"పచ్చలు అయి ఉండాలి" అన్నాడు స్మెల్లర్ పెదిమలు తడిచేసుకుంటూ.
"ఒక్కొక్కటి అరవై నాలుగు వేల వరహాలు" అన్నాడు దుర్గయ్య ఆశగా.
ఉదయార్కర్, బ్రహ్మచారి నీటి అంచున నిలబడి పరీక్షగా చూశారు. దూరంగా సరస్సు అడుగున ఒక గడిలాగా కనబడుతోంది. దానికి కటకటాలు ఉన్నాయి. దానిలో నుంచే వస్తోంది ఆ ఆకుపచ్చటి వెలుగు.
అంతే"
అది తప్ప మరేమీ కనబడటం లేదు.
నీళ్ళలో దిగి ముందుకు నడిచాడు బ్రహ్మచారి.
అతని వెనకనే నడిచారు అందరూ.
ఆ నీళ్ళలో అడుగు తీసి అడుగు వెయ్యడం కష్టమైపోతోంది.
కొద్ది దూరం నడిచాక అన్నాడు బ్రహ్మచారి.
"ఉదయర్కర్ ఒక విశేషం గమనించావా?"
"ఏమిటి?" అన్నాడు ఉదయార్కర్.
"ఈ నీళ్ళలో తేల్చే గుణం ఉంది. అందుకే అడుగు తీసి అడుగు వెయ్యడం ఇంత కష్టమయిపోతోంది." అన్నాడు బ్రహ్మచారి.
అవునన్నట్లు తల పంకించాడు ఉదయార్కర్.
అతనికి మరో విషయం కూడా తోచింది. గుహా , తాలుకూ కప్పు పోను పోను ఏటవాలుగా కిందికి జారిపోతోంది. ఎత్తు తక్కువ కావడం వల్ల కప్పు తలకి తగులుతోంది. నీళ్ళు అప్పటికే ముక్కులదాకా వచ్చేశాయి.
"ఇంక నడవడం సాధ్యం కాదు. ఈదవలసిందే" అన్నాడు సదానంద్ ప్రయాసతో.
"ఈదడానికి ప్రయత్నించారు వాళ్ళు.
కానీ ఈదడం సాధ్యం కావడం లేదు . నీళ్ళు వాళ్ళని బెరడులాగా పైపైకి తెల్చేస్తున్నాయి. పైన కప్పు వీపులకి తగులుతోంది. కాళ్ళూ చేతులూ కదల్చడానికి వీలుగా లేదు. మునుగీ ఈత కొట్టడం చేతకావడం లేదు.
అప్పడు ఉదయార్కర్ కి గుర్తు వచ్చాయి ఆ రాగి రీకులోని వాక్యాలు.
] ఆ పిమ్మట జల మార్గమేర్పడి సాధకుని ఏమార్చగలదు. అచ్చట ఒక్కొక్కటి అరువది నాలుగు వేల ఖరీదు చేయి పచ్చలు కొన్ని కలవు. సాధకుడు సాహసవంతుడు స్వయం నిర్ణయం తీసుకునేది.
తమని నిజంగానే ముందుకు సాగనివ్వకుండా ఏమారుస్తోంది ఈ జల మార్గం!
ఇప్పుడు తాము స్వయం నిర్ణయం తీసుకోవాలిట! ఏమిటా స్వయం నిర్ణయం!
ఏం చెయ్యగలరు తాము?
బ్రహ్మచారి వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు ఉదయార్కర్.
"వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం! ఇంక ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీ లేదు"
పైకి వెళ్ళిపోయి ఏం చెయ్యాలో ఆలోచించుకుని నిర్ణయించుకుందాం " అన్నాడు బ్రహ్మచారి.
అతను అలా అనగానే అందరినీ నిరాశ ఆవరించింది. ఆ సమస్యకు అప్పటికే బ్రహ్మచారి ఒక పరిష్కారాన్ని అలోచించి ఉంటాడనిఆశిస్తున్నారు అందరూ.
నిస్పృహగా వెనక్కి తిరిగారు.
అప్పుడు బ్రహ్మచారి పక్కన నడుస్తూ నెమ్మదిగా అన్నాడు ఉదయార్కర్.
"బ్రహ్మచారీ మీకు కూడా సాధ్యం కాని పనులంటూ అసలు ఉంటాయని ఊహించలేదు నేను.'
చిన్నగా నవ్వాడు బ్రహ్మచారి.
"తలుచుకుంటే ఏదయినా సాధ్యమే. కానీ ఇంకా ముందుకి పోవడానికి ఇది సరైన సమయం కాదనిపించింది"
"ఎందుకని?"
"దానికి రెండు కారణాలున్నాయ్."
"ఏమిటవి?"
"మొదటి కారణం దుర్గయ్య, రెండో కారణం స్మెల్లర్" అన్నాడు బ్రహ్మచారి ముక్తసరిగా.
ఆశ్చర్యంగా చూశాడు ఉదయార్కర్.
"అంటే?"
అటూ ఇటూ చూసి తగ్గు స్వరంతో చెప్పాడు బ్రహ్మచారి.
"మనతో బాటు దుర్గయ్య ఎందుకు వచ్చాడు. కోడినో, మేకనో బలి ఇచ్చి పని సానుకూలం చెయ్యడానికి కదూ?"
"అవును"
"కానీ అతను ఇంతవరకూ ఆ ఊసే ఎత్తలేదు. అవునా?"
"అవును" అంటే......." అని ఆగిపోయాడు ఉదయార్కర్.
