Previous Page Next Page 
మారణహోమం పేజి 61

 

    ఎర్రటి ఆమె పెదవులు నిరుత్సాహాన్ని సూచిస్తూ కొద్దిగా కిందికి వంపు తిరిగివున్నాయి. ఆ పెదిమలకు తన పెదిమలు అద్ది తన పెదిమల మీది చిరునవ్వుని ఆమె పెదిమల మీదకి బదిలీ చేయాలన్న కోరిక బలీయంగా కలిగింది అతనికి. టేబుల్ మీద పెట్టి వున్న నాజూకైన ఆమె చేతిని, పొడుగాటి వేళ్ళను , మణికట్టు దగ్గర ఆమె మేని ఛాయతో పోటీ పడలేక వెలతేలా పోతున్న మేలిమి బంగారపు గాజులనూ మృదువుగా స్పృశిస్తూ "ఎందుకు అమూల్యా అంత దిగులు? మీకు నేను, నాకు మీరూ తోడువుంటే మహోత్సాహంతో ప్రపంచాన్ని జయించేసి , మధురాతి మధురంగా మలచుకుంటాం మన జీవితాన్ని! మొదటిసారి మిమ్మల్ని కోర్టులో చూసినప్పుడు మీ మధురోష్టాల మీద మెరుస్తూ వుండిన సురుచిర దరహాసానికి మళ్ళీ పునరుద్దీపనం చెయ్యండి.
    మీరు అందంగా కనబడితేనే నాకు ఆహ్లాదంగా వుంటుంది అమూల్యా!" అని చెప్పాలని కోరిక కలిగింది.
    ఎప్పుడో చిన్నప్పుడు మనసుని చంపేసుకుని, మనుషులని చంపే ఈ వృత్తిలోకి రాకముందు కవితలని, కలలని కలబోసి ఊహల పందిరి అల్లుకునే ఆ రోజుల్లో ఇలా ఆలోచించేది ఈ మనసు. ఆ తర్వాత మనసుని మిలిటరీ డిసిప్లీన్ లో పెట్టాడు తను. తెల్లవెన్నెల, పిల్లతెమ్మెర లాంటి పదాలు మరపుకొచ్చి లేసర్ గన్స్, మెర్క్యురీ బుల్లెట్సు , మైండ్ బెండింగ్ డ్రగ్స్ లాంటి మాటలు వాడుక పదాలయిపోయాయి.
    మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ అమ్మాయిని చూశాక, వాడిపోతున్న మోడుని వసంతం ఆవహించి చిగురింపజేసినట్లు -
    "అమూల్యా!" ఆర్ద్రతతో మృదువుగా వుంది అతని గొంతు. "ఈ జీవితం  నిత్య నూతనం అమూల్యా! ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళు! కొత్త సమస్యలు! కొత్త సంఘర్షణ! కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు. "ఈ జీవితంలో నేను ఓడిపోయాను" అని, 'ఈ అధ్యాయం యింక ముగిసిపోయింది' అని అనుకుంటూ నిరాశావాదంతో కొట్టుకు పోతుంటారే, అలాంటి వాళ్ళంటే నాకు చాలా చులకన అభిప్రాయం వుంది అమూల్యా! పాత సవాళ్ళకు కొత్త జవాబులు చెప్పగలిగిన వాళ్ళంటే నాకు యిష్టం. వాళ్ళలో మీరు ఒకరని నాకు గట్టి నమ్మకం కూడా! మీరు తిరిగి ప్రాక్టీస్ మొదలెట్టాలి అమూల్యా! మొదలెట్టి, మీ ఫీల్డులో మీరు మరో దృవతారలా వెలిగిపోవాలి.
    అనాసక్తిగా తల అడ్డంగా ఆడించింది అమూల్య. మీరు ఎన్నయినా చెప్పండి తరుణ్! నాలో ఇదీ అని ఇదమిద్దంగా చెప్పలేని జంకు, ఫీయర్ ఆఫ్ కాంప్లెక్స్ ఏర్పడి పోయింది. కోర్టులూ, నల్లకోట్లూ చూస్తేనే వికలమయిపోతోంది మనసు."
    సానుభూతిగా చూశాడు తరుణ్. "మరి మీరేం చేయదలుచుకున్నారు?"
    "మీకు మీ పనుల్లో నాకు చేతనయినంత సాయం చేస్తూ వుండలేనా?" అంది క్రీగంట అతన్ని చూస్తూ.
    మనసులోనే నవ్వుకునాడు తరుణ్. ఎస్పి యనేజ్, కౌంటర్ ఎస్ఫి యనేజ్, గూడచారులు, గుండెలు తీసిన బంట్లు మధ్య ఈ అమ్మాయి ఏం బతకగలుగుతుంది? అలా ఉండగలిగే అమ్మాయిలు కూడా ఉంటారు. నో డవుట్! కాని వాళ్ళ తరహానే వేరుగా వుంటుంది. నీళ్ళలో ఈదే చేపపిల్లల్లాగ, గాల్లో ఎగిరే పిల్లపక్షులలాగా వాళ్ళు "నాచురల్స్!" ఈ అమ్మాయి ఈ అమూల్య అలాంటి రకం కాదు. నిఖిల్ దగ్గర నిలవలేక పారిపోయి వచ్చింది తను. కానీ ఏస్ లాయర్ అయ్యే సూచనలు ఉన్నాయి. అదీ కాకపోతే - అతని పెదిమల మీదికి అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది - అదీ కాకపోతే అమూల్య మంచి హవుస్ వైఫ్ కావచ్చు. ఆదర్శ గృహిణిగా బాగా సూటవుతుంది ఈ అమ్మాయి.
    అతని మనోనేత్రం ముందు అమూల్య మెదిలింది. చిన్నపిల్లవాడిని పేరాంబులెటర్ ఎక్కించి ఇంటిచుట్టూ వున్న లాన్ లో తిప్పుతోంది తను. ఆ తోపుడు బండిలో వున్న చిన్నపిల్లాడు అచ్చం తనలాగానే వున్నాడు. బుల్లిసూటు, చేతిలో చాకొలేట్ బార్ అంత చిన్న గన్!
    ఆలోచనలని అదుపులో పెట్టుకుంటూ అన్నాడు తరుణ్. "మాకు ఈ వృత్తిలో కఠోరమైన శిక్షణ యిస్తారు అమూల్యా! దానిలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటో తెలుసా? భయాన్ని పోగొట్టడం!
    కాళ్ళకీ, చేతులకీ బంధం వేసి జారుడు వందలాంటి దానిమీద నుంచి జారుతూ నీళ్ళ కొలనులోకి తలకిందులుగా వెళ్ళిపోయి, నీళ్ళ అడుగునే బంధాలు వదిలించుకుని బయటికి రావడం ట్రెయినింగ్ లో ఒక అయిటమ్. మీలాంటి ఒక అమ్మాయి బంధాలు వదిలించుకోలేక, నీళ్ళలో నుంచి బయటకు తేలలేక , ఉక్కిరిబిక్కిరి అయిపొయింది. కొద్ది సమయం తర్వాత ప్రమాదాన్ని శంకించి నీళ్ళలోకి దూకేసి ఆమెని రక్షించి బయటకు తెచ్చాడు ట్రెయినర్.
    ఆమె కాస్త సేదదీరగానే అతను మొదటగా చేసిన పని ఏమిటో తెలుసా?"
    ప్రశ్నార్ధకంగా చూసింది అమూల్య.
    "వెంటనే ఆమె కాళ్ళకు మళ్ళీ బంధాలు వేసి నీళ్ళలోకి తోసేయ్యడం! నీళ్ళలో జరిగిన ఆ సంఘటన తాలూకు షాక్ ఆమె మనసులో హత్తుకుపోయి, నీళ్ళంటే శాశ్వతమైన భయం కలుగకుండా ఉండడం కోసం అలా చేశాడన్న మాట!
    రెండోసారి నీళ్ళలోకి వెళ్ళీ వెళ్ళగానే బంధాలు సునాయాసంగా వదిలించుకుని గోల్డ్ ఫిష్ లాగా ఈదుతూ పైకి వచ్చేసింది ఆ అమ్మాయి. అలాగే అమూల్యా మీరు కూడా!"
    "అయితే ప్రాక్టీస్ మొదలెట్టమంటారు!"
    "అవును. కనీసం మీరు ఊహించుకుంటున్న ఫియర్ కాంప్లెక్స్ , జంకు వదిలేటంతవరకూ!"
    చేతివేళ్ళవైపు చూసుకుంటూ కొంచెం సేపు ఆలోచించింది అమూల్య. తర్వాత నిదానంగా అంది. "సరే! మీరు చెప్పినట్లు చేస్తాను. కానీ బాక్ టూ స్క్వేర్ ఏ! నా దగ్గరికి క్లయింట్స్ ఎవరు వస్తారు?"
    నవ్వాడు తరుణ్.
    "ఈ ఇంగ్లిషు సామెత మీరు వినలేదా అమూల్యా! మహమ్మద్ దగ్గరికి కొండ రాకపోతే మహమ్మదే కొండ దగ్గరికి వెళ్తాడట! అలాగే మీ దగ్గరికి క్లయింట్స్ రాకపోతే మీరే క్లయింట్స్ దగ్గరికి వెళ్తారన్న మాట!"
    అది వినగానే హటాత్తుగా ఉత్సాహం తొంగిచూసింది అమూల్య మొహంలో.
    "డన్! నేనే వెళతాను" అంది లేస్తూ.
    "ఇప్పుడే?"
    నవ్వి అక్కడనుంచి కదలబోతు అంది అమూల్య "మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం ఆజన్మాంతం గుర్తు పెట్టుకుంటాను మిస్టర్ తరుణ్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS