దురదృష్టవశాత్తు అతని సేనా సంపన్నత అధికాధికమయినది. అమేయమయింది . వారికి యుద్దమే ప్రధాన వ్యాపకం కావటం నించి ఆ విద్యలో వారు నిపుణులు.
మనం శాంతి కాముకులం. శాంతి జీవనానికి అలవాటు పడిన దాక్షిణాత్యులం. అందు నించి ఔత్తరాహుల\
వలె యుద్ద ప్రాతిపదికలు మనకు నిత్యవసరాలు కావు.
అధునాతన ఆయుధాలలో, యుద్ద విద్యలలో వారికన్నా అనగా ఔత్తరాహుల కన్నా దాక్షిణాత్యులయిన మనం వెనుకబడి ఉన్నమాట వాస్తవం.
జీవితావసరం , మనకు వేటను, వ్యవసాయాన్ని నేర్పించినట్లుగానే వారికి యుద్ద విద్యనూ నేర్పింది. అందు నించి ఆ విషయంలో వారు ముందున్నారన్నది తిరుగులేని కాదనరాని సత్యం. అయినప్పటికీ యుద్దంలో విజయానికి శక్తి సంపన్నత ఒక్కటే చాలదు. ధర్మ మార్గం కూడా వుండాలి.
మనమున్నది ధర్మ పక్షాన, ఔత్తరాహులు అధర్మంగా మనమీదికి ఎత్తి వస్తున్నారు కావటం నించి వారికి పరాజయం అనివార్యం! ఇంతకాలంగా వ్యవసాయపు పనిముట్లు ధరించిన మీ చేతులు నేడు ఖడ్గాన్ని , ధనుర్భాణాలను దరించవలసిన సమయం ఆసన్నమయింది. ధర్మమే మనకు తల్లి! ధైర్యమే తోడూ!!
"ఒక్కొక్క దాక్షిణాత్య యువకుడు ఒక్కొక్క రుద్రదేవుడు కావాలి. ఒక్కొక్క దాక్షిణాత్య యువతి ఒక్కొక్క మహా శక్తిగా మారాలి. దక్షిణాత్యులు స్వతంత్ర పరిరక్షణ సాగిస్తున్న పోరాటంతో మీరంతా విక్రమించాలి.
అందరికన్నా ముందు సేనా ముఖాన నేనుంటాను. కొద్ది నాళ్ళకే క్షుద్రకాళింగుని సేనలు కృష్ణా తీరాన మనసు డీ కొంటాయి. ఆ క్షణాలు ఆసన్నమయినప్పుడు మీరు స్థాయుర్యాన్ని కోల్పోకుండా పోరాడాలి. కృష్ణమ్మ నీలివర్ణం జలదారలు ఔత్తరాహుల రక్తంతో అరుణాంచితం కావాలి.
పందలు ఎవరైనా వుంటే ముందుగానే పారిపోండి. యుద్ద రంగంలో వెన్ను చూపి దాక్షిణాత్యుల పరువును ఔత్తరాహుల ముందు దిగాజార్చకండి" అంటూ వీరోచితంగా మాట్లాడింది శ్వేతకి. యువతీయువకులు ఉప్పొంగిపోయినారు. వారి రక్తం పరవళ్ళు త్రోక్కింది.
క్షుద్రకాళింగుని సైన్యాలు ఎప్పుడూ వస్తాయో అని ఎదురు చూసే స్థితికి వచ్చేశారు వారు.
దురదృష్టకరమయిన ఆ క్షణాలు రానే వచ్చాయి. అపార సేనావాహినితో కృష్ణమ్మ సరిహద్దులు త్రోక్కినాడు క్షుద్ర కాళింగుడు. శ్వేతకి శాత్రవుని పోలకువ సడికన్న మరు క్షణంలో చండికలా అయింది. ఆమె నేత్రాలు విశాలమయినాయి. పొగలు విరజిమ్మే అగ్ని పర్వతంలా అయిందామె.
"అరెరే! క్షుద్రుడా! కాళింగుడా! ఔత్తరాహుల అరచేతి కీలు బొమ్మా! నాగజాతి భూములపై నాగజాతీయుల రక్తం చిందించాలని వచ్చినావా? కృష్ణాతీర సారభూముల్లో సుసంపన్నమై వర్ధిల్లుతున్న మా జాతి జనులు పందులనుకున్నావా?
ప్రతిష్టత్మకమయిన యీ తుది సమరంలో నీ తలను కందుకంలా నేల మీదికి దొర్లించనిదె నేను వీడిన కొప్పు ముడివేయను. స్నానం చేయను, నిద్రాహారాలను విసర్జిస్తాను. నీ రక్తంతో కృష్ణమ్మలో పొంగిపొరలే జీవజల ధారలను అరుణారుణం చేయకపోతే నేను నాగాకన్యను కాను" అంటూ భీషణమయిన ప్రతిజ్ఞ చేసింది శ్వేతకి.
వెంటనే తాను సమీకరించిన దాక్షిణాత్య యువతీ యువక సైన్యాలకు ఆయుధాలను పంచి యిచ్చింది. వారందరినీ ఒక చోటకు కూర్చింది.
"నాతొ పాటు దాక్షిణాత్య రక్తం పంచుకుని పుట్టిన ఆత్మ బంధువులారా! ఆలకించండి . ఔత్తరాహుల ఆగడం ప్రారంభమయింది. నాగుల కౌగిలిలో ప్రశాంతంగా తూర్పు సముద్రానికి తరలిపోతున్న కృష్ణమ్మ కల్లోలితమయింది.
దక్షిణాతుల్య స్వేచ్చ స్వతంత్యాలు ఔత్తరాహులచే హరించి వేయబడిన తరువాత ఇంక ఈ తనువూలెందుకు? ఇంక ఈ ప్రానాలేందుకు! ఇంక ఈ బ్రతుకులెందుకు?
"స్వాతంత్యం పరిరక్షణకై తుది సమరం మొదలు పెట్టండి. మన సంపదలన్నింటినీ నేల మాళిగలలోకి తరలించండి. వాటికి నాగులను కాపుంచండి. యుద్దంలో విజయం దక్షిణాది వారికి దక్కిందా -- మన సంపదలు మనకుంటాయి.
ఒక వేళ ఔత్తరాహుల ఔదాత్యానికి మన ప్రాణాలు బలి అవుతాయా ఆ సంపదలు ఔత్తరాహులకు దక్కరాడు. అందు నించి వాటికి నేలమాళిగలు త్రవ్వించండి. వాటిలో మన సంపదలు నిక్షిప్తం చేయండి. భావితరాల మన వారసులకయినా దక్కుతాయి! తెల్లగా మల్లె చేరులా వున్న సూర్యుడు మందారంలా అయిపోయేలోపుగా ఈ కార్యక్రమం ముగించాలి. సంధ్యా సమయం దాటి రాత్రి ఘడియలు ప్రవేశించగానే యుద్ధం సమారంభమవుతుంది. నాగుల కౌగిలిలోని కృష్ణమ్మ సరిహద్దుల్ని రణ స్థలులు అవుతాయి. ఉద్యమించండి. ఉత్సాహంతో పురోగమించండి" అంటూ వీరలాసం చేసింది శ్వేతకి.
ఆమె యిచ్చిన అజ్ఞలన్నీ అసుర సంధ్యకు ఆసాంతమయినాయి. నిధులన్నీ నేల మాళిగలలో నాగుల రక్షణలోకి వెళ్ళినాయి. యువతీ యువకులు ఆయుధాలు ధరించి ఔత్తరాహుల ఆగడాలను ఎదిరించేందుకు సన్నద్దులయినారు.
అమరాసంధ్య ఆసాంతమయింది. రాత్రి ఘడియలు ప్రారంభించినాయి. నాగుల కౌగిట్లో వున్న కృష్ణమ్మ సరిహద్దులన్నీ సంగ్రామ భూములయినాయి.
దాక్షిణాత్యులకు , ఔత్తరాహులకు సహజమయిన , చారిత్రకమయిన పోరాటానికి శుభారంభమయింది.
ఔత్తరాహుల నీడలో స్వధర్మానికి హాని తలపెట్టిన కుంభవతీ నగర ప్రభువు క్షుద్ర కాళింగుడు సైన్యాలపై శ్వేతకి నాయకత్వంలోని దాక్షిణాత్య సైనికులు తారసిల్లినారు.
ఔత్తరాహ, దాక్షిణాత్య సైన్యాలు డీ కొన్నాయి.
నేరుగా శయనించి వున్న కాళింగుని పట కుటీరానికి వెళ్ళింది శ్వేతకి. అడ్డు నిలిచిన వారి అంతం చూసింది.
రుద్ర కాత్యాయని వలె వెళ్ళి క్షుద్రకాళింగుని వక్షస్థలిపై వామ పాదాన్ని ఆనించి "క్షుద్రుడా ! కాళింగుడా! ఔత్తరాహుల అరచేతి కీలుబోమ్మా! స్వధర్మానికి హాని తలపెడతావా? ఔత్తరాహుల మోచేతి నీళ్ళు త్రాగి దాక్షిణాత్య సోదరలకు ద్రోహం తలపేడతావా?
నేటితో నీ ప్రాణాలు కృష్ణ పాలు చేస్తాను. నీ శరీరాన్ని నాగుల కౌగిట్లో పరవశించే కృష్ణమ్మ పెంచుకున్న మొసళ్ళు పీక్కుతింటాయి " అంటూ త్రిశూలాన్ని అతని కంఠానికి అనిమ్చింది శ్వేతకి .
క్షుద్రకాళింగుడు విభ్రాంతుడే కాదు భయ భ్రాంతుడయినాడు. అతని పురుషాధిక్యత మాత్రం ఆహంకరించింది.
"ఓసి ద్రావిడ వనిత! రాత్రి యుద్ధం చేస్తావా? అందుకే నిన్ను నిశాచారి అన్నారు. రాక్షసి అన్నారు. ద్రావిడులను దశ్యులన్నారు. పగటి యుద్ధం చేయజాలని పందులాయి రాత్రి యుద్ధం ప్రారంభించారా? ఔత్తరాహులయిన ఆర్యుల యుగయుగాల సంప్రదాయంగా పురోగమించిన యుద్ద నీతి మీ రాత్రించరులకుటిల నీతిముందు తల దింపుతుందనుకున్నావా?" అంటూ ఇంకా ఏవో పురుషాధిక్యత, ఆర్య పక్షపాతమూ రంగరించిన ప్రల్లదనాలు పలుకసాగాడు క్షుద్రకాళింగుడు.
శ్వేతకి ఇంకా అతనికి అటువంటి అవకాశం ఇవ్వలేదు.
ఆమె త్రిశూలపాణిని. త్రిశూలం అతని రక్తాన్ని రుచి చూసింది. అతడు అర్తుడై ఆర్తనాదం చేశాడు. అశువులు ఆసాంత మయినాయి.
