Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 5


    "పూజారిగారున్నారా?" అని ఆరిందాలా అడుగుతున్న వెంగమాంబను చూసి పూజారి భార్యకు ముచ్చటేసింది.
    "పూజాగారితో నీకేం పనే?" అంది నవ్వుతూ.
    "ఆయనకే చెప్పాలి" అంది వెంగమాంబ గంభీరంగా.
    "నా తల్లే. ఆయనకే చెప్పుకో. కానీ ఆయన లేరు. పోరుగూరు వెళ్ళారు. సరే కానీ లోపలికొచ్చి కాస్త మజ్జిగైనా తాగిపోవే" అంది పూజారి భార్య మురిపెంగా.
    పూజారి లేరన్న మాటతో ఉసూరుమనిపించిన వెంగమాంబ "ఏమీ  వద్దులెండి" అంటూ గుమ్మంలోంచే వెనుదిరిగి ఇంటి ముఖం పట్టింది.
     ఇంటికి తిరిగొచ్చిందన్నమాటే గానీ వెంగమాంబ మనసు మనసులో లేదు. మొక్కుబడిగా నాలుగు మెతుకులు కతికింది. తల్లి మనసు విలవిల లాడింది. "ఇలా తింటే ఎలాగే తల్లీ! ఊరికే ఆ ఇల్లూ ఈ ఇల్లూ తిరుగుతూ ఉంటావు. అందరి దిష్టీ నీకే. నాన్నగారిని రానీ, చెబుతాను" అంటూ గోలగోల చేసింది.  వెంగమాంబ  మౌనంగా ఉండిపోయింది. తల్లి మాటలు చెవికించితే కదా! తన ఆలోచన ఏనుగు చుట్టూనే తిరుగుతోంది. సాయంత్రం గుళ్ళోకి వెళ్లింది కానీ, పూజారిగారు హడావిడిగా ఉన్నారు. ఆరోజు దేవుడి దర్శనానికి భక్తులు చాలామంది వచ్చారు.
    కృష్ణయ్య ఆరోజు, రోజుకన్నా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. వెంగమాంబ  తండ్రి కోసం చూసి చూసి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఆ నిద్రలో కల. ఆ కలలో ఏనుగు! అంతలో చటుక్కున మెలకువ వచ్చింది. పక్కలో వెంగమాంబ కదులుతుంటే మంగమాంబ మెలకువచ్చి కళ్ళు తెరచింది. "మా తల్లీ మెలకువ వచ్చిందా? పడుకో" అంటూ వెంగమాంబను దగ్గరకు తీసుకుంది.

    "అమ్మా! నాకు కలొచ్చిందే. ఏనుగు కనిపించింది. పాపం ఆ ఏనుగును మొసలి విడిచిపెట్టిందో లేదో...." వెంగమాంబ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "నీ ఏనుగు బంగారం కానూ. దానికేమీ కాదు. నిద్రపోతల్లీ" అంటూ మంగమాంబ  మరింత దగ్గరకు తీసుకుంది.
    ఉదయం లేస్తూనే తెలియని ఉత్సాహం ఆవరించింది వెంగమాంబను. కాస్సేపట్లో అయ్యవారు వస్తారు. ఆ ఏనుగు కథను పూర్తిగా చెప్పమని ఈ రోజు అడగాల్సిందే. ఆయనింకేం పాఠం చెప్పినా తను వినడు, అంతే - అని గట్టిగా నిశ్చయించుకుంది. దేశికులవారు రాకుండానే చాపవేసి మంచినీళ్ళు పెట్టి ఆయన రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.
    దేశికులవారు వచ్చారు. వెంగమాంబ ఆయన కాళ్లకు మొక్కి బుద్ధిగా చాపమీద కూర్చుంది. వెంగమాంబలో గొప్ప గ్రహణశక్తి, సహజ ప్రతిభ దాగి ఉన్నాయని ఎంతో అనుభవం గల దేశికులవారు కనిపెట్టారు. పాటలల్లి పాడుతుందని కూడా ఆయన విన్నాడు. ఆ సహజ ప్రతిభకు తగిన పాండిత్యం కానీ తోడైతే బంగారానికి పరిమళం వచ్చినట్లు రాణిస్తుంది. కానీ ఈ పిల్ల తను చెప్పే పాఠంమీద కన్నా ఎంతసేపూ కథలమీదే ఎక్కువ దృష్టి పెడుతోంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది.
    "ఏం తల్లీ. అమరం చెప్పుకుందామా?" అన్నారు దేశికులవారు.
    వెంగమాంబ తల అడ్డంగా ఊపింది. "ఉహూ. ముందు ఏనుగు కత చెప్పండి" అంది.
    ఆమాటల్లో ధ్వనించిన పట్టుదలకు దేశికులవారు ఒకింత ఆశ్చర్యపోయారు. కత చెబితే తప్ప ఈ పిల్ల మనస్సును పాఠం వైపు మరలించడం కష్టమనుకున్నారు.
    "సరే, ముందు ఏనుగు కథే చేపుకుందాం. ఇంతకూ నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం?"
    వెంగమాంబ ముఖం చాటంత అయింది. "మొసలి ఏనుగు పాదాన్ని పట్టుకుంది..... అంత వరకు".
    "అప్పుడా ఏనుగు మాత్రం తక్కువ తిందా? అదీ బలశాలేనాయె. తన బలమంతా ప్రయోగించి మొసలి నుంచి పాదం విడిపించుకోవాలని చూసింది. మొసలిని నానారకాలుగా నొప్పించింది. అయినా అది మాత్రం విడువలేదు. ఆ విధంగా ఏనుగుకీ, మొసలికీ ఎన్నో సంవత్సరాలపాతు యుద్ధం జరిగింది. చివరకు ఏనుగు బలమంతా తరిగిపోయి అది నీరసించిపోయింది. ఈ మొసలిని జయించడం నావల్ల కాదని అన్న నిశ్చయానికి వచ్చింది. దానికేం చేయాలో తెలియలేదు. ఎవరిని సహాయం అడగాలో తెలియలేదు. అప్పుడు గుర్తొచ్చాడు తనేనీ, ఈ మొసలినీ, ఈ ప్రపంచాన్నీ అంతటినీ సృష్టించిన ఆ భగవంతుడు!"
    "మన శరీరంలో శక్తి ఉన్నంతకాలం మనంతటివారు లేరానుకుంటాం. ఆ శక్తి తరిగిపోయిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. ఏనుగు విషయంలోనూ అదే జరిగింది. నిన్ను తప్ప మరెవరినీ ఎరుగను. ఈ దీనుణ్ణి మన్నించు. నన్ను కాపాడు అంటూ మొరపెట్టుకున్నాడు. దీనినే శరణాగతి అంటారు. పూర్తి నమ్మకంతో భగవంతునికి తనను తాను అర్పించుకుంటే భగవంతుడే అతని యోగక్షేమాలు చూస్తాడు. అక్కడొక అద్భుతం జరిగింది".....
    "ఏమిట"న్నట్లు రప్పలు ఆడిస్తూ చూసింది వెంగమాంబ.
    "ఇక్కడి ఈ ఏనుగు పెట్టిన కేకలు అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్న ఆ సర్వేశ్వరుడికి వినిపించాయి. అప్పుడాయన ఉలిక్కిపడి లేచి పరుగు ప్రారంభించాడు. తన దగ్గరే ఉన్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు, శంఖు చక్రాలు ధరించలేదు, పరివారాన్ని పట్టించుకోలేదు, గరుత్మంతుని కూడా హెచ్చరించ లేదు, విడిపోయిన జడను కూడా సర్దుకోలేదు...." 
    "ఆ సర్వేశ్వరుడు మన వెంకటేశ్వర స్వామిలాంటివారేనా?" వెంగమాంబ ఆ రూపాన్ని ఊహించుకుంటూ అడిగింది.
    "అవును తల్లీ ! ఆ సర్వేశ్వరుడే ఈ వేంకటేశ్వర స్వామిలాంటివారేనా?" వెంగమాంబ ఆ రూపాన్ని ఊహించుకుంటూ అడిగింది.
    "అవును తల్లీ! ఆ సర్వేశ్వరుడే ఈ వేంకటేశ్వరస్వామి. అన్ని రూపాలూ ఆయనవే కదా తల్లి. ఇంతకీ ఆ పరుగు దేనికనుకున్నావ్? ఎంతో భక్తితో, ఆర్తితో, దుఃఖంతో తనను కాపాడమంటూ మొరపెట్టుకున్న ఆ ఏనుగు మొరవిని. ఈ సృష్టిలోని సమస్త జీవులూ ఆయన సంతానమే కదా తల్లీ. ఎవరికీ ఏ కొంచెం నొప్పి కలిగినా ఆయన బాధపడిపోతాడు. అయితే  అంతకాలమూ మొసలి వల్ల బాధలు పడుతున్నా ఆయన ఎందుకు  రక్షించలేదని అడుగుతావేమో! తాను బలశాలిననీ, తనకు ఎవరి సహాయమూ అవసరములేదని ఏనుగు అనుకుంది కనుక భగవంతుడు జోక్యం చేసుకోలేదు. ఆ గర్వం ఎప్పుడైతే అణగిపోయి, తనను గుర్తుచేసుకుందో అప్పుడే ఆయన సహాయానికి సిద్ధమయ్యాడు. అహంకారం ఉన్నచోట పరమాత్మ ఉండడు తల్లీ. అది అణగిపోయినప్పుడే భగవంతుడు మనకు కనిపిస్తాడు.
    పరుగెత్తే పరమాత్మ వెంట ఆయన ఆయుధాలూ, పరివారమూ, లక్ష్మీదేవి అంతా పరుగెత్తారు. అలా ఆ సర్వేశ్వరుడు ఏనుగు ఉన్న సరోవరం వద్దకు చేరుకున్నాడు. క్షణకాలంలో తన చక్రం ప్రయోగించి మొసలిని సంహరించాడు. బాగా అలసిపోయి ఉన్న ఏనుగును తన అమృతహస్తంతో సరస్సు నుంచి గట్టుకు లాగాడు. ఆ చేయి సోకగానే ఏనుగుకి ఎక్కడ లేని బలమూ వచ్చింది. అయితే ఇంతకుముందు ఆ బలంతో పాటు అహంకారం ఉండేది. ఇప్పుడు  ఆహమ్కారం లేదు. అది పరమాత్మ పాదాలమీద సాష్టాంగపడింది. తర్వాత సంతోషంగా తన సహచరులతో కలసి వెళ్ళిపోయింది."
    దేశికులవారు కత ముగించారు. వెంగమాంబ చెక్కిలికి చేయి ఆనించి అలాగే కూర్చుని ఉండిపోయింది. ఆ తర్వాత కత ముగించినా ఆ చిన్న మనసులో ఆ కత మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉండి. ఏనుగును రక్షించడానికి అన్నీ వదిలేసి భగవంతుడు పరుగుతీసిన సన్నివేశం, ఏనుగును సరోవరం నుంచి గట్టుకులాగిన దృశ్యం, ఆ  పిల్లమనసులో ముద్రించుకొనిపోయాయి. ఆ రూపాన్ని మాటిమాటికీ ఊహించుకుంటూ తనకే తెలియని పారవశ్యం చెందుతోంది.

    "అమ్మాయీ! ఇక పాఠం చెప్పుకుందామా?" అన్న దేశికులువారి మాటతో ఈ లోకంలోకి వచ్చింది.

    "దేవుడు ఎవరు ప్రార్థించినా వింటాడా? మనదగ్గరకు వస్తాడా? మనకు కానిపిస్తాడా?" ఏదో లోకంలోంచి అడుగుతున్నట్లుగా అడిగింది వెంగమాంబ.
    దేశికులవారు క్షణం మౌనం వహించారు. ఈ పిల్ల తనకు పరీక్షగానే మారుతోందనుకున్నారు.
    "అవునమ్మా! భక్తితో, ప్రేమతో ఎవరు ప్రార్థించినా వింటాడు. కనిపిస్తాడు కూడా. అదలా ఉంచి ఇక  పాఠం చెప్పుకుందాం" అన్నారు.
    "నాకు కూడా కనిపిస్తాడా? నేనూ భక్తితో, ప్రేమతో ప్రార్థిస్తాను కదా!" వెంగమాంబ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "తప్పకుండానిపిస్తాడు. ముందుగా  నువ్వు మీ నాన్నగారి దగ్గర స్తోత్రాలు అవీ నేర్చుకో. వాటి అర్థం తెలుసుకుని చదువుకుంటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. కనుక ముందుగా నువ్వు అమరమూ, పంచకావ్యాలూ చదువుకోవాలి, సరేనా?" అన్నారు దేశికులవారు.
    సరే అన్నట్లు తలూపింది వెంగమాంబ. దేశికులవారు అమరం వల్లిస్తుంటే యాంత్రికంగా వల్లె వేసింది. కానీ ఆమె మనసునిండా ఆ వైకుంఠవాసుని దివ్యమంగళరూపమే నిండిపోయింది. ఆమె తలపులనిండా ఆయనే తిష్ఠ వేసుకుని ఉన్నాడు.
    దేశికులవారు పాఠం ముగించి నిట్టూర్చి వెళ్ళిపోయారు. వెంగమాంబ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది.
    వెంగమాంబ ప్రవర్తన రోజు రోజుకు విలక్షణంగా మారుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS