Previous Page Next Page 
మారణహోమం పేజి 67

 

    అంత గందరగోళంలోనూ ఆమె గొంతు షార్పుగా, స్పష్టంగా వినబడింది అందరికీ.
    అ తర్వాత గబగబ నడుస్తూ మెట్లు ఎక్కడం మొదలెట్టింది అమూల్య.
    మెట్లు ఎక్కగానే ఒక కుర్రాడు ఆమెకి రెండు ప్లవర్ బొకేలు అందించాడు.
    ఒకదాని మీద "ఫ్రమ్ టి. విత్ బెస్ట్ విషెస్" అని ఉంది.
    వెంటనే గ్రహించింది అమూల్య అది తరుణ్ పంపి ఉంటాడు.
    రెండో బొకేలో కేవలం ఎర్రగులాబీలు ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుమ్టున్నాయి. దానికి స్లిప్ ఏదీ అటాచ్ చేసిలేదు.
    లేకపోయినా తెలిసిపోయింది అది నిఖిల్ పంపి ఉంటాడని.
    కొన్ని ప్రిలిమినరిస్ పూర్తయ్యాక కేసు అప్పటికి వాయిదా పడింది.
    ఆమె కోర్టు నుంచి బయటకు రాబోతుంటే ఎవరో ఆర్తిగా పిలిచారు.
    "ఆమ్మా!"
    ఆ గొంతులో చెప్పలేనంత భీతి ఉంది.
    ఆ స్వరం వినబదినవైపు వెదుకుతూ చూసింది అమూల్య. కొద్ది సెకండ్ల తర్వాత పట్టుబడిపోయిన అడవి జంతువులా గింజుకుంటున్న మనిషి కనబడ్డాడు. అతనికి రెండువైపులా ఇద్దరూ పోలీసులు ఉన్నారు.
    "నన్ను రక్షించామ్మ" అన్నాడు విరిగిపోయినట్లు వినబడుతున్న గొంతుతో నట్టుతూ.
    ఏమయింది?"
    "నేను నేరం చెయ్యలేదమ్మా. నేను......"
    "నోర్ముయ్ బే!" అని గద్దించాడు ఒక పోలీసు. తర్వాత అమూల్య వైపు తిరిగాడు. "మీరు పోచయ్యతో మాట్లాడాలంటే ముందుగాల పర్మిషన్ తీసుకోవాలమ్మ!" అన్నాడు.
    బలిపశువులా రంకెలు పెడుతున్న పోచయ్యని నడిపించుకుని వెళ్ళిపోయారు పోలీసులు.
    కాసేపు అటువైపే చూసి, తర్వాత గేటు వైపు నడిచింది అమూల్య. గేటు దగ్గర ఆమె కాళ్ళు ఆగిపోయాయి. అక్కడే నిలబడి రెండు నిమిషాలు అలోచించి వెనక్కి తిరిగివచ్చింది.
    పోచయ్యని కలుసుకోవడం కోసం .

 

                                                        * * *


    ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక పోచయ్యతో మాట్లాడడానికి అవకాశం దొరొకింది ఆమెకి.
    "చెప్పు!"
    "నేను నేరం చెయ్యలేదమ్మా?"
    "ఏం నేరం?"
    "తుపాకులు తయారుచెయ్యడం!"
    "నువ్వు తుపాకులు తయారు చెయ్యగలవా?"
    అతని చాతీ పౌరుషంతో ఉప్పొంగింది.
    "ఆ కాలంలో తుపాకులు చెయ్యడంలో నన్ను మించిన మొనగాడు లేకుండేనమ్మా!"
    "ఆ కాలంలో అంటే?"
    "నిజాం నిరంకుశ ప్రభుత్వంలోనమ్మా! రజాకార్లు రోజుకొక దారుణం చేస్తున్న రోజుల్లో, సత్యం చెబుతున్న రోజుకి రెండు తుపాకులు చేసి మనవాళ్ళకు అందించానమ్మా!"
    "మరి ఇప్పుడు కేసు ఏమిటి?"
    "ఇప్పుడు ఇంకెవడో బద్మాష్ గాడు బయల్దేరిండు! పక్కా నేను చేసిన లెక్కనే తుపాకులు చేస్తుండు! ఆ నేరం నా మీదకొచ్చే! సత్యం చెబితే పోలీసోళ్ళు  వినరాయే! నేనేం చేతునమ్మా?"
    నెరిసిపోయిన అతని కనుబొమల వైపు చూసింది అమూల్య.
    "ఆ పని చేస్తోంది ఎవరో నీకు తెలుసా తాతా?"
    ఆ పిలుపుకి అతను పులకించినట్లు చూశాడు.
    "పక్కాగా తెలియదుగానీ అనుమానం అయితే ఉందమ్మా!"
    "ఎవరు?"
    "అదిశేషు!"
    మరికొన్ని వివరాలు అడిగింది అమూల్య. అతను చెప్పిన సమాధానాలు శ్రద్దగా వింది.
    "తాతా!"
    "అమ్మా!"
    "నువ్వు చెబుతున్నదంతా నిజమేనా?"
    "ఒట్టు తింటానమ్మా!"
    "అయితే నీ తరపున నేను వాదిస్తా తాతా!"
    "చల్లగ ఉండు తల్లీ!" అని అతను ఆగి మొహమాటంగా అన్నాడు "అమ్మా! నా దగ్గర....."
    నవ్వింది అమూల్య. "డబ్బులేదు . అవునా?......"
    అతనూ నవ్వాడు "అవును తల్లీ!"
    "నువ్వేం చేస్తుంటావు తాతా?"
    "తిరిపెం ఎత్తుకు తింటూ ఉంటానమ్మా!"
    చివ్వున కళ్ళలో నీళ్ళు చిమ్మాయి అమూల్యకి. ఒకప్పుడు దేశం కోసం సర్వం ధారాదత్తం చేసిన మనిషి, ప్రాణాలకు తెగించి రజాకార్లకు వ్యతిరేకంగా ఆయుధాలు తయారు చేసినవాడు. ఇప్పుడు బిచ్చం ఎత్తుకు తింటున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS