Previous Page Next Page 
మారణహోమం పేజి 62

 

    సంతోషం కనబడింది తరుణ్ మోహంలో.
    మర్నాడు కోర్టుకి వెళ్ళింది అమూల్య.
    ఆమెకి తగిలిన మొదటి కేసు నిర్మల! నరేందర్ అత్యాచారానికి గురి అయి, అతన్ని హత్య చేసిన నిర్మల!!


                                                         * * *


    హధీ ఇంట్లో
    పైకప్పుమీద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో తీరిగ్గా ఈదుతున్న ఒక అమ్మాయిని కాసేపు చూసి మొహం చిట్లించింది రాధ. నిఖిల్ వైపు తిరిగింది. నిఖిల్ ఇవేవీ గమనించడంలేదు. తోటవైపు చూస్తూ ఆలోచనలన్నిటిని ఒక బిందువు దగ్గర కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
    ఇక్కడ నుంచి తప్పించుకు బయటపడాలి.
    అదొక్కటే ఆలోచన!
    కానీ ఎలా!
    రాధ మాటలు కొద్ది సెకండ్ల తర్వాత గానీ అతని చెవులకి పడలేదు.
    "ఏమిటీ?" అన్నాడు తలతిప్పి చూస్తూ.
    "ఆ అమ్మాయికి బొత్తిగా సిగ్గు ఉన్నట్టు లేదు. ఒంటిమీద ఒక్క నూలు పోగన్నా లేదు చూడండి!"
    ఒక్కసారి కళ్ళెత్తి పైకి చూసి వెంటనే చూపులు మరల్చుకున్నాడు నిఖిల్.
    "బడితేలాగా ఎలా బరితెగించిందో!" అంది రాధ మళ్ళీ.
    నిఖిల్ మాట్లాడలేదు.
    "నేను మాట్లాడుతుంటే మీకు బోరుగా ఉంటుంది కదూ! ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాను నేను. ఇందాకటిలాగా.
    నవ్వి ఊరుకున్నాడు నిఖిల్.
    నా స్థితిలో మీరు ఉంటె తెలుస్తుంది. నాన్నగారు చనిపోయారు. నాకు ఇంక ఈ లోకంలో నా అన్న వాళ్ళెవరూ లేరు. ఈ హధీ చేతిలో నుంచి బయట పడే మార్గం కనిపించడంలేదు. చావు నిశ్చయమనిపిస్తోంది.
    నేను చావుకి భయపడడం లేదు నిఖిల్! చావు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన క్షణాలు చాలా ఉన్నాయి నాకూ, నాన్నగారికి కూడా! చచ్చి బ్రతికిపోయారు నాన్నగారు."
    "మీ నాన్నగారు చనిపోవడం పెద్ద ట్రాజెడీ రాదా! నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్ధం కావడం లేదు?"
    దిగులుగా తల ఊపింది రాధ. "వద్దు నిఖిల్! సానుభూతి చూపించవద్దు. కష్టాల పరంపరని వదిలించుకుని కనబడని లోకాలకు వెళ్ళిపోయిన కష్టజీవి మా నాన్న అనుకుని ఒక్క కన్నీటి చుక్క కార్చి ఇంక ఆయన్ని గురించి మర్చిపోండి నిఖిల్! రెండు కళ్ళు పోగొట్టుకుని ఈ లోకంలో అయన బతికి బాగుపడేదేముంది? అయన చనిపోయి స్వర్గానికి వెళ్లి ఉంటారు నిఖిల్! బ్రతికి ఉంటే భూమిమీదే దుర్భరమైన నరకం అనుభవించి ఉండేవారు. ఆ విధంగా అలోచించి గుండె రాయి చేసుకున్నాను నిఖిల్. ఇంక నాకు ఆ విషయాలు గుర్తుచెయ్యకండి!"
    అప్రయత్నంగానే రాధ చేతిని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా వత్తాడు నిఖిల్.
    "స్స్ స్స్ స్స్......" అంది రాధ. తలుపు మధ్య పడి నలిగిపోయిన ఆమె వేళ్ళు ఆ కాస్త వత్తిడినే భరించలేకపోయాయి.
    "సారీ!" అని కొద్దిగా వంగి నెమ్మదిగా వేళ్ళమీద ఊదాడు నిఖిల్.
    "ఇందుకే అడిగాను నిఖిల్ ! ఈ మాత్రం తోడు, ఈ మాత్రం ఊరట నాకూ ఉన్నాయని అనుకోవడానికి, నేను దిక్కు లేని చావు చచ్చానని నా ఆత్మ క్షోభించకుండా ఉండడానికీ మాత్రమే అడిగాను నిఖిల్ నన్ను పెళ్ళి చేసుకోమని! బట్టలు వదిలేసి పైన ఈదుతున్న ఆ అమ్మాయిని అసహ్యించుకున్నట్లుగానే సిగ్గువిడిచి పెళ్ళి చేసుకోమని అడిగిన నన్ను కూడా చీదరించుకుంటున్నారా నిఖిల్?"
    ఆమె దుర్భరమైన మానసిక వ్యధని భరిస్తోందని తెలుసు నిఖిల్ కి. ఆ బాధలో మనసు వశం తప్పి మాట్లాడవలసినవీ, మాట్లాడకూడనివీ కూడా కలిపి మాట్లాడేస్తోందనీ అర్ధమవుతోంది.

    కానీ తప్పు ఆ అమ్మాయిది కాదు!
    తలుపు వైపు చూశాడు నిఖిల్. తను తలుపులూ తాళాలు తెరవడంలో ఎక్స్ పర్ట్. ఈ తలుపులు తెరవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
    కానీ తలుపు దగ్గరికీ వెళ్ళీ వెళ్ళగానే అలారం మోగుతోంది. హధీ మనుషులు పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. ప్రయత్నం మొదలెట్టకముందే విరమించుకోవలసి వస్తోంది.
    అతని భ్రుకుటి ముడిపడింది. తప్పించుకునే మార్గాలకోసం మనసు తీవ్రమైన అన్వేషణ మొదలెట్టింది.
    ఇంతలో -
    చంటిపిల్లలు కెవ్వుమని ఏడుపు అందుకున్నట్లు అలారం మోగింది. చాలాచోట్ల ఆగకుండా మోగుతూనే ఉంది అది.
    సంభ్రమంగా చూశాడు నిఖిల్. ఏమయింది?
    అదే ప్రశ్న పైకి అడిగింది రాధ.
    పెదిమ విరిచాడు నిఖిల్.
    చాలా మంది హడావుడిగా పరిగెత్తుకు వస్తున్నట్లు అడుగుల చప్పుడు.
    "ఠక్" మని తెరుచుకుంది తలుపు. తుపాకులు గురిపెట్టి ఇద్దరు మనుషులు లోపలికి వచ్చారు.
    "నువ్వు వెధవ వేషాలు మానలేదు" అన్నాడు ఒకతను నిఖిల్ వైపు చూస్తూ ఉగ్రంగా అంటూనే ఉలికిపడి పక్కకి గెంతి కిందికి చూశాడు.
    అతని పాదాల దగ్గర ఉంది ఒక కుక్క బ్యూటీస్పాట్!
    సంతోషాన్ని అణుచుకుని దాన్ని గుర్తు పట్టనట్లు ఊరకే ఉండిపోయాడు నిఖిల్.
    బ్యూటీ స్పాట్ కూడా నిఖిల్ ని గుర్తుపట్టినట్లు ప్రవర్తించలేదు. పైగా అతను తనకి ఆజన్మవిరోధి అయినట్లు పెద్దగా మొరుగుతూ పళ్ళు భీకరంగా బయటపెట్టి అతని మీదకు ఉరకబోయింది.
    అప్పుడు -
    నిఖిల్ మీదకు  ఉరకబోతున్న బ్యూటీ స్పాట్ ని బలంగా పట్టుకుని ఆపింది ఒక పెద్ద చేయి.
    అది హాధీది!
    "డవున్ బాయ్! డవున్ బాయ్!" అంటున్నాడు హాధీ ఆ కుక్కతో.
    అది తోక ముడిచి కుయ్యోమని ఒకసారి అరచి హాధీ పాదాల దగ్గర చుట్టలా చుట్టుకుని పడుకుండి పోయింది.
    "ఎవరిదీ కుక్క?" అన్నాడు హాధీ.
    అతని అనుచరులు అందరూ తల అడ్డంగా ఆడించారు తెలియదన్నట్లు.
    నిఖిల్ కొద్దిగా కదిలాడు.
    వెంటనే అతని కండలు పీకేయ్యడానికి నిశ్చయించుకున్న దానిలా మోహోద్రేకంతో మళ్ళీ అతని మీదకు ఉరకబోయింది బ్యూటీ స్పాట్.
     హాధీ దాన్ని అతికష్టం మీద ఆపి వీపు నిమిరాడు . సిల్కులా ఉంది దాని బొచ్చు. కుక్కలంటే వెర్రి వ్యామోహం హాధీకి. దాదాపు అది అతనికి ఒక బలహీనత లాంటిది. అతని దగ్గర ఇరవై కుక్కలు ఉన్నాయి ఇప్పటికే.
    "ఎవరి కుక్క! పాయింటర్ అనుకుంటాను. మంచి జాతి కుక్క! తప్పిపోయి నట్లుంది" అన్నాడు హాధీ స్వగతంలా.
    తనని మెచ్చుకుంటూన్నందుకు సంతోషిస్తూన్నట్లు మిలమిల మెరిసే కళ్ళతో హాధీ వైపు చూసింది బ్యూటీ స్పాట్. గబగబ తోక ఆడించింది.
    అంతే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS