Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 59

 

                                           19

    వెన్నెల నీడలు సోకి దాని తను కాంతి తరళిస్తోంది. మిల మిల మెరుస్తోంది . అది మహాసర్పం!
    రెండు నిలువులకు మించిన పొడవుంది. శరీరం పండి ముదిరిన తాడిపండు రంగులో వుంది. ఎరుపు అధికమై కుంకుమ వర్ణంగా మారిన శరీర కాంతి అది.
    దాని మీద ఎనిమిది అంగుళాలకు ఒకచోట బంగారు రింగు రింగుల్లా వున్నాయి. ముదిరిన తాడిపండు వర్ణం మీద మెరిసే బంగారు రింగులు అమిత భయం గోల్పేలా వున్నాయి.
    అది నేల మీద జరజర ప్రాకుతుంటే గుర్రాలు కంపతొడుగు లాగుతున్నట్లుగా శబ్ధమావుతోంది.
    ఆనాడు స్టీం లాంచిలో కర్ర పెట్టెకు తలుపుల మీద సర్పాకృతులున్నాయి. ఆ తరువాత రాగి రేకుల మీద బ్రహ్మమయమయిన అక్షరాలు కూడా సర్పాకృతులవలెనె కన్పించినాయి.
    తొలినాడు శ్వేతకి తాలుకూ సమాధి గుహను త్రవ్విననాడు కూడా సర్పాలు బయటపడినాయి. ఈ సర్పాలకూ, ఆ నిదికీ ఏదో అవినాభావ సంబంధం వుండి వుంటుందని ఊహించాడు జయకృష్ణ.
    అదే అతని విశ్వాసం కూడా అయింది. కాని ఆ విశ్వాసానికి రవంత అయినా ఆధారం మాత్రం లేదు. ఊరికే ఆ నమ్మిక అవాంతరంగా కలిగింది. కాకపోయినా తగినంత ఆధారం మాత్రం లేదు.
    ఆయినా ఆ మహాసర్పాన్ని అనుసరించి పోయినాడు జయకృష్ణ. అది వలయంగా పేర్చిన పెద్ద పెద్ద రాళ్ళని తప్పుకుంటూ ముందుకు మునుముందుకు వెళ్ళిపోతోంది.
    జ్యోతి జయకృష్ణతో పాటుగా దాన్ని అనుసరిస్తోంది. అది ఎందుకు అలా పోతోందో , ఎక్కడకు పోతోందో , జయకృష్ణ దాన్ని అనుసరించి అలా ఎందుకు పోతున్నాడో మాత్రం ఆమెకు తెలియదు.
    వివరాలు అడిగేందుకు అయినా, పెదవి కదిపి మాట్లాడేందుకు అయినా ఆమెకు భయంగా ఉంది. నోరు మెదపక తడబడే అడుగులతో జయకృష్ణను అనుసరిస్తోంది.
    అతడు ఎదమచేయితో జ్యోతి నడుము దగ్గర పొదివి పట్టుకున్నాడు. ఆ స్పర్శతో ధైర్యవచనాలు చెప్తున్న ఆత్మీయతానుభూతిని రుచి చూస్తో నడుస్తోంది జ్యోతి.
    జయకృష్ణ చూపు సర్పాకృతి మీదనే లగ్నమయింది. ముదిరిన తాడిపండు వర్ణం మీద బంగారు రింగులు కలిగిన ఆ మహా సర్పం బహుశా కళింగ సర్పమయివుంటుందని ఊహించాడు జయకృష్ణ. కళింగ సర్పాలు (కింగ్ కోబ్రా) అతి భయంకరమయినవి. అవి సర్పాలను మాత్రమే విందుగా స్వీకరిస్తాయి. ఇతర ప్రాణులను ఆహారంగా స్వీకరించవు.
    దాని రూపు భయంకరమయింది. దాని శక్తి భయంకరమయినది. దాని విషం అతి భయంకరమయినది.
    కళింగసర్పం మంచి శక్తి శాలి అయిన మనిషిని కాటు వేస్తే అతడు మరణించేందుకు కేవలం రెండు సెకన్ల కాలం చాలు. దాని వీసం అంత భయంకరమయినది.
    రెండు సెకన్ల కాలంలో అది శరీరంలోని మొత్తం రక్తాన్ని గడ్డ కట్టించేసి హృదయ స్పందనలను నిలువరించగలదు.
    అటువంటి కాలకూట విషం దాని కోరలలో వుంటుంది. దానికి పధ్నాలుగు కోరలుంటాయి. నోటి పైభాగంలో ముందు భాగాన రెండు కోరలుంటాయి. అవి ధవళ కాంతులతో అతి పెద్దగా పోలిధిన్ అగ్గిపుల్ల ప్రమాణంలో వొంకీలు తిరిగి వుంటాయి.
    పెద్ద కోరలు మృత్యుపాశాలకు మరో రూపాలు. వాటికి ఇరుప్రక్కల మరొక ఆరేసి కోరలు అతి చిన్నవి వుంటాయి. కాటు అందే సమయంలో వాటితో పని వుండదు.
    కాని దొరికిన ఆహారం గింజుకుని నోటినించి జారిపోకుండా వుండగలందుకు , అది వాటిని బంధించేందుకు ఉపయోగిస్తాయి చిన్నిచిన్ని కోరలు! ఆరడుగుల త్రాచుపామును అది అవలీలగా మింగివేయగలదు.
    మహాపద్మ సర్పాలని ప్రాచీనుల చేత వర్ణించబడిన జాతి సర్పమది. అది ఎంత భయంకరమయినది అయినా మానవజాతికి మిత్రుడే అనుకోవాలి. త్రాచుపాములను తిని అది వాటి జాతిని తగ్గిస్తోంది. ఆ రూపేణా అది మనిషికి నేస్తం.
    అది చీకటిలో చాలా దూరం పోయింది. త్రవ్వబడిన శ్వేతకి సమాధికి ఈశాన్య దిక్కున రాతి వలయాల మధ్య వలయాకృతిలో వున్న ఒక రంధ్రంలోకి దూరిపోయింది. ఆ బిలం సరిగా రాతివలయాలకు మధ్య ప్రదేశంలో వుంది.
    ఈ చుట్టూ రాతిగోలీలు వలయాకృతిగా వున్నాయంటే అది కూడా ఒక సమాధి గుహ అయి వుండాలి. శ్వేతకి సమాధి గుహలోంచి త్రవ్వకంలో బయటపడిన సర్పాల వలెనె ఇదీ యాదృచ్చికంగా కన్పించిన సర్పమా? లేక ఏదయినా విశేషం వున్నదా?
    ఆలోచిస్తూ ఆ సమాధి గుహ దగ్గర ఒక గుర్తు వుంచి యిహ అప్పటికి చేసేది లేక వెనుతిరిగి పోయినాడు జయకృష్ణ. తిరుగు ముఖం కట్టాక ఆమె నడుము తన బహువులో ఇమిడి వుండటం గమనించాడు. ఆమెను నవ్వించేందుకు మరింత దగ్గరకు హత్తుకున్నాడు.
    "భయమేసిందా?" అని అడిగాడు. అప్పటికే జ్యోతికి గొంతుక తడారిపోయి వుంది . అవునని తల ఊగించి అతనిని మరింతగా హత్తుకు పోయింది జ్యోతి. ఇద్దరూ డేరాలోకి వెళ్ళిపోయినారు.
    అప్పటికీ అర్ధరాత్రవుతోంది. మిగిలిన రాత్రి భాగాన్ని వృధా చేసుకుంటే అలసట తీరదు. అందునించి  ఆలోచనలన్నింటినీ మనసు లోంచి తీసివేసి నిశ్చింతగా నిద్రకు ఉపక్రమించాడు జయకృష్ణ.
    జ్యోతి కళ్ళు మూసుకుంది . కళింగ సర్పం జరజరమని గుర్రాలు కంప తొడుగులాడుతున్న శబ్దంతో ప్రాకి మీది మీదికి వస్తువున్నట్లుగా అలాపన కలుగుతోంది.
    ఉలికి పడి లేచి కూర్చుందామె.
    ప్రయత్నపూర్వకంగా మనసు నిలువరించుకుని మంచినీరు త్రాగింది జ్యోతి.
    నడుము వాలిస్తే శయ్యలో సర్పాలు ప్రాకుతున్నట్లే అన్పిస్తోంది. అందునించి తాను ప్రతి క్షణానికీ ఉలికిపడాలి. ప్రక్కనున్న ప్రొఫెసర్ శ్రద్దాదేవి నిద్రభంగం అవుతుంది.
    ఆ భయంతో డేరా వేలుపలకు వచ్చి ఎత్తయిన రాతిమీద చదును అయినచోటు చూచుకుని అక్కడ కూర్చుందామె. పాములు వస్తాయేమోనని పరిసరాలలో చూసుకుంది కాస్సేపు.
    చల్లగాలి ఆ శరీరాన్ని తాకగానే ఆలసట వల్ల కళ్ళు కూరుకు పోతున్నాయి. ఆమె నిద్ర వల్ల భయాన్ని మరచి అలాగే ప్రక్కకు వాలిరాతి పలక మీద నిద్రకు ఉపక్రమించింది.
    ఎంతసేపయిందో తెలియదు. ప్రగాడ మయిన సుషుప్తి'లో తెలియని ఏ తీవ్రశక్తులకో లొంగి తల్లీనురాలాయి పోయిన జ్యోతిని ఎవరో పేరు పెట్టి పిలచినట్లు అయింది.
    ఆమె మనో లోకం వాకిలి తెరచుకుంది. అంతరిక లోకంలో అద్భుతమయిన కాంతి వెల్లువలు పొంగారుతున్నాయి. అక్కడ కామనలు లేవు. జీవితంలో ఎదురయ్యే లాలసా పూర్ణమయిన ఆరాటాలు లేవు. స్వార్ధం కొనసాగించే పోరాటాలు లేవు.  
    తనదంటూ ఏమీ లేని నిష్కృతికి దారి చూపే వెలుగు లాంటిదా అనుభూతి. అదెప్పుడు ఎందుకు తనను వశీకరిస్తుందో తెలియదు.
    వెలుగుల వారాసి అయిన ఆ లోకంలో ఒంటరిగా నిలిచి పోయింది జ్యోతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS