ఒక క్రిమినల్..... చట్టం నుంచి తప్పించుకోవడమే కాక, అదొక గొప్ప విజయంలో దేశమంతా ప్రచారం చేసుకోవడానికి దూరదర్శన్ ని ఉపయోగించు కోవడం- (ప్రభుత్వానికి సంబంధించిన దూరదర్శన్ ని ఉపయోగించు కోవడం!!!)
ఏదో ఒక మిష మీద పొరుగు శత్రు దేశానికి మాటిమాటికీ వెళ్ళి రావడం, ఈ దేశాన్నే పుట్టిల్లులా వాడుకుంటూ, తన కార్యకలాపాలు కొనసాగించడం- తన అసమర్థతకి నిదర్శనం.
..... ఇక ఆగలేకపోయాడు అతడు.
ఇంటర్ కమ్ లో సెక్రటరీకి ఏదో సూచన ఇవ్వబోతూ క్షణం తటపటాయించాడు. తను తీసుకుంటున్న ఈ నిర్ణయం సరైనదో కాదో ఆలోచించాడు.
ప్రధానమంత్రి మీద హత్యా ప్రయత్నాలు, ఇంటర్ పోల్ గూఢచారి సంస్థల బ్రేక్ డవున్...... లాటి అంతర్జాతీయ కేసుల్లో తప్ప మామూలు చిన్న కేసుల్లో పాల్గోనని స్పెషల్ సీక్రెట్ ఏజెంట్ కి ఈ స్వదేశీ అంతర్గత విషయం అప్పగించడం సమంజసమా కాదా అని.
'బయట పురుగుకన్నా- లోపల క్రిమి హానికరం' అనుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇంటర్ కమ్ లో సెక్రటరీకి 'ఏజెంట్ నేత్రను పిలుపు' అని చెప్పాడు.
* * *
విశాలమైన హాలు.
నేలమీద గీతలు సమాంతరంగా, గళ్ళలా వున్నాయి.
ఒక పక్క బాక్సింగ్ బ్యాగ్ మీద ఒక వ్యక్తి పంచెస్ యిస్తున్నాడు. కొంతమంది ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. ఒక మూల చిన్న కాఫీ బార్ వుంది. కొంతమంది అక్కడ నిలబడి స్నాక్స్ సేవిస్తున్నారు. ఇంటర్ పోల్ కి ఒక రకంగా వ్యాయామశాల, శిక్షణాకేంద్రం అది. గోడకి అయిదడుగుల యివతలగా చిన్న స్టాండ్ వుంది. డానికి ఒక కాగితం, మధ్యలో నల్లటి చుక్క వృత్తాకారంలో చుట్టా గీతలున్నాయి.
చిన్న పిస్తోలు చప్పుడు. కాగితం మీద వున్న నల్లటి చుక్కలోకి బుల్లెట్ దూసుకుపోయింది. తరువాత వరుసగా మూడుసార్లు చప్పుడైంది. చిత్ర మేమిటంటే...... ఆ కాగితంమీద మరే రంధ్రమూ పడలేదు.
కేవలం కొద్దిమందికే ఆ విద్య వుంటుంది. మొదటి బుల్లెట్ చేసిన రంధ్రంలోంచే మిగతా బుల్లెట్స్ ని షూట్ చేయగలగడం.
"కంగ్రాట్స్" అన్నాడు భాస్కర్ దగ్గరగా వస్తూ, భాస్కర్ దగ్గర అతడు షూట్ చేసిన కాగితం వుంది.
అతడు నవ్వి వూరుకున్నాడు. నిశ్చయంగా అది చాలా సంతృప్తి కరమైన షూటింగ్.
అతడి ఎత్తు అయిదడుగుల ఎనిమిది అంగుళాలు. సన్నటి నడుము, ఆ పైన విశాలంగా పైకి పాకిన ఛాతీ, ఏ ప్రశ్నకైనా దాని జవాబు నవ్వొచ్చేలా మార్చగల స్పాంటేనిటీ........ యివేమీ కావు అతని ఆకర్షణలు..... అతడి కళ్ళు.
తల్లిదండ్రులు అతనికి సరి అయిన పేరు పెట్టారు "నేత్ర"
భాస్కర్ అన్నాడు "ఈ రోజు పేపర్ చదివావా?"
"చదివాను."
ఇంటర్ పోల్ కి అన్ని విదేశాల పేపర్లూ వస్తాయి.
"ఏజెంట్ క్యూ ప్రెసిడెంట్ ని రక్షించిన విధానం చాలా త్రిల్లింగ్ కదూ....?"
వెంటనే జవాబు చెప్పలేదు నేత్ర. తరువాత సాలోచనగా అన్నాడు. "విధానం వరకూ బాగానే వుంది. శత్రువు చేతిలో ఆయుధం పేలకముందే అతడి కళ్ళ మధ్యలో కాల్చడం గొప్పే. కానీ అటువంటి పరిస్థితుల్లో చెయ్యీ , మెదడూ ఒకేసారి పనిచెయ్యగలగాలి..... ఆ హడావుడిలో చురుగ్గా ఆలోచించే శక్తి ఆ ఏజెంట్ కి తక్కువైందేమో అని నా అనుమానం."
"ఏం ..... ఎందుకని....?"
"ఆ కాల్చేదేదో భుజం మీదో చేతి మీదో కాల్చవచ్చుగా. ఒక తిరుగుబాటు దారుణ్ణి చంపడం చాలా సులభం. కానీ అతడిని ప్రాణాల్తో పట్టుకుని వుంటే వెనుక యింకా ఎవరున్నదీ తెలిసేది."
భాస్కర్ సిగ్గుతో "నిజమే.... నేను ఇంత ఆలోచించలేదు. అతడు కాల్చిన విధానం చదివి త్రిల్ అయ్యాం" అని కొంచెం ఆగి, "నువ్వూ, ఏజెంట్ క్యూ తలపడితే ఎలా వుంటుందో చూడాలని నాకెప్పటినుంచో కోరిక నేత్రా. నువ్వు తెలివైన వాడివే. కానీ...... అతడు నీ కన్నా నిశ్చయంగా బలమైనవాడు" అన్నాడు.
"అవును. పఠాన్ కదా......" క్లుప్తంగా అన్నాడు నేత్ర.
"నీకు ఏజెంట్ క్యూ మీద అంత సదభిప్రాయం లేనట్టుందే" అన్నాడు భాస్కర్ నవ్వుతూ.
"నీ ప్రశ్న నాకు అర్థమైంది. 'నువ్వు నీ దేశాన్ని ఎంత ప్రేమిస్తావో అతడు తన దేశాన్ని అంత ప్రేమిస్తాడు.' అంతేనా?"
భాస్కర్ తలూపాడు. నేత్ర సాలోచనగా అన్నాడు.
"నేను నా దేశాన్ని రక్షించటానికి నా వృత్తిని ప్రేమిస్తాను. అతడు తన శత్రుదేశాన్ని నాశనం చేయటానికి తన వృత్తిని ప్రేమిస్తాడు."
"నాకర్థం కాలేదు."
"నాది డెఫిన్సివ్ రోల్. శత్రు దేశపు ఆనకట్ట బద్దలు కొట్టమని నన్ను మన ప్రభుత్వం పంపిస్తానంటే బహుశా నేను నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యవచ్చు. అతనిది అఫెన్సివ్ రోలు. లక్షమంది భారతీయుల్ని చంపే పథకం అతడి ప్రభుత్వం అతడికి అప్పగిస్తే చాలా సంతోషంగా ఆ పనిని స్వీకరిస్తాడు అతడు. అదీ తేడా."
"అది తప్పంటావా?"
"నిశ్చయంగా తప్పే-"
"నేత్రా! రేప్రోద్దున్న నేను నీలాగా సీనియర్ ఏజెంట్ నవ్వొచ్చు. ఇంటర్ పోల్ కి సంబంధించిన విషయాలమీద విదేశాలకి వెళ్ళొచ్చు. ఒక ఆపరేషన్ పూర్తి చేయటానికి ఆ దేశంలో కొంతమంది అమాయకుల్ని చంపవలసి రావొచ్చు. మరి అది తప్పంటావా?"
"ఏది తప్పు? ఏది కాదు? అన్నది మనసుకి సంబంధించింది. ఒక విదేశీ రాయబారి కార్యాలయంలో మనం దొంగతనం చేయటానికి వెళ్ళినప్పుడు అతడు మనని చూడటం తటస్థించవచ్చు. అతన్ని చంపటం రాక్షసత్వం. కానీ చంపకపొతే ఆ దేశంతో యుద్ధంవచ్చే పరిస్థితుల కది దారి తీయవచ్చు. నేను చెప్పిన ఆనకట్ట ఉదాహరణకీ, నీ ప్రశ్నకి సంబంధం లేదు."
"ఏం చదువుకున్నావు నేత్రా నువ్వు?"
నేత్ర నవ్వేడు. "చాలా తక్కువ చదువు. బియ్యే. హిస్టరీ మెయిన్ గా-"
"మరి ఈ లైన్లోకి ఎలా వచ్చావు?"
"మా తాతగారి ఆలోచన ఇది. నా రెండో ఏట మా నాన్న పోయాడు. తాతగారే పెంచారు. మిలట్రీ మనిషి ఆయన. ఈ కాలం వాళ్ళు ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా తల్లులు! పిల్లలు కిండర్ గార్డెన్ చదివే రోజునుంచి వాళ్ళని డాక్టర్లనో, ఇంజనీర్లనో చెయ్యాలనే రాక్షస ప్రయత్నంలో చదువు తప్ప మిగతా అన్ని దారులూ మూసెయ్యలేదాయన. పిల్లాడికి పది మార్కులు తక్కువొస్తే ప్రపంచ ప్రళయం వచ్చినట్టు ఏడ్చే అమ్మమ్మని తెగ తిట్టేవాడు. పైకి చాలా చిన్న విషయాలుగా కనిపించి, మనసు అభివృద్ధి చెందటానికి ఎంతగానో సాయపడే వాటిని ఎన్నో చేసాడు ఆయన."
"ఎలాటివి?"
