"స్వాతంత్ర్య యోదులకి ఇచ్చే ఫించను నీకు రావడం లేదా తాతా?"
నిస్పృహగా అన్నాడు పోచయ్య. "దానికోసం పదేళ్ళు ప్రయత్నించి వదిలేశానమ్మా!"
అమూల్యకి వెంటనే నిఖిల్ గుర్తొచ్చాడు.
* * *
ఆ రాత్రి అమూల్య తనకోసం వంట మొదలెట్టబోతుండగా తరుణ్ వచ్చాడు.
అతన్ని చూసి నవ్వు మొహం పెట్టింది అమూల్య. "చెప్పండి! అసలు మీరు శబ్దమే కాకుండా ఎలా నడుస్తారో తెలుసుకోవాలని ఉంది."
"గాల్లో తేలుతూ" అన్నాడతను చాలా మాములుగా. "మీ అపార్ట్ మెంట్ కి వస్తాను. మిమ్మల్ని చూస్తాను అనుకుంటేనే గాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది నాకు."
ఇబ్బందిగా కదిలింది అమూల్య. తరుణ్ నోటివెంట ఇలాంటి మాటలు రావడం ఆమెకి ఇష్టం లేదు. అయినా భరించాలి తప్పదు. నిఖిల్ శాసనం అది!
శాసనం అని చెప్పలేదు నిఖిల్. కానీ అతని నోటివెంట వెలువడిన ప్రతిపదమూ తనకు శిలాశాసనమే! దాన్ని అతిక్రమించలేదు తను!
దాదాపు ఆమెను తాకేంత దగ్గరగా నిలబడి ఉన్నాడు తరుణ్. ఆమె జడలో ఉన్న మల్లెపూల సువాసన దివ్యలోకాల పరిమళంలా సోకుతోంది అతని నాసికా పుటాలకి.
అతని స్పోర్ట్స్ కోట్ లాపెల్ కి రాసిన 'బ్రూట్' పెర్ ఫ్యుమ్ చాలా తేలిగ్గా, ఆహ్లాదకరంగా ఉన్నా అది అత్తరు వాసనలా ఘాటుగా ఉన్నట్లు అనిపిస్తోంది అమూల్యకు. అక్కడనుండి దూరంగా జరిగిపోవాలని ఉంది ఆమెకు.
కానీ ఉగ్గాబట్టుకుని కదలకుండా నిలబడింది అక్కడే.
ఇతనితో చనువు నటించాలి తను. ఇతని దగ్గరనుంచి రహస్యాలు రాబట్టాలి.
అతను సంకోచంగా చేతులు అమెవైపు చాచాడు.
ఉపిరి బిగాపట్టింది అమూల్య.
అతని చేతులు ఆమెని దాటి ముందుకు వెళ్ళిపోయాయి. సౌ మీద పొంగి పోతున్నాయి పాలు. స్టవ్ ఆఫ్ చేశాడు అతను.
తెరిపినపడి దీర్ఘంగా నిట్టూర్చింది అమూల్య.
"నేను మిమ్మల్ని వదిలేసి వెళుతున్నాను అమూల్య!"
"ఎక్కడికి?"
చెప్పడానికి అతను కొంచెం సంకోచిస్తున్నట్లు కనబడ్డాడు "హాంగ్ కాంగ్!"
"హాంగ్ కంగా? ఎందుకు?"
అతను నవ్వాడు "క్లోక్ అండ్ డాగ్గర్ గేమ్. మీకు విసుగ్గా ఉంటుంది వినడానికి!"
విసుగా! వీనులవిందుగా ఉంటుంది తనకు. అతని రహస్యాలు రాబట్టాలి తను.
"లేదు! చెప్పండి!" అంది. తన గొంతులో ఆతృత ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ.
"ప్రపంచంలో రోజురోజుకీ రోగ్స్ ఎక్కువై పోతున్నారు అమూల్యా! దుష్టులు, దుర్మార్గులు ప్రతియుగంలో, ప్రతి శతాబ్దంలో, ప్రతి దేశంలో పుడుతూనే ఉన్నారు. గిడుతూనే ఉన్నారు. వాళ్ళవల్ల అందరికీ కష్టాలు, కన్నీళ్ళు.
అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది అమూల్యా! ఇదివరకు ఈ వెధవలందరూ ఎవడికి చేతనా చేతనయిన వెధవపనులు వాళ్ళు చేస్తూ పొట్టపోసుకుంటుండే వాళ్ళు.
కానీ ఈమధ్య ఎయిడ్స్ ను మించిన మహమ్మారి ఒకటి మనుషులని తగులుకుంది."
"ఏమిటదీ?"
"ఆర్గనైజ్ డ్ క్రైమ్!"
"అంటే?"
"సమాజ వ్యతిరేక శక్తులు కలిసి తమ యుక్తులన్నీ కలబోసి జనంలో భయాందోళనలు రేకెత్తించి టెర్రర్ క్రియేట్ చేసి, ఇష్టారాజ్యంగా ఎలడం! ప్రభుత్వాలకి సవాలుగా దాదాపు ప్రభుత్వాల లాంటి పకడ్భందీ ఆర్గనైజేషన్స్ నడిపించడం! అమెరికాలో ఇటాలియన్ గుండాలు అందరూ కలిసి మాఫియా స్థాపించుకున్నట్లు, ఫ్రాన్స్ లో కోర్సికన్ బ్రదర్ హుడ్ ఉన్నట్లు, ఇప్పుడు ఆసియా ఖండంలో కూడా ఈ వేయిపడగల విషసర్పం బుసలు కొడుతోంది. తైవాన్ లో "బాంబూ యునియన్" తయారయింది. అది హాంగ్ కాంగ్ కి వ్యాపించింది. జూదం, స్మగ్లింగ్, వ్యభిచారం వీటిని కొనసాగిస్తూ అపారంగా ధనం సంపాదిస్తున్న ఈ గ్యాంగులు, పొలిటికల్ కనెక్షన్స్ తో మరింత పెరిగి, పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల పద్దతిలో మల్టీనేషనల్ లెవల్ కి వచ్చి, కబంధ హస్తాల్లో భూగోళాన్ని ఇరికించేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీళ్ళు మొదలెదుతూన్న కొత్త వ్యాపారాలు డ్రగ్స్, వీపరీతమైన వడ్డీలకు అప్పులివ్వడం, ఎలక్ట్రానిక్ గూడ్స్ కి కౌంటర్ ఫీట్లు తయారు చెయ్యడం లాంటివి. దూప్లికేటింగ్ మెషిన్లతో వీళ్ళు రికార్డు చేసిన దొంగ మ్యూజిక్ కాసేట్లే సంవత్సరానికి 40 మినియన్లు అమ్ముడుపోయి యాభై మిలియన్ల డాలర్లు సంపాదించి పెడతాయి. చివరికి వీళ్ళు ఇప్పుడు హాంగ్ కాంగ్ ఐ.బి. ఏమ్., ఏపిల్ లాంటి కంప్యూటర్లను కూడా దూప్లికెట్లు తయారుచేసే స్థితికి వచ్చారు అమూల్యా!"
అమూల్యా అరచెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని ఆవలింత అపుకుంది.
"బోరుగా ఉందా అమూల్యా?"
"లేదు! లేదు! వింటున్నాను చెప్పండి!"
నిజానికి ఆమెకీ ఈ వివరాలన్నీ వినడం విసుగ్గా ఉంది. కానీ వినక తప్పదు.
"వస్తున్న వార్తలను బట్టి ఆసియాలో చాలా గ్యాంగులు ఇప్పటికే పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ఆసియన్ గ్యాంగులు అమెరికాలో మాఫియాతో కూడా రెగ్యులర్ రిలేషన్ షిప్ పెట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది.
"మొత్తం ఎన్ని గ్యాంగులు ఉంటాయెమిటి?" అంది అమూల్య.
వప్పచేబుతున్నట్లు గడగడ చెప్పడం మొదలెట్టాడు తరుణ్. "తైవాన్ లోనే ఆరొందల గ్యాంగులు. జపాన్ లో రెండువేలు.......
మళ్ళీ ఆవలింత వచ్చింది అమూల్యకి.
"తమాషా ఏమిటంటే ప్రజలు ఈ గుండాలని గుండాలుగా కాక గుండె ధైర్యంగల హీరోలుగా చూడడం మొదలయింది. "యమాగుచీ - గుమీ", "ఇచివా - కాయ్" గ్రూపుల మెంబర్లు ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి వ్యభిచారంలోకి దింపుతారు. పెద్ద పెద్ద కార్పోరేషన్ లను కూడా బెదిరించి డబ్బు గుంజుతారు. అప్పులు ఇచ్చి ప్రాణాలు తోడేస్తారు.
అయినా వీళ్ళు హీరోలుగానే చలామణీ అవుతున్నారు కొంతమంది దృష్టిలో. ఎందుకంటే - ఒక ఉదాహరణ చెబుతాను. జపాన్ లోని యకూజా (ఎనిమిది తొమ్మిదీ, మూడు అని అర్ధం) గ్యాంగులో ఎవరన్నా రూల్స్ ని అతిక్రమించితే పాపపరిహారంగా తమ చిటికిన వేలు కోసేసుకుని మద్యంలో దాన్ని ఊరబెట్టి బాస్ కి పంపాలి.
ఇలాంటి చిత్రమైన పనులు చేసే మన నిఖిల్ కూడా పురాణ పురుషుడిలా ఫోజు కొడుతుంటాడు. ముర్ఖులయిన కొందరు మనుషులు గుడ్డిగా అతన్ని అనుసరిస్తూ ఉంటారు."
"కాదు! నిఖిల్ అలాంటి గుండా కాడు! నీకు తెలియదు తెలియకుండానే నిఖిల్ నిందించే అర్హత నీకు లేదు" అని ఎలుగెత్తి అరిచి చెప్పాలనిపించింది అమూల్యకి. కానీ తమాయించుకుంది. "మీరు చెప్పినవన్నీ ఎక్కడో తైవాన్ లో, హాంగ్ కాంగ్ లో, జపాన్ లో జరుగుతున్నాయి. మనకేం సంబంధం?"
తరుణ్ సంతోషం లేకుండా నవ్వాడు. "ఇది ఎలక్ట్రానిక్ ఏజ్ అమూల్యా! ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్స్, జెట్ ట్రాన్స్ పోర్ట్ ఎర్పాడ్డకా ప్రపంచం చిన్నదయిపోయింది. దేశాలు దగ్గరయి పోతున్నాయి. 'ఎక్కడో దూరదేశంలో జరుగుతోంది. మనకేం భయంలేదు' అని అనుకోవడానికి ఇవి ఇదివరకుటి రోజులు కావు అమూల్యా! ఇవాళ హాంగ్ కాంగ్ లో జరిగింది రేపు ఇండియాలో జరగవచ్చు. జరిగే సూచనలు ఉన్నాయి కూడా. మన జాగ్రత్తలో మనం ఉండాలి" అన్నాడు.
