Previous Page Next Page 
ష్....మాట్లాడొద్దు పేజి 6

    "ష్ మాట్లాడొద్దు...అన్నానా?  బుద్దిగా  బన్ను తిను...రేపయినా  యిదే బన్ను తినాలి. అర్ధమైందా...అన్నట్టు మరో విషయం... ఈ గదిలో కరెంటు లేదు. ఈ గదిలోనేకాదు,యీ యింట్లోనే కరెంటు లేదు.  పాడుబడిన యిల్లు కదా...కరెంటు పికేసారు.  ఈ  క్యాండిల్ ఆరిపోయేవరకూ వెలుగు వుంటుంది.  ఆ  తర్వాత చీకట్లో...ప్చ్...ఎలా వుంటావో...రేపు కలుద్దాం...బై..."
    అతను వెళ్లిపోయాడు.
    'ఏయ్...డేవిడ్...ప్లీజ్".
    కొద్ది క్షణాల్లో తలిపు మూసుకుంది.  దుఃఖం తన్నుకొస్తోంది.
    తను అనవసరంగా ఈ ట్రాప్ లో  యిరుక్కున్నాడు. ఆ జేమ్స్ ఎవరో...ఎందుకిలా చేస్తున్నాడో అర్ధం కావడంలేదు.
    అతనికి తన భార్య ప్రణవి గుర్తొచ్చింది.
    ప్రణవికి దిగులుగా వుంది.
    భర్త కనిపించక అప్పడే మూడ్రోజులైంది. రోజూ కృపాల్ ఫోన్ చేసి తన క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నాడు.  బ్యాంకు వాళ్లు కూడా ఫోన్ చేసారు.
    అనుకోకుండా వేరే వూరు వెళ్లాల్సి వచ్చిందని తను అబద్ధమాడింది. అసలు విషయం తెలియకుండా తను బ్యాంకు వాళ్లతో ఏమని చెప్పేది?
    భర్త జ్ఞాపకాలు  ఆమెను వెంటపడి మరీ తరుముతున్నాయి.  ఎక్కడున్నాడో... అసలేమయ్యడో కూడా అర్ధం కావడంలేదు.
    ఇదంతా మిస్టరీగా అనిపిస్తుంది.  తన భర్తను కిడ్నాప్ చేసే అవసరం ఎవరి కుంటుంది? బుద్ధిగా తన చేసుకుంటాడు.
    యింట్లో ఒక్కర్తి వుండాలన్న భయంగానే వుంది.  పోనీ పేపర్లో 'కనిపించడంలేదు' అని ప్రకటన  యిద్దామన్న ఆలోచన కూడా వచ్చింది.
    ఈలోగా తన భర్త తిరిగివస్తే?  ఆయనకెంత నామోషీ.
    ఆమె బుర్ర వేడెక్కిపోతోంది.  లోపల కుక్కర్ విజిలేసింది.
    ఉలిక్కిపడి లేచి స్టౌ ఆఫ్ చేసి వచ్చింది. ఏ పని చేయబుద్ది కావడంలేదు.
    యింట్లో వాళ్లకు ఈ విషయం చెప్పాలన్నా మనసొప్పడంలేదు.
    ఒంటరిగా...యింకెన్నాళ్లు భర్తకోసం ఎదురుచూస్తూ గడపాలి తను?  అలాగే ఆలోచిస్తూ సోఫాలోనే నిద్రపోయింది ప్రణవి.
     "నిన్ను విడిచి నేను వుండలేకపోతున్నాను చాందినీ" పార్ధసారధి అన్నాడు చాందిని గుండెలవైపు  కాంక్షగా చూస్తూ.
  మూడ్రోజుల్లోనే  చాందిని  అతనికి స్వర్గ సుఖాలు చూపించింది.  సెక్స్ మనిషిని డ్రగ్ ఎడిక్ట్ కన్నా,  ఘోరంగా ఎలా దిగజారుస్తుందో...పార్ధసారధిని చూస్తే అర్ధమవుంది.
    ఒకప్పుడు తన వృతే దైవంగా బ్రతికిన పార్ధసారధి ఈ మూడ్రోజుల్లో చాలా మారిపోయాడు.అతని ఆలోచనలు మొత్తం చాందిని చుట్టే...చాందిని లేకపోతే బ్రతకలేనన్నట్టు...
    "ఏవండీ... యింట్లో వుండీ బోర్ కొడుతుంది.  అలా ఎక్కడికైనా  వెళ్దామా?"
    " నీ యిష్టం చాందినీ...ఎక్కడికి వెళ్దాం? ఎద్తెనా స్టార్ హొటల్ కు  వెళ్దామా?"  ఆమెకు బానిసైపోయాడు పార్ధసారధి.
    "మిధిలా నగర్ లోమా  ఫ్రెండిల్లు  వుంది.  చాలా కాలంగా వాళ్లా యింటిని వాడటంలేదు.  డూప్లికేట్ కీస్ కూడా వున్నాయి.  ఓసారి వేళ్ళొద్దామా?"
    గోముగా అతని భుజం మీద తలవాల్చి అడిగింది.
    "అదేంటి వాళ్లు వాడని ఆ యింట్లో  అంతా డస్ట్...నేస్టీగా వుంటుంది.  ఆ యింట్లోకి ఎందుకు?"
    "యిక్కడైతే  ఫోన్ కాల్స్,  డిస్ట్రబెన్స్...ఆ యిల్లు బావుంటే మనం కొనేద్దాం...నాకా యింటిని కొనిపెట్టలేరా?"  తన గుండెలు అతని భుజానికి తగిలేలా టచ్ యిచి అడిగింది..
    "వై...నాట్ ష్యూర్"  పద యిప్పుడే వెళ్దాం"  అంటూ లేచాడు.
    "ఇప్పుడు మనం బయటకు వెళ్తే నౌకర్లు చూస్తారేమో..."
    "చూడనీ...ఆప్ట్రాల్ మనకింద పనిచేసే నౌకర్లు "   అన్నాడు.  ఒకప్పుడు వున్న ప్రిస్టేజీ...యిప్పడులేదు. పూర్తిగా  ఆమె  ట్రాప్ లో  పడిపోయాడు.
    తనకు ప్రియాతి ప్రియమైన కూతురి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేనంత.
    ఇద్దరూ బయటకు వచ్చారు.  నౌకర్లు చోద్యంగా చూస్తూ వుండిపోయారు  మొదటిసారిగా తమ యజమానిని ట్రాప్ చేసిన అమ్మాయిని చూసారు.
    అదే చివరిసారని  వాళ్లకు తెలియదు.
    ఖచ్చితంగా యిదే ఇల్లు.  నాకు తెలుసు.  నేను రెండ్రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాన.  నలుగురు కుర్రాళ్ల లో ఒక కుర్రాడు అన్నాడు. అతని పేరు స్వరూప్.  డిటెక్టివ్ నవలలు చదవడం చిన్నప్పటినుంచి అలవాటు చేసుకోవడం వల్ల అడ్వంచర్స్   అంటే యిష్టపడుతున్నాడు.
    ఆ రోజు ఇరానీ హొటల్ లో  చాందినీని చూసి వెంటపడ్డాడు.  మిగతా వాళ్లు ఈజీగా తీసుకున్నా స్వరూప్ వూర్కోలేకపోయాడు.
    మిగతా ముగ్గురు ప్రదీప్, మోహన్, శ్యామ్.
    "మరి మాకు చెప్పలేదేమిట్రా?"  అడిగాడు ప్రదీప్.
    "మీరు చెప్పినా నామాట నమ్ముతారో లేదోనని డౌటొచ్చి ఆగిపోయా."
    'సర్లే...యిప్పటికైనా చెప్పావు"  ప్రదీప్ అన్నాడు.
    నలుగురూ డాక్టర్ పార్ధసారధి యింటి దగ్గర కాపుకాసారు.
    రాత్రి ఏడు దాటింది.
    "ఒరేయ్ వెళ్లిపోయి  రేపోద్దాంరా...అయినా  నీ పిచ్చగాని ఆ యింట్లోకి వెళ్లినమ్మాయి,  రెండ్రోజులు బయటకు రాకుండా వుంటుందా?  ఒకవేళ  ఆ యింట్లో వుంటే ఆ యింట్లోవాళ్లే ఆ అమ్మాయిని  అప్పగించేస్తారు"  శ్యామ్ వెతికి చెప్పాడు.
    "అవునవును...అదీ నిజమే"  మోహన్ అన్నాడు.
    "అదేంకాదు.  మీరు చూస్తుండండి.  మనకు లక్ష రూపాయలు గ్యారంటీ" అన్నాడు స్వరూప్.
    సరిగ్గా అదే సమయంలో డాక్టర్ పార్ధసారధి బయటకు వచ్చాడు.
    అతని వెంటే చాందినీ వుంది.
    "అదిగో"  పెద్దగా కేకేసి అరిచాడు స్వరూప్.
    మిగతా ముగ్గురూ అటువైపు చూసారు.
    చాందినీని   చూసాక ఒక్క క్షణం వాళ్లకు నోట మాటరాలేదు. స్టన్నింగ్ బ్యూటీకి  సరైన అర్ధం ఆమెనేమోననిపించింది.
    పార్ధసారధి కారు బయటకు తీసాడు.
    అతని పక్కనే కూచుంది చాందిని.
    కారు ముందుకు కదిలింది.
    "కారు వెళ్తుంది"అరిచినట్టుగానే అన్నాడు స్వరూప్.
    వెంటనే అటుగా వెళ్లే ఆటోని పిలిచాడు.
    "ఏయ్...ఆటో ఆ కారును ఫాలో అవ్వు"  చెప్పాడు స్వరూప్.
    ఆటోవాలా అతనివైపు చిత్రంగా చూసాడు.
    సినిమాల్లో తప్ప యిలా కారును  ఫాలో అవ్వమని చెప్పే ప్రయాణికులు వుండరు.  ఆటో డ్రెవర్ కు అర్ధం కాలేదు.
    "నీకే చెప్పేది...ఆ కారును ఫాలో అవ్వు...మీటర్ మీద పది రూపాయలు ఎక్ స్ట్రా యిస్తా" అన్నాడు స్వరూప్ కంగారుగా  అప్పటికే కారు కి.మీ దూరమైనా వెళ్లుంటుంది.
    ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసాడు.
    కారును ఫాలో అవుతుంది ఆటో.
    ఆటోలోని  నలుగురు కుర్రాళ్లూ  టెన్షన్ గా చూస్తున్నారు.
    "రేయ్...మనం అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నామేమో...మనం పార్ధసారధి యింట్లో నుంచి వచ్చిన ఆ అమ్మాయిని ఛేజ్ చేస్తున్నాం. నిజంగా ఆ అమ్మాయి మనక్కావాల్సిన అమ్మాయే అయితే, పార్ధసారధి తోపాటు రెండ్రోజులు ఎందుకు వుంటుంది.  ప్తెగా అతను పేరున్న సర్జన్"  శ్యామ్ అనుమానంగా అన్నాడు.
    "ఏముంది...అతనే ఆ అమ్మాయిని వాళ్లవాళ్లకు అప్పగిస్తూ వుండొచ్చు"  మోహన్ అన్నాడు.
    "అయితే మనం వాళ్లని  ఫాలో అయి లాభం ఏంటి?" ప్రదీప్ చికాగ్గా అన్నాడు.
    "వుంది...మనం ఆ డాక్టర్ కారుని దాటి డాక్టర్ ని  ఆపి, అసలు విషయం చెబుదాం...మేమే ఆ అమ్మాయిని మొదటిసారి చూసామని.  ఆ డాక్టర్  కోటేశ్వరుడు.  లక్ష కోసం కక్కుర్తిపడే రకంకాదు...ఖచ్చితంగా ఆ అమౌంట్ మనకే యిస్తాడు..." ఉద్వేగంగా అన్నాడు స్వరూప్.
    "ఏమో...యింతకీ ఆ అమ్మాయి మనం వెతుకుతోన్న అమ్మాయేనా?" శ్యామ్ కు డౌట్ వచ్చింది.
    "నో డౌట్, కావాలంటే చూడు"అంటూ ప్యాంటు జేబులో మడిచిన పేపర్ మడత తీసి చూపించాడు.
    "కనబడుటలేదు"  అని ప్రకటన వున్న పేపర్ అది.  వాళ్ల సందేహం తీరింది.
    కారు మిధిలానగర్ లోకి   ప్రవేశించింది.

    "నేను చెప్పలే...అడ్రస్ కూడా కరెక్టే...మిథిలానగర్...ఇంటి నెంబర్ పదహారు"  స్వరూప్ అంటుండగానే కారు ఓ పాడుబడిన యింటి గేటు ముందాగింధి.
    చాందిని కిందికి దిగి, చెక్కగేటు తీసి మళ్లీ వచ్చి కారులో కూచుంది.
    కారు లోపలికి వెళ్లింది.
    కారు లోపలికి వెళ్లగానే చాందిని మళ్లీ కారు దిగి వచ్చి గేటు వేసింది.
    కొద్ది  ముందుగా ఆటో ఆపమన్నాడు స్వరూప్.
    ఆటో ఆగింది.
    నలుగురూ దిగారు...మిటర్ చూసి డబ్బులిచ్చారు. నలుగురూ ఇంటి నెంబర్ పదహారు దగ్గరికి వచ్చారు. చెక్కగేటు తీయబోతుండగా, ఆటో డ్రైవర్ గుర్తు చేశాడు.
    శ్యామ్ పది రూపాయలు ఇచ్చాడు.
    ఆటోడ్రైవర్ ఆ డబ్బులు  తీసుకొని, ఆ నలుగురు కుర్రాళ్ళ వైపు చూసి వెనక్కి తిరిగివెళ్లిపోయాడు...ఏదో గొణుక్కుంటూ.
     ఆ యింటివైపు  ఆశ్చర్యంగా చూసి...
    "ఇదేంటి చాందిని...ఈ యిల్లు యింత పాతబడి వుంది. అసలీ యింట్లో మనుష్యులు వుంటున్నారా?" అడిగాడు పార్ధసారాది.
    "ఎవరూ వుండడం లేదనేగా మనమీ యిల్లు కొనుక్కుందామని అంది" నవ్వుతూ, అతని భుజంమీద తలపెట్టింది.
    పార్ధసారధి ముందుకు కదిలాడు.
    తలుపులు తాళం వేసిలేదు.
    "అదేంటి తాళం లేదు"  అడిగాడు పార్ధసారధి.
    "బహుశ...పనివాళ్లు ఎవరైనా వచ్చి క్లీన్ చేస్తున్నారేమో"  అంది.
    పార్ధసారధి తలుపు తట్టాడు.
    తలుపు తెరుచుకోలేదు.
    "గట్టిగా నెట్టండి"  అంది చాందిని.
    గట్టిగా నెట్టాడు పార్ధసారధి. అతను నెట్టినెట్టక ముందే తలుపులు తెరుచుకోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి లోపల పడిపోయాడు బోర్లా.
    "అయ్యయ్యో...పడిపోయారా!"  అంది లోపలికి వచ్చిన చాందిని వెంటనే తలుపులేసేస్తూ.
    నేలంతా దుమ్ము పరుచుకొని వుంది.
    పార్ధసారధి  మెల్లిగా లేచాడు.
    చాందిని నవ్వుతోంది.
    "ఎందుకు చాందినీ నవ్వుతున్నావు"  కాస్త కోపంగానే అడిగాడు.
    మరోసారి నవ్వింది చాందిని.
    "స్టాపిట్ ఐస్...నేను కిందపడితే నవ్వులాటగా వుందా?" అంటూ కోపంగా చూసాడు చాందిని వైపు.
    అప్పుడు చూసాడు చాందిని వెనగ్గా వున్న మరో మనిషిని.
    ఆ మనిషి డేవిడ్...జేమ్స్ డేవిడ్
   "ఒరే లోపలి నుంచి గేటుకు లాక్ వేసారు.  దూకి వెళ్దామా?"   స్వరూప్ అడిగాడు మిగతా ముగ్గుర్ని.
   "ఒరే...నాకు భయంగా వుందిరా...ఆ అమ్మాయి లోపలికి వెళ్లింది.  పార్ధసారధి వెళ్ళాడు.  మనం యిప్పుడు వెళ్లి ఏం చేద్దాం...ఈ  యిల్లు చూస్తే దయ్యాల కొంపలా వుంది.  ఎందుకైనా మంచిది. మనం వెనక్కి వెళ్దాంరా" మోహన్ అన్నాడు.
    "ఛ...వూర్కో...అదేంట్రా...మనం యంగ్ బోయ్స్ మి...అలా భయపడితే ఎలా?"  అంటూ స్వరూప్ గేటు ఎక్కి దూకాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS