Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 5


    
    ఇన్ స్పెక్టర్ మాట్లాడిన ఒక వాక్యం నన్ను వెంటాడుతోంది. పోలీసుల దగ్గిర సాక్షుల స్థితి తెలిపే వాక్యం అది! ఆలోచించే కొద్దీ కొత్త అర్ధాలు స్ఫురించే వాక్యం అది. మామూలు సాక్ష్యం కాదు. నా భర్త నిజాయితీకి సంబంధించిన సాక్ష్యం అది.
    
    పోలీసు స్టేషను దగ్గిర పడుతూంటే నా అనుమానం నిజమైన సూచన్లు కనబడ్డాయి. రేపొద్దున్న కోర్టులో హాజరు పరచవలసిన అమ్మాయిని ఇన్ స్పెక్టర్ ఆయనకీ వప్పచెప్పుతున్నాడు. ఆయన ఆ అమ్మాయిని తీసుకొచ్చికారు ఎక్కించాడు. రాత్రి మూడింటికి కారు ఆ నిర్మానుష్యమైన వీధుల్లో నెమ్మదిగా ఎక్కడికో వెళుతూంది.
    
    కాస్త దూరంలో నేను అనుసరిస్తున్నాను. ఇన్ స్పెక్టర్ వాక్యానికి నా మనసులో ఇప్పుడు పూర్తిగా ఒక అర్ధం రూపు దిద్దుకుంది.
    
    "-ఫోటోతో పాటూ వేరే సాక్ష్యాలు ఇంకేమీ లేవు. అనవసరంగా మా యస్సై ఇంతవరకూ తీసుకొచ్చాడు. అప్పుడే ఆ ఫోటో చింపేస్తే సరిపోయేది కదా".
    
    ఆయన తన కూతుర్ని ఎక్కడికి తీసుకు వెళ్తున్నాడు?
    
    ఫోటో చింపేసినట్టు ఇప్పుడు....
    
    నా భర్త గురించి ఆ విధంగా ఆలోచించలేక పోయాను.
    
    వ్యభిచార గృహంలో ఆ అమ్మాయి తల్లి ఉందా?
    
    నా సవతి...?
    
    అక్కడికి వెళ్తున్నారా ఇద్దరూ?
    
    అయితే ఆ అపూర్వ సంగమంలో నేనూ ఉండాలి. అటో ఇటో తేల్చుకోవటానికి...
    
    ఆయన కారు వెనకే నా కారు పోనిస్తున్నాను.
    
    ఈ పోలీసులు ఏ ప్రాంతంలో రైడింగ్ చేశారో తెలీదు. అందువల్ల ఆయన తన భార్య (మొదటి భార్య అనాలా? రెండో భార్య అనాలా?)ని కలుసుకోవటానికి ఎటువైపు వెళ్తున్నారో నాకు తెలీదు.
    
    ఆయన బహుశా కూతురితో మాట్లాడుతూ డ్రైవింగు చేస్తూ ఉండి వుండవచ్చు. అందువల్ల నెమ్మదిగా పోనిస్తున్నారు. డ్రైవింగు సరిగ్గా రాని నాకు అదో విధంగా లాభించింది.
    
    ఇంతలో కారు అకస్మాత్తుగా కుడివైపు తిరిగి ఒక స్టార్ హోటల్ లో ప్రవేశించింది. నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఒక వేశ్యాగృహంలో దొరికిన అమ్మాయితో కలిసి ఈయన ఇంత ఖరీదైన హోటల్ లోకి ప్రవేశించటం! నేను కారుని బయటే ఆపి, వాళ్ళు లోపలికి వెళ్ళాక, అప్పుడు అడుగు పెట్టాను.
    
    ఆయన కౌంటర్ దగ్గిర వ్రాస్తున్నారు.
    
    అంటే గది అద్దెకు తీసుకుంటున్నారన్నమాట.
    
    కన్న కూతుర్ని అంత ఖరీదైన హోటల్లో వుంచటం అభినందనీయమే అయినా, యింటికి తీఉస్కురాకపోవటం మరింత అభినందనీయం.
    
    ఇద్దరూ కలసి లిఫ్ట్ లో వెళ్ళారు. వాళ్ళు కదిలారని నిశ్చయించుకున్నాక నేను రిసెప్షన్ దగ్గిరకి వెళ్ళాను.

    "ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళు 'చెకిన్' చేశారు. ఎంత ఆ రూమ్ నెంబరు?"
    
    అతడు నావైపు చిత్రంగా చూశాడు. చూస్తాడని నాకు తెలుసు. తండ్రీ కూతురు అందులోనూ ఏ సామాను చేతిలో లేకుండా గది తీసుకున్న రెండు నిముషాలకి తల్లి వచ్చి వాకబు చేయటం అతడికి ఆశ్చర్యం కలిగించటంలో ఆశ్చర్యం ఏముంది. అయినా అతడు తన భావాలు పైకి చూపించకుండా గది నెంబరు చెప్పాడు. పెద్ద హోటళ్ళలో వుండే తరహాయే ఇది. ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు వచ్చినా ఇలా భావరహితంగానే ప్రవర్తిస్తారు.    

    నా మనసు చాలా ప్రశాంతంగా వుంది. ఏదైనా ఒక పెద్ద గొడవ జరగబోయే ముందు ఇలాగే ప్రశాంతంగా వుంటుంది.
    
    లిఫ్ట్ లో వెళ్ళాను.
    
    విశాలమైన వరండా, వరుసగా ఇరువైపులా గదులు.
    
    1021 నెంబరు దగ్గిర నిలబడ్డాను.
    
    ఈ స్టార్ హోటళ్ళలో వచ్చిన చిక్కేమిటంటే, తలుపు లోపల ఆటోమాటిక్ గా తాళం పడుతుంది. బయటివాళ్ళకి లోపలి వారు గడియ వేసుకున్నదీ లేనిదీ తెలీదు.
    
    ఏం చెయ్యాలా అని కొద్దిసేపు ఆలోచించాను.
    
    తలుపు కొట్టవచ్చు. దానివల్ల లాభం ఏముంది. ఆయన తలుపు తీస్తాడు. ముందు ఆశ్చర్యపోతాడు. కానీ తరళా ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టరు కదా! క్షణాల్లో సర్దుకోవటం తెలుసు. "ఎవరో అమ్మాయి, నేను తండ్రినని బ్లాక్ మెయిల్ చేస్తూంది. పోలీస్ స్టేషన్ లో అయితే రేపు పేపరు వాళ్ళెవరైనా చూస్తే ఇదంతా పబ్లిక్ అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. నెమ్మదిగా అసలు విషయం కనుక్కుందామని..." అని తేల్చేస్తాడు.
    
    అసలే పోలీసులు, రైడింగ్, పోలీస్ స్టేషన్, ఇప్పుడీ స్టార్ హోటలు- వీటితో బెహ్దిరిపోయిన ఈ అమ్మాయి ఏం మాట్లాడగలదు.
    
    -కాబట్టి అదికాదు నేను చెయ్యవలసింది.
    
    "ఏం చెయ్యాలా" అని ఆలోచనలో ఉండగా, తలుపు చప్పుడయ్యింది. అక్కణ్నుంచి చీకట్లోకి వేగంగా తప్పుకున్నాను. కాని దురదృష్టవశాత్తు అక్కడ కూడా లైటు వుంది.
    
    గబగబా మెట్లు దిగాను. పది మెట్లుదిగి, వంపులో నిలబడ్డాను. ఆయన కూడా లిఫ్ట్ కోసం ఎదురు చూడకుండా మెట్లు దిగితే నేను పట్టుబడటం ఖాయం.
    
    నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.
    
    ఆయన లిఫ్ట్ బెల్ కొట్టి అక్కడే నిలబడ్డారు. నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు. దాదాపు పదేళ్ళ వృద్దాప్యం ఒక్కసారిగా మీద పడినట్టుంది ఆయన మొహం. జేబులోంచి కర్చీఫ్ తీఇస్ మాటిమాటికీ మొహం తుడుచుకుంటున్నారు. అప్పటికప్పుడు ఆయన కెదురుపడాలన్న కోర్కెను బలవంతంమీద ఆపుకున్నాను. ఇప్పుడు కాదు, దానికింకా సమయముంది. ప్రస్తుతం నేను సవతి గురించి తెలుసుకోవాలి.
    
    ఈ లోపులో లిఫ్ట్ వచ్చింది. ఆయన అందులో ప్రవేశించి క్రిందకి వెళ్ళిపోయారు. నేను వెంటనే గదిలోకి వెళ్ళలేదు. ఆయన ఎందుకోసం క్రిందకి వెళ్ళారో, మళ్ళీ వస్తారో లేదో తెలీదు. అందువల్ల కిటికీలోంచి చూశాను. ఆయన కొద్దిసేపటికి క్రింద కారు దగ్గరికి నడవటం కనిపించింది. ఆ కారు కదిలాక, వరండాలోకి వెళ్ళి రూమ్ ముందర నిలబడి బెల్ నొక్కాను.
    
    నిముషం తర్వాత తలుపు తెరుచుకుంది.
    
    ఎదురుగా పదహారేళ్ళ అమ్మాయి నిల్చుని వుంది.
    
                                      * * *
    
    కొంచెంసేపు ఎవ్వరం మాట్లాడలేదు. ఇద్దరం ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నిలబడ్డాం. ఆ అమ్మాయి నన్ను వూహించక పోవటంతో-భయం స్పష్టంగా కనిపించింది.
    
    "ఎ...ఎవరు కావాలి?" అంది.
    
    "నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను" అన్నాను.
    
    ఆ అమ్మాయి మోహంలో భయం మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. చేతులు వణుకుతున్నాయి. ఇంకో క్షణం ఆగితే ఏడ్చేసేట్టు వుంది. నాకు జాలేసింది. "కంగారుపడకు మా ఇన్ స్పెక్టరుగారు నువ్వెలా వున్నావో చూసిరమ్మని పంపారు" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS