అప్పుడు వినబడింది ఆ పిలుపు.
చాలా చిత్రమైన గొంతు!
"రా.........ఆ......ఆ..........ఆ......"
"రా........ఆ......ఆ.........ఆ......."
రా....అ......ఆ.........ఆ........."
అందరూ విస్తుపోయి చూశాడు ఏమిటిది? తాము వింటున్నది నిజమా? భ్రమా? ఏమిటి?
చెవులు రిక్కించి వింటూ అన్నివైపులా చూశాడు ఉదయార్కర్.
కొద్ది క్షణాల తర్వాత అతనికి అర్ధం అయింది ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తోందో.
ఆ భైరవుడి ప్రతిమ వెనకాల అర్చిలాగా ఉంది కొండ. గాలి వేగంగా దానితో ప్రవేశించినప్పుడల్లా ఆ చిత్రమైన శభ్ధం ఉత్పన్నమవుతోంది రారమ్మని పిలుస్తున్నట్లు.
మంత్రముగ్దుడిలా ఆటే చూస్తుండిపోయాడు ఉదయార్కర్.
అప్పుడు అనిపించింది అతనికి.
తన పాదాల కిందకి చూశాడు.
అక్కడ కాలవలు కట్టి ప్రవహిస్తున్నాయి. వాననీళ్ళు. ఆ వాన ఒరిపిడికి అక్కడ వున్న మట్టి అంతా కొట్టుకు పోతోంది.
ఆ రాతి నెల మీద వున్న మట్టి కొట్టుకు పోతుంటే -
ఉదయార్కర్ కళ్ళకి దర్శనమిచ్చింది, అప్పటిదాకా మట్టిలో పూడుకుపోయి వున్న ఒక పద్మం.
సరిగ్గా అతని కాళ్ళ క్రింద అతను నిలుచున్న చోటనే.
సూర్యుడి కిరణాలు సోకితే అప్పుడే విచ్చుకుంటున్నట్లు మనోహరంగా చెక్కి వున్నాయి దాని రేకులు.
ఉద్వేగంతో ఉదయార్కర్ ఒళ్ళు గగుర్పొడిచింది.
"బ్రహ్మచారీ" అన్నాడు ఉదయార్కర్ నెమ్మదిగా పరవశంగా.
"చూశాను" అన్నాడు బ్రహ్మచారి నెమ్మదిగా. తర్వాత కింద కూర్చుని పద్మం రేకులతో ఇరుక్కుని ఉన్న మట్టినంతా తీసి శుభ్రం చేశాడు బ్రహ్మచారి.
అందరూ అతనివైపే ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
పద్మం తాలుకూ మధ్య భాగంలో ఒక బోడిపెలా వుంది.
దానిని కుడి నుంచి ఎడమకి తిప్పాడు బ్రహ్మచారి.
కానీ -------
అది తిరగలేదు. మొరాయించింది.
"నాజుగ్గా తిప్పితే తిరుగుతుందా! నన్ను తిప్పనీ!" అన్నాడు దుర్గయ్య ఎగబడుతూ.
అతని వైపు తీవ్రంగా చూశాడు బ్రహ్మచారీ. భయంగా ఆగిపోయాడు దుర్గయ్య.
పద్మాన్ని తిప్పడానికి మళ్ళీ ప్రయత్నించాడు బ్రహ్మచారి.
ఈసారి కొద్దిగా కదిలింది పద్మం. తర్వాత నెమ్మదిగా తిరగడం మొదలెట్టింది.
వెంటనే అందరి చూపులు ఆ ప్రయత్నంగా భైరవుడి ప్రతిమ మీదకి పోయాయి.
ఏమవుతుంది?
ఏమవుతుంది ఇప్పుడు?
అందరిలో ఒకటే తహతహ!
21
అందరూ అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే భైరవుడి ప్రతిమ శిరస్సు మీద నెమ్మదిగా ఒక కొమ్ము బయటకు వచ్చింది.
"ఇన్ క్రెడిబుల్" అన్నాడు ఉదయార్కర్ సంభ్రమంతో. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇవాళ మార్కెట్ లో కొన్న మిక్సి వచ్చే నెల దాకా సరిగా పనిచేస్తుందో లేదో గట్టిగా చెప్పలేం. అలాంటిది ఆ రోజుల్లో చేసి వుంచిన ఏర్పాట్లు ఈరోజుకీ చెక్కు చెదరకుండా ఉండి ఇంకా పని చేసే స్థితిలోనే ఉండడం .......గ్రేట్ రియల్లీ గ్రేట్"
"భైరవుడి విగ్రగానికి కొమ్ము వచ్చేసింది. ఇంక ఏం చెయ్యాలి మనం ఇప్పుడు? అన్నాడు సదానంద్" ఉత్సాహంతో ఊగిపోతూ.
"భైరవుని సాధకుడు సాష్టాంగపరచాలి" అన్నాడు బ్రహ్మచారి.
అతని నోటి నుండి ఆ మాటలు వచ్చీ రాకముందే స్మెల్లర్ దుర్గయ్యా ఇద్దరూ భైరవుడి ప్రతిమ ముందు సాష్టాంగపడిపోయారు.
అయినా ఏమి జరగలేదు.
చిన్నగా నవ్వాడు బ్రహ్మచారి.
"మనం కాదు సాష్టాంగపడవలసింది. భారవుడి విగ్రహాన్నే సాష్టాంగపరచాలి. ఉదయార్కర్ నువ్వు సాయం పట్టు" అన్నాడు .
ఉదయార్కర్, బ్రహ్మచారీ ఇద్దరూ చెరో వైపు నుంచి భైరవుడి ప్రతిమను పట్టుకున్నారు.
"వంచు" అన్నాడు బ్రహ్మచారి.
