Previous Page Next Page 
మారణహోమం పేజి 64

 

    "వాడు నన్ను చెడగొట్టినవాడు. పంచాయితీ పెట్టించినా. నేరం చేసిన మాట నిజమే అని తెలిసినా వందరూపాయల జుర్మానాతో వదిలి పెట్టిండ్రు. విన్నావా అమ్మా! వంద రూపాయల జుర్మానా! దిక్కుమొక్కులేని ఆడదాన్ని చెడగొట్టినందుకు వంద రూపాయల జుర్మానా!" నిర్మల గొంతులో కసి పెరుగుతోంది. "నన్ను జోలె పట్టమని అందులో వేసిండు వందరూపాయలు! నేను జోలె కింద నుంచి కొడవలి తీసి ఒక్క దెబ్బతో వాడ్ని సఫా చేసినా!" నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తోంది నిర్మల.
    "నిర్మలా! నీకు అన్యాయం జరిగింది! నిజమే! కానీ అతన్ని ఎందుకు చంపావు? పగతోనా? ద్వేషంతోనా?"
    "కాదమ్మా! ప్రాణభయంతో చంపినా!"
    అంటే?"
    "నేను నరేందర్ ని చంపకుంటే నరేందర్ నన్ను చంపి ఉండేవాడమ్మా!"
    "ఎందుకలా అనుకుంటున్నావు?"
    "అనుకోవడం కాదమ్మా! అనుభవం! అన్నాయం జరిగిపోయింది నాకు! దానికి బదులుగా నాయం అని ఆశపడి పిచ్చిదాన్ని లెక్క పంచాయితీ కెళ్ళినా! తప్పు చేసినందుకు తాళి కట్టమంటారని అనుకుంటినమ్మా! ఎపుడయితే వాల్లు వంద రూపాయలు జుర్మానా లెక్క వేసి నా చేత జోలె పట్టించారో అప్పుడే నాకు తెలిసి పోయిందమ్మా. పంచాయితీ పెద్దలకు నామీద ఉన్న కోపం! అప్పుడే తెలిసిపోయింది నాకు ఇగ నన్ను బతకనివ్వరని! ఈసారి నన్ను చెడగొట్టే సమస్య లేదమ్మా చంపి పారేస్తారు! పంచాయితీ పెట్టమని అడగనీకి కూడా నేనుండ అప్పుడు నాకు తెలుసమ్మా! అందుకే అనుకుంటి! నేను చచ్చేట్లయితే ఈ బేయిమాన్ గాడ్ని ముందు చంపి తర్వాత నేను చస్త అని! అట్లనే చేస్తినమ్మా!"
    మొదటిసారిగా నిర్మల కళ్ళలో నీళ్ళు నిలబడ్డాయి.
    "ఊరుకో నిర్మలా!" అంది అమూల్య ఓదార్పుగా.
    పెదిమలను కొరికి పట్టుకుని దుఖం అపుకుంటోంది నిర్మల.
    "నువ్వు నరేందర్ ని కొడవలితో కొడుతూ ఉండగా ఎవరన్నా చూశారా?" అంది అమూల్య "హత్య" అనే మాట రాకుండా జాగ్రత్తగా పదాలని పేర్చి.
    విషాదంగా నవ్వింది నిర్మల.
    "ఎవరన్నా? ఊరు ఊరంతా కదిలి వచ్చి చూసిందమ్మా! పంచాయితీ - ఆ తర్వాత నేను ప్రాణాలు తియ్యడం!"
    హతాశురాలయింది అమూల్య.
    ఇంత పకడ్భందీగా ఉన్న కేసుని తను ఎలా గెలుస్తుంది? నిర్మలను ఎలా రక్షిస్తుంది?
    కానీ ఆమె మనసు ఊరుకోవడంలేదు. అన్యాయానికి బలయిపోయిన అడకూతురు నిర్మల!
    మానంతో బాటు ప్రాణం కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు తనని కాటేయ్యబోయిన పాముమీద ఒక్క వేటు వేసింది.
    అందుకని ఇప్పుడు కేసు!
    విషనాగులాంటి నరేందర్ ని చంపినందుకు నిర్మలకు ఉరిశిక్ష పడాలని!
    లేదా కనీసం ఆజన్మాంత ఖైదు విధించాలని!
    ఆ విధంగా న్యాయాన్ని రక్షించాలని!
    నిట్టూర్చి  నిర్మల వైపు చూసింది అమూల్య.
    "న్యాయం కోసం మనం పోరాడదాం నిర్మలా! గెలుస్తాం మనం నీ సహకారం ఉంటే!"
    చిత్రంగా చూసింది నిర్మల. "నా సహకారమా అమ్మా! నేనేం చెయ్యగలను తల్లీ! నేను ఫీజుగా ఇచ్చుకోనికి నా తాన పైసలు కూడా లేవే?"
    కడుపులో పేగులు ముడిపడినట్లయింది అమూల్యకి. "నాకు డబ్బు అక్కర్లేదు నిర్మలా? నువ్వు ధైర్యంగా ఉండాలి. కోర్టులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లు జవాబులు చెప్పాలి. తడబడిపోయి తప్పులు చెప్పకూడదు. విరక్తి చెంది పట్టు వదిలెయ్యకూడదు , సరేనా?"
    చదువుకున్న చెల్లెలివైపు చదువురాని అక్క చూసినట్లు కాసేపు అమూల్యవైపు తదేకంగా చూసింది నిర్మల. "నీ పేరేమిటమ్మా?"
    "అమూల్య!"
    రెండుసార్లు ఆ పేరుని మనసులోనే గునిమ్చుకుని తర్వాత పైకి అంది నిర్మల. "అమూల్యమ్మా, నాకోసం నీ టైం ఎందుకు ఖరాబు చేస్కుంటావు? నరేందర్ ని చంపేసినా! ఇగ నా మనసు చల్లగున్నది! నన్ను ఇక ఉరితీసినా ఫర్వాలే!"
    "నువ్వు నరేందర్ ని చంపలేదు! నిన్ను నువ్వు రక్షించుకోడానికి ప్రయత్నించావు అంతే! గుర్తుంచుకో!"
    సంతోషం లేని చిరునవ్వు నవ్వి అనాసక్తిగా తల పంకించింది నిర్మల.
    తగిన జాగ్రత్తలు చెప్పి అక్కడినుంచి కోర్టుకి వెళ్ళింది అమూల్య.
    కోర్టుకి వెళ్ళేసరికి బార్ రూంలో ఆమె కోసం టెలిఫోన్ రింగవుతోంది.
    కేసు గురించి ఆలోచిస్తూ రిసీవర్ క్రెడిల్ మీద నుంచి ఎత్తింది అమూల్య. "హలో!"
    "నేను!"
    తను ఎవరో స్పష్టంగా చెప్పలేదు అతను.
    కానీ ఆ గొంతుని కోటానుకోట్ల గొంతులలో కూడా గుర్తు పట్టేయ్యగలదు అమూల్య.
    నేను!
    ఆ గొంతులో ఎంత ఆత్మవిశ్వాసం! నేను - దీనులను ఉద్దరించడానికి దిగి వచ్చిన దేవదూతను!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS