ఆ అమ్మాయి మాట్లాడలేదు.
"ఆయన రేప్రొద్దున్న వస్తానన్నారా?"
వస్తానన్నారన్నట్టు తలూపింది. మరో నాలుగయిదు ప్రశ్నలు వేశాను. దేనికీ స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఈ లోపులో లోపల ఫోన్ మ్రోగింది. ఆ అమ్మాయికన్నా ముందే నేనువెళ్ళి ఫోన్ అందుకున్నాను.
"హల్లో...." ఆయన కంఠం.
రిసీవర్ ఆమెకి అందిస్తూ "నేనిక్కడ వున్నట్టు చెప్పకు" అన్నాను.
ఆ అమ్మాయి బెదురుతూ తలూపింది. ఫోన్లో ఆయన కంఠం స్పష్టంగా వినిపిస్తూ ఉంది- "ఏమీ భయంలేదు. హాయిగా నిద్రపో, రేప్రొద్దున నేను వస్తాను. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం".
"అలాగే" ఫోన్ పెట్టేసింది.
"ఊ- ఇప్పుడు చెప్పు ఎవరునువ్వు? నీ పేరేమిటి?"
"శ్రీ... శ్రీదేవి"
"మీ అమ్మ పేరు?"
"ఇందిర"
"ఆనందరావుగారు నీకేమవుతారు?"
ఆ అమ్మాయి మోహంలో ఆశ్చర్యం కనిపించింది. ఇదికూడా నీకు తెలియదా అన్న ఆశ్చర్యమో, ఇప్పటివరక్జూ పోలీస్ స్టేషన్ లో చెప్పాను కదా అన్న ఆశ్చర్యమో....
"మా నాన్నగారు" అంది. నా మొహంలో మారే భావాలు కనుపించకుండా జాగ్రత్తపడి "అన్నలు, చెల్లెళ్ళు ఎవరైనా వున్నారా?" అని అడిగాను.
"ఎవరూ లేరు".
"నువ్వు ఒక్కత్తివే కూతురివా?"
"అవును"
"ఎక్కడుంటారు మీరు?"
"ఈ వూరుకాదు, విజయనగరం".
"మీ నాన్నగారేం చేస్తూ వుంటారు?"
"తరళా ఫెర్టిలైజర్సు లో ఇన్ స్పెక్టరు. ఎప్పుడూ వూళ్ళు తిరుగుతూ వుంటారు.
"ఓహో అలాగా" అనుకున్నాను.
"మీ అమ్మగారేం పనిచేస్తూ వుంటారు?"
"స్కూల్లో టీచరు".
"మరి నువ్వీ ఊరు ఎలా వచ్చావు? బ్రోతల్ కంపెనీలో ఎలా చేరావు?"
ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. చాలా సేపటి వరకూ ఏడుస్తూనే వుంది. నా పరిస్థితీ అలాగే వుందిగానీ, కోపంతోనూ ఎవరిమీదో తెలియని కసితోనూ దేహం కుతకుత ఉడికి పోతూ వుంది.
"నేనూ, అమ్మా, నాన్నగారూ కాశ్మీర్ వెళ్ళాం" చెప్పటం ప్రారంభించింది.
"ఎప్పుడు?" తుపాకి గుండులా వచ్చింది నా నోటినుంచి ప్రశ్న.
"మొన్న మార్చిలో..."
మార్చి పదినుండి ఇరవైవరకూ కోయంబత్తూరులో ఏదో మీటింగ్ వుందని ఆయన వెళ్ళారు. ఇందుకన్నమాట.
"నెల కెన్ని రోజులు వుంటారు విజయనగరంలో?"
"ఎప్పుడూ క్యాంపులు తిరుగుతూ వుంటారు. ఇంట్లో రెండు మూడు రోజులే వుంటారు. అందుకే నాన్నకీ అమ్మకీ గొడవ అవుతూ ఉంటుంది".
"ఏమని?"
"ఆ ఉద్యోగం మానేసి ఇంకేదైనా చూసుకోమంటుంది అమ్మ. నాన్నగారు వినరు. కాశ్మీరులో ఇంకా పెద్ద గొడవైంది. మమ్మల్ని విజయనగరంలో దింపేసి వచ్చేశారు. అప్పట్నుంచి మళ్ళీ రాలేదు. అమ్మేమో భోజనం కూడా మానేసింది. మొన్నొక రోజు కిరసనాయిలు కూడా మీద పోసుకుంది. నాకేమో చాలా భయం వేసింది" అంటూ వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది.
"నీ చిన్నప్పటినుంచీ మీ నాన్నగారు ఇంతేనా? అంటే ఇలా క్యాంపుల్లోనే తిరుగుతూ వుండేవారా?"
ఆ అమ్మాయి తలూపింది.
"మీ ఇద్దరే ఉండేవారా ఇంట్లో?"
తలూపింది.
"మరి మీఅమ్మ కిరసనాయిల్తో కాల్చుకోబోతే ఏం చేశావు?"
"నాన్నని బ్రతిమాలి తీసుకొస్తానని చెప్పాను. పోలీసుగారూ! మీరే చెప్పండి ఎన్నేళ్ళు ఇలా ఒక్కళ్ళమే ఉండటం? నాన్నకేమో ఆ కంపెనీలో ఉద్యోగం మానెయ్యటం ఇష్టంలేదు. అందుకని నేనే ఆ కంపెనీ ప్రొప్రైటర్ ని కలుసుకుని 'నాన్నగార్ని వేరే డిపార్టుమెంటుకి మార్చండి. లేకపోతే మా అమ్మ చచ్చిపోతుంది' అని చెపుదామనుకున్నాను".
"ఆ ప్రొప్రైటరు దుర్మార్గుడూ, వంచకుడూ అయితే?"
"నాన్నగార్ని తీసుకువెళ్దామని వచ్చాను. అమ్మ చాలా మంచిది. నాన్న గార్ని వదిలి ఉండలేక దెబ్బలాడిందే తప్ప ఇప్పుడెంతో బాధపడుతూంది. తను ఎప్పుడూ ఇంట్లో లేకపోతే మాకు ఒంటరిగా దిగులుగా వుంటుంది. అయినా మరీ ఇంత కోపమా? నాలుగు నెలల్నుంచీ ఒక్కసారి కూడా రాలేదు. అందుకే నేనొచ్చాను".
"ఈ వూరెప్పుడొచ్చావు?"
"సాయంత్రం రైల్లో వచ్చాను. ఎక్కడికెళ్ళాలో తెలియలేదు. అంతలో ఎవరో కనపడి తనకి ఈ అడ్రసు తెలుసునని తీసుకెళ్ళి..." ఆపైన పూర్తి చేయలేదు. మిగతాది అర్ధమైంది. అదృష్టవంతురాలు ఈ అమ్మాయి! ఈ రాత్రేగానీ రైడింగ్ జరక్కపోయివుంటే... ఈ పువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపివేయబడి వుండేది.
"పైకి మంచివాడిలాగానే కనబడ్డాడు. బ్రోకరు అనుకోలేదు" అంది.
"పైకి మంచివాళ్ళుగా కనబడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదమ్మా. నీకింకా చాలా అనుభవం రావాలి. ఇంత వయసున్న నాకే ఆ అనుభవంలేదు" లేచి నిలబడుతూ అన్నాను.
"ఇక నువ్వు పడుకో! మీ నాన్నగారు ప్రొద్దునే వస్తారు. అంతేకాదు. ఈ ఇనెస్పెక్షన్లుండవు కూడా మీతోనే వుంటారు. ఎక్కడికీ కదలకుండా".
"అంటే... మీ ఇన్ స్పెక్టర్ గారితో చెప్పి సెక్షన్ మార్పిస్తారా?"
"సెక్షన్ కాదు- కంపెనీయే మార్పిస్తాను" అని అక్కన్నుంచి వచ్చేశాను.
లిఫ్ట్ లో దిగుతున్నంతసేపూ నా మనసు నా స్వాధీనంలో లేదు. ఒక ఎరువుల కంపెనీ మానేజింగ్ డైరెక్టరుగా ఆయన ఎక్కువ టూర్లు చేయటం గానీ, క్యామపులకి వెళ్ళటంగానీ అవసరం లేదు. కానీ ఆయన నెలరోజులు ఏదో ఒక పనిమీద వూరు ఎందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్ధమవుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా, మొన్న వేసవిలో ఇంకేదో వూరని చెప్పి, కాశ్మీరు భార్యాబిడ్డలతో వెళ్ళటం....ఆ తరువాత వచ్చాక ఆయన కోయంబత్తూరునించి తెచ్చినవి అని, సాహితీ, సాకేతలకు బట్టలు కూడా ఇచ్చారు. మా ముగ్గుర్నీ కూర్చోబెట్టి 'అక్కడి విశేషాలు' అంటూ చాలా కబుర్లు చెప్పారు. అక్కడి సంగతులు కళ్ళకి గట్టినట్టు వర్ణించారు.
అదే నాకు అసహ్యంగా వుంది.
