Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 5


                                                                చెట్టు
    చెట్టునుంచి జలజలా రాలి పడ్డాయి పళ్ళు. పిల్లలు బిల బిల పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందు ఇద్దరు. ఇద్దరు నలుగురయ్యారు, ఆరుగురయ్యారు, పదయ్యారు, పదిహేనయ్యారు, చిన్న, పెద్ద, అబ్బాయిలు, అమ్మాయిలు తలలు పైకెత్తి చిటారు కొమ్మనున్న కాయలవంక చూస్తున్నారు. అంతలో ధనధనా రాలిపడుతున్నాయి కాయలు. జేబులు నిండా నింపుకొన్నారు. నోటికి కరచుకున్నారు. దోసిళ్ళలో నింపుకుని పరిగెత్తి పక్కనున్న ఇంటి గుమ్మం ముందు వాళ్ల జేబులు నింపుకుంటున్నారు. ఆ ఇంటి వాకిలినిండా పిల్లలే.... 
    తాతగారు డాబామీద కర్ర పెట్టేసి నెమ్మదిగా మెట్లుదిగి వచ్చారు. అక్కడున్న పడక్కుర్చీలో వాలారు. అలసట ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ఇంచు మించుగా నాలుగు మూడు రోజుల కొకసారి అలవాటే ఆయనకి.
    "మీరు తినండి తాతయ్యా!" పిలలు పోటీలుపడి బాగా పండిన పళ్లు అందిస్తుంటే మెత్తనిది ఒక్కటి తీసుకుని అలా పిల్లల్ని చూస్తూ వుండటంలో గొప్ప ఆనందముందాయనకి.
    ఆ పెద్ద జామచెట్టు కాయలు కాస్తూనే వుంటుంది. అన్ని కాయలూ కోసేసినా మళ్లీ నాలుగు నెలలయ్యేసరికి చెట్టు నిండిపోతుంది. ఆ చెట్టునున్న పళ్ళకోసం పిట్టలు, పిల్లలు వస్తూ పోతూ వుంటే తాతగారికి పట్టరాని సంతోషం. గొప్ప తృప్తి ఆ కళ్ళలోనే కనిపిస్తుంది. భగవంతుని సృష్టి ఎంత చిత్రమైందో అని ఆశ్చర్యపోతుంటారు ఎన్నిసార్లో ఆ చెట్టు క్రింద వాలు కుర్చీలో కూచోని....
    పిల్లలు ఇంకా ఆ చెట్టు దగ్గరే నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. గుమ్మంలో అడుగుపెట్టిన రాణికి ఆ దృశ్యం మహా చిరాకును కలిగించింది. దుమధుమలాడుతూ తన బెడ్ రూములో కెళ్ళి కిటికీ తలుపులు ధనామని వేసుకుంది. కిటికీలోంచి జామచెట్టు కనిపించ దింక! తాతగారు ఓ నవ్వు నవ్వుకుని "ఒరేయ్ బుజ్జీ, ఆ మూల జామకాయ పండింది. చూశావా - తెచ్చుకో" అన్నారు.
    ఢిల్లీలో రెండు గదుల ఫ్లాట్ లో పెరిగింది రాణి,
    అమ్మ, నాన్న, తమ్ముడు, తను తప్ప మరెవరూ తమ ఇంటికి రావటం, నాలుగు రోజులుండటం ఏనాడూ తెలియదు రాణికి. పైగా పిల్లల్ని ముద్దు చేయటమంటే చిరాకే కాదు, అలా ముద్దు చేసేవాళ్ళపై కోపం కూడా రాణికి.
    రాణికి పెళ్ళయి అరు నెలలైంది. పెళ్ళికొచ్చిన స్నేహితులు, బంధువులు అంతా తన అత్తవారింటిని మెచ్చుకుంటూ ఇంత పెద్ద ఇల్లు ఎంత హాయిగా వుందో అని, ఇన్ని పూల మొక్కలు, ఈ పెద్ద జామ చెట్టు, ఖాళీస్థలం ఎంత బావుందో అంటుంటే ఆనాడు రాణికి అత్తవారిల్లు చాలా బావుందనిపించింది.
    కానీ, అసలు పేచీ నెమ్మదిగా మొదలయింది. ఆ ఇంటి వాతావరణం ఎందుకో ఆమెకి నచ్చలేదు.... తనింట్లో ఏవి అనవసరంగా భావించి పెరిగిందో తను - ఇక్కడ అవన్నీ అవసరంగా వున్నాయి. ఈ ఇంటికి స్నేహితులు. చుట్టాలు ఎప్పుడూ వస్తూనే వుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలని, భోజనాలని అత్తగారు సిద్ధం చేస్తూనే వుంటారు. ఇది రాణికి ఏపాటీ నచ్చదు. పెళ్ళయిన కొత్తల్లో భర్తతో రహస్యంగా అందికూడా- 'ఇలా ఇంటికి ఎవరో ఒకరు ఎప్పుడూ వస్తుంటే నాకు చాలా బోర్' అని. రామం నవ్వేసి 'ఎవరూ రాకపోతే నాకు బోర్' అని అన్నాడు. మాట్లాడకుండా ఊరుకుంది.
    ఆ ఇంట్లో పూర్తిగా నచ్చనిది ఈ జామచెట్టు.... అదేం చిత్రమో, ఎప్పుడూ కాయలు కాస్తూనే వుంటుంది. ఆ కాయల కోసం పిల్లలు ఎప్పుడూ  ఇంట్లోకి వచ్చేస్తూనే వుంటారు. ఎవరినీ అడగక్కర్లేదు. తిన్నగా డాబా ఎక్కి కొమ్మలు వంచి జామకాయలు కోసేసుకుంటారు. సగం సగం కొరికి కిందపడేస్తారు. ఎక్కడ చూసినా ఆకులు, కొరికి పడేసిన పిందలు.... ఛీ, ఛీ.... తనింట్లో చిన్న డ్రాయింగ్ రూమ్, చక్కటి ఫ్లవర్ వాజ్.... అందమైన కుర్చీలు. ఇక్కడో.... ఆ పెద్ద హాల్లో వున్న కుర్చీలు, పిల్లలు తీసుకెళ్లి దొడ్లోకొచ్చి పొడుగాటి కర్ర తీసుకుని కుర్చీ ఎక్కి జామకాయలు కోయటం ఎన్నిసార్లు తను కళ్ళతో చూసిందో.... మళ్లీ ఆ కుర్చీ లోపల పెట్టరు.... ఛీ, చాలా న్యూసెన్స్.... రాణి ముఖం నిండా చిరాకు!
    'అయినా రాణీ, నీ కెందుకంత కోపం.... ఆ చెట్టు కాయలు పిల్లలు కాకపోతే మనం తింటామా?' రామం పుస్తకంలోంచి తల ఎత్తకుండానే అన్నాడు.
    'మనం తినం కానీ-' ఏదో చెప్పబోయింది రాణి.
    తాతగారు చేత్తో పెద్ద కర్ర పట్టుకుని మేడ మెట్లు ఎక్కుతున్నారు. రాణి ఒళ్లు మండిపోయింది.
    'చూడండి.... ఈ తలుపు మీరు తియ్యడానికి వీల్లేదు. ఆ పిల్లలంతా ఎలా దూరుతారో చూస్తాను.' రాణి లేచి గబగబా వెళ్లి తలుపేసింది.
    చెట్టునించి కాయలు కింద రాలి పడుతున్నాయి. పిల్లలు తలుపులు బాదుతున్నారు. రాణి అలా చూస్తూ కూచుంది. అప్పుడు గుర్తొచ్చింది స్టౌమీద పెట్టిన పాలు పొంగిపోయి వుంటాయని. లోపలికి వెళ్లింది రాణి. గబ గబా తాతగారు తలుపుతీయడం, బిలబిలా పిల్లలు లోపలికి పరిగెత్తి వచ్చి కాయలు ఏరుకోటం జరిగిపోతోంది.
    రాణికి కోపమే కాదు, అవమానంగా అనిపించింది. తను తలుపేసి వస్తే తాతగారు తలుపు తీయటం. అలా చేస్తే అ పిల్లలకి భయమేముటుంది.
    'నవ్వుతారేమిటి- ఆ పిల్లలకి నేనంటే ఏమన్నా భయముంటుందా?' రామం చేతిలోనున్న పుస్తకం లాగి విసిరిపారేసింది రాణి....కోపంతో బుగ్గ లెర్రబడ్డాయి. రామం నవ్వుతూనే అన్నాడు.
    'నువ్వు కోపంగా వున్నప్పుడు మరీ బావుంటావు తెలుసా?' రాణీని దగ్గరికి తీసుకున్నాడు. 'పసిపిల్లలకి నీ మీద ప్రేమ ఉండాలి కానీ, భయమెందుకు చెప్పు రాణీ?'
    రాణీ మాట్లాడలేదు.... కళ్ళలో సన్నటి నీటిపొర కదిలింది.
    రోజురోజుకీ చెట్టు పెద్ద సమస్యలా తయారైంది. దీన్ని ఎలా వదిలించుకోవాలా అని రకరకాల ఆలోచనలు చేసింది రాణి. స్నేహితురాళ్ళతో ముచ్చటించింది.... 'ఇదేం పెద్దసమస్య?' అంది లీల. ఆసాయంత్రం ఆఫీసునుంచి కలిసివస్తూ.... నెమ్మదిగా ఉపాయం చెప్పింది.... చెట్టుకి బేరం కుదిరింది.
    నాలుగు రోజులయేసరికి తెల్లవారగానే కూరలమ్మే అబ్బాయి చెట్టు ఎక్కాడు. కింద సంచి పట్టుకుని మరొకతను నుంచున్నాడు. కాయలు కోస్తున్న సందడి ఇరుగుపొరుగు పిల్లలకి ఎలా అంతుపట్టిందో, పరుగు పరుగున వచ్చారు. ఆశ్చర్యపోతూ చెట్టువంక చూస్తున్నారు. ఒక్క కాయ కిందపడుతుందేమో ఎత్తుకుపోదామని సిద్ధంగా నిల్చున్నారు. చెట్టువంక ఆశగా చూస్తున్నారు. చెట్టునున్న కాయలన్నీ సంచిలో నింపుకున్నాడు కూరగాయలవాడు. అమ్మగారికి డబ్బు లెక్కకట్టి ఇచ్చేశాడు. చెట్టు మొత్తం దులిపేశాడు వాడు. పిల్లలంతా బిక్క మొకం వేసుకుని వెళ్ళిపోయారు. తాతగారు గదిలోంచి బయటికి రాలేదు. రాణి విజయగర్వంతో లోపలకొచ్చింది.
    'ఇదిగో_' డబ్బు బల్లమీద పెడుతూ భర్త ముఖంలోకి చూసింది.
    'అది రాక్షసి డబ్బు_ ఇక్కడినుండి తీసేయ్!'
    రామం ముఖం గంభీరంగా వుంది.
    'అంటే, నేను రాక్షసినా?' గొంతు సవరించుకుంది రాణి. రామం మాట్లాడలేదు. రోజూ పదింటికి ఇల్లువదిలే రామం, గంటన్నర ముందర ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
    రాణి గబగబా పనులు తెముల్చుకుంది. ఆ రోజు ఎంతో ఆనందంగా వుంది ఆమెకి. ఏదో గెల్చినగర్వం, ఆనందం ఆమె కళ్లల్లో మెరిసాయి.
    గేటు సందులోంచి పసికళ్ళు తొంగిచూడ్డం కనిపించింది రాణికి. పో!' కేక పెట్టింది. ఒక్క పరుగుతీసాడు పసివాడు.
    సాయంత్రం ఆఫీసునుంచి రాణీ వస్తుంటే ఎక్కడనుంచో మాటలు వినిపిస్తున్నాయి. 'ఆంటీ వస్తోందిరా. అటుచూడు, బ్రహ్మరాక్షసిలాలేదూ?'
    'ఆ....దెయ్యంకదూ-' పిల్లలు కిలకిలా నవ్వుకున్నారు. రాణి తల తిప్పి వెనక్కి చూసింది. చిన్న రాయి భుజానికి తగిలింది.
    'సారీ ఆంటీ.... నేను కాదు, నేను కాదు.'
    'సరే.' గబగబా నడుస్తోంది రాణి.
    'ఆంటీ_'
    వెనక్కి తిరిగింది రాణి. తలుపు సందులోంచి పొద్దున కనిపించిన చిన్న కళ్ళు. 'ఆ చిన్నది కోసుకోనా_'
    'ఊ.' రాణి ఉరిమింది.
    పిల్లలు గలగలా నవ్వి పరుగెత్తారు.
    ఆ ఇంట్లో వాతావరణంలో చాలా మార్పు వచ్చేసింది. ఉన్నట్టుండి తాతగారు ముభావంగా అయిపోయారు. రామం చాలా సీరియస్ గా ఉంటున్నారు, తన పని తను చేసుకుంటున్నాడు. ఇరుగుపొరుగు పిల్లలెవరూ ఇంట్లో అడుగు పెట్టటంలేదు.
    మూడు నాలుగు నెలలయ్యేసరికి మళ్ళీ చెట్టు పూలతో, పిందెలతో నిండిపోయింది. అయినా ఆ చెట్టువైపు కన్నెత్తి చూడటంలేదు ఎవరూ. ఒక్క పసివాడు కూడా గుమ్మంలో అడుగుపెట్టటంలేదు.
    రాణీకి కొన్నిసార్లు ఆశ్చర్యం, మరికొన్నిసార్లు భయం కలుగుతోంది. ఈ ఒక్క సంఘటన వీళ్ళ మనసుల్ని ఇంత గాయపరచింది. చెట్టుకేసి చూసింది రాణీ. కాయలన్నీ అలాగే వున్నాయి. పిట్టలుకూడా రావటంలేదా ఏమిటీ? నవ్వొచ్చింది రాణీకి. అంతటా నిశ్శబ్దం. ఏదో వెలితి. తాతగారు ఉత్సాహంగా డాబామీదికి వెళ్ళటమే లేదు.
    ఆఫీసునించి వస్తుంటే, జామకాయల బండిచుట్టూ పిల్లలు మూగి కొనుక్కుంటున్నారు.
    గబగబా ఇంట్లోకొచ్చిన రాణీకి, కుర్చీలో దిగాలుపడి కూర్చున్న తాతగారు కనిపించారు.
    ఈ ఒక్క చెట్టు ఇంత గొడవ సృష్టించింది. అయినా పిల్లల్ని తనెందుకు కోసుకోనివ్వటంలేదు? వాకిలంతా కాయలు, గింజలు, ఆకులు పారేస్తారనా? పనిమనిషి తుడుస్తుంది. కాకపోతే, ఒక్కసారి తనూ వాకిలి శుభ్రంగా తుడుచుకోవచ్చు. ఈ చెట్టు ఎన్ని వసంతాలు చూసిందో?  రోజు ఎంగేజ్ మెంట్ అయ్యాక తను ఈ ఇంటికొచ్చినపుడు, ఈ డాబామీదికి తీసుకెళ్ళి తనకు జామకాయలు కోసిచ్చాడు రామం. 'నేనూ, నా ఫ్రెండ్సూ ఎప్పుడూ ఈ చెట్టు దగ్గరే ఆడుకున్నాం, ఈ చెట్టుకింద కూచొని చదువుకున్నాం తెలుసా! ఐ లవ్ దిస్ ట్రీ' అన్నాడు రామం. ఆ మాటలు రాణీ చెవుల్లో గింగురుమన్నాయి.
    'అమ్మాయ్ చెట్టు కాయలు కోసుకునేందుకు అతనొచ్చాడు.' తాతగారి గొంతు గదిలో కిటికీ దగ్గర కూచుని చెట్టునుచూస్తున్న రాణీకి విన్పించింది.
    గబుక్కున తలుపు తీసుకు బయటకొచ్చింది.
    గబగబా గేటుదగ్గర కొచ్చింది. 'ఇటుచూడు, ఈ మారు కాయలు అమ్మకానికివ్వద్దని తాతగారు అన్నారు. అందుకని-' రాణి నెమ్మదిగా అంది.
    'సరే, ఇంకోసారి వస్తానని' అతను సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోతుంటే, 'సరే, సరే' ఖంగారుగా లోపలికొచ్చేసింది రాణి.
    తను రాక్షసికాదు, రాక్షసికాదు! రాణి తనలోతనే అనుకుంటూ గుమ్మంలోకెళ్ళింది.
    'ఇటురా.'
    'బాబూ రా.'
    'కాయలు కోసుకోండిరా.'
    'నాన్నా, ఆ చెట్టు కాయలన్నీ మీకే.'
    రాణి మాట ఎవరూ వినటంలేదు. భయం భయంగా చూసి పక్కకు తప్పుకుంటున్నారు పిల్లలంతా.
    'నాకు వద్దు ఆంటీ.... నేను కొనుక్కుంటా.' పక్కింటి రాజా గుమ్మంముందు నుంచుని చెట్టువంక చూస్తూ అన్నాడు.
    చిన్నపిల్లలు వస్తుంటే కొంచెం పెద్దపిల్లలు ఆపుతున్నారు పోనీకుండా. రాణీ అలాగే గుమ్మందగ్గర నిల్చుంది చాలాసేపు. ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండాయి. చెట్టువంక చూసింది ఒక్క నిమిషం.
    గబగబా లోపలికొచ్చింది. పెద్ద కర్ర తెచ్చింది. 'తాతగారూ.... చెట్టు కాయలన్నీ దులపండి, పిల్లల్ని రమ్మనండి... హాయిగా తినమనండి'
    తాతగారు క్షణం చెవులని నమ్మలేకపోయారు. 'రండి తాతగారూ, కాయలన్నీ కోయండి.' బతిమాలుతోంది రాణి.
    తాతగారు నెమ్మదిగా డాబామీద కెళ్ళారు. బయట నుంచున్న పిల్లలంతా ధైర్యంగా తోసుకుంటూ లోపలకొచ్చేశారు.
    ఒకళ్ళు, ఇద్దరు, పదిమంది, ఇరవై మందితో ఆ వాకిలి నిండిపోయింది.
    చెట్టునించి కాయలు రాలిపడుతుంటే, పరుగు పరుగున వచ్చి ఏరుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు. జేబుల్లో నింపుకుంటున్నారు.
    ఆ పిల్లల్ని చూస్తూ ఆనందంతో కన్నీటిబిందువులు రాణి చెక్కిలిపై జారిపడుతుంటే, అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన రామం విస్తుపోయాడు ఆ దృశ్యాన్ని చూసి.
    'నేను రాక్షసిని కాదండీ!' రాణి గొంతు గద్గదికమౌతుంటే 'నాకు తెలుసు రాణీ!' గుండెలకు హత్తుకున్నాడు రామం.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS