అంతలోనే వాళ్ళ పక్క నుంచి జలాంతర్గాముల లాగా రెండు ముసళ్ళు విపరీతమైన వేగంతో వెళ్ళాయి.
"నేను వెళ్ళిపోతున్నాను" అన్నాడు స్మెల్లర్ కీచుగా అరిచి వెనుదిరుగుతూ.
"స్మెల్లర్" అన్నాడు బ్రహ్మచారి గట్టిగా. "ఎలాగూ సగం దాటేశాం. ఇంక ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఒక్కటే. అందుకని ముందుకే వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు ఒంటరి వాడివై పోతావ్! జాగ్రత్త"
"అవును! వెనక్కు వెళ్ళే లోపల మొసళ్ళు మనని అందుకోవని గ్యారెంటీ ఏముంది? అందుకని ముందుకే వెళదాం" అన్నాడు.
ఉదయార్కర్ బ్రహ్మచారితో కలిసి ముందడుగు వేస్తూ. ధైర్యం తెచ్చుకుని దుర్గయ్య కూడా వాళ్ళని అనుసరించాడు విధిలేక. వాళ్లతో కలిసి నడిచాడు స్మేల్లర్.
వాళ్ళు మరో నాలుగు అడుగులు వేశారో లేదో నోరు తెరిచి రంపాలలాంటి పళ్ళను బయటపెట్టి వాళ్ళవైపు వేగంగా వచ్చింది ఒక ముసలి.
వెంటనే ప్రాణ భయంతో వెర్రికేక పెట్టాడు స్మెల్లర్.
మొసలి విపరీతమైన వేగంతో ముందుకు దూసుకువచ్చింది. మృత్యుగహ్వరంలా తెరచి ఉంది దాని నోరు. ముందుగా దానివాత పడేది ఎవరు?
ఉదయర్కర్ వైపు మళ్ళింది మొసలి. మరుక్షణం రివ్వున దూసుకొచ్చింది దాని నోట్లో గుచ్చుకుపోయింది ఒక బాణం.
గిలగిల్లాడిపోయింది ముసలి. విలవిల తన్నుకుంది. ఆ విసురుకి అక్కడి నీళ్ళన్నీ అల్లకల్లోలమై పోయాయి.
తర్వాత్ నీళ్ళలోకి వెళ్ళిపోయింది మొసలి. అది చచ్చిందో బతికే ఉందొ ఉదయార్కర్ కి అర్ధం కాలేదు.
ఎవరు వేశారు ఆ బాణం?
తల తిప్పి చూశాడు ఉదయార్కర్. ఎవరూ కనబడలేదు అతనికి.
ఆ బాణం వేసింది తన ప్రాణం రక్షించాడానికా, లేక తననే చంపదానికా?
అతనికి అంతు బట్టలేదు.
తమని రక్షించడానికి బాణం వేసి ఉంటే ముందుకు వచ్చి కనబడటానికి ఏం అభ్యంతరం ఆ మనిషికి.
ఆలోచిస్తూ సంశయంగా ముందుకు కదిలారు ఉదయార్కర్. గుబగుబలాడే గుండెలతో నదిని దాటారు అందరూ.
అటువైపు కోట గోడ కొంచెం పడిపోయి వుంది. ఎక్కువ శ్రమ లేకుండానే ముందుకి సాగిపోగలిగారు.
కోటలో ప్రవేశించగానే కనబడింది, ఒక ప్ర్రసంనంజనేయ స్వామి ప్రతిమ. తృప్తిగా తల పంకించాడు బ్రహ్మచారి.
అక్కడ నుంచి ఉత్తరదిశగా నడిచారు. సరిగ్గా అయిదు అమ్ముల దూరం.
అంటే బాణం వేస్తే ఎంతదూరం వెళుతుందో అంతకు అయిదు రెట్లన్నమాట.
అక్కడ ఆగి రాగిరేకులో రాసి ఉన్నట్లు అక్కడనుంచి తూర్పు వైపుకు తిరిగి నడిచారు.
ఆ ప్రాంతంలో వున్నాడు ముక్త్యాలేశ్వరుడు.
ఆయనకి ఎదురుగానే ఒక భైరవుడి ప్రతిమ.
అచ్చం రాగిరేకులో చెప్పినట్లుగానే నడుం మీద ఎడం చెయ్యి కుడిచేతిలో కత్తి నేల చెప్పలేనంత ఎగ్జయిట్ మెంట్ కలిగింది ఉదయార్కర్ కి.
సో ఫార్ సో గుడ్.
"ఉదయార్కర్ వచ్చేస్తున్నాం దగ్గరికి" అన్నాడు బ్రహ్మచారి.
ఉదయార్కర్ తల పంకించాడు ఆనందంగా.
స్మెల్లర్ , దుర్గయ్య మహోత్సాహలతో ముందుకు పోతున్నారు.
కానీ అక్కడ ఎదురయింది వాళ్ళకి మొదటి అడ్డంకి.
రాగి రేకులో చెప్పినట్లు భైరవుడి ప్రతిమకి ఎదురుగా పద్మం ఉండాలి.
కానీ పద్మం లేదు అక్కడ.
బ్రహ్మచారి సదానంద్ మొహమొహాలు చూసుకున్నారు.
"ఉదయార్కర్ ఇంతవరకూ మనం విన్న అన్ని వివరాలూ సత్యంయ్యాయి. ఈ పద్మం కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. ఉండి తీరాలి వెదుకుదాం" అన్నాడు బ్రహ్మచారి దృడంగా.
అందరూ తదేక దీక్షతో ఆ ప్రాంతం అంతా వేదికేయ్యడం మొదలెట్టారు.
కానీ ఎంత వెదికినా కనబడలేదు రాగి రేకులో వర్ణించిన పద్మం.
వెదికి వెదికి వేసారిపోయి తలొక బండమీద కూర్చున్నారు వాళ్ళు.
అప్పుడు ఉన్నట్లుండి మొదలయింది జడివాన. ఆకాశం నుంచి నేల మీదకు గాజుపలకని ఒకదాన్ని ఏటవాలుగా ఆనించినట్లు కనబడుతోంది. ఆ వాన తెర కొద్దిసేపటి తర్వాత వాన జోరుకి గాలి హోరు కూడా తోడయింది.
