Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 7


    అతను నిమిషం ఆగి, చుట్టూ చూసి,  తిరిగి చెప్పసాగాడు. "నన్ను ముచ్చటగా మూడు సార్లు పడకొట్టి , "పూల్ ని చేస్తే కనక కాలేజీ ఆవరణలో , అందరి మద్యలో నీ చేత మరోసారి చెంప దెబ్బ తింటాను. అదీ ఓ నెల రోజుల్లోగానే.....లేకుంటే..."
    "లేకుంటే..... ఆలస్యం పట్టలేనట్లు మంజీర అడిగింది.
    "నువ్వు అందరి ముందూ నిలబడి, చెంప లేసుకుని, నాకు చేతులు జోడించి క్షమార్పణలు చెప్పాలి."
    "డన్" అంది బొటనవేలు పైకెత్తి.
    అభినవ్ పెదవుల మీద ఎప్పటిలాగానే చిరునవ్వు మెరిసింది.
    "క్లాసెస్ కి పదండి" అందర్నీ ఉద్దేశించి చెప్పాడు.
    అందరూ గొప్ప ఉత్సాహంగా చూస్తున్నారు.
    మంజీర విసురుగా వెళ్ళిపోయింది. క్లాసు వైపు కాడుం కారు వైపు.
    "అభినవ్ మేన్ ఆఫ్ ది డే" అరిచింది ఓ అమ్మాయి.
    అందరూ ఆమెకి వంత పాడారు.


                                                      *    *    *    *

 

    "ఏం జరిగింది ? కాలేజి కి వెళ్ళిన దానివి అంతలోనే తిరిగి వచ్చేశావు.
    వచ్చినప్పటి నుండి మాట్లాడకుండా మూగం వేసి పడుకున్నావు. వాట్ హపెండ్ బేబీ!: అంటూ అడిగింది సుమిత్ర.
    మంజీర మాట్లాడలేదు. నుదుట మీద అరచెయ్యి పెట్టుకుని ఆలోచిస్తోంది. "ఎంత ధైర్యం, చూడడానికి వెంగళయిలా , నుదుట కుంకుమ బొట్టూ , చెవి వెనుక పువ్వుతో ఉన్నాడు. అందరి ముందూ ఎంత చాలెంజ్ చేసాడు. అందరూ ఘనకార్యం చేసేసినట్లు అతన్ని పొగడడం. "ఛీ, ఛీ" ఇలా ఎప్పుడు జరగలేదు. తన చేత ఫూల్స్ గావింపబడ్డ వాళ్ళే తప్ప, ఎదురు తిరిగినవాళ్ళు ఇంతవరకూ కనపళ్ళేదు.
    ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అంటూ ప్లాన్స్ తయారు చేసుకోవడంలో మునిగిపోయింది మంజీర.
    మాటిమాటికీ అతనే గుర్తుకొచ్చి కవ్వించ సాగాడు. చిన్నవైనా లోతుగా చూసే కళ్ళు , కోటేరు ముక్కూ, వొట్టుగా ఉన్న క్రాఫ్ , నున్నగా, పొడవుగా అతి సాదాసీదా బటల్లో , వహాయి స్లిప్పర్స్ వేసుకునీ కూడా ఎంత దర్పంగా మాట్లాడాడూ? పడగొట్టాలి! తెలివిగా పడగొట్టాలి! మూడు సార్లు పరమ అధ్బుతంగా ప్లాన్ చేసి అతనో మూర్ఖుడని తెలియజెప్పాలి. అందరి మధ్యలో అతన్ని మరోసారి చేపదెబ్బ కొట్టాలి. "దటీజ్ మంజీరా!" అనిపించాలి. ఆమె ప్రతి రోమమూ ఎక్సైట్ మెంట్ టప్ నిక్కబొడుచుకున్నాయి.
    "అమ్మాయి భోజనం చేసిందా?" నారాయణమూర్తి అడిగాడు.
    "దాని మూడ్ బాగా లేనట్టుంది, చెయ్యనంది." సుమిత్ర వడ్డిస్తూ చెప్పింది.
    "కాలేజికి వెళ్ళిందా?"
    "ఆ, వెళ్ళి వచ్చేసింది."
    "ఎమిటట విశేషాలు?"
    "నాతొ ఏం చెప్పలేదు. మీరే అడిగి తెలుసుకోండి." ఆమె తన పని పూర్తీ చేసి ఒక నవల పట్టుకుని ఎదురు కుర్చీలో కూర్చుంది.
    "మంజూ " పిలిచాడాయన.
    తండ్రి పిలిచేసరికి , రాక తప్పలేదు మంజీరకి. వచ్చి విసుగ్గా ఎదురుగా కూర్చుంది.
    పూజ పూర్తి చేసుకుని అరుంధతి కూడా వచ్చింది.
    "కూర్చో అమ్మా!" అన్నాడు నారాయణమూర్తి.
    ఆమె కుర్చీ కాస్త అవతలకి జరుపుకుని, భోజనాల బల్ల తనకి తగలకుండా కూర్చుంది.
    "నాకు ఆకలిగా లేదు" విసుగ్గా చెప్పింది మంజీర.
    "ఏం జరిగింది ?"  గట్టిగా అడిగాడు తండ్రి.
    మంజీర ఇంక ఆగలేకపోయింది. "ఆ ఫూల్ నాకు నీతులు చెప్పాడు అందరి ముందూ! అందుకని కొట్టాను. కొట్టినా బుద్ది రాలేదు. " నన్నే చాలెంజ్ చేస్తున్నాడు పెద్ద జేమ్స్ బాండ్  లాగా."
    "ఏ ఫూల్?" అయన తినడం ఆపి, కూతురి వైపు గాభరాగా చూసాడు.
    అరుంధతి అయోమయంగా చూస్తోంది ఇద్దర్ని.
    "అభినవ్ ట!"
    అయిపొయింది. అనుకున్నంతా అయింది. మొదటిరోజే ఎవడితోనో జగడం పెట్టుకుని వచ్చింది. ఇంకవాడు ఊరుకుంటాడా? ఓ పదిమందిని వేసుకుని ఇంటి మీదకు వస్తే, ఇంటి పరువు ఏమైనా ఉంటుందా? అరుంధతి గుండెలు గడగడలాడాయి. సుమిత్ర వంక చూసింది.
    సుమిత్ర చాలా సీరియస్ గా నవల చదువుకుంటుంది.
    "ఎవరు అతను? నీకు అసలు నీతులు ఎందుకు చెప్పాడు?" అడిగాడు నారాయణమూర్తి.
    మంజీర వెక్కిరింతగా చెప్పింది. "ఆడపిల్లలు స్టిక్కర్స్ అవీ,  పెంట్స్ పైనా షర్ట్స్ పైనా పెట్టుకోకూడదట. అవి మగపిల్లల్ని రెచ్చకొడ్తాయట!"
    "మంచి మాటేగా! మనసులో అనుకుని, మరి నువ్వు ఎందుకు కొట్టావు?" అడిగాడు అయన.
    "నా మీద చెయ్యి వేసి, నా స్టిక్కర్ చింపేసాడు."
    "మరి నువ్వు కొడ్తే అతను ఊరుకున్నాడా?"
    "లేదు! నాతొ పెద్ద చాలెంజ్ చేసాడు." అంటూ నవ్వి, "నేను వరుసగా మూడుసార్లు అతన్ని ఫూల్ చెయ్యగలిగితే అందరి మధ్యలో మరో చెంప దెబ్బ తింటాడట. లేని పక్షంలో...."
    "లేని పక్షంలో ...... " అరుంధతి ఆత్రంగా అడిగింది.
    "లేకపోతే , నేను అందరి మధ్యలో చెంపలు వేసుకుని అతనికి క్షమార్పణ చెప్పలట."
    తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. నారాయణమూర్తి అరుంధతిలు.
    సుమిత్ర కూడా విన్నట్టుంది. "నో బేబీ! అలా జరగనివ్వకు, మంచి ప్లాన్ ఆలోచించు, అతన్ని మరోసారి చెంపదెబ్బ కొట్టి నీ తడాఖా చూపించు" అంది ఉత్సాహంగా.
    అరుంధతి ఇంక ఊరుకోలేకపోయింది. "అదేమిటి? అలాగేనా తల్లి చెప్పాల్సింది. ఏదో బడికి వెళ్ళి బుద్దిగా పాఠాలు , అవీ విని నేర్చుకు రావాలి కానీ, ఆ పోటీలు, పోట్లాటలూ, అదీ మగపిల్లలతో ఎందుకే ?" అంది.
    "గ్రానీ! నీకేం తెలియదు, నువ్వు ఊరుకో" చిరాగ్గా అంది మంజీర.
    నారాయణమూర్తి అన్నాడు, "ఔనమ్మా గ్రానీకి ఏం తెలుసు? ఆడపిల్లలూ ఒద్దికగా ఉండాలనీ, కన్నవాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని తెలుసు కానీ ఇలా బరితెగించి, మగపిల్లల్ని కొట్టడం, రెచ్చగొట్టడం ఇవన్నీ ఆవిడకేం తెలుసు" బాధతో పాటు శ్లేష ధ్వనించింది అతని గొంతులో.
    సుమిత్రా, మంజీర లేచి లోపలికి వెళ్ళిపోయారు.
    నారాయణమూర్తి కళ్ళూ, అరుంధతి కళ్ళు కలుసుకున్నాయి. అరుంధతి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అంతా సర్దుకుంటుంది , కంగారు పడకు" అన్న భావం వుంది.
    తనలో తనే చెప్పుకుంటున్నట్లు చెప్పసాగాడు అతను. " అక్కడ పీటర్ అనే కుర్రాడితో స్నేహం చేసింది. వాడ్ని వదిలించడం నా తరం కాలేదు. వాడికి సరైనా అమ్మా, నాన్నా చదువూ సంధ్యా ఏమీ లేవు! వొట్టి పోరంబోకు. సుమిత్ర ఏం పట్టించుకోదు, పైగా " ఈ కాలం పిల్లల సంగతి మీకు తెలీదు , మీ మేనత్త పెంపకంలో మూడు గుచ్చిగా పెరిగారు" అంటుంది. వాడి పీడ తప్పించుకోవడం కోసం, ఇలా అర్ధంతరంగా మంచి ఉద్యోగం వదిలి పెట్టుకుని వచ్చేయాల్సివచ్చింది." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS