Previous Page Next Page 
మారణహోమం పేజి 60

 

    నీకేన్నేళ్ళు?" అన్నాడు నిఖిల్ కోపాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ.
    "నేనేం చిన్నపిల్లననుకున్నారా? నాకు పంతొమ్మిదేళ్ళు . మేజరుని" అంది రాధ నిటారుగా నిలబడుతూ.
    "చిన్నతనం పోలేదని నీ మాటలే చెబుతున్నాయి. చస్తామో బతుకుతామో తెలియని ఈ స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు తప్ప వేరే టైం దొరకలేదూ నీకు పెళ్ళి మాటలు మాట్లాడటానికి?"
    "మీరన్నట్లు ఒకవేళ నిజంగా నేను చనిపోతే, అ తర్వాత ఇంకెప్పుడు మాట్లాడేది..........పెళ్ళిమాటలు!"
    "యూ ఆర్ ఏ వెరీ ఫూలిష్ గర్ల్!" అన్నాడు నిఖిల్ ఒక్కొక్క అక్షరాన్ని వత్తి పలుకుతూ. "నేను ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలో కూడా పెళ్ళంటూ చేసుకోను! ప్రేమ, పెళ్ళి ఈ మాటలే నాకు అలర్జీ. అవి వింటే వంటిమీద వంద గొంగళి పురుగులు పాకుతున్నట్లు ఉంటుంది. తెలిసిందా? నేను ఏ ఒక్కరి సొంతమూ కాను. నేను ప్రజల మనిషిని. మళ్ళీ చెబుతున్నాను. నేను ప్రజల మనిషిని రాదా! ఈ సారికి ఊరుకుంటున్నాను. ఇంకోసారి ఇలా మాట్లాడితే........"
    "మొట్టికాయ వేస్తారా?" అంది రాధ నవ్వు తెచ్చుకుంటూ. ఆ తర్వాత కాసేపు కణతలు నొక్కుకుంటూ దీర్ఘంగా ఆలోచించింది. "సరే! మీకు ప్రేమా పెళ్ళీ అంటే ఎలర్జీ అంటున్నారు కాబట్టి అలాంటి మాటలు ఇంక జన్మలో మాట్లాడను నేను. మీరు చేస్తున్న మహాయజ్ఞంలో మరో సమిధనవుతాను నేను. ఇష్టంగా........."
    "ఇప్పుడు తెలివైన పిల్లలా మాట్లాడుతున్నావ్!" అన్నాడు నిఖిల్. అతని పెదిమలు చిరునవ్వుతో కొద్దిగా విచ్చుకున్నాయి.
    "కానీ ఒక సంగతి ముందే చెబుతున్నాను" అంది రాధ.
    "ఏమిటది?"
    నిశ్చయంగా చెప్పింది రాధ.
    "మీరు పెళ్ళంటూ చేసుకుంటూ......"
    తీక్షణంగా చూశాడు నిఖిల్.
    "ఈ ఒక్కసంగతి చెప్పనివ్వండి. మీరు అసలు పెళ్ళే చేసుకోనంటే నేను చేసేదేమీ లేదు. కానీ అసలు పెళ్ళంటూ చేసుకోదలిస్తే నన్నేచేసుకోవాలి!"
    "యూ ఆర్ ఏ బ్లడీ ఫూల్!"
    "నేను తప్పుగా ఏం చెప్పలేదే! మీరు పెళ్ళంటూ చేసుకోనంటే నేను బలవంతం చెయ్యను. కానీ పెళ్ళి చేసుకోదలుచుకుంటే మాత్రం నన్నే చేసుకోవాలి అని అడుగుతున్నాను . తప్పా?"
    పరిశీలనగా ఆమె వైపు చూశాడు నిఖిల్. తను అన్నది నిజమే! ఈ అమ్మాయి కొన్ని విషయాలలో ఎంతో హుందాగా పెద్దమనిషి తరహాగా ప్రవర్తిస్తుంది.
    కానీ, కొన్ని విషయాలలో, ఇంకా హైస్కూల్ స్టుడెంటులాగానే ప్రవర్తిస్తుంది.
    అసలే తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న ఆమెను నొప్పించడం ఇష్టం లేక , మారాం చేస్తున్న చిన్నపిల్లకు బొమ్మ కొంటానని ప్రామిస్ చేస్తున్నట్లు అతను అన్నాడు.
    "సరే!"
    "ఏమిటి సరే?"
    "నేను పెళ్ళి చేసుకోను. కానీ చేసుకుంటే మాత్రం నిన్నే చేసుకుంటాను."
    రాధ మోహంలో చెప్పలేనంత సంతోషం కలిగింది.
    "ప్రామిస్!" అంది రాధ చెయ్యి జాస్తూ.
    తలుపుసందుకు పడి నలిగిపోయిన ఆమె వెళ్ళు కమిలిపోయి కనబడుతున్నాయి.
    జాలితో కరిగిపోయింది నిఖిల్ హృదయం.
    "ప్రామిస్!" అన్నాడు ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ.
    పెద్ద సైజు ముత్యం లాంటి హర్షభాష్పం ఒకటి నెమ్మదిగా రాధ కనుగొలకుల్లో నిలిచింది.

 

                                                      * * *


    తను చదువుతున్న పుస్తకం మీద నీడ పడగానే చటుక్కున తల ఎత్తి చూసింది అమూల్య.
    పుస్తకం చదువుతోందన్న మాటేగానీ ఒక్క అక్షరం గూడా ఆమె మనసుకి ఎక్కడం లేదు. నిఖిల్ గురించిన ఆలోచనలే ఆమె మనసుని ముంచేస్తున్నాయి.
    తలయెత్తి చూసేసరికి తరుణ్ నిలబడి వున్నాడు. నిఖిల్ ని ఫినిష్ చేసేస్తానని పంతం పట్టి వున్నా తరుణ్!
    ఈ కొద్ది రోజులలోనే అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంది అమూల్య. అతని అలవాట్లు గమనించింది.
    అప్రయత్నంగా ఆమె కళ్ళు అతని భుజం కిందగా ఉబ్బెత్తుగా అస్పష్టంగా కనబడుతున్న దానిమీదకు వెళ్ళాయి.
    అదేమిటో తెలుసు అమూల్యకి.
    రివాల్వర్! నిఖిల్ చంపడానికి అనుక్షణం తయారుగా వుండే రివాల్వర్!
    ఈసారి నిఖిల్ కనబడితే ఫార్మాలిటీస్ ఏమీ పాటించనని, బులెట్ లతో అతన్ని స్ప్రే చేసేస్తాననీ చెప్పాడు తరుణ్.
    తన నిఖిల్ ని.
    అమూల్యకి మోకాళ్ళు బలహీనంగా అయిపోయాయి.
    మీరొక పనిచెయ్యాలి!" అన్నాడు తరుణ్ సీరియస్ గా.
    "ఏం పని?" అంది అమూల్య నిదానంగా.
    "మీరు మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యడం మొదలేట్టాలి."
    "ప్రాక్టీస్" అన్నమాట వినగానే గుండెలు పిండేసినట్లయింది అమూల్యకి. "ప్రాక్టీసా?" అంది నిస్పృహగా. "ప్రాక్టీస్ ఎలా పెడతాను నేను? నా మొట్టమొదటి కేసే చిట్టచివరి కేసు అయిపొయింది. అపకీర్తి కీరీటం నా నెత్తిమీద పెట్టేశాడు ఆ నిఖిల్. ఇంక నేను మళ్ళీ ప్రాక్టీస్ మొదలెట్టినా నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరుంటారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS