"ఆశ్వర్దకి ఏమీ వినబడటం లేదు, కనబడటం లేదూ! నవ్వుతున్న మంజీర మాత్రం లీలగా కనిపిస్తోంది.
* * *
"నారాయణా, నీతో కూడా రావడానికి నిర్ణయించుకున్నాను" చెప్పింది అరుంధతి.
నారాయణమూర్తి కళ్ళల్లో అనందం తొణికిలాడింది.
"హాయ్! గ్రానీ కూడా వస్తోందా> ఫెంటాస్టిక్" మంజీర అరిచింది.
సుమిత్ర భావరహితమైన కళ్ళతో కూతుర్ని చూసింది.
గూట్లోంచి 'శ్రీరామ పట్టాభిషేకం' ఫోటో, పోతన 'భాగవతం' తీసుకుని గడప దాటి ఇవతలకి వచ్చింది అరుంధతి.
పుట్టినప్పటి నుండీ కష్టం , సుఖం అన్నీ ఆ ఇంట్లోనే గడిచాయి. అత్తారింటి మొహమే చూడలేదు. పురాణానికో, గుడికో తప్ప, ఆ ఇల్లు కదలల్సిన అవసరమే రాలేదు. కానీ, ఇప్పుడిలా ఏకంగా ఊరే వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తోంది.
ఎవర్ని చూసినా కళ్ళల్లో నీళ్ళు చిపిల్లుతున్నాయి. కానీ మాట రావట్లేదు. అందరూ వచ్చి పలకరిస్తున్నారు. రామాలయం పూజారి గారూ, "అరుంధతి ఆ పట్నంలో ఇమడగలవా తల్లీ!" అన్నారు.
ఆమె సమాధానం చెప్పలేకపోయింది.
అశ్వర్ధ ఇంటి వైపు చూస్తే, అతని తల్లీ, తండ్రి ఏదో తప్పు చేసినట్లు తలలు దించుకున్నారు.
చివుక్కుమంది అరుంధతికి! ఎన్నో ఏళ్ళుగా ఉన్న స్నేహం , నిమిషంలో పుటుక్కున తెగిపోయింది. ఆశ్వర్దని రోజుల పిల్లాడి అప్పటి నుండి చూస్తోంది. వొట్టి వెధవ! వాడిని ఈ మంజీరనే రెచ్చగొట్టి ఏదో చెప్పి వుంటుంది. లేకపోతే వాడు అలా చెయ్యడు' అనుకుంది మనసులో.
"కారేక్కమ్మా" నారాయణమూర్తి చెప్పాడు.
అరుంధతి నెమ్మదిగా ఎక్కి వెనక్కి చేరగిలబడి కూర్చుంది. ఏదో తెలియని దిగులు! తన సర్వస్వం విడిచి పెట్టి , ఏవో తెలియని సుదూర తీరాలకి వెళ్ళిపోతున్నట్లుగా దార్లో కనిపించిన అందరికీ చెయ్యి ఊపుతూ వీడ్కోలు చెప్తోంది. అందరూ కంట నీరు పెట్టుకుని మరీ సాగనంపుతున్నారు. ఊరు దూరమవుతున్న కొద్ది మనసు భారమయింది.
మంజీర ఏదో పుస్తకం చదువుతూ , మూతి వంకరగా పెట్టి నవ్వుకుంటోంది. ఆ పుస్తకం అట్ట మీద పరమ అశ్లీలమైన బొమ్మ ఉంది. మంజీర వైపే రెప్ప ఆర్పకుండా చూసింది. కన్ను తిప్పుకోనివ్వని అందం, అణుకువ ఆవగింజంత కూడా లేదు. ఆ మహా పట్టణంలో నారాయణకి ఈ పిల్ల వల్ల ఏం తిప్పలు వచ్చి పడతాయో!" అనుకుంది.
సుమిత్ర చెవుల చుట్టూ స్కార్ఫ్ కట్టుకుని , నిండా షాల్ కప్పుకుని నిద్ర పోతోంది, చీకూ చింతా లేకుండా.
నారాయణమూర్తి డ్రైవ్ చేస్తూనే ఆలోచించసాగాడు. మేనత్తని ఒప్పించి తమతో తీసుకు వెళ్ళడం అతనికి జీవితంలో గొప్ప "ఎచీవ్ మెంట్' గా అనిపించింది.
* * *
దేవుడి కుంకుమ అతడి నుదుటిన దిద్దింది జానకి. ఆ తరువాత భక్తిగా ఒక పువ్వు తీసి అతని చెవి వెనకాల పెట్టింది.
"టిఫిన్ బాక్సులో అన్నం కలిపి పెట్టనా?" అతను అన్నం తింటూ ఉండగా అడిగింది.
"వద్దులే అమ్మా, మొదటి రోజుగా, త్వరగా వచ్చేస్తాను"
"పోనీ రెండు కజ్జి కాయలైనా....."
అభినవ్ అదే చిరునవ్వుతో తల్లి వైపు చూసి "వద్దన్నగా" ఆన్నాడు.
ఆమె మరి మాట్లాడలేదు.
అభినవ్ పుస్తకాలు తీసుకుని గుమ్మం దాకా వచ్చి , "ఎదురు రా అమ్మా" అన్నాడు.
"నేనా!"
"అవును! లేకపోతే వెళ్ళను" మొండిగా చెప్పాడు.
జానకికి అప్రయత్నంగా కంటనీరు తిరిగింది. కొంగుతో కళ్ళు అడ్డుకుంటూ గుమ్మం దిగింది.
అభినవ్ నవ్వుతూ గుమ్మం దిగుతుంటే, ఆమె ఎదురు నడిచింది. నుదుట ఎర్రని కుంకుమ బొట్టుతో, సాదా నేత చీరలో, కొంగు నిండా కప్పుకుని ఎదురొస్తున్న తల్లి అతని కళ్ళకి పులకించిన పుడమి తల్లిలా కనిపించింది.
ఆ కళ్ళలో ఆశలూ, ఆశయాలూ అతనికి తెలుసు! తననో పెద్ద ఇంజనీర్ గా చూడాలని, చిన్నప్పటి నుండీ ఆమె పడిన అవస్తలు అతనికి తెలుసు! ఈరోజు తను పైనల్ ఇయర్ లోకి అడుగు పెడ్తున్నాడు. ఈ విజయాన్ని పంచుకోవడానికి ఆనందించడానికి వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు!
