Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 62


    ఔత్త రాహ సేనావాహిని అతలా కుతలమయింది.
    కాని వారు విరిసిన ఆయుధాల మధ్య వొంటరిగా చిక్కిన శ్వేతకి శరీరం తూట్లూ పడిపోయింది. నాగ రక్తంతో తడిసిన నాగ భూమి దీనురాలాయి శోకించింది.
    నాగుల కౌగిట్లో కృష్ణమ్మ సుస్థిర అయింది. అందు కారకురాలయిన శ్వేతకి మాత్రం అశువులు బాసింది.
    
                         *    *    *

    అద్భుతమయిన ఆ దృశ్యాలు అంతటితో ఆసాంతమయినాయి. తిరిగి జ్యోతి మనో పటలం మీద శ్వేతకి ఆత్మ రూపం ప్రత్యక్ష మయింది.
    "సోదరీ! చూచినావుకదా! ఔత్త రాహుల ఆగడం. నేను దాచిన నిధులు ఈ కృష్ణా తీర వాసులకే దక్కాలన్న నా ప్రయత్నం ఇంకా నేరవేరలేదు.
    అది నీవల్ల రేపటి ప్రొద్దు జరుగనున్నది. నిధులు బయటపడి కృష్ణా తీర వాసులయిన దాక్షిణాత్యులకు అవి దక్కాలి. అప్పుడే నా ఆత్మకు విముక్తి." అన్నది శ్వేతకి ఆత్మరూపం.
    నిద్రాముద్రలోనే గాడతరంగా దీర్ఘంగా నిట్టూర్చింది జ్యోతి!

                                 20

    తూరుపు తెల్లవారింది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి అందరికన్నా ముందుగా తాను లేచింది. అప్పుడప్పుడే రవి బింబం అరుణారుణంగా ఉదయిస్తోంది.
    ప్రాత సమీరాలు శరీరాలను తాకి సేద తీర్చుతున్నాయి. విచ్చిన మందారంలా పొడిచిన సూర్యుడు గుచ్చిన మల్లెచెండులాగా మారిపోతున్నాడు.
    శ్రద్దాదేవి లేవగానే ప్రక్కన జ్యోతి కనుపించకపోవటంతో రవంత కంగారుపడి డేరా వెలుపలకు వచ్చింది. అక్కడ ఎత్తయిన రాతి మీద తలవాల్చి నిద్రాముద్రితంగా పడి వుంది జ్యోతి.
    రవి కిరణాలు తాకుతున్న ఆమె కింకా మెళుకువ రాలేదు. లేలేత సూర్యాకాంతి చెక్కిళ్ళ పై పద్మరాగవర్ణలా తరళిస్తోంది. ఆమె వంక రవంత సేపు రెప్ప వేయక చూచింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. దగ్గరగా వెళ్ళి భుజం తట్టి నిద్రలేపింది.
    ఎర్రగా కిసుంక పుష్పాల్లా మండుతున్న కళ్ళు విప్పి చూచింది జ్యోతి. ఎదురుగా ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమెను చూడగానే అలసట అంతా తీరిపోయినట్లు హాయి అనిపించేలా నవ్విందామే.
    చివాలున లేచి వచ్చి తనకు తల్లి, గురువు , దైవం అయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి  పాదాలకు నుదురు తాకించి నమస్కరించింది.
    "అమ్మా! రాత్రి నిద్రపట్టక డేరా వెలుపలకు వచ్చాను . ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు.
    ఈ వేళ నిద్రలేవగానే మీ పవిత్ర పాదాలే నాకు కనిపించాయి. అందునించి నా బ్రతుకులో శుభోదయ మానుకుంటున్నాను." అన్నది జ్యోతి విశ్వాసపూర్ణస్వరంతో.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవికి జ్యోతి గురించి తెలుసు. ఆమె కదలిక లేమిటో, జ్యోతి ఆలోచనలు ఎలాంటివో ముందుగానే గ్రహించగలదామె. ఈ ప్రభాతసుందరవేళ నిద్ర లేవగానే అంత విశ్వాసపూర్ణమైన ధోరణిలో మాట్లాడగలుగుతోందంటే ఏదో జరిగి ఉండాలి. అదేమయి వుంటుంది?
    వయసొచ్చిన ఆడపిల్లలకు స్వభావసిద్ద మయిన శారీరక పరిణామాలు సంభవమవుతాయి - అలాగే మనసుల్లో తల్లికి కూడా తెలియపరచుకోలేని కొన్ని అరలు ఏర్పడతాయి.
    శ్రద్దాదేవి పెదవుల మీదికి చిరునవ్వు చింది వచ్చింది.
    "ఈ పూట నేనేరుగని మరో జ్యోతిని చూస్తున్నాను" అన్నదామె పరిశీలనలో విస్మయాన్ని మేళవించి చూస్తూ.
    "అమ్మా! ఇంతకాలంగా నున్న వెన్నాడిన శ్వేతకి ఆత్మరూపం ఇకనించి మనకు కన్పించదు" అన్నది జ్యోతి.
    "ఎలా చెప్పగలవు" అని అడిగింది ప్రొఫెసర్.
    "ఒక విస్పష్టమయిన సమాధానం అంటూ ఏమి చెప్పలేను. కాని నాకు అలాంటి విశ్వాసం కలుగుతోంది. ముందు నిధుల గురించి త్రవ్వకం పనులు సాగించాలి." అంటూ ఉద్విగ్నమయిన మూర్తిత్వంలో లేచి నిలబడింది జ్యోతి.
    జయకృష్ణ అప్పటికి లేచివచ్చి వారితో చేరిపోయినాడు. త్రవ్వకం పనులు ఎక్కడ ప్రారంభించాలన్న ప్రశ్నకు ముందుగా సమాధాన మిచ్చింది జ్యోతి.
    "రాత్రి కన్పించిన మహా సర్పం దూరిపోయిన బిలం త్రవ్వాలి. అక్కడ నిధులు లభిస్తాయని నా విశ్వాసం." అన్నదామె. అయితే ఆ నమ్మిక కలగటానికి కారణం యిదమితద్దమని మాత్రం తేల్చి చెప్పలేక పోయింది.
    విశ్వాసపూర్ణమయిన స్వరాన చెప్తున్న ఆమె మాటలను ఎవరూ కాదనలేకపోయినారు.
    దూరంగా డేరాలు దింపుకున్న డిపార్ట్ మెంట్ పనివారు కూడా అప్పటికి సాధనాలన్నీ తీసుకుని సంసిద్దులయినారు. జయకృష్ణ అజ్నల కోసం ఎదురు చూడసాగారు.
    అప్పటికే జ్యోతి సూచించిన చోటు నించే త్రవ్వకం ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినాడు జయకృష్ణ. ప్రొఫెసర్ శ్రద్దాదేవి, జ్యోతి వెంట రాగా అందరూ ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. జయకృష్ణ ముందుగా హెచ్చరించాడు.
    "ఫ్రెండ్స్! అర్కెలాజికల్ డిపార్ట్ మెంటులో పని చేసేందుకు సునిశితమైన ఊహాశక్తి కావాలి. వాస్తవాలను చిన్నిచిన్ని ఆధారాలతో గ్రహించగల నేర్పు కావాలి. అంతేకాదు! వాటితో పాటుగా ధైర్య సాహసాలుండాలి. తెగింపు ఉండాలి. చరిత్ర అవశేషాలు జనావాసాలలో మాత్రమే దొరకవు. అవి లభించే చోటు అరణ్యం కావచ్చు, సముద్ర తీరం కావచ్చు. కొండ ప్రాంతాలు కావచ్చు ఎక్కడయినా అర్కెలాజికల్ డిపార్టుమెంటు ఉద్యోగులు నేర్పుతో పనిచెయగలగాలి.
    ఒక్కొక్క చోట క్రూరమృగాలు తుఫానులో మండు టండలో ఎదురవుతాయి. ఒక్కొక్కచోట క్రూరమృగాలు దాడి చేస్తాయి. కొన్ని చోట్ల దొంగల బెడద కూడా ఎదురవుతుంది.
    ఎన్ని కష్టాలు ఎదురయినా చెక్కు చెదరని ధైర్యంతో అనుకున్నది సాధించగలగాలి.
    ప్రస్తుతాంశంలో ఇక్కడ మీరు త్రవ్వకం పని చేయబోతున్నారు. ఈ బిలంలో ఒక మహా సర్పం చేరి పోవటం నేను కనులారా చూశాను.
    జన సాంద్రత అంతగా లేని ఈ చోట ఒక్క సర్పమే కాదుబిలంలో అదే జాతి అనేక సర్పాలుండవచ్చు. మీలో ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా ఉండాలి.
    నేను కూడా మీతో పాటుగా త్రవ్వకం పనిలో పాల్గొంటాను. మెళకువతో ఈ పని పూర్తీ చేయగలిగితే మన డిపార్ట్ మెంటు ప్రపంచానికి రాక్షసి గుహలను గురింఛి సరి కొత్త వెలుగును చూపగలుగుతుంది.
    డిపార్టుమెంటు కి దక్కే ప్రతిష్ట ఏదైనా అది మన అందరిదీ!
    అందునించి పిరికితనం లేని జాగ్రత్తలో ఈ పనిని కొనసాగించండి" అంటూ ముందుగానే తానే బిలం ప్రక్కన చదునయిన ప్రదేశంలో పలుగు దింపాడు జయకృష్ణ.
    ఆ వెనువెంట పది పలుగులు భూమిలోకి దిగినాయి. భూమి తల్లిని త్రవ్వి పోయటం ప్రారంభించినారు. అనుక్షణం ఒక వినూత్న ఉత్సాహంతో పని చేశారు. ఒక పెద్ద వలయాకృతిలో నాలుగు అడుగుల మేర త్రవ్వకం పని సాగింది. అంతవరకూ అక్కడ నిధి తాలూకు చిహ్నాలేమీ కన్పించలేదు. అధిక మయిన శారీరక శ్రమ కావటం నించి పనివారు ఆకలితో శక్తిమాలిన వారయినారు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS