"ఏం లేదు నోట్స్ ఏదో రాసుకుంటున్నా" అంటూ నోట్ బుక్ తీసి దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేసాడు.
"ఏం నేను చూడకూడదా?"
"చూడ కూడదని ఏముంది ఇందులో?" అంటూ పుస్తకాల మధ్యలోకి విసిరేసాడు.
"ఏమి లేదంటూనే దాచేస్తావెందుకని!"
"ఏదో కధ రాయడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు చూస్తే నవ్వుతావు. అందుకని దాచేస్తున్నా" మాధవి అదోలా నవ్వింది. ఆ నవ్వుకు సాగర్ మనసు కలవరపడింది.
"నాన్నగారు కూడా వచ్చారా?" మాట మార్చటానికి ప్రయత్నం చేసాడు. మాధవి తండ్రితో రాలేదని తెలుసు. నాన్నగారు ఇంట్లో , ఊళ్ళో లేనప్పుడు జడ్జి గారు ఇంటికి రారని తెలుసు. వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు మాధవి ఒంటరిగా తన గదికి రాదనీ కూడా తెలుసు.
"రాలేదు నేనే వచ్చాను."
"ఒంటరిగా ఇంత రాత్రప్పుడు రావడం మంచిది కాదు, లే, ఇంటి దగ్గర వదిలి వస్తాను."
"అమ్మా నాన్న ఇంట్లో లేరు."
"ఎక్కడికి వెళ్ళారు?"
"జగద్గురు సదానంద స్వాముల వారి ఉపన్యాసం వినడానికి వెళ్ళారు. పనిమనిషి బోనాల పండగని వెళ్ళింది. చాలాసేపు చూశాను. అమ్మా, నాన్న రాలేదు. ఆకలవుతోంది. భోజనం చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ వంటచేసి పెట్టి వెళ్ళింది. కుక్కర్ లో అన్నం వున్నది. కూరా, చారు డైనింగ్ టేబుల్ మీదకు చేర్చాను. కుక్కర్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి మూత తెరిచాను. నాకేదో అయిపోయినట్లయింది. కుక్కర్ లోనుంచి స్టీమ్ మోత! అంతే! అల్లి బిల్లి తిరిగిపోతున్నట్లనిపించింది. సరిగ్గా ఆ రోజు జరినట్లే జరిగింది"
"నీకు స్పృహ తెలిసేటప్పటికి ఎక్కడ వున్నావు?"
"ఆరోజులా స్పృహ తప్పి పడిపోవటం జరగలేదు. టేబుల్ ముందే నిలబడి ఉన్నాను. నా ముందున్న కుక్కర్...."
"జస్ట్ వన్ మినిట్! ఆ రోజు బహుమతిగా పొందిన కుక్కరేనా?"
"అవును, అమ్మ ఆ కుక్కరే వాడింది. నేను చూడటం ఇంట్లో మళ్ళీ ఈ రోజే."
"ఓ.కే. రిలాక్స్! అన్నం తిన్నావా?"
"లేదు"
"మా ఇంట్లో భోజనం చెయ్యి"
"తినాలనిపించటం లేదు. ఐ కాంట్ ఈట్ నౌ"
"ఉండు, ఇప్పుడే వస్తాను" సాగర్ లేచి వెళ్ళాడు. ఐదు నిమిషాల్లో హార్లిక్స్, యాపిల్స్, బిస్కెట్స్ తీసుకొని వచ్చాడు.
"ఇవన్నీ ఎందుకు ప్రేమ్ ? మీ అమ్మగారు లేరా?"
"ఉన్నారు , వంట్లో బాగా లేదని పడుకొని వున్నదీ. మా నాన్న కాంప్ కు వెళ్ళారు."
బిస్కెట్స్ సుతారంగా మునిపళ్ళతో కొరికి తింటూ హార్లిక్స్ తాగుతున్న మాధవిని తదేకంగా చూడసాగాడు సాగర్. ఆమెలో అంతకుముందున్న ఉద్రిక్తత తగ్గిపోయింది.
సాగర్ కళ్ళల్లోకి చూసింది. ఆమె బుగ్గలు యాపిల్ పళ్ళలా నిగనిగలాడాయి. యాపిల్ కోసి సగం సాగర్ చేతిలో పెట్టి మిగతాది తను తింటూ ప్రశాంతంగా కూర్చున్నది.
"మాధవీ! నిన్ను మళ్ళీ కొన్ని ప్రశ్న లడుగుతాను! నీకు గుర్తున్నవి చెప్పు. బలవంతంగా గుర్తు చేసుకోడానికి ప్రయత్నించకు. నీకు గుర్తున్న వరకే చెప్పు."
మాధవి మౌనంగా తల ఊపింది.
"ఆ రోజు మొదటిసారి స్టేజి మీదకు వెళ్ళినప్పుడు కప్ అందిస్తున్న డాక్టర్ గారి చేతివేళ్ళు చుశావ్! అవునా?
"అవును"
'ఆరో వేలు కనపడింది బొటనవేలు పక్కనా, చిటికిన వేలు పక్కనా?"
"చిటికిన వేలు పక్కన"
"ఆ వేలు నీ వేళ్ళకు తగిలిందా"
"లేదు! అక్కడ అపుడు లేదు."
"అప్పుడక్కడ లేదు?" సాగర్ బుర్ర గోకున్నాడు.
"మరి కనపడిందన్నావుగా?"
"తెగిపోయినట్లు కనిపించింది."
"అప్పుడే తెగిపోయినట్లు కనిపించిందా?"
"అవును. డాక్టరు గారి చిటికిన వేలు మీద తెగిన గుర్తు కన్పించింది.
అంటే ఆయనకు వేలి మీద తెగిన గుర్తు కన్పించగానే, నీకు తెగిపోయిన వేలు గుర్తు కొచ్చిందా."
"అవును. కరెక్టు! తెగిపోయిన వేలు నా కళ్ళ ముందు తిరిగింది."
"ఓ! కే. మొదటిసారి అంతకంటే ఏమి అనిపించలేదు. కదా?"
"అంటే ఓ! నో! నో! క్రింద పడ్డ కప్పు అందిస్తున్న డాక్టర్ గారి ముఖం కన్పించినప్పుడు ఆ ముఖంలో నుంచి అలాంటి ముఖమే మరొకటి కన్పించింది." పైన గిర్రున తిరుగుతున్న ఫాన్ కేసి చూస్తూ అన్నది మాధవి.
"ఆ తర్వాత-"
"ఏమి కాలేదు. స్టేజి దిగి వచ్చాను!"
"రెండో సారి స్టేజీ ఎక్కినప్పుడు- అదే, హండ్రెడ్ మీటర్ రేస్ మొదటి బహుమతి తీసుకున్నప్పుడు అలాగే తెగిపోయిన వేలు కన్పించిందా?"
"ప్రెషర్ కుక్కర్ అందిస్తున్న డాక్టరు గారి ముఖం లోంచి ఈసారి ఆ రెండో ముఖం బాగా ప్రస్పుటంగా కన్పించింది. ప్రషర్ కుక్కర్ లో నుంచి పొగలు సెగలు వచ్చినట్టు కన్పించాయి. ప్రషర్ కుక్కర్ చేసే మోతలు విన్పించాయి. ఆ ధ్వనులు రైలు ఇంజన్ కూత కంటే పెద్దగా విన్పించాయి."
"అంటే ఆ తర్వాత నీకేమీ తెలియదు గదూ!"
"ధ్వనులు పెద్దదవుతుండగా నా కళ్ళు కింద నేల కదిలి పోతున్నట్లయింది. అంతా స్టేజీ హాలు గిరగిరా నా చుట్టూ తిరిగి పోతున్నట్లుగా అనిపించింది. మెల్లగా ఆ ధ్వనులు ఆగిపోయినై."
"ఆ తర్వాతే నీకేమీ తెలియకుండా పోయింది గదూ?"
"కాదు! ధ్వనులు ఆగిపోగానే నా తల మీద ఏదో బరువు పెట్టినట్లయింది. ప్రెషర్ కుక్కర్ మూత ఎగిరి పడింది. కోడి మెడ కోస్తున్న కత్తి , ఆ కత్తిని పట్టుకున్న చెయ్యి, ఆ చేతి కున్న ఆరో వేలు కన్పించింది! వంకాయలు తరుగుతున్న కత్తి, చేతికి - ఆడుతున్న ఆరో వేలూ- బెండకాయలు - అనప కాయలు - పొట్ల కాయలు తెగి ముక్కలు ముక్కలవుతూ కుక్కర్ లో పడుతున్నాయి. సలసల కాగే నూనె - కళాయిలో - మాంసం - కైమా కొడుతున్న కత్తులూ- వ్రేళ్ళూ - కత్తులూ వ్రేళ్ళూ - కత్తులూ- వ్రేళ్ళు-"
"మాధవీ! మాధవీ! వణికిపోతున్న మాధవినీ పట్టుకొని బిగ్గరగా పిలిచాడు సాగర్. మళ్ళీ స్పృహ తప్పిపోతుందేమో నని గాభరా పడిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత తేరుకుంది . ఆమె చెక్కిళ్ళ పైన మెరిసిపోతున్న స్వేద బిందువులను తుడిచి నిట్టూర్చాడు.
