Previous Page Next Page 
మారణహోమం పేజి 63

 

    అందమైన ఆడపిల్ల కన్నుగీటితే అయిసయి పోయినట్లు అయిసయి పోయాడు హాధీ.
    అది కనిపెట్టేసింది బ్యూటీస్పాట్.
    తనకి వచ్చిన ట్రిక్స్ అన్నీ త్వరత్వరగా ప్రదర్శించడం మొదలెట్టింది. అతనికి షేక్ హాండ్ ఇచ్చింది. పాదాలు నాకింది. వెల్లికిల్లా పడిపోయి నిశ్చలంగా కాసేపు ఉండి చనిపోయినట్లు నటించింది. గాల్లోకి ఎగిరింది.
    హాధీ నవ్వాడు.
    "దీన్ని కట్టేయ్యనా బాస్?" అన్నాడు ఒకతను.
    వెంటనే కుయ్యోమని హృదయవిదారకంగా శోకం పెట్టడం మొదలెట్టింది బ్యూటీస్పాట్.
    మిగతా అన్ని విషయాల్లోనూ రాతిగుండె హాధీది. కానీ కుక్కల విషయంలో మాత్రం అతనిది వెన్నలాంటి మనసు.
    "ఏడవకే పిచ్చిముండా!" అన్నాడు మురిపెంగా. అని అంతలోనే అనుమానమొచ్చినట్లు "నువ్వు ఇంతకీ మొగా, అదా?" అంటూ శంకానివృత్తి కోసం తొంగిచూసి "ఆడపిల్లవేనా? బాగుంది! బాగుంది! మా తోటంతా తిరిగేయ్యలని ఉందా ఏమిటి? సరే! ఏం చేస్తాం! తిరుగు! రేపటి నుంచి మాత్రం గొలుసు వేసి కట్టేస్టా! ఆ! ? ముందే చెబుతున్నా! రేపట్నుంచి ఈ నఖరాలు మన దగ్గర చెల్లవు? ఆ.....!" అంటూ అదేపనిగా బ్యూటీస్పాట్ ను ముద్దు చేస్తున్నాడు హాధీ.
    ఒక అనుచరుడు ఏదో చెప్పబోయి మళ్ళీ మనసు మార్చుకుని ఆగిపోయాడు. హాధీకి అడ్డు తగిలితే ఏమవుతుందో అతనికి అనుభవపూర్వకంగా తెలుసు.
    బ్యూటీ స్పాట్ మళ్ళీ మరోసారి హాధీ పాదాలు నాకింది.
    ఇష్టంగా దాని ఒళ్ళంతా నిమిరి అక్కడనుంచి కదిలాడు హాధీ.
    తలుపులు వేసి అతని అనుచరులు కూడా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళారు.
    సాభిప్రాయంగా రాధ వైపు చూశాడు నిఖిల్. రాధ ఏదో చెప్పడానికి నోరు రేరిచింది.
    పెదిమల మీద వేలు పెట్టుకుని "మాట్లాడవద్దు!" అని సైగ చేశాడు నిఖిల్. ఆ గదిలో కన్ సీల్డ్ మైక్రోఫోనులు ఉండవచ్చని అతనికి తెలుసు.
    రాధ చప్పున నోరు మూసేసుకుంది.
    అరగంట గడిచింది.
    మళ్ళీ అలారం మ్రోగింది ఆగకుండా పలు ప్రాంతాల్లో.
    అందరూ దడదడలాడుతూ పరిగెత్తుకు వచ్చారు. హాదీవాళ్ళ వెనకే తన మహాకాయాన్ని భారంగా మోసుకుంటూ వచ్చారు.
    రెండు నిమిషాల సేపు ఆ ప్రదేశాన్నంటా జాగ్రత్తగా పరిశీలించారు వాళ్ళు.
    ఈసారి కూడా అలారం కుక్కవల్లనే మ్రోగిందని తేలింది. అటువైపు పరిగెత్తుతూ వచ్చి తలుపుని తాకింది బ్యూటీస్పాట్. వెంటనే గయ్మని అలారం మోగింది.
    తన పెద్ద బొజ్జ ఊగిసలాడేటట్లు నవ్వాడు హాధీ. "ఏం? మమ్మల్ని ఈ రాత్రికి నిద్రపోనివ్వవా ఏం?" అన్నాడు బ్యూటీస్పాట్ తో. "ఇంతకీ నీ పేరేమిటీ?" అన్నాడు దానిమీదకు వంగి.
    తన తడి మూతితో అతని ముక్కుని తాకింది బ్యూటీ స్పాట్. "నాకే గనక మాటలు వస్తే నీతో గంటలతరబడి మాట్లాడేదాన్ని!" అన్నట్లు చూస్తూ.
    అరగంట లోపలే అలారం మళ్ళీ మోగింది.
    ఈసారి అనుచరులు మాత్రమే వచ్చారు. హాధీ రాలేదు. ఆ కుక్క చేస్తున్న ఆగడం చూస్తే చితకబాదాలనిపిస్తోంది వాళ్ళకి. కానీ అది తమ యజమాని ఇష్టపడిన కుక్క. అందుకని దాన్ని ఏమి అనడానికి సాహసించలేదు. ఏడవలేక నవ్వుతూ తిరిగి వెళ్ళిపోయారు.
    నలభై నిమిషాల తర్వాత మళ్ళీ అలారం మోగింది - ఐదోసారి!
     ఈసారి ఎవరూ పట్టించుకోలేదు దాన్ని. కుక్కే తలుపుని తాకి ఉంటుమ్డనుకున్నారు ఎవరికి వాళ్ళు.
    కానీ ఈసారి తలుపు దగ్గరికి వచ్చింది కుక్క బ్యూటీ స్పాట్ కాదు. దాని యజమాని నిఖిల్. అతను తలుపులని నిశితంగా పరిశీలించాడు.
    తర్వాత -
    అరచేతి అంచుతో ఒక్క దెబ్బ -
    అంతే! !
    ఆయువుపట్టుమీద కొట్టినట్లు సదలిపోయింది తాళం తాలుకు పట్టు!
    తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంది.
    అక్కడ ఉంది బ్యూటీ స్పాట్.
    తడితడిగా ఉన్న కళ్ళతో చూసింది నిఖిల్ ని.
    "థాంక్స్ బ్యూటీ!" అన్నాడు నిఖిల్ కృతజ్ఞతగా.
    మరునిమిషంలో వాళ్ళు ముగ్గురూ కాంపౌండ్ వాల్ వైపు పరిగెత్తడం మొదలెట్టారు.

            
                                                       * * *


    జైల్లో - విజిటర్స్ రూంలోకి తీసుకొచ్చారు నిర్మాలని. ఆమెను పరీక్షగా చూసింది అమూల్య. బాగా పొడుగ్గా , ఛామనఛాయలో ఉంది నిర్మల. అయిదు అడుగుల ఏడంగుళాలు ఉండవచ్చు. కాయకష్టం చేసి బతికే మనిషి కావడం వల్ల దృడంగా ఉంది శరీరం. ఆమె కళ్ళలో భయం కనబడడం లేదు. జీవితం మీద విరక్తి ఉంది. నిర్లిప్తంగా చూసింది అమూల్యని.
    "చెప్పమ్మా! ఈ హత్యానేరం నీ మీద అన్యాయంగా మోపారు. అవునా?" అంది అమూల్య మొదలెడుతూ.
    "కాదు! నేనే హత్య చేసిన మాట నిజమే!"
    "ఎవరిని?"
    "నరేందర్! దేవేందర్ కి తమ్ముడు కొడుకు"
    "ఎందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS