Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 63

 

    అది గమనించిన జయకృష్ణ వారందరికీ ఆటవిడుపు యిచ్చి వేశాడు. పనివారంతా డేరా దగ్గిర చేరిపోయి వంటపనిలో నిమగ్నులయినారు.
    జ్యోతి ఆ చోటు నించి అంగుళం మేర కదిలిరాలేదు. ఆమె కోసం జయకృష్ణ కూడా అలాగే కూర్చుండిపోయినాడు. ప్రొఫెసర్ శ్రద్దాదేవి త్రవ్వకం పని జరుగుతున్నా పరిసరాలను అత్యంత నిశితంగా పరిశీలించసాగింది.
    ఉడికీ ఉడకని స్వయం పాకాన్ని రుచి తెలియని ఆకలితో ఆరగించి పనివారంతా డేరాలలో నిద్రకు ఉపక్రమించారు. తిరిగి రెండు గంటలు దాటిన తరువాత త్రవ్వకం పనిని కొనసాగించాలి. అలసట వల్ల సుఖ మెరుగని నిద్రలోకి జారిపోయినారు వారు.
    త్రవ్విన చోట ప్రతి అణువూ జ్యోతి శ్వేతకి ఆత్మ రూపాన్ని చూచినట్టే చూస్తోంది అక్కడ ప్రతి అణువులోనూ ఆనంద మూర్తిలా శ్వేతకి రూపం ఆమెకు కన్పిస్తోంది.
    జయకృష్ణ ఆలోచనా మగ్నుడయి వున్నాడు.
    పరిసరాలను పరిశీలిస్తున్న ప్రొఫెసర్ శ్రద్దాదేవికి ఆ చుట్టూ ప్రక్కల గుర్తించదగిన వస్తువులేవీ కన్పించలేదు. అల్లంత దూరంలో తమ డేరా కన్పిస్తోంది. దానికి అవతల పనివారున్న డేరా! డేరా అవతల నించి ముగ్గురు వ్యక్తులు రావటం చూచిందామె. మొదట పనివారే అనుకుంది. కాని మరింత దగ్గర అయాక కాదని తెలుసుకుంది. అక్కడ నవాగతులు కన్పించే అవకాశాలు చాల స్వల్పం. ఎవరయి వుంటారా అని ఆలోచిస్తూ వుండగానే చేరువయినారు వారు.
    "నువ్వా మాధవా?" అంటూ నిశ్చేష్టురాలయింది శ్రద్దాదేవి. ఆ మాటలు తనలో అనుకున్నట్లే  బయటకు అనేసిందామె. జయకృష్ణ చివాలున తలఎత్తి చూశాడు.
    ఆ ముగ్గురు వ్యక్తులూ అతి కర్కశంగా కనిపించారు. ముగ్గురి దగ్గరా అత్యంత అధునాతనమయిన రైఫిల్స్ ఉన్నాయి. వారినించి రక్షణ కల్పించేందుకు నిద్రించే పనివారు లేచి వచ్చే అవకాశాలేమయినా ఉన్నాయా  అని ఆలోచిస్తున్నారు జయకృష్ణ. తాను వారిపై మెరుపు దాడి చేస్తే? తన సంగతి ఎలా ఉన్నా ప్రొఫెసర్ శ్రద్దాదేవి? ఆమె యింకా మునుముందు ఎందరిలోనో జ్ఞాన జ్యోతిని వెలిగించ వలసిన మహనీయురాలు.
    అందునించి కర్తవ్యం గురించిన నిర్ణయానికి రాలేక ఆలోచనలు పరుగెడుతున్నా పైకి స్థాణువులా నిలిచిపోయినాడు జయకృష్ణ! జ్యోతి తల ఎత్తి అయినా చూడలేదు. శ్వేతకి తాలూకు ఆత్మరూపాన్ని అణువు అణువులోనూ చూస్తూ వివశురాలాయివున్నది ఆమె. చెదరని పరధ్యాస!
    "మిస్టర్ జయకృష్ణా! నీవేదయినా చలాకీతనం చూపాలని ప్రయత్నించావా, ప్రాణాలు ఆసాంతమవుతాయి. ప్రొఫెసర్ శ్రద్దాదేవి! ఆనాడు నేను పంపిన ఉపాధ్యాయ మహాశయుడిని మోసగించినట్లు నన్ను మోసగించలేవు.
    ఇది నా జీవిత లక్ష్యం నేరవేరుతున్న తుది ఘడియ.
    లాంచిలో నిధులున్నాయని విని దాన్ని నా మనుషులచేత కొనిపించాలని ప్రయత్నించాను. లాంచి పేలిపోవటంతో ఆ ప్రయత్నం వృధా అయింది. తామ్రపత్రాలను దొంగలించినా, దారి తెలియక ఓడిపోయాను.
    కాని! నిధి గుర్తించిన పూర్తి సమాచారం ఇప్పుడు మీ అంతట ,మీరే చూపారు. మీ పనివారంతా , ఆహారంలో నేను కలిపించిన మందు తిని హాయిగా కొన్ని గంటల సేపు నిద్రపోతారు.
    ఈలోగా నా పని పూర్తి అవుతుంది. ఎదిరించాలని ప్రయత్నించకు" అంటూ ఆ ముగ్గురినీ అయుదాలతో వున్న ఇద్దరికీ అప్పగించి తాను త్రవ్వకం చేయసాగాడు మాధవ.
    కొంతసేపు త్రవ్వక ఒక యినుప ముద్ద గునపానికి తగిలినట్లుగా ఖంగుమని మోగింది.
    మాధవ అనందం పట్టలేక వికటాట్టాహాసం చేశాడు. యు=యినుపతోట్టిలా కన్పించిన దానిలో అపారమయిన నిక్షేపం కన్పిస్తోంది. దాన్ని వెతికి తీయాలంటే మరికొంచెం మాత్రమే త్రవ్వవలసి వుంది.
    మరొక్కసారి గునపం వేసి ఒక మట్టి అండను కదిలిస్తే యినుప  తొట్టి నిరాటకంగా పైకి వచ్చేస్తుంది. మరుక్షణం నించీ తాను కోటీశ్వరుడయి పోతాడు.
    అంతటి దురాశ నిండిన అనందం తో చివరి అండను కదిలించేందుకు మాధవ పలుగును బలంగా ప్రయోగించాడు.
    అండ అయితే కదిలింది కాని దాని క్రింద వున్న మహా సర్పం ఉఫ్ ....... ఊఫ్ ఫ్ మన్న వుత్కారంతో నిలువెత్తున లేచింది. నాలుక చీలి కలును బయటకు లాగుతూ పద్మంలా పడగ విప్పి కోపంతో ఊగిపోసాగింది.
    అసంకల్పిత ప్రతీకార చర్యలా భయవిహ్వాలుడై ఒక్క గెంతులో ఒడ్డుకి చేరిపోయినాడు మాధవ.
    ఈలోగా అది చేయవలసిన పని చేసింది. కసిగా కాటు కోసం ఓరగా పడగ విసిరింది. దాని  మృత్యు రూపాల వంటి కోరలు పూర్తిగా అతని శరీరాన్ని తాకితే చనిపోయేందుకు రెండు సెకనులు పట్టదు. కాని ఒక కోర చివరి భాగం రేగు ముల్లులా అతని చేతి మీద గీరుకుపోయింది. అందు నించి కొద్ది నిముషాలపాటు బ్రతికి ఉండే అవకాశం కలిగింది.
    "దురాశకివి తుది క్షణాలు మాధవా! బ్రతికి ఉండే ఈ కొద్ది నిముషాలయినా మనసు విప్పి మాట్లాడు" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి జాలి గొలిపేలాగా!
    తన అనుచరులను ఆయుధాలు పారవేయవలసిందని సైగ చేశాడు మాధవ! వారలా చేయగానే చెప్పసాగాడు.
    "ప్రొఫెసర్ శ్రద్దాదేవి! పవిత్రుడయిన తండ్రి కడుపునా పుట్టి, వేద విద్యామూర్తి అయిన నీ తండ్రి దగ్గర చదివి చివరకు నిగమాశర్మలా అయినాను నేను.
    శకుంతల మరణానికి కారకుడను అయినాను. ఆమె అంటే నీకు ఎంత ప్రేమనురక్తులో నాకు తెలుసు. అందు నించి చిరకాలంగా మిగిలి పోయిన రహస్యం నీకు చెప్తాను.
    నా బిడ్డను వధించాలన్న దురాశ నాలో ఉంది. అలా చేస్తే నటించిన ప్రేమానురాగాలకు సాక్ష్యాధారాలు లేకుండా పోతాయి. అందు నించి ఆమెను చంపాలనుకున్నాను.
    కాని నాలో మిగిలి వున్న మానవత్వామో , లేక రోజుల వయసు మాత్రమే ఉన్న పసికందు నన్నేమి చేయగలదన్న ఆహంకారమో నన్ను ఆ పని చేయనీయలేదు.
    కృష్ణలో లాంచిలో బిడ్డను వొదిలేసి ఎరుగని వాడిలా దిగిపోయాను. ఆ తరువాత ఆ బిడ్డను లాంచి యజమాని పెంచాడు. తాను పెంచిన తండ్రిని అని ఆమె కెన్నడూ చెప్పలేదు. ఆ బిడ్డే ఈ జ్యోతి.
    ప్రొఫెసర్! నిధుల మీద ఆశతో బిడ్డను కూడా వంచించి నేను తండ్రి అనే పదానికి తగనివాడను అయినాను. అందుకే ఆ కళింగ సర్పం నాకు సరి అయిన శిక్ష విధించింది.
    శకుంతల బిడ్డ అయిన ఈ జ్యోతి నా ప్రాణరహితమయిన శరీరాన్ని పూడ్చే గోతిలో పిడికెడు మట్టి వేయాలి.
    అదే నా తుది కోరిక." అన్నాడు మాధవ. అప్పటికే రక్తమంతా విషకలుషితమయిపోయింది. ముఖమంతా నల్లగా అయింది. కనుపాపలు పెద్దవి అయినాయి. పెదవులు పట్టు తప్పాయి.
    నోటి నించి నురగలు రావటం ప్రారంభమయింది.
    మరికొద్ది క్షణాల తరువాత ఒక పాపపు చరిత్రకు తెర వాలినట్లుగాఅతని రెప్పలు వాలినాయి.
    విష వాయువులు అణగారినట్లుగా  అతని శ్వాస ఆసాంతమయింది. శుభాశుభ కర్మల నిమిత్తం లేకుండా అవశ్యము అనుభోక్తవ్యమయిన మృత్యువు నీడ మహానీయంగా అతని పై వాలింది. మాధవ మరణించాడు.
    అతని మాటలు విన్న ప్రొఫెసర్ శ్రద్దాదేవి , జ్యోతి ఇరువురూ విభ్రాంతులయినారు. మరికొద్ది క్షణాల తరువాత ప్రొఫెసర్ శ్రద్దాదేవి కౌగిలిలో మాతృత్వం తాలుకూ మహానీయమయిన ప్రేమదారను ఆస్వాదిస్తూ ఒదిగిపోయింది జ్యోతి.
    శ్రీ బృందావన్ గోయెల్ సమక్షంలో అమూల్యమయిన నిధిని ప్రభుత్వ పరంగా ఇచ్చివేశాడు జయకృష్ణ. సేకరించి తెచ్చిన్ క్రేనియంలు శిలలు, బండ పూసలు వంటివి అన్నీ డిపార్టుమెంటుకు స్వాధీన పరచి హాయిగా ఊపిరి పీల్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS