ఒక మనిషిమీద కోపం వచ్చినా, ఇష్టంలేకపోయినా భరించవచ్చు కానీ అసహ్యం వేస్తే కష్టం. ఆయనేగానీ నేను ఫలానా కారణాలవల్ల ఒకమ్మాయిని ఈ రకంగా "ఉంచుకున్నాను" అని నాకు చెప్పివుంటే పరిస్థితి వేరే రకంగా వుండేది. నేనిలాంటివి అసలు సహించననీ, విడిపోతాననీ, నా మనస్తత్వం ఆయనకు తెలుసు నేను విడిపోయిన మరుక్షణం తరళా ఫెర్టిలైజర్....ఆయన అందుకోసమే నాతో ఉన్నారా?
....ఆ వూహే భరించలేకపోయాను.
మాది చాలా అన్యోన్యమైన కాపురం అని ఇంతకాలం అనుకుంటూ వచ్చాను. ఆయన చాలా బాగా చూసుకుంటారు. కాని అదొక్కటే కాదుగా కావల్సింది. ఈ అమ్మాయి వయసు చూస్తూంటే, చాలా చిన్నపిల్లలా కనపడుతూంది. నాకు మొదట ఒక మగపిల్లవాడు పుట్టి పోయాడు. వాడు బ్రతికివుంటే ఇరవైరెండు దాటి ఉండేవి. ఈ లెక్కన - మా వివాహమైన ఏ ఆరేడు సంవత్సరాలకో ఆ విజయనగరం అమ్మాయితో పరిచయం అయివుండాలి. ఆమెకు ఈయన అవివాహితుడనని చెప్పి ఉండాలి.
ఎంత దారుణం!
ఇలాటి ఆయనతోనా నేను ఇన్నాళ్ళు కాపురం చేసింది?
లిఫ్ట్ ఆగింది. రాత్రి మూడు దాటింది.
రిసెప్షన్ అంతా నిర్మానుష్యంగా ఉంది.
నేను రావటం వాళ్ళు చూడలేదనుకుంటాను. రిసెప్షనిస్టు పక్కనున్న మరో మనిషితో మాట్లాడుతున్నాడు.
"ముందు తండ్రీ కూతురూ వచ్చారు. తరువాత తల్లి వచ్చింది. కొంచెంసేపటికి కొడుకు వచ్చాడు. గమ్మత్తుగా లేదూ? అరగంటలో ఒకరి తరువాత ఒకరు రావటం..."
పిడుగుపాటులా వినిపించాయి ఆ మాటలు.
కొ...డు...కు
ఈ కొడుకెవరు?
-ఆ అమ్మాయి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. "మా అమ్మకి నేనొక్కదాన్నే.... నేనూ మీ అమ్మా ఇద్దరమే ఉంటాం!"
మళ్ళీ ఈ అబ్బాయెవరో?
రిసెప్షన్ దగ్గిరకు వచ్చి ఆ ప్రశ్నే అడిగాను.
"ఇప్పుడే వెళ్ళాడండీ మీ అబ్బాయి. ఎనీ ప్రోబ్లమ్?" అన్నాడు రిసెప్షనిస్టు మర్యాద నిండిన కంఠంతో.
నేను ఆగలేదు. వాళ్ళు ఏమనుకుంటారు? అని కూడా ఆలోచించలేదు. పరుగెత్తాను.
విశాలమైన రిసెప్షన్ చివరివరకూ పరుగెత్తి అదే వేగంతో మెట్లు దిగాను. అదే సమయానికి ఆ అబ్బాయి తన జీపు రివర్సు చేసుకుని కారిడార్ గుండా బయటికి తిప్పుతున్నాడు. లైట్ల వెలుతురు అతడి మొహంమీద స్పష్టంగా పడుతూంది.
సన్నటికేక- భయంగా, నమ్మశక్యం కానట్టుగా, నా గొంతు లోంచి కీచుమని ధ్వనించింది.
పాతిక సంవత్సరాల క్రితం మా ఆయన ఎలా వుండేవారో అచ్చుగుద్దినట్టు వున్నాడు. ఏ కోర్టుగానీ ఏ నిపుణుడుగానీ తేల్చి చెప్పనవసరంలేదు- అతడు ఆయన రక్తం పంచుకు పుట్టినట్టు.
3
ఆ యువకుడు జీపులోంచి తల బయటకు పెట్టి "ఏం మాడమ్ బ్రతకాలని లేదా?" అని అడిగాడు నేను అతడి మాటలు పట్టించుకోలేదు. అతడి మొహంవైపే చూస్తున్నాను.
మొత్తమంతా ఆయన పోలికే.
జీప్ రాడ్ పట్టుకున్నాను. "లిఫ్ట్ కావాలా మాడమ్?" అని అడుగుతున్నాడు.
"బాబూ! మీ నాన్నగారి పేరేమిటి?"
అర్దరాత్రి దాటి మూడు గంటలయిన తరువాత, వెళ్తూన్న జీపునాపి, ఒక హోటల్ ఆవరణలో అలాటి ప్రశ్న వేసినందుకు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటే అనుకుని వుండవచ్చు గాక. కానీ నేను దేన్నీ లెక్కచేసే స్థితిలో లేను ఇప్పుడు.
"మీ నాన్నగారి పేరేమిటి నాయనా" అని అడిగాను.
అతడు నావైపు చిత్రంగా చూస్తూ "మా నాన్నగారు మీకు తెలుసా?" అని అడిగాడు. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు.
"నిన్నెక్కడో చూసినట్టు వుంటేనూ".
"అసంభవం" ఇంగ్లీషులో అన్నాడు కానీ అంతలోనే సర్దుకుంటూ- "మీరు అమెరికాలో వున్నారా?" అని అడిగాడు.
"అంటే?"
"నేను నెలరోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాను".
"మీ నాన్నగారు?"
"నా చిన్నప్పుడే పోయారు. నేనూ అమ్మా అంకుల్ దగ్గిరే వుంటున్నాం-"
అతడు బహుశా నా వయసుకి గౌరవం ఇస్తూ చెపుతున్నాడు. లేకపోతే ఇంత ఓపిగ్గా సమాధానాలు ఇవ్వవలసిన అవసరం అతడికి లేదు.
"మీ చెల్లి?" అని అడిగాను.
అతడు మొహం చిట్లించి, నన్నొక పిచ్చిదాన్లా చూశాడు. "చెల్లి ఎవరు?"
"పై రూమ్ లో వుంది-శ్రీదేవి".
అతడి దృష్టి గూర్ఖామీద పడింది. వాడిని పిలవబోతుంటే, "-నేను పిచ్చిదాన్ని కాదు" అన్నాను.
"మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధంకాలేదు. శ్రీదేవి గానీ, భానుప్రియ గానీ నా కెవరు తెలీదు. నేనీ హోటల్లో పదిరోజుల్నుంచీ వుంటున్నాను. రాత్రి రావలసిన ఫ్లయిట్ ఆలస్యం అయింది. అందుకే విమానాశ్రయానికి వెళుతున్నాను. అందులోనే అమ్మ అమెరికానుంచి వస్తోంది. నా పేరు గోపీచంద్ అమ్మ పేరు భాగ్యేశ్వరీదేవి. మా నాన్న గారు చిన్నప్పుడే పోయారు. అమ్మకి నేనొక్కన్నే సంతానం" గడగడా చెప్పాడు నన్నొదుల్చుకోవటానికా అన్నట్టు ఆ తరువాత మరి నేను మాట్లాడటానికి వీల్లేకుండా, గేరు మార్చి జీపు ముందుకు పోనివ్వబోయాడు.
"మీ నాన్నగారి పేరు?"
"ఆనందరావు".
కాళ్ళు తడబడకుండా, ముందుకు తూలిపోకుండా అతికష్టంమీద నిభాయించుకుంటూ ఆఖరి ప్రశ్న అడిగాను. "మీ ఇంటి పేరు?- అదే మీ నాన్నగారి ఇంటిపేరు?"
"అయినంపూడి....ఐనంపూడి ఆనందరావు" జీపు శబ్దంలో అతడి మాటలు కలిసిపోయాయి.
నా కాళ్ళక్రింద భూమి విచ్చుకున్నట్టు అనిపించింది. ప్రపంచం అంతా గిర్రున తిరిగిపోతోంది. క్రింద పడకుండా పట్టుకున్నాను.
మా ఆయన పేరు అది. పూర్తిపేరు.
* * *
