ఆమె మనోపటలం మీద ధవళకాంతులు తేలిమబ్బు తునకలవలె తారాడుతున్నాయి.
ఆ కాంతి పుంజాల మధ్య తిరిగి శ్వేతకి రూపం ఆమెకు ప్రత్యక్షమయింది. ఆ రూపం మనోపటలం మీద ఆవిష్కృతం కాగానే జ్యోతి యిదివరకటిలా భయాపడలేదు.
ఆత్మీయతానుభూతిని సమీకంరించి "సోదరీ! స్వాగతం. ఎందుకో తెలియదు కాని ఎప్పుడూ నిన్ను చూసేందుకే నా మనసు ఆరాటపడుతుంది. నీ ఊహలతో గడిపిన కొద్ది క్షణాలు ఎంతో మధురమయినవిగా అన్పిస్తాయి నాకు.
ఒకప్పుడు నీవు నన్ను సోదరీ అని సంభోధించావు . ఒకప్పుడు నా ప్రాణాలను బలి తీసుకోవాలని ప్రయత్నించావు. నా ప్రయత్నాలను విరమించుకోమని బెదిరించావు.
నా పట్ల నీవు ఎలా ప్రవర్తించినా దవళ, ధవళంగా అపురూపంగా మూర్తి మంతమయి తరళించే నీ రూపం చూడాలన్న అభిలాష నన్ను విడిచిపెట్టదు.
సోదరీ! నా ప్రాణాలను తీసుకున్నా నాకు ఆనందమే! కాని ఆనాడు సమాధి గుహలలో పరుండిన క్షణాలలో అద్భుతంగా దర్శనమిచ్చినావు. నీ గురించి కొంత చెప్పావు.
అంతలోనే వెళ్ళిపోయినావు. అర్ధంతరంగా ఆగిపోయిన ఆ చరిత్రను తిరిగి నాకు చెప్పవూ?" అని అర్దింపుగా అడిగింది జ్యోతి.
శ్వేతకి ధవళరూపం మరింతగా తరళించెట్లుగా నవ్వింది. ఆమె నవ్వొక అద్భుతమయిన చిరస్మరణీయమయిన మధురానుభూతిలా జాలు వారింది.
ఆ శ్వేతమూర్తి నవ్వితే వెన్నెల తరగల వంటి చిరునవ్వు. కాంతులు ఉప్పెనలయి ముంచెత్తినాయి. ఉషస్సంధ్యలో నందివర్ధనం పూటమీది నుంచి మంచు తరగలు జారి పడుతున్నట్లుగా అయింది.
ఆ అద్భుత రూపాన్ని రెప్పవాల్చక చూస్తోంది జ్యోతి.
వీణ మీద వేదనాదాలు పలికించినట్లుండే మధుర మధుర కంఠ స్వరంతో మాట్లాడసాగిందామె.
"సోదరీ! అత్యంత బాధాకరమయిన అమానుష రూపంలో శతాబ్దలుగా విముక్తికై దురసిల్లుతున్న దూరదృష్టవంతురాలను నేను. నీవంటి సాహిసికురాలయిన యువతి నాకై అన్వేషణ సాగించటం వాస్తవానికి అనంతమయిన ఆనందాన్నే యిచ్చింది నాకు.
వ్యక్తిత్వమంటూ లేకుండా బ్రతుకుని ముగించగలిగిన ఒక మధురమయిన అనుభూతి మృత్యువు. ఆనుభూతిలో భౌతికమయిన పరిణామాలుంటాయి.
వాటి అనంతరం నించి వేరుపడిన వ్యక్తిత్వం లాంటి ఆత్మ అనంతంలోనే అంతరించవలసినది. అది సహజమయిన , సుఖప్రదమయిన పరిమాణం.
అది అందరూ కోరదగిన అద్భుతమయిన అనుభూతి.
కాని నా విషయంలో అలా జరగలేదు. భౌతిక రూపం నించి వేరు పడినా అనంతం నించి ప్రత్యేక్షమయినా ఉనికిని సంతరించుకున్న ఆత్మ తిరిగి అనంతంలో లయించకుండా అలా వుండిపోయినాను. శతాబ్ధలకాలం కొనసాగిన చెర యిది!
నీవు ఈ ప్రయత్నంలోకి సాహసంతో దిగావు. విజయురాలవు కాగలవన్న నమ్మికతో ఈనాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆ మధుర మయిన క్షణాలు అతి చేరువలోకి వచ్చాయి.
రేపటి రవి కిరణం భూమిని తాకగానే నీవు కళింగ సర్పం చొరపడిన బిలాన్ని త్రవ్విస్తావు.
అక్కడి నిధిని జాతి పరం చేస్తావు. అంతటితో నేను చిర విశ్రాంతమయిన మధుర స్థితిని పొందుతాను.
కాని సోదరీ! నేను వెళ్ళే ముందుగా ఈ కధను లోకానికి అందించాలని అభిలాషిస్తున్నాను. ఆనాడు క్షుద్రకాళింగుడు కుంభవతీ నగరం నించి మా మీదికి ఎత్తి వస్తున్నాడని విన్నావు కదా!
ఆ తరువాత ఏమయిందో చూడు" అంటూ తన మృదులమయిన అంగుళులతో జ్యోతి కనురెప్పలను తాకింది శ్వేతకి.
జ్యోతి మనో పటలం మీద అద్భుతమయిన దృశ్యాలు కన్పించటం ప్రారంభమయినాయి. తల్లీనురాలయింది జ్యోతి.
నాగ యక్ష పుండ్ర పుళింద జాతుల కౌగిళ్ళలో పరవశించి ప్రవహిస్తోంది నీలవేణి కృష్ణమ్మ. కుంభవతిని పాలించే క్షుద్రకాళింగుడు అపార సేనాహహినితో ఎత్తి వస్తున్నాడు.
ఆ పోలకువను ముందుగానే తెలుసుకున్న శ్వేతకి నాగజాతి యువతీ యువకులందరినీ సమీకరించింది.
వేట , వ్యవసాయమూ ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తున్న నాగ భూమి భయంకర రణస్థలి అయిపొయింది.
ఏ యిరువురి మధ్య విన్నా యుద్ద విషయాలే చర్చగా నడుస్తున్నాయి." "క్షుద్రకాళింగుడు ఔత్తరాహుల అండదండలు కలిగినవాడు పాడి పంటలతో సుసంపన్నమయిన కృష్ణాతీరం కబళించేదాకా అతని స్వార్ధమనే ఆకలి తీరదు.
అతని వద్ద ఆధునాతమయిన ఆయుధాలున్నాయి. అందునించి నాగులకు ఓటమి అనివార్యం" అని కొందరు చెప్పుకొంటున్నారు . "శ్వేతకి శక్తి సంపన్నత ఊహించరానిది. ఆమె నాగ యక్ష పుండ్రపుళింద జాతులను ఒక త్రాటి మీద నడిపిస్తోంది.
అశ్మక, భోజక, మహిషక, శాబర గణాలన్నింటినీ సమీకరిస్తోంది. వారి వారి యువతీ యువకులకు ఆత్మ రక్షణలోనూ, యుద్ద విద్యలలోనూ మెళుకువలు నేర్పిస్తోంది. అందునించి క్షుద్రకాళింగుని ఆమె విజయవంతంగా త్రిప్పికొట్టగలదు. దక్షిణాది సంపదలను దోచుకోవాలన్న దుర్భుద్ధితో తరలివచ్చే ఔత్తరాహులకు భవిషత్తులో ఇది మంచి గుణపాఠం కాగలదు." అని చెప్పుకుంటున్నారు మరికొందరు.
వాద ప్రతివాదాలు అలా అలా జరుగుతూ వుండగానే కాలం కదలిపోయింది. యువతీ యువకులు యుద్ద సంరంభంలో మునిగి తేలుతున్నారు. క్షుద్రకాళింగుడు మరింత దగ్గరయినడన్నా వార్తలు కూడా వచ్చినాయి.
శ్వేతకి హైమావతికి అపరావతారమే అయింది. యువతీ యువకుల శిక్షణా శిభిరాలను తుడిసారి పరిశీలించేందుకు అశ్వాన్ని అధిరోహించి బయలు దేరిందామే.
ఆమె రాకతో అశ్మక, మహిశక, భోజక, శాబర యువతీ యువకులలో అనందం వెల్లువ అయింది. ఆమె కన్పించటమే వారికి కొత్త ఊపిరినీ, ఊతాన్నీ యిస్తోంది. వారంతా ఆయుధాలు ధరించి వీరమర్యాదగా అభివాదాలు చేశారు.
వారందరినీ ఒకచోట సమావేశపర్చింది శ్వేతకి.
"దాక్షిణాత్య రక్తానికి వారాసులయిన మీ అందరికీ అభివాదాలు. కుంభవతీ నగర పాలకుడయిన క్షుద్రకాళింగుడు కృష్ణా తీర సారభూముల పైకి కన్ను మలిపినాడు.
అది దుష్టనేత్రం!
ఆ చూపు పారినంత మేర ఆ యుద్దాగ్నికీలలకు ఆహుతి అవుతుంది. తరతరాలుగా యుగయుగాలుగా రెండు వందల అవాసాలు ఏర్పరచుకుని కృష్ణమ్మను మన కౌగిళ్ళలో నిలిపి గౌరవించాము. ఆ తల్లి దయతలచి యిచ్చిన జలధారలతో బ్రతుకులు నిలుపుకున్నాము. నాగ యక్ష పుండ్ర పుళింద జాతులు మూడు పూవులు ఆరు కాయలుగా వంశ పరంపరాభివృద్ది అవుతున్నాయి. వేట, వ్యవసాయం తప్ప మరొక వ్యాపకాలు లేని మన మీదికి స్వార్ధంతో , సామ్రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ద భయాన్ని కలిగించ వస్తున్నాడు క్షుద్రకాళింగుడు'.
శాంతియుతమయిన స్వేచ్చాజీవనం సాగిస్తున్న మనలను దోచుకుని నిప్పచ్చరంగా చేయాలని , బానిసలుగా మార్చాలని ఎత్తి వస్తున్నాడు క్షుద్రకాళింగుడు.
