ఇద్దరూ ఒకేసారి బలమంతా ఉపయోగించి భైరవుడి విగ్రహాన్ని ముందుకు వంచారు.
నెమ్మదిగా ఒరిగిపోయింది విగ్రహం.
దానిని నేలమీద పడుకోబెట్టి , ఆయాసం తీర్చుకుంటూ తిరిగి చూశారు ఉదయార్కర్, బ్రహ్మచారీ.
భైరవుడి ప్రతిమకి వెనక వున్న అర్చికి అమర్చి ఉన్న రాతి పలకలు నెమ్మదిగా పక్కకి తప్పుకోవడం మొదలెట్టాయి.
లోపల ఒక మార్గం కనబడింది.
"పదండి" అన్నాడు బ్రహ్మచారి.
అడుగులో అడుగువేస్తూ ఆ గుహా ద్వారాన్ని సమీపించారు అందరూ. లోపల కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి.
తన భుజానికి వేళ్ళాడుతున్న సంచితీసి , వేడికి , అందులో నుంచి ఒక చిన్న పాత్రను తీశాడు బ్రహ్మచారి. దానిలో ఒక పదార్ధం ఉంది. ఒక వత్తి కూడా ఒకటి వేసి ఉంది దానిలో.
ఆ పదార్ధం ఏమిటో ఉదయార్కర్ కి అర్ధం కాలేదు, "ఏమిటది?" అన్నాడు అనుమానంగా.
"లక్ష్మికాపు అంటారు దీన్ని?" అన్నాడు బ్రహ్మచారి.
"లక్ష్మి కావా? అంటే?"
చెప్పడం మొదలెట్టాడు బ్రహ్మచారి "కొన్ని నిధి నిక్షేపాలు విషలిప్తమై ఉంటాయి. అంటే ఆ నిధి నిక్షేపాలను ఎవరన్నా సమీపించగానే , లేదా వాటిని కదిలించగానే విషవాయువులు వెలువడే ఏర్పాటు చేసి ఉంటుంది. లక్ష్మికావు వెలిగిస్తే అది విషవాయువులని హరించి వేస్తుంది. వెలుగు వచ్చి మనకు దారి చూపిస్తుంది కూడా. అయితే ఒక విషయం! ఇది చాలా ఖరీదు.
తులం రెండు వేల పై చిలుకు పెట్టి కొన్నాను. కొద్దిగానే ఉంది నా దగ్గర. అందుకని ఒకసారి దీన్ని వెలిగించాక మనం త్వరత్వరగా లోపలికి వెళ్ళిపోవాలి" అన్నాడు. అని మళ్ళీ ఒకసారి రాగిరేకు తీసి చదివాడు.
"ఇరవై ఒక్క పురుష ప్రమాణములు దిగిన తదుపరి మూడు వందల ఎనభై గజముల సోరంగపుదారి. బహు జాగ్రత్త."
"పురుష ప్రమాణములు అంటే ఏమిటి? ఇరవై మనుషుల లోతు అనా" అన్నాడు ఉదయార్కర్.
"కాదు" అని నవ్వాడు సదానంద్.
"పురుష ప్రమాణం అంటే వేరే అర్ధం ఉందిలే నాకు తెలుసు, అదంతా మనకెందుకు? దాదాపు పదిహేను ఇరవై అడుగులు అనుకుంటే పోలా"
లక్ష్మికాపు వెలిగించి "పదండి" అన్నాడు బ్రహ్మచారి.
ద్వారంలో తలపెట్టి తొంగి చూశాడు ఉదయార్కర్.
అక్కడ రాతి మెట్లు కనబడుతున్నాయి.
దిగడం మొదలెట్టారు అందరూ.
దాదాపు ఇరవై అడుగులు దిగిన తర్వాత అన్నారు బ్రహ్మచారి "ఆగండి! ఇక్కడే ఉండాలి ఆ మూడు వందల ఎనభై గజాల సోరంగపు దారి."
అందరూ ఆగిపోయారు.
కానీ ఆ సోరంగపు దారి ఎక్కడుందో వెంటనే కనబడలేదు వాళ్ళకి. కొద్ది క్షణాలు అన్ని వైపులా పరిశీలనగా చూశాడు బ్రహ్మచారి.
"బ్రహ్మచారి ఇటు చూడండి" అన్నాడు ఉదయార్కర్ మెల్లిగా.
చటుక్కున తిరిగి చూశాడు బ్రహ్మచారి.
అక్కడ గుహా పై కప్పు నుంచి కిందికి జారిన స్తంభంలా కనబడుతోంది ఒకటి. ఆ స్తంభం నేలని తాకడం లేదు. నేలకి ఒక అడుగు పైనే నిలిచిపోయింది.
"శిలా ద్రవం" అన్నాడు బ్రహ్మచారి.
"పైనుండి శిలాద్రవం కారి ఘనిభవించి ఇలా స్తంభం రూపం దాల్చింది" అన్నాడు.
ఆ స్తంబానికి ఒక పక్కగా కాస్త ఎడం ఉన్నట్లు కనడుతోంది. ఒక మనిషి పక్కకు తిరిగి అతి కష్టం మీద ఆ ఎడంలో నుంచి లోపలికి దూరవచ్చు.
దానిలో నుండి ముందుగా ఉదయార్కర్ లోపలి వెళ్ళాడు. ఆ వెనకనే బ్రహ్మచారి, సదానంద్, స్మెల్లర్, దుర్గయ్య ఒకరి తర్వాత ఒకరుగా లోపలికి దూరారు. అతి జాగ్రత్తగా నడవడం మొదలెట్టారు.
మూడు వందల ఎనభై గజాలు నడిచిన తర్వాత హటాత్తుగా వాళ్ళ కాళ్ళకు చెమ్మతగిలింది.
చటుక్కున ఆగిపోయారు అందరూ.
వాళ్ళకి ఎదురుగా కనబడుతోంది -
ఒక చిన్న సరస్సులాంటిది.
"అదే అయి ఉండాలి రాగిరేకులో వర్ణించబడిన జలమార్గం" అన్నాడు బ్రహ్మచారి తదేకంగా చూస్తూ.
బ్రహ్మచారి అలా అంటూ ఉండగానే అతని చేతిలోని లక్ష్మి కావు ఒక్కసారి రెపరెపలాడి ఆరిపోయింది.
అప్పుడు కనబడింది వాళ్ళకి ఆ సరస్సు అడుగునుంచి వస్తున్నసన్నటి ఆకు పచ్చటి వెలుగు ఆ గుహా అంతా ఆ వెలుగుతో మిలమిల్లాడిపోవడం మొదలెట్టింది.
