Previous Page Next Page 
మారణహోమం పేజి 66

 

    ఆ రాత్రి ఒక్క నిమిషం పాటు కూడా నిద్రపోలేదు అమూల్య. మంచం మీద కూర్చుని , దిండ్లు ఒళ్ళో పెట్టుకుని, మోచేతులు వాటిమీద పెట్టి అరచేతుల్లో చుబుకం ఆనించి అంతరంగ మధనంలో మునిగిపోయింది.
    ఏం చెయ్యాలి ఇప్పుడు? తను నిర్మల తరపున డిఫెన్సు లాయర్ గా ఉండడం వల్ల నిర్మలకి కీడు ఎక్కువ జరుగుతుందా? మేలు ఎక్కువ జరుగుతుందా?
    తను గనక ఈ కేసులో ఇన్ వాల్వ్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వామనరావుగారు అది ప్రతిష్టకు సంబంధించిన విషయంగా తీసుకుని, నిర్మలని హంతకురాలిగా నిరూపించడానికి ఉరిశిక్ష వేయించడానికి సాధ్యమైనంత కృషి చేస్తారు.
    ఆఫ్ కోర్సు! అది అయన తప్పుకాదు! అది అయన విద్యుక్తధర్మం!
    తను ఈ కేసు నుండి తప్పుకుంటే తనమీద ఉన్న దురభిప్రాయం నిర్మల మీద కూడా కలిగే ప్రమాదం తగ్గవచ్చు. ఆత్మరక్షణ కోసం నాగేందర్ ని చంపానని నిర్మల చెబుతున్నది ఆయన నమ్మవచ్చు. నిర్మల తేలిక శిక్షతో బయటపడవచ్చు.

    అయిత్యే నిర్మలకు న్యాయం జరగటం కోసం తను ఓటమిని ఒప్పుకోవాలి. చేతులు జోడించి వామనరావు గారి ముందు నిలబడి "నేను ఈ కేసుని వదులుకుని పిరికిపందలా పారిపోతున్నాను. మీరు నా మాజీ క్లయింట్ నిర్మల మీద జాలి చూపించి ఆమెకు తక్కువ పడేటట్లు అనుగ్రహించండి!" అని ప్రార్ధించాలి.
    ఆ తర్వాత?
    ఆ తర్వాత మాత్రం నిర్మలకి పూర్తిగా న్యాయం జరుగుతున్నదని భరోసా ఏమిటి?
    ఒకప్పుడు ఈ దేశంలో ఉచితంగా, సముచితంగా దొరికిన విద్యా, వైద్యాలు ఇప్పుడు ఖరీదయిన అంగడి సరుకులుగా మారినట్లే. న్యాయం కూడా అట్టడుగు పొరలో ఉన్న నిర్మలలాంటి వారికి అందుబాటులో లేకుండా పోవడంలేదూ?
    కోర్టు ఖర్చులు, లాయరు ఫీజులు, వాయిదాలు, అప్పీళ్ళు, ధనవ్యయం, కాలహరణం టెన్షన్.........
    అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్ళకు తప్పితే వ్యాజ్యాలు అందరికీ కుదరవు. న్యాయం దొరకడం కష్టం. కాకపొతే ఈ సామెత ఎందుకు పుట్టుకు వస్తుంది.
 "కోర్టుకి ఎక్కినవాడూ గాడిద నేక్కినవాడూ సమానమే " అని? అలాగే "కేసు ఓడినవాడు కోర్టులో ఏడ్చాడు. కేసు గెలిచినవాడు ఇంటి కొచ్చి ఏడ్చాడు!" అన్న నానుడి ఎందుకు పుట్టుకొస్తుంది. న్యాయం ఖరీదు పెరిగిపోకపొతే?
    అయితే నిర్మలకు అండగా నిఖిల్ ఉన్నాడు. ఆమెకి డబ్బు ఇబ్బంది ప్రస్తుతానికి లేకపోవచ్చు.
    కానీ హటాత్తుగా పరిస్థితులు మారిపోతే? తన బ్రతుకే దినదినగండంగా బ్రతికే నిఖిల్ ఆమెకి సహాయపడలేని పరిస్థితిలో ఇరుక్కుపోతే?
    అప్పుడు నిర్మల పరిస్థితి నావలో తీసుకెళ్ళి సముద్రంలో వదిలేసినట్లు కాదూ?
    తెలతెలవారుతుండగా ఒక నిర్ణయానికొచ్చింది అమూల్య. ఏది ఏమైనా సరే!
తను ఈ కేసు వాదించి తీరుతుంది.
    వాదించి , గెలిచి తీరుతుంది.
    ఆ నిర్ణయానికి వచ్చాక ఆమె మనసు తేలికపడింది. ఫ్రెష్ గా ఉన్న మైండ్ తో ప్రపంచాన్ని మొత్తం జయించ గలనన్నంత ఆత్మవిశ్వాసంతో, కోర్టుకి వెళ్ళింది.
    కోర్టుకు వెళ్ళగానే ఆమెకు తెలిసిన మొదటి సంగతి.
    నిఖిల్ కేసు నడుస్తున్నప్పుడు విచారణ చేసిన జడ్జిగారే నిర్మల కేసు విచారణ చేస్తారు!
    ఆయనకి తను ఇంకా గుర్తు ఉండే ఉంటానని తెలిసు అమూల్యకి.
    ఏ కేసు అయినా ఓడిపోవడానికి ఇంతకంటె గొప్ప విషమపరిస్థితుల కాంబినేషన్ ఉంటుందా?
    హతాశురాలాయి పోయింది అమూల్య.

 

                                                          * * *


    కేసు సెన్సేషనల్ గా మొదలయింది. అమూల్య కోర్టు ఆవరణలో అడుగు పెడుతుండగానే లెక్కలేనంత మంది ప్రెస్ ఫోటోగ్రాఫర్లూ, విలేకర్లూ చుట్టుముట్టేశారు. అసంఖ్యాకమైనాన్ని సార్లు మెరుపులు మెరిసినట్లు కెమెరా ఫ్లాష్ లు వెలిగాయి.
    ఒక విలేకరి ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు. "ఏ ధైయిర్యంతో ఈ కేసు టేకప్ చేస్తున్నారు మీరు?"    
    "మా పక్షాన న్యాయం ఉందన్న ధైర్యంతో!" అంది అమూల్య. త్వరత్వరగా లోపలికి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో ఉంది ఆమె.
    "మీలో చాలా మొండితనం ఉంది. అవునా?"
    మాట్లాడకుండా చిరునవ్వు నవ్వింది అమూల్య.
    ఇంకో విలేకరి ముందుకు దూసుకొచ్చాడు.
    "ఈ కేసు ఓడిపోతే ఇంక మీకు పుట్టగతులు లేకుండా పోతాయని గ్రహించారా? ఇదివరకే ఒకసారి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది మీకు? చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్టు మొహం చూస్తున్నారు. శుభమా అంటూ మొదలెడుతూ ఇలాంటి అడుగు ఉడిపోయిన కుండలాంటి కేసు......"
    "ఏక్స్ క్యూజ్ మీ!" అని అతన్ని తప్పించుకుని ముందుకు నడిచింది అమూల్య.
    రెండు చేతులూ బార్లా జాపి ఆమెని అడ్డగిస్తున్నట్లు నిలబడి అడిగాడు మరో విలేకరి.
    "పబ్లిక్ ప్రాసిక్యుటర్ వామనరావుగారి మీద పంతం గెలవదానికే మీరు ఈ కేసు టేకప్ చేశారని ఒక టాక్ వుంది. మీ కామెంట్?!"
    "నో కామెంట్!"
    ఇంకో విలేకరి "వామనరావుగారి మీద కసి ఉందా?"
    చటుక్కున ఆగిపోయింది అమూల్య. "లేదు! నాకేవ్వరి మీదా కసి లేదు. కోపం లేదు. నేను పంతం కోసం ఏ పనీ చెయ్యడంలేదు. నా క్లయింట్ కి అన్యాయం జరిగిపోయింది. ఆమెకి న్యాయం కలగజేయ్యడానికి , కనీసం ఇంకా అన్యాయం జరిగిపోకుండా చూడాలని నా తాపత్రయం! నా ఆవేదన! నా ప్రార్ధన! నా వేడుకోలు!" అంది పెద్దగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS