అతడి గురించి గట్టిగా మాట్లాడటానికి కమిషనర్ ఆఫ్ ఫోలీస్ ఆఫీసులో ఉన్నతాధికారి కూడా భయపడతాడు! హొం మినిస్ట్రీ ఆఫీసుకి కేసు రాగానే అతడి కొక కాపీ పంపబడుతుందని ప్రతీతి!! అతడి తాలూకా మనిషి ఎవరైనా (పొరపాటున) జైలుకి వెళితే జైలు అధికారులే 555 సిగరెట్ల నుంచి మంచి ఆహారం వరకూ ఏర్పాటు చేస్తారు. నాసా క్రింద అతడు స్వల్పకాలం జైల్లో వున్నప్పుడు మూడొంతుల మంది పార్లమెంటు సభ్యులు అతడిని జైల్లో పరామర్శించడానికి వచ్చారని పేపర్లన్నీ ముక్తకంఠంతో చెప్పాయి!!!
వసంత దాదా!
అతడు కావాలనుకుంటే రాజకీయ నాయకుల్ని సృష్టిస్తాడు. మంత్రుల్ని రోడ్డున వడేస్తాడు!
భారతదేశపు అత్యంత ప్రతిభావంతమైన క్రిమినల్ లాయర్లు అతడి తరపున ఒక చిన్న కేసైనా వాదించటానికి ఉవ్విళ్ళూరుతారు.
అతడు చేసే పన్లన్నీ ఒక ప్లాన్ ప్రకారం వుంటాయి! అవి దీర్ఘకాల ప్రణాళికలు!!! విసిరేసిన ఆకుల్లో ఆహారాన్ని ఏరుకుంటూ, ఫుట్ పాత్ ల మీద పడుకునే కుర్రవాళ్ళని చేరదీసి నెమ్మదిగా స్మగ్లింగ్ లోకి దింపుతాడు. కడుపునిండా తిండి పెడతాడు. వాళ్ళు కలలోకూడా ఊహించలేని రమ్యహర్మ్య వాతావరణాన్ని వారికి కల్పిస్తాడు. దాంతో ప్రాణంపొయినా సరే వాళ్ళు అతడి మాటలకు బద్దులుగా వుంటారు. అన్ని బిక్షలకన్నా ప్రాణ బిక్ష గొప్పది అని గ్రహించి వాడు వసంత దాదా! పాతిక సంవత్సరాల క్రితం అతడి క్రింద పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం కరోల్ బాగ్, కుతుబ్ మినార్ ప్రాంతాల్ని (హైదరాబాద్ లో అయితే షమ్ షేర్ గంజ్, పురానాపూల్ ప్రాంతాల్ని) నడుపుతున్నారు.
దాదా క్రింద వున్న గాంగ్ లకి రకరకాల పేర్లుంటాయి. గణేష్ దళం, శక్తిదళం- అలా! ఒక గృహస్థు తాలూకు పదిహేనేళ్ళ కూతురు తప్పిపోతే, అతడు వెళ్ళి ఆ ఏరియా లీడర్ని కలుసుకుంటే, నాలుగు గంటల్లోగా ఆ అమ్మాయి వెతికి తెప్పించి ఇవ్వబడింది. ముఖ్యంగా రేప్ చేయబడకుండా! పోలీసులకి రిపోర్ట్ ఇవ్వకపోవటం అతడు చేసిన తెలివైన పని (....ఇండియన్ ఎక్స్ ప్రెస్- ఆగస్ట్ 1,పేజీ 4).
అయితే, మిగతా అందరు 'డాన్' లలాగా ఢిల్లీ కి సంబంధించిన ఈ వసంత్ దాదా తన చేతుల్ని మలినంచేసుకోడు. సారానీళ్ళూ, రక్తం తడి ఇతడిని అంటవు. అంతా క్రింద వాళ్ళే చేసుకుపోతారు.
వసంత్ దాదా ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ అతడి తెలివితేటలకు మచ్చుతునక!
నౌకల్లో విదేశాల్నుంచి దిగుమతి అయిన ముడి సరుకుని, యజమానుల తరపున డాక్ (నౌకల్నుంచి సరుకు దింపే స్థలం) నుంచి అతడు దొంగతనం చేయిస్తాడు. దేశంలో లభ్యంకాని ఆ సరుకు బ్లాక్ మార్కెట్ లో 30% లాభానికి అమ్మి వేయబడుతుంది. యజమానికి దొంగతనం వల్ల పోయిన సరుకుకి ఇన్సూరెన్సు వస్తుంది! అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మరో విడత అదే సరుకు తెప్పించుకోవటానికి లైసెన్సు వస్తుంది! ఈ చివరది అన్నిటికన్నా ముఖ్యం.
మొత్తం లాభంలో సగం వసంత్ దాదాకి ఇవ్వాలి. ఈ రకమైన ఆదాయం అతడికి నెలకు డెభ్బై లక్షల్నుంచి కోటి రూపాయల వరకూ వుంటుందని అంచనా! అయితే అందులో మూడొంతులు అతడు పోలీసు అధికారులకి వారం వారం ఇవ్వవలసిన బేటాలు, డాక్ అధికారుల దగ్గిరకి పంపే అమ్మాయిల ఖర్చు, ఇన్సూరెన్స్, ప్రభుత్వ దిగుమతి విభాగం ఆఫీసర్లకి ఇచ్చే స్కాచ్ ఖర్చులకి పోతుంది. ఇదిగాక రాజకీయ పార్టీలకు ఇవ్వవలసింది కొంత!
ఆ విధంగా ధారాళంగా ఖర్చు పెడతాడు కాబట్టే అతడు ప్రభుత్వానికి సమాంతరంగా తన సామ్రాజ్యాన్ని నడప గల్గుతున్నాడు.
* * *
రామ సుబ్బారావు వెళ్ళేసరికి వసంతదాదా ఈలం విప్లవకారుల సంస్థతో మాట్లాడుతున్నాడు. శ్రీలంకలో తమిళులకి జరుగుతున్న అన్యాయాన్ని ఆవేశంగా వివరిస్తున్నారు ఆ కుర్రవాళ్ళు. వసంతదాదా నుదుటన వున్న విభూతి రేఖల మధ్య అడ్డంగా కనబడుతున్న గీతలు అతడి దీర్ఘలోచనని సూచిస్తున్నాయి. చూసిన వారికి అతడెంత లోతుగా ఈ సమస్యలో లీనమయ్యాడో అనిపిస్తుంది. అతడు అంత ఆలోచనగానూ వారిని వింటున్న మాట నిజమే. అయితే కేవలం వారిమీద సానుభూతితో మాత్రమే కాదు. దీన్ని తన పావులారిటీకి ఎలా ఉపయోగించుకో వచ్చా అని! ఎలాగూ ఈ సమస్య ఇప్పుడు ఆగదు. ఆ వుద్యమానికి ఇంకెవరైనా నాయకత్వం వహించక ముందే తన 'సానుభూతి' అని బహిరంగంగా తెలుపుతే, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పక్షంలో అయిదారు సీట్లకి బేరం పెట్టవచ్చు. అతడు దీనికి మూడు చర్యల్ని ప్రతిపాదించాడు. 1. గణేష్ నవరాత్రి సందర్భంగా దేశంలోకెల్లా ఎత్తైన విగ్రహాన్ని తీసుకెళ్ళే 'గణేష్ దళ్' బృందం ఈ సంవత్సరం బొంబాయిలో జరిపే ఉత్సవం- శ్రీలంక తమిళుల పట్ల ఆవేదన తెలుపుతూ మౌన పాదయాత్రగా నడక సాగిస్తుంది. 2. ప్రధాన మంత్రికి తమిళుల సానుభూతిపరులు అయిదు లక్షల పోస్ట్ కార్డులు పోస్టు చేస్తారు. ౩. తమిళ నాయకులకు ఉత్సవం అనంతరం లక్ష రూపాయిలు చందా ఇస్తాడు. కార్డుల ఖర్చు కూడా భరిస్తాడు.
వసంత దాదా ఈ మూడు విషయాలూ చెప్పగానే ఈలం యువకుల మొహాలు ఆనందంతో విప్పారినయ్! సంతోషంగా వెళ్ళిపోయారు. తరువాత సుబ్బారావుని "బోలీయే సాబ్! ఆజ్ కల్ ఆఫ్ దిఖా రహీ నహీ" అంటూ ఆహ్వానించాడు వసంతదాదా.
సంభాషణంతా హిందీలో జరిగింది.
విదేశీయులు గుంటూరుకి పొగాకు నాణ్యత పరీక్షించే నిమిత్తం వస్తూ వుంటారు. వీరిని అతిథిగృహాల్లో 'ఆనందింపజేయటం' నీ వ్యాపారస్థుల కనీస ధర్మం. గుంటూరులో ఇటువంటి గెస్ట్ హవుస్ లలో సంవత్సరానికి కపీసం మొత్తం అరలక్ష స్కాచ్ బాటిల్స్ దాకా ఖర్చు అవుతాయని అంచనా! దీనికి ఆ ఊరి ఏజెంట్ రామసుబ్బారావు అని చాలా కొద్దిమందికే తెలుసు. మిగతా ఆంధ్రా పౌరులకి తెలిసినా వారు నమ్మరు. కోట్లతో వ్యాపారం చేసే గౌరవ సమాజ సభ్యుడు ఇంత చిన్న వ్యాపారానికి పూనుకుంటాడా అని! నిజమైన వ్యాపారస్థుడు చిల్లికాణీ లాభమున్న వ్యవహారాన్నైనా బయటకు పోనివ్వడన్న సామాజిక స్పృహ వుంటే అతడు సగటు భారతీయుడు అవడు. మొత్తానికి ఆ విధంగా సుబ్బారావుకీ వసంత దాదాకీ పరిచయం.
సుబ్బారావు తను ఎలా మోసపోయింది వివరంగా చెప్పాడు. గంగరాజు తనని ఏ విధంగా బుట్టలో వేసిందీ వివరించాడు. వసంతదాదా కళ్ళు మూసుకుని విన్నాడు. అతడి భృకుటి ముడిపడింది. నుదుటి మీద గీతలు మామూలే.
తమ ప్రపంచంలో ఏ చిన్న ప్రాణికి అన్యాయం జరిగి తమ దగ్గిరకొచ్చినా 'దాదా' లు సహించరు. అవతలి ప్రపంచపు ప్రాణి ఎంత పెద్దదయినా నిర్ధాక్షిణ్యంగా నాశనం చేస్తారు.
అంతా విన్నాక దాదా అన్నాడు - "అయితే ఇదంతా గంగరాజు చేయించాడంటారు".
"అవును దాదా. చాలా గొప్ప తెలివి తేటల్తో ఫోన్ చేయించి మరీ చెప్పించాడు. ముఖర్జీ ఈ విధంగా నాకెందుకు చెప్పాడో అర్థం కావటం లేదు. అతడిమీద కూడా మనం చర్య తీసుకోవాలి-"
వసంతదాదా జవాబు చెప్పలేదు. అతడంత తొందరగా ఒక ముగింపుకి రాడు. పక్కనే వున్న ఫోన్ అందుకుని డయల్ చేశాడు. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి లైన్లోకి వచ్చాక, రెండు నిమిషాలపాటు అతడితో మాట్లాడి, రిసీవర్ పెట్టేస్తూ సుబ్బారావు వైపు తిరిగి, "ముఖర్జీ సాబ్ గత సంవత్సరంగా విజ్ఞాన్ భవన్ లో భోజనం చేయలేదట" అన్నాడు.
సుబ్బారావు మొహం వెలవెలబోయింది. "చూశారా అది కూడా అతడే ఏర్పాటు చేశాడు" అన్నాడు.
"ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడో అదీ కనుక్కుందాం. మీరు ఢిల్లీ చేసిన ఫోన్ నెంబరు ఎంత?"
సుబ్బారావు చెప్పాడు.
వసంతదాదా పక్కనున్న అతడి అనుచరులు అతడు చెప్పిన ఆ నెంబరు వినగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
"మీరు చెప్పిన నెంబరు కరెక్టేనా సాబ్. మరొకసారి గుర్తు చేసుకోండి"
"నిశ్చయంగా అదే- ఎవరిదా నెంబరు?"
"సర్కిల్ 3- డి.సి.పి. శ్రీకాంత్ నెంబర్ అది. సుబ్బారావు సాబ్, ఇందులో ఏదో మెలిక వుంది. దీనంతటికీ కారణం మీరనుకున్నట్టు గంగరాజు అయివుండక పోవచ్చు. మొత్తం అంతా వివరంగా చెప్పండి".
సుబ్బారావు అన్ని విషయాలూ చెప్పాడు. చివర్లో స్టాక్ హొం ఇంటర్వ్యూ గురించి చెప్పేసరికి దాదా ఆలోచన్లు అక్కడ ఆగిపోయాయి. శ్రీకాంత్ ఫోన్ లో ప్రతి సంభాషణా అతడి దగ్గిర రికార్డు చేయబడుతుంది.
సరిగ్గా పావుగంట గడిచేసరికి అతడి చేతిలో ఒక ఫోటో వుంది. దాన్ని సుబ్బారావు ముందుకు తోస్తూ "ఇదిగో ఈ అమ్మాయే సాబ్ మీకు అందంగా టోపీ వేసింది. మీతోనే ఢిల్లీ ఫోన్ చేయించి, తన వంటవాడి చేత మంత్రి రూపంలో మీకు ఉద్యోగం విషయం చెప్పించింది" అంటూ నవ్వేడు. దాదా పక్కనున్న వాళ్ళు కూడా నవ్వసాగారు. సుబ్బారావు మొహం కందిపోయింది. అతడింత అవమానం జీవితంలో ఎప్పుడూ పొందలేదు.
"దీనికి తగిన శాస్తి చేయాలి" అన్నాడు.
"ఈ శ్రీకాంత్ మాకెలాగో గురువే సాబ్. ఈ అమ్మాయి విషయం మా హైద్రాబాద్ వాళ్ళు చూసుకుంటారు".
"చాలా పట్టుదలగా వున్నారే......"
సుబ్బారావు మాట్లాడలేదు.
"సరే అయితే. ఇప్పుడే హైద్రాబాద్ మాట్లాడతాను. మీరెళ్ళి కలుసుకోండి".
"ఎవర్ని?"
"సలీం శంకర్ని-"
* * *
రామ సుబ్బారావుకి సలీం శంకర్ మొదటి చూపులోనే నచ్చాడు. వసంతదాదాలో అది నటన గానీ, నిజాముగానీ అదోలాటి మృదుత్వం వుంది. సలీం శంకర్ లో అటువంటి ఛాయలేమీ లేవు. నూటికి నూరుపాళ్ళు రౌడీ లాగానే వున్నాడు.
చార్మినార్ వెనుక బార్ కాస్ అని పిలవబడే ప్రాంతపు సందులో ఒక షాపులాటి ప్రదేశంలో వారి సమావేశం జరిగింది. పాడయిపోయినట్టున్న ఆ షాపులో వస్తువుల ఖరీదు కనీసం యాభై లక్షలకి తక్కువ వుండదు.
"దాదా అంతా చెప్పాడు. ఏం చెయ్యాలి నేను?"
సుబ్బారావు ఫోటోని సలీంకి అందించాడు. "ఈ చిన్న పిచ్చుక తనే తెలివైనదనుకుంటూంది. దీనికి బుద్ధి చెప్పాలి. మిగతా విషయాలన్నీ దాదా చెప్పాడుగా".
"చెప్పాడు. చాలా గమ్మత్తుగా నాటకమాడింది. మనమూ అంత గమ్మత్తుగానే బుద్ధి చెబుదాం".
"ఏం చేస్తావు?"
"అదంతా నాకు వదిలి పెట్టండి. ఈ మధ్య మెదడుతో పని లేక చాలా రోజులైంది".
సుబ్బారావు సంతృప్తుడై లేచాడు.
"సాబ్" అన్నాడు సలీం శంకర్. "ఈ ముఖ్యమంత్రి చార్మినార్ రోడ్లనీ, ఏరియానీ, విశాలం చేసి, కొత్త భవనాల్ని కట్టిస్తానంటున్నాడు. అసలు మన హైద్రాబాదీ కల్చర్ అంతా ఈ పురానా సీటీలోనే వుంది. దీన్ని పాడుచేయటానికి మేమెట్లా వప్పుకుంటాం? అందుకే "హైద్రాబాద్ సంస్కృతీ సంరక్షణ సమితి" అని పెట్టి ఈ గల్లీలు (సందులు) అన్నీ ఇలానే వుండాలని, వుంచాలనీ వినతి పత్రం సమర్పిస్తున్నాం. దానికి చందా ...." ఆగాడు.
సుబ్బారావు సమితి పేరుమీద, జేబులోంచి చెక్కుబుక్కు తీసి ఇరవై వేలకి వ్రాసి ఇచ్చాడు.
