేహితుడు గది ఖాళీచేసి ఇవాళ ఊరెడుతున్నాడు ఆఫీసు పనిమీద- వాడి గది మనం తీసుకుందాం- ఎలావుంది ఆలోచన'- ఇందిర పకపకా నవ్వేసింది రామం మాటలకి.
    'స్టుపిడ్- ఏమీ అర్థంకాదు- వెళ్ళు- పనిచేసుకో'- రామం కిటికీలోకి చూస్తూ నిలబడ్డాడు.
    'నెల్లాళ్ళకోసం గది తీసుకుంటే అందరూ నవ్వరూ- అయినా అత్తగారూ మామగారూ ఒప్పుకోవద్దూ'
    'ఎవరో నవ్వితే నాకేమిటి- ఇప్పుడు ఆషాఢం  అని వెడతావు- ఆ తర్వాత మీ అమ్మ శ్రావణమాసం నోములని ఉంచేస్తుంది నేనొక్కణ్ణి ఉండలేను ఇందూ'- రామం కిటికీలోకి చూస్తూ నిలబడ్డాడు.
    ఇందిర మాట్లాడలేదు.
    'అమ్మ పిలుస్తోంది'
    ఇందిర కదలలేదు.
    'నిన్నే, అమ్మ పిలుస్తోంది వెళ్ళు- ఏడుపెందుకూ'
    గబగబా పమిటతో కన్నీళ్ళద్దుకుని వెళ్ళిపోయింది ఇందిర.
                            *    *    *
    రామం గదిలో అడుగుపెట్టాడు. తండ్రి పేపరు చూస్తున్నాడు. తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి నానా ఇబ్బందీ పడుతూ చివరకు తేల్చాడు రామం.
    'హాయిగా వెళ్ళి ఉండండి- నెల్లాళ్ళు ఇట్టే తిరిగొస్తాయి' అన్నాడు పేపరులోంచి తలతీయకుండానే తండ్రి. తండ్రికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాడు రామం.
                            *    *    *
    రామం, ఇందిర చిన్నగదిలో హాయిగా వున్నారు. 'ఏమో బాబు ఎలా వుంటారో, పురుళ్ళకని, పెళ్ళిళ్ళకని పుట్టింటి కెళ్ళి కూచుని' అనుకుంది ఇందిర ఆషాఢాన్ని గెల్చుకున్నామన్న ఆనందంలో.
                                                *    *    *
    ఇందిరముఖం ఆక్షణం చిన్నబోయింది. సాయంత్రం రాము ఇంటికొచ్చాడు ఆఫీసునుండి.
    'ఇదేమిటండీ ఖర్మ'
    ఇందిర మాట క్షణం అర్థంకాలేదు రామానికి.
    'ఏమైంది.
    'ఏమనాలో అదే అయింది- ఆ ఇంటాయన వచ్చాడు, నా దగ్గర నుంచి గది తీసుకున్న మనిషి నాకు అప్పగించాలి కాని ఇదేమిటని ఒకటే గోల- నాకు తెలియదు మీతో మాట్లాడమన్నాను'-
    ఇందిర చిరాగ్గా ముఖం పెట్టింది.
    రామం బట్టలు మార్చుకుని కాఫీ తాగుతున్నాడు- యమునిలా ప్రత్యక్షమయ్యాడు ఇంటివాడు-
    ఎంతో నచ్చచెప్పాడు. బతిమాలాడు రామం ఇంటివాణ్ణి. 'ఈనెల అయిపోయాక ఒక్కరోజయినా మాకొద్దు ఈ గది' అన్నాడు.
    'అదేమీ కుదరదు, ఆషాఢంలో మా అమ్మాయి వస్తుంది. మా అల్లుడికి ఇక్కడే ఉద్యోగమయింది. అత్తఅల్లుడు ఒక గడపలోంచి నడవకూడదు. అందుకు ఈ గది ప్రత్యేకంగా కావాలి' అన్నాడు వేరే మాటకి అవకాశం లేకుండా.
    క్షణకాలం దిక్కు తోచలేదు రామానికి.
    'సరే చూడు ఇందూ, ఆఫీసుకి సెలవు పెట్టేస్తాను-మీ నాన్నకి రాయి, నాకు వో గది ప్రత్యేకించమని, ఏం'- ఇందిర ముఖం ఒకసారి వెలిగింది. హాయిగా పుట్టింట్లో తను భర్త వో నెల్లాళ్ళు గడపవచ్చు.
    రామం ఆఫీసుకెళ్ళిన అర్థగంటకే వీధి తలుపు చప్పుడయింది. అప్పుడే సెలవు పెట్టి వచ్చేశాడేమో అని ఆలోచిస్తూ తలుపు తీసింది ఇందిర.
    గుమ్మంలో మామగారు !
    'చూడమ్మాయ్, మీరిలా విడిగా ఉండటం మీ అత్తగారికి నచ్చలేదు-అయినా ఆవిడ చెల్లెల్ని చూడాలని అనుకుంటోంది-వాడేమో నిన్ను పుట్టింటికి పంపడాయే - అందుకని ఆషాఢంలో మీ అత్తగారు ఇక్కడ లేకుండా వుంటే సరిపోతుంది గదా అని ఆవిడ చెల్లెలింటికి వెడతానంటోంది - అబ్బాయిరాగానే ఇద్దరూ వచ్చేయండి'__
    'హమ్మయ్యా' ఇందిర విశ్రాంతిగా ఊపిరి పీల్చుకుంది.
    ఇంటివాడితో పేచీ అక్కర్లేదు.
    ఆఫీసుకి సెలవక్కర్లేదు.
    టిక్కట్లకి డబ్బు తగలెయ్యక్కర్లేదు!
    గుమ్మంలో అడుగుపెట్టగానే రామానికి చెప్పింది శుభవార్త. రామం పొంగిపోయాడు.
    'చూసావా మావాళ్ళు ఎంత మంచివాళ్ళో' అన్నాడు ఒక్కసారిగా.
    తల్లి రేపు ప్రయాణం. ఎల్లుండితో ఆషాఢం వచ్చేస్తుంది. అవి ఇవి సద్దుతోంది. పిన్నికి ఇష్టమని చిన్న జాడీలో ఊరగాయ సద్దింది.
    నాలుగు గంటలకి ప్రయాణం. సామానంతా సద్దుకోటం అయింది.
    కాఫీ ఫలహారాలుచేసి హాలులో కూచుని కబుట్లు చెప్పుకుంటున్నారు రామం, ఇందిర, తల్లి, తండ్రి.
    పోస్ట్ మాన్ పడేసిన ఉత్తరాన్ని చదువుతున్నాడు తండ్రి.
    'మళ్ళీ మామగారేమో చూడండి' అన్నాడు రామం,
    ఉత్తరం చదవటం పూర్తిచేసి తల్లికేసి చూసాడు ముసలాయన.
    రామంకేసి చూసాడు తర్వాత.
    'మీ చెల్లాయి మొగుడు వస్తున్నారట రాత్రికి'
    తల్లి ముఖంలోకి చూచాడు తండ్రి.
    రామం ముఖం ఒక్కసారి పాలిపోయింది.
    'ఏమిటో చెప్పండి సరిగ్గా' అంది ఖంగారుగా తల్లి.
    'ఏముంది-మీ మరిది నెల్లాళ్ళు సెలవు పెట్టి వస్తున్నాడు. అక్కను చూడాలని మీ చెల్లాయి చాలా అనుకుంటోందిట. పైగా వాళ్ళ అల్లుడు వాళ్ళ ఊరు ఉద్యోగ ప్రయత్నాలకోసం వస్తున్నాడట. ఆషాఢమాసం కదా అత్త అల్లుడు ఒకే గడపలో నడవకూడదనీ, చాలా రోజులై అక్కని చూడాలనుకుంటోందని - బయల్దేరి వస్తున్నాడు - ఈ ఉత్తరం నిన్న ఇయ్యాల్సింది, ఇవాళ ఇచ్చాడు. అదీ-విన్నావా' ముసలాయన రామం ముఖంలోకి చూచి నవ్వాడు.   
    రామమూ నవ్వాడు ఏడ్వలేక!
    ఇంక ఉపాయాలు ఆలోచించే స్థితి దాటిపోయింది రామం బుర్ర.
    తని నిమిత్తమాత్రుడు, తను చేయగలది ఏమీలేదు!
    ఇందిర రైల్లో కూర్చుంది.
    అనుబంధాల్ని, ఆప్యాయతల్ని దూరానికి దగ్గరికి తీసుకుపోయే రైలు కూసి కదిలింది.
    రామం గుండె కదిలింది!
    తనూ ఈ రైల్లో ఎక్కిపోతేనేం!
    నీళ్ళు నిండిన కళ్ళతో రామంకేసి చూసింది ఇందిర.
    రైలుతోపాటు, రామమూ కదిలాడు!
    'ఇంక నెల్లాళ్ళు-' ఏడ్వాలనిపించింది రామానికి. నీళ్ళు తిరిగిన కళ్లు రహస్యంగా తుడుచుకున్నాడు నడుస్తూ.
    రాత్రి నిద్ర లేకుండానే ఆషాఢ తొలి ఉషస్సును చూశాడు రామం!*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS