Previous Page
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 64

 

    తిరిగి వెళ్ళి పోయేందుకు సంసిద్దురాలవుతోంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె శ్రీ బృందావన్ గోయెల్ యింట అతిధిగా వుంది. వారు అణువుల వరకూ కారులో తీసుకువెళ్ళి అక్కడ నించి లాంచిలో ఐలాండ్ మ్యూజియం కు వెళ్ళారు.
    ఇక్ష్వాకుల నాటి బౌద్దశిల్పాల రామణీయకతను మరొకమారు చూచి విభ్రాంత అయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. చితిక వేస్తె చక్కటి లోహ ధ్వనులను ప్రతిధ్వనించే నరసింహస్వామి శిల్పం వంటి హైందవ శిల్పాలు కూడా అనేకం వున్నాయి.
    "ఇక్ష్వాకు ప్రభువుల పాలనా కాలంలో స్త్రీలకు స్వేచ్చ ఉండేదట రాజుల శైవాన్ని ఆదరించితే రాణులు బౌద్దాన్ని ఆదరించేవారు. శాంతిచిరి, మహాదేవి భట్టారిక , రుద్రాధర, వాసిష్ట, మాద్రి వంటివారు పాలనా విషయాలలో రాజులకు సలహాలు కూడా యిచ్చి ప్రజల సుఖ జీవనానికి తమ వంతు సహకారం అందించేవారు.
    స్త్రీలు ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ , అత్తమామలకు సేవా ధర్మాన్ని నిర్వహిస్తూ , భర్తలకు ఒదిగి వుండటమే కాదు! అదే వారి జీవితాలకు చరమ లక్ష్యం కాదు.
    సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించే వారు. సమాజ శ్రేయస్సుకై తమ వంతు పాత్రను చిత్తశుద్దితో, దీక్షతో , సమర్ధవంతంగా నిర్వహించేవారు.
    హైందవ రాజ్యాలు అంతరించి బానిస పాలనలు ప్రారంభమయిన తరువాత స్త్రీలు అబలలుగా చిత్రించబడినారు. తమ వ్యక్తిత్వాలను పురుషాధిక్యతకు ఇచ్చాపూర్వకంగా బలి యిచ్చుకుని, అదే పతి భక్తీ , పాతివ్రత్యం అని భావించే స్థితికి వచ్చినారు.
    ఆత్మ లోకంలో దెబ్బతిని వ్యక్తిత్వాన్ని పురుషాధిక్యతకు బలి యిచ్చుకున్న తరువాత పతిభక్తి అయినా పాతివ్రత్యమయినా సరి అయిన లక్ష్యాన్ని చేరదు.
    మీ తరం యువతులయినా ధైర్య సాహసాలు, నిజాయితీ ----- వీటికీ మారుపేరుగా వర్ధిల్లాలి.
    జ్యోతీ! ముఖ్యంగా నీవు! శకుంతలకు ఆత్మశాంతి కలిగించాలంటే వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలగాలి" అని భోధించింది శ్రద్దాదేవి.
    ఆమె చెప్పిన మాటలు మననం చేసుకుంటూ యీరోజు తిరుగు ప్రయాణం గురించి ఆలోచిస్తుంది జ్యోతి.
    కావాలని ప్రయత్నించినా నిధులు వెలికి వచ్చాక శ్వేతకి ఆత్మ రూపం తాలూకు నీడ కూడా మనసులోకి రావట్లేదు.
    విజయపురి వొదిలి పోవాలంటే ఆమె కెందుకో దిగులుగా అనిపిస్తోంది.
    ఒంటరిగా ఆలోచనా మగ్నురాలాయివున్న జ్యోతిని కలియ వచ్చాడు జయకృష్ణ.
    "నా గురించే కదా ఆలోచిస్తున్నావు?" అన్నాడు కవ్వింపుగా.
    "కాదు! జయకృష్ణా! జీవితం పరుగెత్తే సెలయేరులాంటిది అన్నాడు గౌతమబుద్దుడు.
    యధార్దమయిన మాటలు మహనీయుల ప్రవచనం వల్ల మనసు మీద ముద్ర వేస్తాయి.
    సాగరసంగమానికై సాగిపోయే జలధారలు ఎన్నెన్ని చోట్లు చూస్తాయి! ఎన్నెన్ని దశలు మారుతాయి? కాని తుదకు సాగరంలో సంగమించి ప్రత్యేకతను కోల్పోతాయి. అనంతవారసిలో అంతర్భాగాలు అవుతాయి.
    మనవ జీవితం అంతే కదా!
    ఎక్కడో కృష్ణా జలాల్లో లాంచి నడుపుకుంటూ బ్రతికే నేను ప్రొఫెసర్ శ్రద్దాదేవి ప్రేరణతో ఒక అన్వేషణకు ఉపక్రమించాను. ఆ అన్వేషణలో నేను పొందగలిగిన దాని కన్నా పోగొట్టుకున్నదే విలువయినది" అన్నది జ్యోతి గంభీరంగా.
    నవ్వులాటకు ఉడికించేందుకు సంభాషణ ప్రారంభించిన జయకృష్ణ ఈ గంభీరమైన ధోరణీ చూచి తనూ సీరియస్ గా అయిపోయాడు.
    "జ్యోతీ, బ్రతుకు అంటే ఒక వెతుకులాట, ఇది ఆటగానే గడిచిపోవాలి. అందు నించి పొందగలిగినదేమిటి? పోగొట్టుకున్నది ఏమిటి ? ఎక్కువగా ఆలోచించకు" అన్నాడు.
    "జయకృష్ణా! నీవు నాకు తోడూ నీడ అయి నిలిచి ఎంతో మేలు చేశావు. ఇంక ఎక్కువ ఆలోచించటం గురించి అంటావా? అవును అడ మనసు నీకు అర్ధం కాదు .
    మగవారు సునాయాసంగా మరచిపోగలిగిన విషయా లేన్నింటిని ఆడవారు హృదయంలో పదిలపరచుకుంటారు. ముఖ్యంగా ఈ అన్వేషణలో పురోగమిస్తూ నీతో కలసి గడిపిన క్షణాలూ నా జీవితాంతం నేను మరువలేను.
    ఒక మంచి మిత్రునికి వీడ్కోలు చెప్తున్నా ఈ క్షణాలలో మనసు బరువేక్కదా?" అన్నది జ్యోతి దిగులుగా.
    "జ్యోతి డియర్! ఇప్పటి వీడ్కోలు చాలా తాత్కాలికమయినదని నీకు తెలియదా? ప్రొఫెసర్ శ్రద్దాదేవి నించీ, శ్రీ బృందావన్ గోయెల్ నించి ఆశీస్సులూ అనుమతీ లభించాక తిరిగి నీవు దక్షిణ విజయపురికి నా యింటికే వస్తావు కదా!" అన్నాడు జయకృష్ణ. జ్యోతి నిర్లిప్తురాలయింది. ఆమె చూపులు ఎక్కడో దూరంగా ఆకాశపు అంచులు నేలను ముద్దాడుతున్న దిగంతాలలో చూస్తున్నాయి. "అది అసాధ్యం జయకృష్ణా! ఆశించటం మనిషి వంతు. అది కాకుండా చేయటం భగవంతుని లీల? ఒక ఆపరాది తండ్రీకి, ఒక అనాధ తల్లీకీ పుట్టిన అదృష్టహీనురలిని నేను . ఉన్నతోద్యోగాలకు అధిరోహించే అపురూప మయిన భవితవ్యం నీది.
    "జయా ! నీ నుంచి నేను ఆశించేది సానుభూతి కాదు. స్నేహం మాత్రమే" అని చెప్పి దుఃఖ భారాన్ని దాచుకుంటూ లేచి వెళ్ళిపోయింది జ్యోతి. జయకృష్ణ మనసు మానని గాయంలా అయింది. అంతా విన్న తరువాత "పెళ్ళి చేసుకోకుండా ఏం చేయాలని నిర్ణయిన్చుకున్నావూ?" అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "అమ్మా! మీ పవిత్ర పాదాల సాక్షిగా నేను జయకృష్ణను ప్రేమించాను. పెళ్ళాడదామనుకున్నాను. నా జన్మ వృత్తాంతం తెలిశాక ఇటువంటి స్థితికి నేను అనర్హురాలను అనుకున్నాను.
    ఒకరి సానుభూతి ఆధారంగా సుఖప్రదమయిన జీవితాన్ని అందుకోవాలన్న దురాశ నాకు లేదు. నిండా బ్రతికితే మనిషిది నోరెళ్ళ అయిష్షు.
    అనంత కాలవాహినితో దాని నిడివి ఆల్పాతి అల్పం. అల్పా కాలంలో ఆసాంతమాయే బ్రతుకులో మచ్చలేందుకు? దురాశలెందుకు?? సానుభూతితో సంప్రాప్తమయే సుఖ జీవనం కన్నా, వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ఏటి వాలు నీటి బ్రతుకు నయం.
    "అది నేను కోరుకుంటున్నాను" అని చెప్పి ప్రొఫెసర్ శ్రద్దాదేవి పాదాలకు అల్లుకు పోయింది జ్యోతి. ఆమె శిరస్సున తన పాణివాలను వుంచి ఆశీర్వదించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి----
    "చిర యశో ప్రాప్తిరస్తు!!"

                                     ----సమాప్తం----


 Previous Page

WRITERS
PUBLICATIONS