"వెనక్కి తిరిగి చూడకు! వెళ్లిరా" చెప్పింది కంగారుగా.
స్వచ్చమైన పాలలాంటి మనసూ, దానికి తగిన రూపం ఉన్న కొడుకుని వెనుక నుంచి తృప్తిగా చూసుకుంది. అంతలోనే కన్నతల్లి దృష్టి తగలకూడదు అంటూ లోపలికి నడిచింది.
అభినవ్ రెండు బస్సులు మారి, కాలేజిలోకి అడుగు పెట్టేసరికి , అక్కడ వాతావరణం మంచి జోరుగా ఉంది. నలుగురు సీనియర్స్ ఒక గ్యాంగ్ గా చేరి, గేటులోకి అడుగు పెట్టిన కొత్త మొహలని అట పట్టిస్తున్నారు.
అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి మంచి ఐకమత్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొందరిని డాన్స్ చేయ్యమంటున్నారు. కొందర్ని ఏదైనా ఏక్ట్ చేసి చూపించమంటున్నారు. జూనియర్స్ మొహాల్లోని భయం, వారిని మరింతగా రేచ్చగోడ్తుంది. అందరి ముఖాల్లో ఉద్వేగం తాండవీస్తోంది.
"ఏయ్ నీ పేరేమిటి?" ఒక చుడీదార్ అమ్మాయి, చీర కట్టుకుని బెదురుగా చూస్తున్న అమ్మాయిని అడిగింది.
"వెంకటలక్ష్మి!"
"ఛీ! ఏం బాలేదు! ఈవాళ్టి నుండి నీ పేరు "వెనీలా' అని మర్చేస్తున్నాము" అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు.
"ఓహ్! వెనీలా అంటే నాకెంతో ఇష్టం. నా నోరు ఊరిపోతుంది. " అని ఓ అబ్బాయి అనగానే , అందరూ మళ్ళీ నవ్వులు.
వెంకటలక్ష్మి కళ్ళల్లో నీళ్ళురాయి.
"ఏయ్ అగు! నీ పేరేమిటో చెప్పి వెళ్ళమ్మా!" మరో అమ్మాయిని అటకాయించారు.
"రాధా కృష్ణ వేణి."
"అంత పొడుగ్గా బాలేదు. మేమంతా నిన్ను షార్టుగా "రావే" అంటాము. చెప్పాడు పోతరాజు అనే అబ్బాయి.
'అప్పుడు ఆ అమ్మాయి నిన్ను "పోరా" అంటుంది. చెప్పాడు అభినవ్ కల్పించుకుంటూ.
అందరూ తలలు తిప్పి అభినవ్ వైపు చూసారు.
ఆ అమ్మాయి కృతజ్ఞతగా చూసి వెళ్ళిపోయింది.
"అభినవ్ పెద్ద హీరోలా ఫోజులు కొట్టకు. ఈ ఒక్కరోజూ సర్దాగా ఎంజాయ్ చెయ్యనీ!" చెప్పాడు అతను.
"ఏడిపించకుండానే , ఏడిచేసే బెడురుగొట్టు అమ్మాయిలని ఏడిపిస్తే ఏం సరదారా! అదిగో అటు చుడండి. ఆ అమ్మాయినీ ...." అన్నాడు అభినవ్.
అందరూ అతను చూపించిన వైపు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
దివి నుండి భువికి దిగి వస్తున్న అప్సరసలా నడిచి వస్తోంది ఆమె. ఆమె వేసుకున్న గంధం కలర్ 'టీ షర్టు' ఆమె వంటి రంగుతో పోటీ పడ్తోంది. నిర్లక్ష్యంగా ఎగుర్తున్న జుట్టుని అంతకంటే నిర్లక్ష్యంగా సవరించుకుంటూ , అందర్నీ థ్రిల్లింగ్ గా గమనిస్తూ గేట్లోంచి అడుగు పెడ్తోంది మంజీర. ఆమె కళ్ళలో ఎక్కాడా, అదురు కానీ, బెదురూ కానీ లేవు!
ఆమె వెనక్కి తిరగగానే ఆమె ప్యాంట్ వెనకాల "డోంట్ ట్రై హిట్ మీ" అనే పెద్ద స్టిక్కర్ వేళ్ళాడుతూ కనిపించింది.
.jpg)
ఇంతసేపూ అల్లరి చేసిన మూకంతా కళ్ళు విప్పార్చుకుని చూస్తుండి పోయారే తప్ప, ఆమె దాటి వెళ్ళిపోతుంటే ఏమీ చెయ్యలేకపోయారు.
పోతురాజు బుర్రలో 'చక్' మని ప్లాష్ లా ఒక ఐడియా మెరిసింది. అభినవ్ ను మోచేత్తో పొడిచి, "వెళ్ళు వెళ్ళి ఆమె వెనుక హిట్ చేసిరా!" అన్నాడు.
"నేనా!" ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్.
"నువ్వే, ఇందాక హీరో డైలాగులు కొత్తవుగా!" అని అతను అనగానే అందరూ "అభినవ్ వెళ్ళాలీ!" అంటూ క్లాప్స్ కొడ్తూ పాటలా పాడసాగారు.
"ఓ.కే. " అంటూ అభినవ్ కదిలాడు.
అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
అభినవ్ ఆమెకి చెరువుగా వచ్చాడు, వారి మధ్యలో నాలుగు మెట్లు ఉన్నాయి. అతను ఒక్కొక్క మెట్టే పరుగులాంటి నడకతో ఎక్కుతున్నాడు. అచ్చు 'పద్మవ్యుహాన్ని చేధించడానికి వెళ్తున్న అభిమన్యుడిలా....
"ఠప్!!!" మన్న చప్పుడికి అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది మంజీర.
తన స్టిక్కర్ అతని చేతిలో ఊగుతోంది. ఒక్క క్షణం ఆమెకి జరిగింది అర్ధమయింది. "యూ రోగ్" అంటూ ఆమె విసురుగా చెయ్యి ఎత్తింది. అది మరో నిమిషంలో అతని చెంపని తాకుతుందనగా, ఆ చేతిని అతను బంధించాడు.
పడగ మీద కొట్టబడిన పాముపిల్లలా చూసింది మంజీర అతని వైపు!
అభినవ్ చిన్నగా నవ్వుతూ , "సారీ! ఇటువంటి స్టిక్కర్స్ పెట్టుకుని ఆడపిల్లలు కాలేజిలో తిరుగుతూ ఉండడం, నాకు అంత బాగా అనిపించలేదు. 'వొద్దు' అంటే అదే చేయ్యలనిపించే కోతి వయసు మా స్నేహితులది . మీరు రెచ్చకోడుతున్నట్టు "నన్ను తాకొద్దు", నన్ను ముద్దు పెట్టుకోవద్దూ, నన్నుకొట్టొద్దు " అనే స్టిక్కర్లు పెట్టుకుని, ఆ తరువాత వాళ్ళు వద్దు అన్న పని చేసేశాక భోరున ఏడుస్తూ ప్రిన్సిపాల్ గారికి కంప్లయింట్ గొడవలూ అన్నీ ఎందుకు చెప్పండీ?" అంటూ ఆమె చెయ్యి నెమ్మదిగా వదిలేశాడు.
అతను వదిలీ వదలగానే ఆమె చెయ్యి ఊహించనంత వేగంతో మళ్ళీ లేచి అతని చెంపని తాకింది.
ఈ 'ఎటాక్' అతను ఊహించలేదు. ఒక సగటు ఆడపిల్లకి, అటువంటి షాక్ తరువాత, కోలుకోవడానికి కనీసం కొన్ని నిమిషాలు పడ్తాయి అనుకున్నాడు. అతని అంచనాలకి భిన్నంగా ఆమె అతన్ని ఆశ్చర్యపరిచింది.
అభినవ్ అప్రయత్నంగా చెంప తడుముకున్నాడు.
"బీ కేర్ పుల్! మరొకసారి నాకు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తే , అటువంటి దెబ్బలు ఇంకా రుచి చూస్తావు" చెప్పింది వ్యంగ్యంగా నవ్వుతూ.
అభినవ్ పెదవి మీద చిరునవ్వు మాయమయింది. వెనక్కి తిరగబోతున్న ఆమె భుజం మీద చెయ్యి వేశాడు.
ఈసారి కొంచెం తత్తరపాటుతో అతడ్ని చూసింది మంజీర.
"మగవాడ్ని చెంప మీద కొట్టడం కాదు, చేతనైతే తెలివితో పడగొట్టు, అప్పుడు ఒప్పుకుంటాను నీ గొప్పతనం" చెప్పాడు అభినవ్.
అప్పటికే చాలా మంది వాళ్ళ చుట్టూ గుంపు క్రింద చేరారు.
మంజీర ఆశ్చర్యంగా అతన్ని చూస్తుండి పోయింది.
