నేను - పిలిచితే పలికే ఆర్తత్రాణ పారాయణుడిని!
నేను - పాపులని పగలూ రెయీ వెన్నాడి పనిపట్టే పవిత్రయజ్ఞంలో మునిగి పోయిన వాడిని! నేను!
నేను నేనే!
నిఖిల్!" అని పరవశంగా అనబోయి సకాలంలో ఆగిపోయింది అమూల్య.
"హలో! మీరా? ఎక్కడనుంచి? బాగున్నారా?"
తన తలకి ఉన్న బాండేజీని తడుముకున్నాడు నిఖిల్.
"నాట్ వెరీ బాడ్! నువ్వెలా ఉన్నావు?"
"నాట్ వెరీ బాడ్!"
"మన హీరో?"
"హీరో కాదు! విలన్!" అంది అమూల్య గొంతు తగ్గించి , నిఖిల్ కనబడిన మరుక్షణంలో అతన్ని దేహాన్ని ప్రాణాన్ని వేరు చేస్తానని తరుణ్ పట్టిన ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. ఆమె మెడమీద నూగులా ఉన్న రోమాలు లేచి నిలబడ్డాయి భయంతో.
చిన్నగా నవ్వాడు నిఖిల్. "అతని గొడవ అతనిది! కానియ్! నిర్మల కేసు నువ్వు డీల్ చేస్తున్నావటగా?"
ఆశ్చర్యపోయింది అమూల్య. ఇతనికి దివ్యదృష్టి లాంటి అతీతశక్తులు ఏమన్నా ఉన్నాయా?
"అవును!" అంది నెమ్మదిగా.
"థాంక్స్ డియర్!" అన్నాడు నిఖిల్.
అక్కడ "డియర్" అనేది వాడుక భాషలో చనువుని సూచించే వ్యవహారికపదం. దానికి ప్రత్యేకమైన అర్ధమేమీ లేదు.
కానీ ఆ పదం చాలాసేపటివరకూ ఆమె చెవులో వినబడుతూనే ఉంది. వెండిగంట చేసిన మృదుమధుర రాగం తాలూకు శబ్ద తరంగాలలా.
"హలో!" అన్నాడు నిఖిల్, అప్పటికి మూడోసారి. అమూల్య పలకకపోయేసరికి లైన్లోడిస్టర్బెన్స్ వస్తోందేమో అన్న అనుమానం వచ్చి ఆందోళన ధ్వనిస్తోంది అతని కంఠంలో.
"హలో!" అన్నాడు మళ్ళీ.
"హలో!" అంది అమూల్య తెప్పరిల్లుకుని.
"అమూల్యా! ఆర్ యూ అల్ రైట్?"
"నాట్ వెరీ బాడ్!" అంది నిస్పృహగా.
"నిర్మల నాకు చాలా ఆత్మీయురాలు అమూల్యా."
తనకు తెలీకుండానే నిటారుగా నిలబడింది అమూల్య. "ఓహ్! ఐసీ!" అంది మంచుముక్కల్లా ఉన్నాయి ఆమె మాటలు. ఆత్మీయురాలు! అవునా?
"తనకు నేను తప్ప మరెవ్వరూ లేరు ఈ లోకంలో! అన్న వెంకటేశం అని ఉన్నాడు కానీ పాపం అతను చాలా అమాయకుడు అమూల్యా! ఎప్పుడో సత్యకాలంలో పుట్టి వుండవలసిన వాడు."
"నేను చెయ్యగలిగినదంతా చేస్తాను. " "నిఖిల్", అనబోయి ఆగిపోయింది అమూల్య. ఓరకంటితో చుట్టుతా చూసింది.
"నిర్మల నరేందర్ ని చంపినప్పుడు నేను అక్కడే వున్నాను. అప్పుడే ఆమెని నాతొ తీసుకువచ్చేసి ఉండవలసింది. అప్పుడు ఇక కేసూ పాడూ ఏమీ ఉండేవికావు. కానీ అదే సమయంలో నన్ను తరుముతూ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళూ రావడం, ఆ గందరగోళంలో నేనూ, రాధా కొండల్లోకి పారిపోవడం జరిగాయి. కొండలకి అవతల వైపు మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళని పంపి నిర్మలని రప్పిద్డామనుకున్నాను."
"రాధ ఎలా ఉంది?" అంది అమూల్య అతని మాటలకు అడ్డం వస్తూ. రాధ! సన్నగా , బంగారు తీగలా ఉండే రాధ. సతతం నిఖిల్ ని నీడలా వెన్నంటి తిరిగే అదృష్టవంతురాలు రాధ! రాధ సంగతి అడుగుతుంటే అమూల్యకు గుండె గొంతుకలో కొట్లాడినట్లు అనిపిస్తోంది.
"రాధ! షీ ఈజ్ ఫైన్! బట్ షీ ఈజ్ బ్లడీ సిల్లీ గర్ల్! మచ్యురీటీ లేదు!" అతని గొంతులో కోపం లేదు. ఆ తిట్లలో కూడా రాధ అంటే అభిమానం ఒలికిపోతోంది. ఆ మాటలు అంటున్నప్పుడు రాధ అతని పక్కనే నిలబడి ఉండవచ్చునని, అతను ఆమె వైపు ఇష్టంగా చూస్తూ అలా మాట్లాడి ఉంటాడనీ ఊహించింది అమూల్య.
"కొండ అవతలకి దిగగానే ఒక వెధవ చేతిలో పడ్డాం నేనూ రాదా! బయట పడేసరికి ఆలస్యం అయిపొయింది. నిర్మల మీద కేసు పెట్టేశారు. కేసు గెలవాలి! నిర్మలను కాపాడాలి!"
"బిల్డింగ్ వాలా లేరా?"
"బిల్డింగ్ వాలాకి అనారోగ్యం! మెదడులో నీరు చేరింది. అయన కేస్ టేకప్ చేసే స్థితిలో లేడు!"
"నిర్మల ఆత్మరక్షణ కోసం హత్య చేసిందని నిరూపించగలిగితే శిక్ష పడకపోవచ్చు. కానీ కష్టం! నావల్ల ప్రయత్నలోపం మాత్రం ఉండదు!"
నిఖిల్ కొద్దిక్షణాలు ఆగి అన్నాడు.
"ఆమెని ప్రాసిక్యూట్ చేస్తోంది ఎవరో తెలిసే ఉంటుంది నీకు?"
"ఎవరు?"
ఇబ్బందిగా అన్నాడు నిఖిల్. "పబ్లిక్ ప్రాసిక్యుటర్ వామనరావు స్వయంగా .........."
స్థంభించిపోయింది అమూల్య.
పబ్లిక్ ప్రాసిక్యుటర్ వామనరావు.
ఇదివరకు నిఖిల్ మీద కేసు నడుస్తున్నప్పుడు తన బాస్ వామనరావు!
తను చేసిన తప్పు వల్ల కేసు పాడయిపోయి నిఖిల్ విడుదల కాగానే తన అంతు చూస్తానని శపథం పట్టిన మనిషి!
తడారిపోయాయి అమూల్య పెదిమలు!
వామనరావు ఇప్పుడు స్వయంగా నిర్మల కేసు టేకప్ చేస్తారా!
తన పేరు చెబితేనే చిరాకు పడతారు అయన!
తనకు తెలుసు! ఇప్పుడు నిర్మల తరపున తను వాదిస్తోందని తెలియగానే అది అయన చాలెంజ్ గా తీసుకుంటారు.
అది నిర్మల మీద కోపం కాదు!
తన మీద కోపం!
నిర్మల మీద నేరం రుజువు చేసి మాగ్జిమమ్ శిక్ష పడేటట్లు నిర్విరామంగా కృషి చేస్తారు. అది తన పవిత్ర కర్తవ్యంగా భావిస్తారు!
తనని అధఃపాతాళానికి తోక్కెయ్యడం వల్ల ధర్మాన్ని రక్షించినట్లవుతుందని తప్పకుండా భావిస్తారు.
ధర్మో రక్షతి రక్షితః
'చెవులు గింగురుమనేలా మళ్ళీ మళ్ళీ వినబడింది అదే ఉవాచ.
ధర్మో రక్షతి రక్షితః
ఏది ధర్మం!
ఏది అధర్మం!
ఎవరు ఏ తప్పు చేశారు?
ఎవరు ఎవరిని రక్షించాలి?
సొమ్మసిల్లిపోతున్నట్లు అనిపించింది అమూల్యకి. నీరసంగా ఫోన్ పెట్టేసింది. టేబుల్ దగ్గరికి నడిచి, మంచినీళ్ళ గ్లాసు మీద ఉన్న మూత తీసి, గ్లాసు పెదిమల దగ్గరికి తీసుకొచ్చింది.
గ్లాసు అడుగున వామనరావు మొహమే కనబడింది!
నీళ్ళు కదులుతూ ఉంటే ఆ మొహం కోపంతో వికృతంగా మారి పళ్ళు పటపట నూరుతున్నట్లు భ్రమ కలిగింది.
అమూల్యకి పగటిపూట పీడకలలు రావడం ఆరోజు నుంచే మొదలయింది.
* * *
