Previous Page Next Page 
మారణహోమం పేజి 59

 

    "ఇంత టాలెంటు వేస్టయిపోకూడదు నిఖిల్! అందుకని వచ్చేయ్! మాతో చేరిపో! చిన్న చిన్న చిలక కొట్టుళ్ళు ఎంతకాలం! బిగ్ టైంలోకి అడుగుపెట్టు!"
    ఒకసారి జుగుప్సగా హాధీని చూసి తల పక్కకి తిప్పుకున్నాడు నిఖిల్.
    అది గమనించిన హదీ గొంతు పదునుగా మారింది. "మేమంతా ఏదో పాపాత్ములమైనట్లు నువ్వొక్కడివే పుణ్యాత్ముడివైనట్లు ఫోజులు పెట్టకు. ఎవరెవరు ఏయే వెధవపనులు చేస్తున్నారో నాకు బాగా తెలుసు."
    ఇంక వినడం కూడా అనవసరం అన్నట్లు బోన్ సాయ్ చెట్టు మీద దృష్టి కేంద్రీకరించాడు నిఖిల్.
    "నాకు నీ సహకారం కావాలి నిఖిల్!" అన్నాడు హాధీ.
    "ఏ విషయంలో?"
    "డ్రగ్స్!"
    నిఖిల్ మొహం తక్షణం రౌద్రంగా మారింది.
    హధీ జేబులోంచి చాక్ లేట్ బార్ ఒకటి తీసి రేపరు విప్పాడు.
    "ఇప్పుడు మనం చెయ్యగల వ్యాపారాల్లో రాజకీయ వ్యభిచారం తర్వాత దాదాపు అంత లాభసాటి అయిన వ్యాపారం డ్రగ్స్! ఎంత కాదన్నా మూడొందల శాతం లాభం వస్తుంది మనకి. ఆంధ్రప్రదేశ్ టెర్రిటరీ అంతా నీకు ఇస్తాం. నీకు ట్వంటీ పర్సెంట్ కమీషన్"    
    ఉన్నట్టుండి అలర్టుగా అయిపోయాడు నిఖిల్. ఈ వెధవ దగ్గర నుంచి ఇన్ ఫర్మేషన్ గుంజాలి. ఆ తర్వాత వీడి పని పడతాడు తను.
    "చెప్పు!" అన్నాడు ఆసక్తి కనబరుస్తూ.
    "మనకు దీనివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ మనం దొరికిపోయినా తప్పించుకుపోయే ఏర్పాట్లు పకడ్భందీగా చేసి పెట్టాం ముందే!"    
    "ఏమిటవి?"
    హదీ నవ్వాడు.
    "నేను చిన్నపిల్లగాడి ననుకుంటున్నావా నిఖిల్? నువ్వు అవునంటే , నీ మాటలు మీద నాకు నమ్మకం కుదిరితే అప్పుడు గానీ ముందుకి ప్రొసీడ్ కాము మనం."    
    "హాధీ" అన్నాడు నిఖిల్ నెమ్మదిగా. "నువ్వు నీచులలో మహానీచుడివని నాకు తెలుసు. నీలాంటి విషసర్పాలను కాటేయ్యడానికి పుట్టిన కాలసర్పాన్ని నేను. నన్ను మర్యాదగా వదిలిపెట్టియ్యడం , నువ్వు ఆరోగ్యంగా ఉండడం అనేవి రెండూ ఒకదానికి ఒకటి పర్యాయపదాలని తెలుసుకో!"
    "అంతేనా?"
    నిఖిల్ ఇంకా మాట్లాడదలచుకోలేదు.
    హదీ వెనక్కి జేరగిలబడి, చాకొలేట్ తింటూ పైకప్పు వైపు చూశాడు. ఒక అందమైన అమ్మాయి మత్స్యకన్యలా నెమ్మదిగా ఈదుతోంది పైన వున్నా స్విమ్మింగ్ పూల్ లో.
    మైమరిచినట్లు కాసేపు అలానే ఉండిపోయాడు హాధీ.
    తర్వాత "తొందరేముంది? ఆలోచించుకో!" అన్నాడు సోఫాలో నుంచి మెల్లిగా లేచి తలుపు దగ్గరికేళ్ళాడు.
    తలుపులు నిశ్శబ్దంగా పక్కకి జరిగిపోయాయి. హాదీ బయటికి వెళ్ళిపోయాడు.
    ఒక్క అంగలో తలుపుని చేరి తెరవబోయాడు నిఖిల్.
    వెంటనే ఆ భవంతిలో పది చోట్ల హెచ్చరికగా అలారం మోగడం మొదలెట్టింది.
    తోటలో నుండి సాయుధులైన మనుషులు నలుగురు పరుగెత్తి రావడం కనబడింది నిఖిల్ కి.
    మళ్ళీ తలుపులు తెరచుకున్నాయి. హాధీ లోపలికి తలపెట్టి చూశాడు. "అతి తెలివి చూపించకపోవడం ఆరోగ్యంగా బతకగలగడం ఒకదానికొకటి పర్యాయపదాలని తెలుసుకో!" అన్నాడు మాటకి మాట అప్పగిస్తూ.
    ఆ వెంటనే , ఎవరో బయటినుంచి నేట్టినట్లు రాధ ఒక్కసారిగా తూలి లోపలకు వచ్చింది.    
    నుదురు చిట్లించాడు నిఖిల్. రాదని కూడా ఇక్కడే ఎందుకు ఉంచుతున్నాడు హాదీ? దీన్లో కూడా ఏదన్నా మతలబ్ ఉందా?
    ఏదిఏమైనా గానీ రాధ తన కళ్ళెదురుగానే ఉంటుంది. అది కొంతలో కొంత మేలు!
    లోపలికి వస్తూనే వెనక్కి తిరిగి తుపుక్కున హాధీ మొహం మీద ఉమ్మేసింది రాధ.
    హాదీ మొహం వికృతంగా మారింది.
    రాధ చేతిని గుంజి తను బయటకు వెళ్ళిపోయి, అక్కడున్న ఒక బటన్ పుష్ చేశాడు.
    వెంటనే తలుపులు మూసుకుపోయాయి.
    రాధచేయ్యి మాత్రం తలుపులమధ్య ఉండిపోయింది.
    "బాస్టర్డ్!" అన్నాడు నిఖిల్ పెద్దగా అరుస్తూ. "బాస్టర్డ్ తలుపు తియ్యి! లేకపోతే రక్తం తాగుతాను."
    అంటూనే కుడికాలు లేపి బలంగా తన్నాడు నిఖిల్.
    వెంటనే వెయ్యి దేయ్యపు పిల్లలు మేలుకుని గుక్కపెట్టి ఏడుస్తున్నట్లు భవంతిలో ఎన్నో చోట్ల అలారం గంటలూ, సైరన్ లూ మోగడం మొదలెట్టాయి.
    బాధతో విలవిల్లాడిపోతోంది రాధ. సోలిపోతున్నట్లు కనబడుతోంది తను.
    అప్పడు అకస్మాత్తుగా మళ్ళీ తలుపులు తెరచుకున్నాయి. చటుక్కున చెయ్యి వెనక్కి లాగేసుకుంది రాధ. ఎకసెక్కంగా హాధీ నవ్వు వినబడింది. మళ్ళీ తలుపులు మూసుకుపోయాయి.
    రోప్పుతోంది రాధ. చినిగిపోయి అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆమె బట్టలు. గుండెల మీద పమిట లేదు.
    "రాదా!" అన్నాడు నిఖిల్ మృదువుగా.
    ఆయాసంగా తలతిప్పి చూసింది.
    "నాతొ రావద్దంటే వినలేదు నువ్వు. అనవసరంగా నీకు కూడా కష్టాలు! చూశావా!" పట్టుదలగా తల ఆడించింది రాధ.
    "మీతో కలిసి ఎక్కడికైనా వస్తాను. నరకానికైనా సరే! మీతో కలిసి పంచుకునే కష్టాలు కూడా సుఖాల్లాగానే కనబడతాయి నాకు."
    సంతోషం లేకుండా నవ్వాడు నిఖిల్. "సెంటిమెంట్లు అంటే నాకు సరిపడదు రాదా! ఈ మనసులూ, మమతలూ, మమకారాలు - అన్నీ ట్రాష్! ప్రజల మనిషిని నేను. ప్రజలకోసం పుట్టాను. ప్రజల కోసమే చస్తాను. ఇది మహాయజ్ఞం లాంటిది రాదా? ఇందులో సెంటిమెంట్లకు సూది మోపినంత మేర కూడా తావులేదు. మనం మనకోసం బతకకూడదు! మంది కోసం బతకాలి!"
    తలుపుల మధ్య పడి నలిగిపోయిన చేతివేళ్ళను పరిశీలనగా చూసుకుంది రాధ, తర్వాత నెమ్మదిగా అంది -
    "మీరు నన్ను చూసి భయపడుతున్నట్లున్నారు!"
    ఆశ్చర్యంగా చూశాడు నిఖిల్. "భయమా? భయమెందుకు?"
    "మీరంటే నాకు చాలా ఇష్టమనీ, చనిపోయేదాకా మీతోటే కలిసి ఉండాలని ఉందనీ , మీ కష్టాలు నా కష్టాలుగా , మీ సుఖాలు నా సుఖాలుగా, మీ జీవితం నా జీవితంగా భావిస్తాననీ చెప్పెస్తానేమోనని మీకు భయం! నా మెడలో మూడు ముళ్ళు వేసి తాళి కట్టెయ్యమని నేనెక్కడ కాళ్ళా వెళ్ళా పడిపోతానేమోనని కూడా మీరు భయపడిపోతున్నారు. అందుకే ముందు కాళ్ళకి బంధం వేసినట్లు ముందుగానే ఏవేవో చెప్పేస్తున్నారు. అవునా?"
     తీవ్రంగా చూశాడు నిఖిల్.
    రాధ తొణకలేదు. "భయం అంటే ఏమిటో తెలియని నిఖిల్. ఒక ఆడపిల్ల తనని పెళ్ళాడమని అడుగుతుందేమోనని బెదిరిపోవడం చిత్రంగా లేదూ? తలచుకుంటే నవ్వొస్తోంది!"
    "నీకు మతి పోయినట్లుంది" అన్నాడు నిఖిల్ కోపంగా.
    "కాదు పిచ్చిపట్టింది!" అంది రాధ. "ప్రేమపిచ్చి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS