ముందుగదిలోనే ఎదురయ్యాడు కృష్ణ "వెళ్ళొస్తా అమ్మా" అన్నాడు.
"అన్నం తిన్నావా?" అందావిడ, తలూపాడు.
"నాన్నగారికి మళ్ళీ బి.పి. వచ్చింది చూశావా? బాగా ఉధృతంగా వచ్చింది. వెళ్తూ డాక్టరుగారికి చెప్పి వెళ్తావా? యెందుకైనా మంచిది ఓసారి చూసి వెళ్తారు" అంది.
సీరియస్ గా అయిపోయాడతను. "ఆ! చూస్తూనే ఉన్నాను. యిందాక కిటికిలోంచి చూశాను, కర్రపుచ్చుకుని రామిరెడ్డిలా రయ్ మని పరిగెడుతున్నారు. మరి అనారోగ్యం మనిషి అలా పరిగెడితే బి.పి. రాక బంగారు పతకం వస్తుందా? చెప్తే వివరు. డాక్టరుగారికి చెప్పి వెళ్తాలే. అయినా ఆయన మాత్రం ఏం చేస్తాడు?" అనేసి వెళ్ళి పోయాడు. బరువుగా నిట్టూర్చింది ఆవిడ.
వంటింట్లోంచి వచ్చింది దీపిక. అద్దంముందు నిలబడి పమిట సర్దుకుని కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు తీసుకుని చెప్పు లేసుకుని "అమ్మా నే వెళ్ళొస్తా!" అంది.
తలూపింది ఆవిడ, వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఏదో పనుంది అన్నారు ప్రొఫెసర్ గారు" అనేసి ఇవతలికి వచ్చేసింది.
ఆ ఆలికిడికి లేచారు నారాయణమూర్తి గారు.
"వెళ్తున్నావా తల్లీ?" అన్నారు ఆప్యాయంగా.
"అవును నాన్నా!" అంది దీపిక.
"ఏమిటమ్మా మరి? ఎంతదాకా వచ్చింది? ఏమైనా ఆశాజనకంగా ఉందా పరిస్థితి?" ఆశగా అడిగాడు.
"శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాం నాన్నా మీరు ధైర్యంగా ఉండండి ప్రొఫెసర్ గారు పుల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు పనవుతుందని" అంది.
"ఏమో తల్లీ నా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను వెళ్ళిరా" అన్నాడు ఆయన.
వంటింట్లోంచి ఈ సంభాషణ అంతావింటున్న వర్ధనమ్మ నెత్తి బాదుకుంది. భగవంతుడా ఈ సంసారాన్ని నువ్వే రక్షించాలి అనుకుంది.
* * *
పరుగు పరుగున వెళ్తున్న మోహన్ యేదో అడ్డం రావడంతో కాలిక యెదురు దెబ్బ తగిలి విసురుగా జారి కింద పడిపోయాడు.
స్నానం పూజ ముగించి పిచ్చుకలకి బియ్యం వెయ్యడానికి వాకిట్లోకి వచ్చిన నారాయణమూర్తి విసురుగా వచ్చి తన గేటు ముందు జారిపడిన ఆ యువకుడిని చూసి అరెరె అంటూ గేటు తీసుకుని రోడ్ మీదికి వచ్చాడు.
మోకాలు పట్టుకుని అమ్మా అంటూ కూలబడిన మోహన్ కి చెయ్యి ఆసరా ఇచ్చి లేవదీశాడు. "ఇలారండి" నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకు వెళ్ళాడు. పోర్టికోదాటించి మెట్లమీద కూర్చోబెట్టాడు.
ఒక్కక్షణంలో వస్తా అని లోపలికి వెళ్ళి దూది డెట్టాల్ ఒక చేత్తో, మంచినీళ్ళ గ్లాసు మరో చేత్తో పట్టుకుని వచ్చాడు. మోకాలి మీద చెక్కుకుపోయింది. ఫ్యాంటు పైకితీసి దూది డెట్టాల్ టో ముంచి గాయం మీద అంటించాడు.
భగ్గున మండింది. "అమ్మా" అన్నాడు బాధగా.
"ఫర్వాలేదు తగ్గిపోతుంది." ఓదార్పుగా భుజం తట్టి మంచినీళ్ళు యిచ్చాడు చల్లని నీళ్ళు తాగి కాస్త తేరుకున్నాడు మోహన్.
"ఇప్పుడెలా ఉంది? అయినా అంత కొంపలంటుకుపోయే పన్లు ఉంటే కాస్త పెందలాడే బైలు దేరి నిదానంగా వెళ్ళాలిగానీ రోడ్డుమీద పరిగెట్టడం ఏం పని? మరి అలా పరిగెడితే ఇలాగే అవుతుంది.
మీ కుర్రకారు యింతే, నిలువూ నిదానం ఉండవు మీకు" నిష్ఠూరంగా అంటూ అతని పక్కనే చతికల పడ్డాడు ఆయన.
"నేను పనిమీద పరిగెట్టడం లేదండీ, పక్కంటికి వచ్చాను. ఆ యింటాయన, మా నాన్నగారి ఫ్రెండట. చుట్టావుచూపుగా వెళ్తే కర్ర పుచ్చుకుని నా వెంట పడ్డాడండీ, తప్పించుకుని పరిగెట్టుకు వస్తూ పడిపోయానండీ," దీనంగా చెప్పాడు మోహన్.
చిరాగ్గా పక్కింటి వైపు చూశాడు నారాయణ మూర్తిగారు. "ఏమిటీ చిన్ననాటి స్నేహితుడు కొడుకు ఇంటికొస్తే కర్రపుచ్చుకుని వెంటపడతాడా? ఉన్నా అవలక్షణాలకి తోడు పిచ్చి కూడా మొదలైందా ఏమిటి వీడికి. అసలేం జరిగింది? నువ్వేమైనా అసభ్యంగా ప్రవర్తించావా?" అడిగాడు.
"రామరామ లేదండీ? ముందంతా బాగానే ఉన్నారు. మర్యాదగానే మాట్లాడారు. నువ్వు హనుమాయమ్మ మేనల్లుడివా? అన్నారు. కాదండీ కంకిపాడు విశ్వనాధంగారి అబ్బాయినండీ అన్నాను. అంతే, అమాంతం లేచి నా వెంటపడ్డాడు."
ఉలిక్కి పడ్డాడు నారాయణమూర్తిగారు ఆశ్చర్యంగా మోహన్ వంక చూశాడు.
"ఏమిటీ? నువ్వు కంకిపాడు విశ్వనాధం కొడుకువా?" అన్నారు
మోహన్ పై ప్రాణం పైనే పోయింది. యిందాక ఆయన అంతే! ఇలాగే గుడ్లప్పగించి చూసి దండయాత్ర చేశాడు. అప్పుడంటే తిన్నగా ఉన్నాడు కాబట్టి రయ్ మని పరిగెట్ట గలిగాడు. ఇప్పుడెలా? భయం భయంగా చూస్తూలేవబోయాడు.
"ఓరోరి! నువ్వు కంకిపాడు విశ్వనాధం కొడుకువా! ఎంతవాడివయ్యావురా? నేను చూసినప్పుడు ఓ చిన్న బనీను వేసుకుని అరుచుకుంటూ రోడ్లమీద ఆడుకుంటూ ఉండే వాడివి, నీ పేరేమిట్రా మార్చేపోయాను ఆ! రామ్మోహన్. మోహన్ అని పిల్చేవాళ్ళం. మీ నాన్నా బాగున్నాడా? ఏం ఓసారి వచ్చి నన్ను చూసి పోయే తీరిక లేదా ఆ దొరగారికి?" ముఖం చేటంత చేసుకుని యేకధాటిగా మాట్లాడుతున్న ఆయన వంక తెల్లబోతూ చూశాడు మోహన్.
"సార్ ! మీరు" అన్నాడు అనుమానంగా.
"సార్ చారు ఏవిట్రా నీ తలకాయ తక్షణంగా మావయ్య అని పిలు" అన్నాడు.
"అదికాదండీ!" మళ్ళీ యేదో చెప్తుంటే ఆపేశాడు ఆయన.
"మళ్ళీ మీరంటాడు. ఒరే నాగ్గానీ చిరాకొచ్చిందంటే రెండు తగిలించేగల్ను ముందు లే ఇక్కడినించీ!" అంటూ లేచి రెక్క పుచ్చుకుని లేవదీశాడు.
ఇదెక్కడిగోలరా దేవుడా, ఈ వీధి వాళ్ళకి ఇదో అలవాటు కాబోలు ఎవర్ని పలకరించినా తగిలించేస్తామంటున్నారు బుద్ధి తక్కువై వచ్చాను అని లోలోపలే వాపోయాడు మోహన్.
"నీక్కావలసిన నారాయణమూర్తిని నేను. నీకు తెలీక పక్కింటికి పోయావు. ఇద్దరీ పేర్లూ ఒకటే అయి తగలడడంతో యిలా జరిగింది" అన్నాడు లోపలికి తీసుకెళ్తూ.
లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు. "తీసుకోరా" అంటూ ఆదరంగా అందించి పక్కనే కూర్చున్నాడు.
"ఏమిటో మీ అత్తయ్య ఉండగా యిల్లు కళకళలాడుతూ ఉండేది ఆ వైభోగం అంతా దానితోనే పోయింది!" అన్నాడు కళ్ళనీళ్ళు నింపుకుని.
వేడి వేడి కాఫీ ఒక్క గుక్క తాగేసరికి మొద్దుబారిపోయిన బుర్ర మళ్ళీ పని చెయ్యడం ప్రారంభించింది. జరిగినదంతా అర్ధం అయింది. లోలోపలే తనని తాను తిట్టుకున్నాడు.
"అవును మామయ్యా, ఈ విషయం తెలిసి నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు. మీ కొచ్చిన కష్టం సామాన్యమైంది కాదు ధైర్యం తెచ్చుకొండి!" అంటూ ఈసారి రైట్ పర్సనని పరామర్శించాడు.
కళ్ళు తుడుచుకున్నాడు నారాయణమూర్తిగారు. "ఏమిటోరా మోహన్. వంటరి పక్షిని అయిపోయాను. నా పంచప్రాణాలూ భారతి మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను దాన్ని ఓ యింటి దాన్ని చేసేస్తే యిదంతా దానికిచ్చేసి నిశ్చింతంగా కూర్చుంటాను. యివ్వాళ నిన్ను చూస్తే బ్రహ్మానందంగా ఉందిరా నాకు" అని ఆనందపడ్డాడు.
ఎక్కడున్నావ్ అని అడిగి, లాడ్డిలో ఉన్నందుకు బోలెడంత నొచ్చుకున్నాడు. "పద సామాన్లు తేచ్చేద్దాం ఇక్కడే ఉందువుగాని" అన్నాడు.
